దాత మనసు
- ఎర్రాప్రగడ రామకృష్ణ
దానగుణంగల వ్యక్తులను మన పెద్దలు మూడు రకాలుగా వర్గీకరించారు. మొదటివాడు దాత. అవసరానికి ఆదుకోవాలని ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా తృణమో పణమో ఇచ్చి పంపేవాడు దాత. రెండోవాడు ఉదారుడు. అడిగినవారి అవసరాన్ని చక్కగా గుర్తించి, అడిగినదానికన్నా కాస్త ఎక్కువ ముట్టజెప్పి మరీ పంపేవాడు ఉదారుడు.
ఇక వదాన్యుడు అనే మూడోస్థాయి వ్యక్తి- అవతలవాడు అడిగేదాకా కూడా చూడకుండా, అవసరం వచ్చిందని, లేదా ఆపద వాటిల్లిందని తెలియగానే అయాచితంగా చేతనైనంతా చేసేస్తాడు.
దానగుణం కలవాడి స్వభావం ఎలా ఉంటుందో, అలాంటి వ్యక్తికి కలిగే ఆనందం ఎలాంటిదో తెలిపే కథ ఇది. ఆ ఇంటి యజమాని ఉత్తముడు, సజ్జనుడు. ఆయనకు చాలాకాలంగా రావలసిన పెద్ద మొత్తం ఒకటి చేతికి అందేలా ఉందని తెలిసింది. దానితో ఇంటికి రిపేర్లు చేయించాలని ఆయన అనుకున్నాడు. తనకు నెక్లెస్ చేయించుకోవాలని భార్య ఆశపడింది. స్కూటర్ కొనుక్కుందామని కొడుకు అనుకున్నాడు. అనుకున్నరోజు రానే వచ్చింది. ఎదురుచూపులు ఫలించాయి.
ఇంటి యజమాని వెళ్ళి రావలసిన డబ్బు వసూలు చేసుకుని తిరిగి వస్తుండగా, అనుకోని సంఘటన ఎదురైంది. దారిలో ఒక తల్లి తన పసిబిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని హృదయవిదారకంగా ఏడుస్తోంది. మాయదారి రోగమేదో వచ్చిందని, తన బిడ్డకు ఆపరేషన్ చేస్తేగాని ప్రాణం దక్కదని, తనకి సహాయం చేయమని ఆ తల్లి రోదిస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని అమాయకమైన ఆ పసిబిడ్డ మొహం చూస్తే ఈ ఇంటి యజమానికి మనసు కరిగిపోయింది. ఇంటి మరమ్మతులా, ప్రాణమా అని ఒక్కక్షణం ఆలోచించాడు. చేతిలో డబ్బంతా ఆ తల్లికి ఇచ్చేశాడు. నిర్వికారంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
జరిగినదంతా విని ఆయన భార్య మొదట నిరాశ పడింది. భర్తను ఏమీ అనలేదు. కొడుకుమాత్రం తండ్రిపై విరుచుకుపడ్డాడు. 'మనమేమంత ధనవంతులమని ఇలా దానధర్మాలు చేయడానికి' అంటూ తండ్రిపై అక్కసు వెళ్ళగక్కాడు. అరిచేశాడు. ఆఖరికి తల్లి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇది జరిగిన రెండు రోజులకు పేపర్లలో ఒక వార్త వచ్చింది. రోడ్డుమీద ఆనాడు ఎదురైన స్త్రీ మోసగత్తె అనీ, ఆమె బిడ్డకు ఎటువంటి రోగమూ లేదని, ఆరోగ్యవంతురాలైన కూతుర్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ, ఆ తల్లి మోసం చేసి డబ్బు సంపాదిస్తోందని, ఎవరో ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు తల్లీబిడ్డలను అరెస్టు చేశారని- దాని సారాంశం.
అది చదవగానే కొడుక్కి పట్టరానికోపం వచ్చేసింది. తన తండ్రి చేసిన 'అపాత్రదానం' గుర్తించి, ఆవేశంతో దూసుకువచ్చాడు. అయితే అదే సమయానికి తండ్రికీ ఆ వార్త తెలిసి, రెండు చేతులూ జోడించి భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ కంట ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్న తండ్రిని చూసి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు తల్లి చెప్పింది- ''నాయనా! ఆ పసిపిల్లకు ఏ రోగమూ లేదని తెలిసి, నీ తండ్రికి అంత ఆనందం కలిగింది. ఆమె ఆరోగ్యం కోసమే కదా డబ్బు దానం చేసినది. ఆ డబ్బు ఆపరేషన్‌కు సరిపోయేదో లేదో, ఆపరేషన్ జరిగినా పూర్తి ఆరోగ్యం కలిగేదో లేదో- ఆ స్థితికన్నా అసలంటూ ఎలాంటి అనారోగ్యమే లేని స్థితి ఆ పిల్లది- అనే నిజం తెలిసి నీ తండ్రి ఆనందంతో దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారయ్యా'' అని.
అది ఏస్థాయి ఆనందమో, ఆ స్థాయి ఆనందాన్ని సాధించిన మనిషిని దాత అనాలో, ఉదారుడనాలో, వదాన్యుడనాలో... ఇంకా వేరే ఏ పెద్దపదంతో పిలవాలో మీరే చెప్పండి!
(Eenadu, 20:09:2007)
______________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home