'బోగస్'స్వాములు

'ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన బోగసోడు' అని సర్కారు ఇటువంటి వాళ్ల వెంటపడి పట్టుకుని 'సమ్'కెళ్లు వేస్తుందని ఆశపడతాం. కానీ ఓ 'గద్ద'మనిషి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్నే 'సృష్టించేసి' మంది డబ్బును ఎగరేసుకుపోయాడు. దాంతో ఎంతో మంది 'జేబులొ డబ్బులు పోయెనే' అనే 'బాట' పాడుకోవలసి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు చూపిస్తామని గాలి కబుర్లు చెప్పి జేబులు కత్తిరించి, బిచాణా ఎత్తేయడం బోలెడు గిరాకీ ఉన్న వ్యాపారమైపోయింది. 'దొర'కేంత వరకు ఇటువంటి 'దొరలు' ఎందరో!
బోగస్ వ్యాపార సుందరి 'ఫోర్'జరీ అంచు చీర కట్టుకుని హొయలొలకబోస్తుంటుంది కూడా. బోగస్ వ్యాపారాలను 'మార్చి' మార్చి జనాన్ని ఏమార్చి ఒక నెలలోనే 15వేల కోట్ల రూపాయల మేరకు సాగించారని 'నోటు'మాటగా చెప్పవచ్చు. హ్యాపీ లైఫ్ కోసం ఆశపడి బీపీ లైఫ్ తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. బోగస్ నవ్వులు నవ్వి 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' అన్న సీను సృష్టించి నమ్మిన వాళ్లను రౌడీల చేత నట్టేట ముంచేట్టు చేయడమూ జరుగుతోంది!
చివరకు షాపింగ్‌లో బోగస్, సర్కారు ఇళ్ల కేటాయింపులోనూ బోగస్ వ్యవహారం 'చోటు' చూసుకుంటోంది! చిత్రమేమిటంటే బోగస్ వ్యవహారాల మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని మంత్రులు నమ్మకంగా చెప్తుంటారు. కొంత కాలానికి ఎంత గొప్ప 'యాక్షన్' అనిపిస్తుంది. మహామహా నటులు ఇంతగా నటించ లేరని వేరే చెప్పాలా?
-ఫన్‌కర్
(Eenadu, 01:09:2007)
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home