పుస్తక సమీక్ష
సుప్రసిద్ధ పాతిక
'బాధల ముళ్లు గుచ్చుకుని బతుకు పచ్చి గాయమై'నా సాహితీ సేద్యాన్ని కొనసాగించిన సహవాసి మిగిల్చి వెళ్లిన చివరి ఫలం 'నూరేళ్ల తెలుగు నవల'. కావ్యాలు, ప్రబంధాల మత్తు వదిలించి, వాస్తవికత కొరడాతో పాఠకులను నిద్రలేపిందని నవలకు పేరు. ఏ అవలక్షణాలను ఈసడించి ఈ ప్రక్రియ వెుదలైందో అందులోనూ అవి జొరబడినై. లేదంటే ఈ వందేళ్లుగా రాసినవన్నీ ఉత్తమ నవలలే కావాలి. కోకొల్లలుగా ఉత్పత్తి అవుతున్న వాటికి భిన్నంగా, ఉరిమి, చిల్చి, చెండాడి... తన తరం పాఠకులనే కాదు, రాబోయే తరాలనూ ప్రభావితం చేయగలిగే రచనలను 'తెలుగునాడి'లో పరిచయం చేస్తూ వచ్చారు సహవాసి. నవలను తెలుగునేలకు ఆహ్వానించిన కందుకూరి 'రాజశేఖర చరిత్ర'తో వెుదలై, మట్టివాసనతో గుబాళించే వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి'తో ముగిసే ఈ పుస్తకంలో మాలపల్లి, వేయిపడగలు, మైదానం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, చదువు, అల్పజీవి, ప్రజలమనిషి, పెంకుటిల్లు, బలిపీఠం, మైనా, అంపశయ్య, హిమజ్వాల లాంటి పాతిక ఆణిముత్యాలనూ ఆయా రచయితల జీవితవిశేషాలనూ అందించారు. 'వెన్న పడుతుండగా పగిలిపోయిన చల్లకుండ కళ్ల ముందు ఆడుతుంది' అని బాధపడ్డారు దుర్భర దారిద్య్రంతో మూడు పదుల వయసులోనే కన్నుమూసిన మంచి-చెడూ రచయిత 'శారద'ను తలుచుకుంటూ. 'వస్తు, శిల్పాలు రచనలో చాలా సన్నిహితంగా కలిసిపోవటం ఉన్నత విలువలు కలిగిన సాహిత్య లక్షణం...' అంటారు బాపిరాజు 'నారాయణరావు' పరిచయంలో. ఇది అన్ని పుస్తకాలకూ వర్తించే వ్యాఖ్య. తెలుగు నవలా సముద్రంలో ఒక్కసారీ మునకలేయని వారికి, ఏం చదవాలో సూచించే దిక్సూచి ఈ పుస్తకం. ఆ అలవాటు ఉన్నవారికి కొత్త వెలుగులు చూపించే దీపపు కాంతి.
నూరేళ్ల తెలుగు నవల(1878-1977);
రచన : సహవాసి
సంపాదకుడు : డి.వెంకట్రామయ్య;
పేజీలు : 230; వెల : రూ.100/-
ప్రతులకు : నవోదయ, కాచిగూడ, హైదరాబాద్-27.
- షేర్‌షా
(EenaaDu, 07:10:2007)
______________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home