జనం నోట్లో 'నానీ'
- రావికంటి శ్రీనివాస్
ఇప్పుడంతా
రెండింటిపైనే చర్చ
క్రికెట్లో ధోని
కవిత్వంలో నాని
తెలుగు సాహిత్యంలో నానీలు ఎంత ప్రాచుర్యం పొందాయో చెప్పడానికి ఈ ఒక్క నానీ చాలు.
ఇరవై ఓవర్ల క్రికెట్‌లో ధోనీసేన సంచలనం సృష్టిస్తే... ఇరవై అక్షరాలతో ఫోర్లు (నాలుగులైన్లు) కొడుతూ నాని తెలుగు కవిత్వంలో దూసుకుపోతోంది. తెలుగు కవిత్వంలో ప్రాచీన సాహిత్యాన్ని, కావ్యాలను టెస్టు మ్యాచ్‌లతో పోలిస్తే నానీలను ట్వంటీ ట్వంటీ పోటీలుగా భావించవచ్చు. టెస్టు మ్యాచ్‌ల తర్వాత వచ్చిన వన్డే మ్యాచులు ఎంతగా అలరించాయో తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 'ట్వంటీ ట్వంటీ' మరింత స్పీడ్ పెంచుకుని, నిడివి తగ్గించుకుని ఎంత రసవత్తరంగా తయరైందో అందరికీ తెలిసిందే. సరిగా ఇదే పోలిక తెలుగు కవిత్వానికీ వర్తిస్తుంది. గ్రాంధిక భాష, ఛందో బంధాల నడుమ సాగిన కవిత్వ ప్రక్రియ క్రమంగా రూపాలు మారుతోంది. సంక్లిష్ట వృత్త పద్యాలకన్నా, సరళమైన ఆటవెలదులు, తేటగీతులకే ఆదరణ ఎక్కువ. చిన్న చిన్న పదాలు, పాదాలే అందుకు కారణం. పామర జనం నోళ్లలో కూడా నాని విస్తృతం కావడానికి కూడా ఆ సరళతే కారణం. భావాన్ని నిర్దుష్టంగా చెప్పటం, సూటిగా చెప్పటం కోసం అనేక ప్రక్రియలు అవసరమయ్యాయి. సాహితీ రచనలో సౌలభ్యం కోసం పద్యం వచన పద్యం దాకా వచ్చింది. ఆ వరుస లోనే మినీ కవితలు, హైకూలు వచ్చాయి. ''దేనిలోనైనా మార్పు జరిగే కొద్దీ సౌలభ్యమూ పెరుగుతుంది. అసలు కచ్చితంగా చెప్పాలంటే సౌలభ్యం కోసమే మార్పు అవసరమవుతుంది'' అదే క్రమం కొనసాగి తెలుగు కవితా లోకంలో వికసించిన వెలుగు పూలు... తెలుగు పూలు నానీలు. దశాబ్దం క్రితం చిన్న పాయగా ప్రారంభమైన ఈ కవిత్వ ప్రక్రియ నేడు మహాప్రవాహమై ముందుకు సాగుతోంది. కవిత్వం.. రచనలు.. సాహిత్యం పండితులకే తప్ప మనకెందుకులే అనుకునే దశలో సామాన్యులను సైతం నానీలు ఆకట్టుకుంటున్నాయి. ఆంగ్ల మాధ్యమంపై మోజులో తెలుగు భాష అంతరించిపోతుందేమో అని ఆందోళన చెందుతున్న వారికి సరికొత్త ఆశను చిగురింపజేస్తున్నాయి. 'ట్వింకిల్ ట్వింకిల్' రైమ్స్ తప్ప చిట్టి పొట్టి పాటలు తెలియని చిన్నారులను సైతం కట్టిపడేస్తున్నాయి. చిన్నారులను నానీ, కన్నా అంటూ పిలచుకుంటాం. అలాంటి వారినీ ఆకట్టుకునేవి కాబట్టే వీటిని నానీలు అంటున్నామంటున్నారు ఈ ప్రక్రియ సృష్టికర్త ఆచార్య ఎన్.గోపి. నావి(నా), నీవి(నీ) కలిపితే నానీలు.. అంటే మనవి అని మరో అర్థం. 1997 ఆచార్య ఎన్.గోపి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆతర్వాత ఎస్.రఘు, ఎస్.ఆర్.భల్లం, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, అంబల్ల జనార్దన్, ద్వానా శాస్త్రి, రసరాజు తదితరులు నానీల వర్షం కురిపించారు. 2001లో కోట్ల వెంకటేశ్వరరెడ్డి 'తెలంగాణా నానీలు' రాయడంతో నానీల సీను తెలంగాణాకు మారింది. చిల్లర భవానీ దేవి యశశ్రీ రంగనాయకి, శారదా అశోకవర్ధన్ లాంటి రచయిత్రులూ నానీలు రాశారు. కొత్త కొత్తగా రచనా ప్రక్రియకు పూనుకునే వారికి నానీలు స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు సాహిత్య ప్రపంచంలోకి సింహద్వారంగా నానీలు వెలుగొందుతున్నాయి.
