కృణ్వంతో విశ్వమార్యం
- పారుపల్లి వెంకటేశ్వరరావు
సౌజన్యం, సత్యనిరతి, సదాచరణగల జ్ఞానులు పూజనీయులు. అటువంటి వారికి వర్తించే పదం ఆర్యులు. వారు ఏమతం వారైనా, ఏజాతివారైనా, ఏదేశం వారైనా, ఏఖండంవారైనా, ఆర్య పదం అటువంటి జ్ఞానులకు వర్తిస్తుంది. కుల, మత, భేదాలతో పనిలేదు. స్త్రీ, పురుష విచక్షణ లేదు. ఆర్యపదం గౌరవవాచకం, సంస్కారగుణ సూచకం!
కారణజన్ములుగా మన పురాణాలు, కావ్యాలు కీర్తించే మహామనీషులు, మహా రుషులు, విశ్వమానవ సమాజాన్ని ఆర్యమయం చేయటానికి ధర్మశాస్త్రాలు రచించారు. ఆ శాస్త్రాల ద్వారా, విశ్వమానవాళికి మహత్తరమైన సందేశాలు అందించారు.
''కృణ్వంతో విశ్వమార్యం'' (విశ్వాన్ని ఆర్యమయం చేద్దాం) అన్న ప్రబోధ వాక్యం ఆ మహనీయులు ప్రవచించిందే!
స్వామి వివేకానంద ప్రపంచ మానవాళికి అటువంటి సందేశం అందించటం కోసం అమెరికాలో జరిగే విశ్వమత మహాసభలో పాల్గొనాలని బయలుదేరాడు. అరవై రోజులు ఓడలో సముద్రయానం చేసి 1893 జులై ఆఖరికి అమెరికా చేరాడు.
ఆ మహాదేశంలో వివేకానందకు ఎవరూ తెలిసినవారు లేరు. ప్రయాణ సమయంలో ఆయనకు ఒక సంస్కారవంతురాలైన అమెరికన్ మహిళ పరిచయమైంది. ఆ మహిళ స్వామీజీని పరిపూర్ణ జ్ఞాని అని గుర్తించింది. సంపన్నురాలైన ఆమె స్వామీజీకి సగౌరవంగా ఆతిథ్యమిచ్చింది. అంతేగాక హార్వర్డు యూనివర్సిటీలో గ్రీకు భాషాచార్యుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ జె.హెచ్.రైట్‌కి స్వామి వివేకానందుని పరిచయం చేసింది. ఆయన సుదీర్ఘ సంభాషణ జరిపిన తరవాత స్వామీజీ తత్వజ్ఞాన ప్రతిభకు, విద్వత్తుకు ఆకర్షితుడై అమితంగా అభిమానించాడు.
విశ్వమత మహాసభలో పాల్గొనటానికి యోగ్యతా పత్రాలు వివేకానందకు లేవు. ఆ సంగతి స్వామీజీ రైట్‌తో అనగా ఆ ప్రొఫెసర్, స్వామీజీ! మిమ్మల్ని యోగ్యతా పత్రాలు అడగటం సూర్యుణ్ని ప్రకాశించటానికిగల హక్కును అడగటమే అన్నాడు. ఆ ప్రొఫెసర్ రైట్ సాయంతో స్వామి వివేకానందకు యోగ్యతాపత్రాలు లభించాయి. 1893 సెప్టెంబరు 11 తేదీన చికాగోలో కొలంబస్ హాలులో విశ్వమత మహాసభ ప్రారంభమైంది.
విశ్వ వేదిక మీద తనకు కేటాయించిన సమయం రాగానే వివేకానంద వేదికపై నిలిచి-
అమెరికా దేశపు సోదరీ సోదరులారా! అంటూ ప్రసంగం ప్రారంభించాడు. అక్కడ సమావేశమైన ఆరువేల మంది శ్రోతలు- వివేకానంద ఆత్మీయ సంబోధన వినగానే ఆనంద పరవశులై లేచి నిలబడి సుదీర్ఘ కరతాళ ధ్వనులు చేశారు. వేదికపైకి ఒక నవీన మతప్రవక్త వచ్చి సందేశం అందించబోతున్నాడన్నట్లు హర్షాన్ని వ్యక్తపరచారు.
ఒక దేశానికో ఖండానికో, జాతికో మతానికో కాక మొత్తం ప్రపంచ మానవుల హృదయాల్లో స్నేహ సౌభ్రాత్రాలు, సౌశీల్యాలు నెలకొల్పాలన్నదే స్వామి వివేకానంద సదాశయం, సందేశం!
ఆయన ప్రసంగం విన్న అమెరికా ప్రజలు ఆ అనర్గళ వాక్ప్రవాహానికి, అద్భుత మేధాశక్తికి ఆశ్చర్యం చెందారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అమెరికా దేశ పత్రికలు ''దివ్యప్రేరిత మహావక్త'' అని ప్రశంసించాయి.
ప్రపంచంలో రెండు రకాల మహోన్నత సంస్కృతులు ఉన్నాయని వివేకానంద కనుగొన్నారు. ఒకటి, సనాతన భారతీయ సంస్కృతి. దీనివలన ఆసియా ఖండమంతా ప్రభావితమైంది. రెండు, పురాతన గ్రీకు సంస్కృతి. దీనివలన పాశ్చాత్య ప్రపంచమంతా ప్రభావితమైంది. రెండూ మానవజాతికి మేలు చేకూర్చేవే!
పాశ్చాత్య సంస్కృతిలోని శ్రేష్టత, భారతీయ సంస్కృతిలోని శ్రేష్టత- రెండూ స్వామీజీలో జీర్ణమయ్యాయి. ఈ రెండు సంస్కృతులలోని శ్రేష్టతలు సంలీనమైతే అది పరిపూర్ణ విశ్వసంస్కృతిగా భాసిల్లుతుంది. ఈ విశిష్ట సత్యాన్ని వివేకానంద విశ్వమానవాళికి ఎలుగెత్తి చాటారు. ''కృణ్వంతో విశ్వమార్యం'' అన్న సంస్కృత వాక్యానికి వివేకానంద సందేశం అనుగుణంగా ఉంది.
(Eenadu, 07:10:2007)
_______________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home