గేట్స్‌ను మించిన మేనేజ్‌మెంట్ మేధావి సీకే ప్రహ్లాద్
న్యూఢిల్లీ: కోయంబత్తూర్ కృష్ణారావు ప్రహ్లాద్ ఎవరో ఎరుగుదురా? పోనీ... సి.కె.ప్రహ్లాద్ అంటే తెలుసా? ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మేనేజ్‌మెంట్ మేధావి. వ్యాపార వ్యూహాల రచనలో ఈ భారతీయుడు తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ అలాన్ గ్రీన్‌స్పాన్‌లనే మించి ఎదిగారు. సన్‌టాప్ మీడియా వెలువరించిన ఈ సంవత్సరపు థింకర్స్ 50 జాబితాలో అగ్రస్థానాన్ని ప్రహ్లాద అలంకరించారు. ఆయన క్లయింట్లలో అల్‌స్థోమ్, ఏటీ &టీ, సిటీకార్ప్, కొడాక్, ఒరాకిల్, ఫిలిప్స్, క్వాంటమ్, రెవ్లాన్, యూనిలీవర్ వంటి దిగ్గజ బహుళ జాతి కంపెనీ (ఎంఎన్‌సీ)లు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న ప్రహ్లాద్ 'ద నెక్ట్స్ ప్రాక్టీస్'కు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా. ఎన్‌సీఆర్ కార్పొరేషన్, హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌ల డైరెక్టర్ల బోర్డులో సభ్యుడు. థింకర్స్ 50 జాబితాకు ప్రహ్లాద కాక మరో ముగ్గురు భారతీయులు ఎంపికయ్యారు. వారు సీఈఓ కోచ్ రాం చరణ్ (22వ స్థానం), టక్ బిజినెస్ స్కూలుకు చెందిన విజయ్ గోవిందరాజన్, హార్వర్డ్‌కు చెందిన రాకేశ్ ఖురానా. వర్జిన్ గ్రూపునకు చెందిన రిచర్డ్ బ్రాన్సన్ 9వ స్థానం పొందారు.
కోయంబత్తూరులో ఓ న్యాయమూర్తి, సంస్కృత పండితుడి ఇంట జన్మించిన ప్రహ్లాద్‌కు మరో ఎనిమిది మంది తోబుట్టువులు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో భౌతిక శాస్త్రం చదివారు. పంతొమ్మిదో ఏటనే చెన్నైలోని యూనియన్ కార్బైడ్ బ్యాటరీ కర్మాగారంలో ప్రహ్లాద్‌ను మేనేజర్‌గా తీసుకున్నారు. నాలుగేళ్లు పనిచేసిన తరువాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం-ఏ)కు వెళ్లారు. పొరుగున ఉన్న విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రయాసపడ్డాక ఆమె పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. ఎమ్మెన్సీల యాజమాన్యంపై పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు స్వదేశానికి తిరిగి వచ్చి ఐఐఎంఏలో పాఠాలు చెప్పారు. తరువాత మళ్లీ అమెరికాకు వెళ్లిపోయారు. గత పదేళ్లుగా అగ్రగామి పది మేనేజ్‌మెంట్ మేధావుల్లో ఒకరుగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడం ప్రహ్లాద్ ప్రతిభకు నిదర్శనం. ద ఫ్యూచర్ ఆఫ్ కాంపిటీషన్, ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ సహా పలు పుస్తకాలు రాశారు. లాల్ బహదూర్ శాస్త్రి పురస్కారం, అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు గెల్చారు.
(Eenadu, 09:11:2007)
____________________________________________
Labels: Management
0 Comments:
Post a Comment
<< Home