వాసనాత్రయం
- ఎర్రాప్రగడ రామకృష్ణ
జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది జ్ఞానా దేవతు కైవల్యమ్ అని శ్రుతులు చెప్పాయి. కనుక మన పెద్దలు జ్ఞానాన్ని మోక్ష సాధనంగా భావన చేశారు. మోక్షాన్ని సాధించే నిమిత్తం జ్ఞానాన్ని అలవరచుకొమ్మని బోధించారు. అదెలాగో కూడా ఎన్నో రకాలుగా వివరించారు. జ్ఞాన సాధనకు ఆటంకంగా నిలుస్తున్నవాటిని గుర్తించి, ఆ అడ్డంకుల విషయంలో జాగరూకత వహించవలసిందిగా చెప్పారు. అలాంటివాటిలో వాసనాత్రయం ముఖ్యమైనది. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అనే మూడింటివల్ల బ్రహ్మజ్ఞానం (విశ్వనాథ సత్యనారాయణ మాటల్లో అచ్చ తెలివి) మనిషికి దక్కకుండా పోతోందని హెచ్చరించారు.
లోకవాసన యాజస్తోః శాస్త్రవాసయా నచ
దేహవాసన యా జ్ఞానం యదావన్నైవ జాయతే
అని చెప్పిన ఉపనిషత్తును 'ముక్తి'కోపనిషత్తుగా సంభావించారు.
వాసనాత్రయంలో మొదటిది లోకవాసన. తన ఘనతను ఈ లోకం సరిగ్గా గుర్తించడంలేదని మథనపడుతూ, గుర్తింపు కోసం ఆరాటపడుతూ, ఈ లోకం పట్ల లోకంలోని వివిధ వస్తువుల పట్ల ఆకర్షణ పెంచుకుంటూ, అవన్నీ శాశ్వతాలని భ్రమిస్తూ, పోయేటప్పుడు అవన్నీ తన వెంట వస్తాయని నమ్ముతూ, అజ్ఞానంలో కూరుకుపోవడాన్ని- లోకవాసనగా మనం చెప్పుకోవచ్చు. ఇది జ్ఞానసాధనకు తీవ్రమైన ఆటంకంగా నిలుస్తుంది.
రెండోది శాస్త్రవాసన. శాస్త్ర పరిజ్ఞానం పట్ల విపరీతమైన మోజు పెంచుకుని తాను గొప్ప పండితుణ్నని విర్రవీగే మనిషి బలహీనతను శాస్త్రవాసనగా చెప్పారు. తర్కమూ, వాదన వంటి వాటిపట్ల ఇష్టం పెంచుకుని తన పాండిత్యంతో వాక్చాతుర్యంతో అవతలివాణ్ని ఓడించాలన్న తహతహ కలిగినవారంతా ఈ కోవలోకి వస్తారు. అసలైన జ్ఞానం సిద్ధించేవరకూ ఈ వ్యామోహం మనిషిని విడిచిపెట్టదు. అలాంటి నిజమైన స్థితి కలిగాకే, అంతవరకూ తన వివేకమూ జ్ఞానమూ- విషయ పరిజ్ఞానమనే చెత్తలో కూరుకుపోయాయనే సత్యం బోధపడుతుంది. ఫలితంగా మౌనం పట్ల ప్రీతి ఏర్పడుతుంది. జ్ఞానులు ఎక్కువ మంది మౌనులుకావడంలోని రహస్యమిదే!
ఇక మూడవది దేహవాసన. తన దేహంపై మనిషికి ఉండే మమకారం ఇంతా అంతా కాదు. శరీరం అనిత్యమన్న సత్యం మరిచిపోయి, దాని పోషణ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. దాన్ని నిత్యమూ అలంకరించుకుని మురిసిపోతాడు. తన దేహాన్నే 'తాను'గా భ్రాంతిపడతాడు. దీన్నే దేహవాసన అన్నారు. నిజానికి మనిషి దేహం సజీవంగా కళకళలాడుతోందంటే- దానికి శివుడు కారణమని చెబుతారు. శివుడు శరీరంలో ఉన్నంతవరకే- దాన్ని ఎన్నిరకాలుగా అలంకరించినా, ప్రపంచ సుందరి వంటి గొప్ప గొప్ప బిరుదులు తగిలించినా! ఒక్కసారి ఆ దేహంలోంచి శివుడు తప్పుకొంటే- ఇక ఎప్పుడు దాన్ని తగలబెడదామా అని చూస్తారంతా! కనుక దేహాన్నికాక శివుణ్ని ధ్యానించమన్నారు. 'ధీ' అంటే బుద్ధి. 'యానం' అంటే ప్రయాణం. బుద్ధితో కలిసిచేసే ప్రయాణమే ధ్యానం. తద్వారా ధ్యానసిద్ధి కలిగి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. జన్మమృత్యురాహిత్య స్థితి కలుగుతుంది. అదే మోక్షం!
జన్మకు కారణం కాముడు (మన్మథుడు), మృత్యువుకు కారణం కాలుడు (యముడు). వీరిద్దరూ శివుడి చేతిలో హతమయ్యారని పురాణగాథ. శివధ్యానంతో ఆ రెండూ దూరమై మోక్షప్రాప్తి కలుగుతుందని ఆ కథకు అర్థం. వాసనాత్రయం నుంచి దూరమైతే జ్ఞానసిద్ధికీ మోక్షప్రాప్తికీ మార్గం సుగమం అవుతుందని సారాంశం.
(Eenadu, 25:11:2007)
____________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home