కలలు - ఫలితాలు
మనిషికి కలలు రావటమనేది అతి సహజం. మనస్సుకు సంబంధించిన ఈ విషయం మీద ఈనాటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పూర్వకాలంలోనే కాక ఈనాడు కూడా కొన్ని రకాల కలలొస్తే కొన్ని కొన్ని ఫలితాలు ఉంటాయని అందరూ అనుకోవటం కనిపిస్తూ ఉంటుంది. ఈ కలల గురించి అగ్ని పురాణంలో కొంత వివరణ ఉంది. శుభస్వప్నాలను గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో పేర్కొనటం కనిపిస్తుంది. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు. సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువు. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, ఆవు పేడ, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్ని పురాణం పేర్కొంటోంది. తైలాన్ని తాగటం, దానిలో స్నానం చేయటం, ఎర్రని పూలమాలలను ధరించటం ఎర్రని చందనాన్ని పూసుకోవటం లాంటివన్నీ చెడు కలలే. పురాణంలో పేర్కొన్న స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది. దుస్వప్నాలు వచ్చినప్పుడు మెలకువ వచ్చాక మళ్ళీ నిద్ర పోవటానికి ప్రయత్నించాలి. దుస్వప్నాల దోష శాంతి కోసం పండిత పూజ, నువ్వులతో హోమం చెయ్యటం మంచిది. బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యగణాలను పూజించటం, స్తోత్రాలు, పురుషసూక్తం లాంటి వాటిని పారాయణం చేయాలి. రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక సంవత్సర కాలం లోపల అది ఫలవంతమవుతుంది. రెండో జాములో కల వస్తే ఆరు మాసాల లోపున, మూడో జాములో వస్తే మూడు మాసాల లోపున, నాలుగో జాములో కల వస్తే పదిహేను రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వస్తూ ఉంటాయి. సూర్యోదయ సమయంలో కల వస్తే అది పది రోజులలోపే జరుగుతుంది. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుంది. రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలి. అదే శుభస్వప్నమైతే నిద్రపోవటం మంచిదికాదు.
కలలో పర్వతం, భవనం, ఏనుగు, గుర్రం, ఎద్దులను ఎక్కినట్లు కనిపిస్తే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. తెల్లటి పూలతో నిండిన వృక్షాలు కనపడ్డా, కలలో తన బొడ్డు నుంచి వృక్షంకానీ, గడ్డికానీ మొలిచినట్టు, తన భుజాలు, శిరస్సు చాలా పెద్దవిగా ఉన్నట్టు, జుట్టు తెల్లపడ్డట్టు కనిపించినా అది శుభపరిణామ సూచకం.
తెల్లటి పుష్పమాల, తెల్లటి వస్త్రాలు ధరించినట్టు, సూర్యచంద్ర నక్షత్రాలను పట్టుకొన్నట్టు, ఇంద్రధనుస్సును ఆలింగనం చేసుకొన్నట్టు, పైపైకి ఎక్కుతున్నట్టు, కల వస్తే శత్రువులు నశిస్తారని సూచన. పాయసాన్ని తిన్నట్టు కలవస్తే శుభప్రదం.
ఇలా శుభ స్వప్నాల గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం పేర్కొంది. అలాగే శుభస్వప్నాల వరుసను కూడా ఈ సందర్భంలోనే పేర్కొంది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మేలని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ.
-డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
_______________________________
Labels: Life/telugu
3 Comments:
nice script i believe it thanks 4r this
2:07 pm
Nice article. This is very useful to me.
4:04 pm
very good topic and narrated in a great way
1:34 pm
Post a Comment
<< Home