హిందీ చిత్రరాజాలు
దిల్ తో పాగల్ హై: ఎవరో ఒకరు... ఎక్కడో ఒకచోట... నీ కోసం పుట్టే ఉంటారు - 1997లో యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'దిల్ తో పాగల్ హై' విడుదలైన తరవాత ప్రతి ప్రేక్షకుడి నోట నానిన మాటిది. షారుఖ్‌్, మాధురీ, కరిష్మా నటించారు. ఈ చిత్రానికి ఆ ఏడాది రెండు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇందులో జె.పి.దత్తా రూపొందించిన 'బార్డర్' ఒకటి కాగా, సుభాష్ ఘయ్ రూపొందించిన 'పరదేశ్' ఇంకొకటి.
కుఛ్ కుఛ్ హోతా హై: ఎవరికైనా మనసులో ఏదో ఏదో అయిపోతుంటే వారు కచ్చితంగా ప్రేమలో పడినట్టే అని చెప్పిన చిత్రం 'కుఛ్ కుఛ్ హోతా హై'. 1998లో విడుదలైన ఈ సినిమా విక్రమ్ భట్ రూపొందించిన 'గులామ్' సొహైల్ ఖాన్ రూపొందించిన 'ప్యార్ కియా తో డర్నా క్యా' చిత్రాలతో పోటీ పడి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొంది. ఇందులో షారుఖ్, కాజోల్, రాణి ముఖర్జీ, సల్మాన్ నటించారు.
హమ్ దిల్ దె చుకే సనమ్: 1999లో విడుదలైన ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కథతో రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. సల్మాన్‌్, ఐశ్వర్య, అజయ్ దేవగణ్ నటించారు. ఇందులో సల్మాన్, ఐశ్వర్యల మధ్య అప్పట్లో జరిగిన నిజ జీవిత ప్రేమ కథను కూడా చొప్పించారు. ఇదే ఏడాది విడుదలైన 'తాల్', 'సర్ఫరోష్' చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఈ సినిమా విజయ పథాన దూసుకుపోయింది.
కహో నా ప్యార్ హై: బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌ని ఓ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'కహో నా ప్యార్ హై'. కథానాయికగా అమీషా పటేల్‌కి కూడా మంచి బ్రేక్‌నిచ్చింది. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 102 అవార్డులను పొందిన ఏకైక బాలీవుడ్ చిత్రంగా 2003లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
లగాన్: 2001లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రికెట్ నేపథ్యంతో సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్ నాయకానాయికలు. అదే ఏడాది విడుదలైన 'గదర్-ఏక్ ప్రేమ్ కథా', 'దిల్ చాహతా హై' రేసులో నిలిచాయి. మొదటి సారిగా బాలీవుడ్ నుంచి విదేశీ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రంగా 'లగాన్' ఖ్యాతిని ఆర్జించింది.
దేవదాస్: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'దేవదాస్' రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. దేవదాస్‌గా షారుఖ్, పార్వతిగా ఐశ్వర్య, చంద్రముఖిగా మాధురీ దీక్షిత్ నటించిన ఈ చిత్రం 2002లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి వేసిన భారీ సెట్టింగులు చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి.
కొయి మిల్ గయా: రాకేష్ రోషన్ దర్శకత్వంలో 2003లో సైన్స్, ఫిక్షన్ మిళితంగా రూపొందిన 'కొయి మిల్ గయా'లో హృతిక్, ప్రీతి జింటా నటించారు. అదే ఏడాది 'కల్ హో న హో', 'మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్' చిత్రాలు కూడా విజయాలు సాధించాయి. అయితే చిన్న పిల్లాడి మనస్తత్వం కల పాత్రలో హృతిక్ రోషన్ ప్రదర్శించిన నటన, రాకేష్ రోషన్ దర్శకత్వ ప్రతిభ 'కొయి మిల్ గయా' చిత్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.
వీర్‌జారా: షారుఖ్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ నటించిన 'వీర్ జారా' యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చింది. ఇండో-పాక్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రేమ కథను ప్రేక్షకులు ఎంతగానో అభిమానించారు. అమితాబ్, హేమమాలిని కూడా ఇందులో అతిథిపాత్రలు పోషించారు. ఎనిమిదేళ్ల గ్యాప్ తరవాత యశ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారత్, పాకిస్థాన్‌లోనే కాకుండా యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూఎస్ దేశాల్లో కూడా విజయం సాధించి 2004లో నెంబర్ వన్‌గా నిలిచింది.
బ్లాక్: హెలెన్ కెల్లర్ అనే మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'బ్లాక్'2005లో విడుదలైంది. సాధారణ కళాశాల నుంచి ఓ ఫిజికల్లీ ఛాలెంజెడ్ అమ్మాయి గ్రాడ్యుయేట్ విద్యను కొనసాగించడం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. అమితాబ్‌బచ్చన్, రాణి ముఖర్జీ నటించారు. అదే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 10 ఉత్తమ చిత్రాలను టైమ్ అనే మ్యాగజైన్ (యూరప్) ప్రకటించింది. ఇందులో 'బ్లాక్' నెంబర్: 5 స్థానంలో నిలిచింది.
రంగ్ దె బసంతి: రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన 'రంగ్ దె బసంతి' 2006 జనవరి 26న విడుదలైంది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, సొహ అలీఖాన్, మాధవన్, తదితరులు నటించారు. ఇదే ఏడాది 'ధూమ్:2', 'కభి అల్విద నా కెహనా', 'క్రిష్', 'లగే రహో మున్నాభాయ్' ఘన విజయాలనే నమోదు చేశాయి. అయితే మొదటి వారం కలెక్షన్లే రూ. 51 కోట్లు దాటిన సినిమాగా 'రంగ్ దె బసంతి' రికార్డు సృష్టించింది.
(Eenadu, 11:11:2007)
__________________________________
Labels: Cinema, Cinema/ Hindi
0 Comments:
Post a Comment
<< Home