పరమార్థం
- డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి
భగవంతుడు సర్వవ్యాపకుడనే విశ్వాసం అందరిలో ఉండాలి. కించిత్ పాపకార్యమైనా చేయకూడదు. ధర్మబుద్ధి పవిత్రాచరణ కలిగి ఉండాలి. జీవన పరమార్థమంటే ఈ జన్మలో భగవత్ సాక్షాత్కారం చేసుకోవడమే. అందుకు కావలసిన సాధన అభ్యాసం చేయాలి.
పూర్వం ధర్మబుద్ధి కలిగిన ఓ రాజు ఉండేవాడు. అతడు భగవద్భక్తుడు. శాస్త్ర పఠనంలో అతనికి ప్రీతి ఎక్కువ. ఆధ్యాత్మ క్షేత్రంలో కొన్ని సందేహాలు ఆ రాజును వేధిస్తూనే ఉండేవి.
రాజ వంశానికి పౌరోహితుడైన మహాపండితుడున్నాడు. అతడు శాస్త్ర విచారణలో గొప్ప నేర్పరి. అతడు పాండిత్య ప్రకర్ష గలవాడేకానీ అనుభవశూన్యుడు. వాచా వేదాంతే కాని అనుష్ఠాన తత్పరుడు కాదు. ఈ విషయం రాజుగారికి తెలియదు. అతడు తన సంశయాలను తీర్చగలడని అనుకున్నాడు.
''పండితోత్తమా! చాలాకాలం నుంచి మూడు సందేహాలు నన్ను వేధిస్తున్నాయి. నన్ను బాధిస్తున్న మూడు సంశయాలు మీముందు పెడుతున్నాన''ని రాజు అన్నాడు. వాటికి ఆరు మాసాల్లో సమాధానం ఇవ్వాలి. లేదంటే మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తానన్నాడు రాజు.
ఆ ప్రశ్నలు మూడు- దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏవైపు చూస్తున్నాడు, దేవుడు ఏ పని చేస్తున్నాడు?
పురోహితుడు రాజు ప్రశ్నలు విని భయకంపితుడయ్యాడు.
ఆ పండితుని ఇంటిలో గోపాలుడొకడున్నాడు. అతనికి పద్నాలుగు సంవత్సరాలు. చిన్ననాటి నుంచే అతనికి భక్తి చక్కగా అలవడింది. రాజపురోహితుడి దీనత్వానికి కారణం తెలుసుకున్నాడు. ఆరు నెలలైన తరవాత- కారణాంతరాల వలన ఆస్థానానికి రాలేకపోతున్నాను, నా తరఫున నా ప్రతినిధి వస్తాడని రాజుగారికి చెప్పమన్నాడు గోపాలుడు.
ఆరు మాసాలు గడిచిపోయాయి. ఆ రోజున భగవద్భక్తులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు, భాగవతులతో రాజాస్థానమంతా కిక్కిరిసిపోయింది.
గోపాలుడు ఒక ఉత్తరాన్ని తీసుకొని రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజు ఉత్తరం చదివి సంతోషించి ఆ బాలుని జవాబులు చెప్పాల్సిందిగా కోరాడు.
ఎత్త్తెన సింహాసనంలో రాజు కూర్చున్నాడు. గోపాలుడు కింద నిలబడి 'మహారాజా! బోధించేటప్పుడు గురువు ఉన్నత స్థానంలో ఉండాలి. ఇది లోకాచారం. కనుక నేను సింహాసనంపై ఉండాలి. మీరు కింద నిలబడాలి' అన్నాడు. అందుకు రాజు అంగీకరించాడు.
గోపాలుడు మహారాజుతో ''ఏదైనా శుభకార్యం ప్రారంభించేందుకు ముందు దీపారాధన చేయాలి. దేవుడికి పూజ, అభిషేకం చేయాలి. ఓ పాత్రలో పాలు పోసి తెప్పించండి'' అన్నాడు. రాజు అట్లాగే చేశాడు. పూజాదికాలు నిర్వహించారు.
దేవుడెక్కడ ఉంటాడనే మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా రాజు కోరాడు. 'రాజా! పాలలో వెన్న ఎక్కడ ఉందో ముందు నాకు చెప్పండి' అన్నాడు గోపాలుడు.
'పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంది' అన్నాడు రాజు.
'దేవుడు కూడా సమస్త చరాచరాల్లో నిగూఢంగా వ్యాపించి ఉన్నాడు. అతడు లేని చోటు లేదు' అన్నాడు గోపాలుడు.
రెండవ ప్రశ్న. దేవుడు ఏవైపు చూస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పాలని అడిగాడు రాజు. 'మహారాజా! ఆ ప్రమిదలోని దీపం ఏవైపు చూస్తుందో చెప్పగలరా?' అన్నాడు గోపాలుడు. అన్నివైపులా చూస్తుందన్నాడు రాజు. దేవుడు కూడా అన్ని దిక్కులను చూస్తున్నాడు. సమస్త ప్రాణుల హృదయాల్లో అంతర్యామియైు సమస్తం పరిశీలిస్తున్నాడన్నాడు గోపాలుడు.
ఇక మూడవ ప్రశ్న-దేవుడు ఏ పని చేస్తాడు? దీనికీ సమాధానం చెప్పాలని రాజు కోరాడు.
'మహారాజా! దేవుడు ఒకరిని సింహాసనంపై నుంచి కిందికి దించుతాడు. మరొకరిని సింహాసనంపై కూర్చోబెడతాడు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఫలాలనిస్తాడు. ఇదే దేవుని పని. ధన గర్వం, అధికార గర్వం ఉన్నవారిని కిందికి దింపుతాడు. వినయ విధేయతలు, శ్రద్ధ, భక్తి కలిగినవారిని పైకి లేపుతాడు. ఇదే దేవుని పని' అని బదులిచ్చాడు గోపాలుడు. రాజు పరమానందభరితుడయ్యాడు.
(Eenadu, 04:10:2997)
______________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home