నానీల్లో ప్రశ్నలు ఉంటాయి. జవాబులు ఉంటాయి. చమక్కులు ఉంటాయి. భావోద్వేగాలు ప్రతిఫలిస్తాయ్. ఆర్తిని కలిగిస్తాయ్. ఆవేదన రగిలిస్తాయ్. ఆలోచన రేపుతాయ్. అయ్యో అనిపిస్తాయ్.. భలే అనిపిస్తాయ్.. బాధను కలిగిస్తాయ్. మనసును కదిలిస్తాయ్. మంచిని పెంచుతాయి. చెడును దునుమాడుతాయి. పంచ్‌తో బాధేస్తాయి. స్పార్క్‌తో మెరిపిస్తాయి.
గాఢమైన భావనలు, లోతైన ఆలోచనలు బుద్ధిగా నాలుగు పంక్తులో ఒదిగిపోతాయి.
మెలకువ
రెప్పల గదుల్లో బందీ
రేపటికే
విడుదల
ఎంత లోతైన భావన.
గోపీ గారి పదాల్లో చెప్పాలంటే-
ఎండపొడల్లో
తడిగా నానీలు
రక్తంతో శ్రుతిచేసిన
వినూత్న బాణీలు
''నానీల్లో వాక్యాన్ని భావాన్ని సంక్షిప్తంగా చెప్పటం, జీవన సత్యాన్ని పిండటం అనే లక్షణాలున్నాయి. అన్నింటికి మించి నానీలో ఏ ఉద్రేకం, ఆగ్రహం, ఆవేశం లేవు. స్పష్టమైన ధ్యానాత్మకత నానీలకుంది.'' నానీలు కేవలం నాలుగు పంక్తులు కలిగి ఉన్న ప్రక్రియ కాదు. అనేకమైన కవితా మార్గాలను సంలీనం చేసుకున్న ప్రక్రియ. రెండు భావ శకలాలలో ఒక పెద్ద వచన కవిత సాధించిన ప్రయోజనాన్ని సాధించిన ప్రక్రియ. నానీల్లో అంతశ్శోధన ఒక ప్రత్యేక గుణం.
తడుస్తాయని
చేపలు భయపడవు
సముద్రాన్ని చీలుస్తూ
అతికిస్తాయి.
చూసిన దృశ్యాన్ని కొత్తగా... ఎంత గొప్పగా ఆవిష్కరించారు?
నడుస్తున్నట్లు
మైమ్
అంగుళం ముందుకుసాగదు
రాజకీయమంటే అదే..
రాజకీయాల తీరుపై ఎంత ఘాటైన వ్యంగ్య బాణమిది?
క్లాసులో ఎప్పుడూ
వెనకవరసే
ఇప్పుడాయన
అగ్రనాయకుడు
ఎలాంటివారు రాజకీయాల్లోకి వస్తున్నారో.. ఎవరు పాలకులవుతున్నారో ఎంత వ్యంగ్యంగా చెప్పారో కవి
వివాహమా
ఎంతపనిచేశావ్
పుట్టింటికే
నన్ను అతిథిని చేశావ్
ఓ రచయిత్రి కలం నుంచి జాలువారిన ఈ పదాలు చదివితే మనసు కదలడం లేదూ..
బువ్వ తింటాంటె
సరం పడ్డది
ఎక్కడో
రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో కవి హృదయ స్పందన ఇది. ఎంత సామాజిక స్పృహ.
పూలదండను చూసి
మురిసింది మేక
అదే ఇక
చివరి కేక
ఒక మూగ జీవి దైన్యాన్ని ఇలా ఆవిష్కరించారు.
నానీలలో
కవిత్వం జాడ
కై చిప్పలతో తీసిన
పాలమీగడ
ఇవి కొన్ని మ(మె)చ్చు తునకలు మాత్రమే. ఇలాంటి కొన్ని వందల వేల నానీలు ఈ రోజు తెలుగునాట వెలువడుతున్నాయి. భాషను సుసంపన్నం చేస్తున్నాయి. మరి కొన్ని శతాబ్దాల వరకు భాష నిలిచి ఉండేందుకు బీజాలు వేస్తున్నాయి.
నానీ జనాః సుఖినోభవంతు
(నానీల దశమ వార్షికోత్సవం, నానీల శతాధిక గ్రంథోత్సవాల సందర్భంగా)
(Eenadu, 14:10:2007)
_______________________________
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home