మరల మరల ప్రయత్నించు!
- అయ్యగారి శ్రీనివాసరావు
ప్రతిపనికీ ఒక ప్రారంభం. ఆ పని పూర్తికావాలంటే కొంత ప్రయత్నం. ఆ ప్రయత్నంలో జయం కలగొచ్చు. అపజయమైనా కలగొచ్చు. అపజయం కలిగినపుడు నిరాశపడి అక్కడితో ఆగిపోతే ఆ కథ అక్కడితో ముగిసిపోతుంది. అలా కథ ముగిసిపోయినవారంతా చరిత్రగతిలో కలిసిపోయిన ఎందరో చరిత్రహీనులతో కలసిపోతారు.
కాని- అక్కడితో ఆగిపోకుండా మరోసారి, ఆపై ఇంకోసారి ప్రయత్నం చేస్తే ఒకసారి కాకపోయినా మరొకసారైనా విజయం చేకూరడం తథ్యం. అలా విజయం సాధించినవారే చరిత్రలో ప్రసిద్ధులై కలకాలం నిలబడతారు.
అదొక గోపాలకుని ఇల్లు. ఆ ఇంట అన్ని కుండలతో పాటు చిక్కని మీగడతో ఉన్న పెరుగుకుండ. ఎలా వచ్చిపడ్డాయోగాని రెండు కప్పలు ప్రమాదవశాత్తు ఆ పెరుగు కుండలో పడ్డాయి. ఆ కుండ చాల లోతైనది కూడా. బైటపడటానికి ఆ రెండు కప్పలూ ప్రయత్నించసాగాయి. పైకెగబాకాయి. కాని ఆ మీగడకున్న జిడ్డు వలన ఆ ప్రయత్నం సాగక మరల అందులోనే పడిపోయేవి. అలా ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన ఒక కప్ప నిరాశతో ''మిత్రమా! ఇక శలవ్! మనం బయటపడే అవకాశంలేదు. మన జీవితాలిలా పరిసమాప్తం కావలసిందే. మన నుదిటిన ఆ భగవంతుడదే రాశాడు'' అంటూ ఆ పెరుగు కుండలో మునిగిపోయింది. ఆ దృశ్యం చూసినా రెండవ కప్ప మాత్రం నిరాశపడలేదు. ప్రయత్నం వీడలేదు. మరల మరల ప్రయత్నించింది. మామూలుగా కాదు. మరింత పట్టుదలతో. దానిదొకటే నిశ్చయం. ''మరణమైనా రావాలి. ప్రయత్నమైనా ఫలించాలి. అంతేకాని చేతకాక చచ్చిపోకూడదు''. అందుకే అలాగే ప్రయత్నించింది. కొంతసేపటికి దాని వెనక కాళ్ళకు గట్టిగా ఏదో తగిలింది. అది పెరుగులో తేలియాడుతోంది. ఇప్పుడు దాని కాళ్ళకు జిడ్డు కూడా పోయింది. దాంతో ఆ కప్ప ఆ గట్టిగా ఉన్న పదార్థంపై కాస్సేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంది. అలా కాసేపు విశ్రాంతి తీసుకుని శక్తిని కూడదీసుకుని ఒక్క ఉదుటున కుండ అంచుపైకెగిరి బయటపడింది. ఇంతకీ ఆ పదార్థమేమిటంటే- ఆ కప్ప అటూ ఇటూ కదలడంవలన పెరుగు చిలికినట్లయింది. వెన్న ఒకచోట చేరింది. అదే ఆ కప్ప ప్రాణాలను కాపాడింది.
యథా కందుక పాతేనోత్పతత్యార్యః పతన్నపి
తథాదనార్యః పతతి మృత్పిండ పతనంయథా!!
బంతి కింద పడ్డా పైకిలేస్తుంది. అలాగే ప్రయత్నశీలుడు ఒక సమయంలో కష్టాలు వచ్చి పతనమైనా మరల అంతలోనే అంతే వేగంతో లేచి ప్రయత్నించి విజయం సాధిస్తాడు. మట్టిముద్ద ఉందే, అది కిందపడితే మరి లేవలేదు. అధముడు కూడా అంతే. అందుకే ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నించాలి. విజయం సాధించేవరకు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో లోపంవద్దు. అపజయాలు, ఆటంకాలు వస్తే బెదిరిపోవద్దు. ఆగిపోవద్దు. కడదాకా ప్రయత్నిస్తేనే విజయం తప్పక సిద్ధిస్తుంది.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేననీచైః ప్రాంభ్మవిఘ్ననిహతా విరమన్తిమధ్మాః
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమజనాః నపరిత్యజన్తి
విఘ్నాలు కలుగుతాయేమోననే భయంతో పనిని ప్రారంభించనే ప్రారంభించరు నీచులు. ప్రారంభించి విఘ్నాలు ఎదురైతే ఆ పనిని అక్కడితో విడిచిపెట్టేస్తారు మధ్యములు. ఉత్తములైనవారు మాత్రం ఎన్ని ఆటంకాలు, విఘ్నాలు కలిగినా తలపెట్టిన కార్యాన్ని నెరవేర్చి తీరుతారు. కాబట్టి ప్రయత్నించు, ప్రయత్నించు. మరల మరల ప్రయత్నించు. విజయం తథ్యం.
(Eenadu, 03:10:2007)
______________________________________
Labels: Self development, Self development/Telugu
1 Comments:
"marala marala praytninchu" --chala baagundi sir.Good article. Thank you sir
5:23 pm
Post a Comment
<< Home