సెల్లు పట్టు శుభవేళ
'పెళ్లికేం తొందర సెల్లు చూసుకో ముందర'
అని ఓ సెల్‌ఫోన్ కంపెనీ అంటుంటే 'ఏమి 'ఐడియా' హలా!' అని కుర్రకారు లొట్టలు వేస్తోంది. త్వరలో వచ్చే 'వర్చువల్ గాల్‌ఫ్రెండ్' (వీ-గాల్‌ఫ్రెండ్) గేమ్ వల్ల 'సెల్లు పట్టు శుభ వేళ' అని యువకులు తహతహలాడవచ్చు. అలాగే యువతుల కోసం 'వర్చువల్ బోయ్‌ఫ్రెండ్' గేమ్ కూడా మరికొన్నాళ్లకు రాబోతోందట. దీంతో 'ప్రేమకు వేళాయెరా!' అని ఏ అమ్మాయి అయినా తనకు తోచిన, తన మది దోచిన సుందరాంగుడితో హ్యాండ్'సెట్టు'పట్టాల్ వేసుకోవచ్చు. 'బాలస్తావత్ క్రీడాసక్తః' అన్న ఆది శంకరాచార్యులు మళ్లీ పుడితే 'యువతస్తావత్ సెల్లాసక్తః' అనడం ఖాయం. 'గ్రౌండు' రియాలిటీ తెలిసిన యువతరం 'కామాతురాణాం న భయం న లజ్జ' అని కాక, గేమాతురాణాం నో భయం నో లజ్జ అంటూ ముందుకు సాగుతోంది.
'సెల్లు తీసుకొని హలో చెప్పుకొని చల్లగ ప్రేమలుసాగాలోయ్'
అంటూ తహతహలాడుతోంది. ల్యాండ్‌లైన్లలో నంబర్లు 'తిప్పి' చెప్పి మాటా మాటా, మనసూ మనసూ కలుపుకొనే రోజులు కరిగిపోయి, మూడో చెవిన పడకుండా సెల్లులో 'నొక్కి' వక్కాణించుకొనే రోజులు పెరిగిపోతున్నాయి. 'లైన్' వేయడమనే మాటను తెలుగువాడు సృష్టించుకున్నాడంటే అందుకు కారణం ఫోనే. ప్రేమికులు ఒకరికొకరు దగ్గరయితే 'ముద్దు'ముచ్చట్లే అనుకునే వారు కూడా సెల్లుల్లో సాగే ముద్దు 'ముచ్చట'లే అసలైన లిప్‌మూవ్‌మెంట్ అంటున్నారు. పూర్వం రాయప్రోలు సుబ్బారావు అమలిన శృంగార తత్వాన్ని ప్రబోధిస్తూ కావ్యం రాస్తే కొంత మంది పెద్దలు 'పెదవి' విరిచారు. ఇప్పుడు సెల్‌ఫోన్ పుణ్యమా అని ముక్కు మొహం తెలియని అమెరికా అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి సెల్లులో సరసమాడడానికి వీలు ఏర్పడింది. ఇదే సరికొత్త కళ్యాణ'మస్తు' కావచ్చునని జోస్యం చెప్పే వారూ ఉన్నారు. సెల్లు గేములకు ఒక సీజన్ అంటూ ఏమీ లేదు. చలికాలం వానాకాలం ఏదయినా అంతా సెల్లుకాలమే.
'నీదా సెల్లు నాదీ సెల్లు సెల్‌ఫోన్ కలిపింది ఇద్దరినీ...'
అని ఇలవేల్పును మించిన సెల్‌వేల్పు ప్రేమికుల హృదయాల్లో గూడు (కాకపోతే మందిరం) కట్టుకుంది. సెల్‌ఫోన్ల పుణ్యమా అని ప్రేమ 'రికార్డు' స్థాయికి చేరుకుంది. 'గాలం' వక్రించితే ప్రేమ కబుర్లు వికటించి సెల్లు 'ప్రకృతి' సొల్లు వికృతి కావచ్చు. అప్పుడు
'సెల్లుయో సెల్లకో తమరు ఆడిన మాటలు వినుము ఇచ్చటన్'
అని భగ్న ప్రేమికురాలు/ప్రేమికుడు 'సెల్'యేరులా సాగిన సంభాషణను ఏకరువు పెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. నీవు ఎంత 'సెల్'ఫిషో అని కడిగిపారేయవచ్చు ఎంచక్కా.
తెలుగువాడు మాట్లాడడంలో చివరికి పోట్లాడడంలో కూడా క్రీడను చూసే క్రీడా ప్రియుడు. అతడు పెళ్లాడడం అని కూడా అంటాడు. అది ఆట ఎట్లా అయిందని మీమాంసపడేవారికిక అతని ముందుచూపు తేట(తెలుగు)తెల్లం అవుతుంది. అవసరమైతే వి-గాళ్ ఆటను చూపిస్తాడతడు. 'ఆడవోయి ప్రేమవీరుడా!' అని గొంతెత్తి పాడతాడు. స్నేక్, బ్రిక్ వంటి సెల్‌ఫోన్ క్రీడల్లో చేయితిరిగినవారు 'ఒక్క సెల్లే చాలు
వద్దులే ప్లేగ్రౌండు' అని కోరస్ ఎత్తుకోవచ్చు. 'హేపీ న్యూ ఇయర్' అంటూ ప్రేమ సంభాషణల్ని 'చెవులూరించేలా' 'ఇయర్స్' కొద్దీ సాగించొచ్చు. 'పబ్లిక్' గార్డెన్స్‌లో సైతం 'ప్రైవేట్'గా మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు అనుబంధాన్ని 'తోట'తెల్లం చేసుకోవచ్చు. దీనిని బట్టి చూస్తే సెల్లా మజాకా అంటారు కానీ సెల్లు నిజంగా 'మజా'కే! కాదనేదెవరు?
- ఫన్‌కర్
(Eenadu, 19:08:2007)
---------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home