మన తెలుగు తల్లికి...

వెనకటి తరం రచయితలు కొందరు లాల్చీ ధారణ, బెంగాలీ పంచెకట్టు, రవీంద్రుడి మార్కు గడ్డంతో వంగ కవిత్వాన్ని భుజాన మోసేవారు. 'ఠస్సా చెప్పి రంజింప చేద్దా'మనే గిరీశం తరహాలో- ఆంగ్లంపై అమిత అనురక్తి ప్రదర్శించేవారి సంఖ్యాధిక్యానికి నాడూ నేడూ కొదవ లేదు. జీలకర్రలో కర్ర లేకపోవచ్చుగాని తెలుగువాడిలో వాడికి లోటు లేదన్న గర్జనలకూ ఏనాడూ కరవు లేదు. జనవరి, మార్చి, మే, జులై నెలల పేర్లతో- 'జనవరిష్టుడు శ్రీరామచంద్రమూర్తి మేలుగూర్చుట వ్రతముగా మెలగినాడు మహిని రాక్షసులన్ బరిమార్చినాడు సూర్యవంశపు జూలయి శోభలీనె' అని తమాషా పద్యాలల్లిన నేర్పరులిక్కడ ప్రభవించారు. తెలుగు చేవ ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పూర్వీకులు ఇక్కడివారేనని, కేరళలో నంబూద్రి నాయర్లు సైతం తెలుగువారేనని, కర్ణాటకలో వైదిక బ్రాహ్మణులు మన భాషీయులేనని సంబరపడతాం. ఆది శంకరాచార్యులు మొదలు అన్నాదొరై వరకు ఎందరో తెలుగువారేనని మురిసిపోతాం. తెలుగు భాషా పరిరక్షణ సంగతేమిటంటే- ముందు వెనక అంతా... నిశ్శబ్దమే. 'దేశంలో తెలుగుభాషది రెండోస్థానం (ఇది జనాభాకు సంబంధించి!) ప్రాశస్త్యంలో మొదటిస్థానం అనేది నా వ్యక్తిగతాభిప్రాయం...'- అదీ, శ్రీశ్రీ మాట. తెలుగు పదాలకున్న శబ్దమాధుర్యం మరే భాషకూ లేదు. ఏ సాంకేతిక అభిప్రాయాన్ని అయినా, ఏ వైజ్ఞానిక విషయాన్ని అయినా సునాయాసంగా ప్రకటించే శక్తి తెలుగు భాషకుందని ప్రొఫెసర్ హాల్డేన్ లాంటి విజ్ఞాన వేత్తలెందరో ఒప్పుకొన్నారు. అయితేనేం... మాతృభాషపట్ల పలువురు తెలుగువారి నిరాసక్తత, ప్రభుత్వ ఉదాసీనత- ఎడాపెడా జోడుకత్తులై ఘన వారసత్వాన్ని తెగనరుకుతున్నాయి. ప్రజల కాలానుగుణ అవసరాలు తీర్చలేని ఏ భాషైనా ఉనికి కోల్పోక తప్పదు. ఆ ప్రమాదం తెలుగుకు వాటిల్లకూడదన్న ముందుచూపు కనబరచినప్పుడే మన భాషకు మళ్లీ వెలుగు!
దేశంలోనే మనది మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం. సమున్నత భాషా సాంస్కృతిక వారసత్వ సంపద మన సొంతం. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు...' అంటూ ఒకప్పుడు మన్ననలందుకున్న భాష నేడు అడుగడుగునా ఎందుకు మసకబారుతోంది? ప్రతి రాష్ట్రానికీ ఆ రాష్ట్ర భాషే అధికార భాషగా ఉండాలని, పరిపాలన వ్యవహారాలన్నీ రాష్ట్ర భాషలోనే జరగాలని నెహ్రూ గిరి గీశారు. 'తెలుగు బాసను జుంటితేనెయని పొగిడి పొరుగింటి పులుపుపై మరులు' పెంచుకుంటున్న అవ్యవస్థ తెలుగు తేజాన్ని హరింపజేస్తోంది. జాతీయ భాష కాగల అర్హత ఒక్క తెలుగుకే ఉందన్నది మహాకవి వాక్కు. దాన్ని వెక్కిరిస్తున్న రీతిగా- సంస్కృతం, తమిళాల్ని ప్రాచీన భాషలుగా గుర్తించిన కేంద్రం వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులూ మంజూరు చేసింది. తెలుగుపై శీతకన్నేసింది. వచ్చే సంక్రాంతిలోగా ప్రాచీన భాష హోదాను అనుగ్రహించకపోతే తెలుగుజాతి సామూహిక నిరశన తప్పదని తిరుపతి భాషా బ్రహ్మోత్సవాల్లో తీర్మానం చేశారు. రెండు నెలలక్రితం విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. అక్కడ జాతీయ సమైక్యతే రచయితల లక్ష్యమని, తెలుగు భాషా పరిరక్షణ వారి బాధ్యతేనని గవర్నర్ తివారీ చెప్పారు. ప్రభుత్వం తనవంతుగా ఏం చేయాలో ప్రత్యేకించి ఎవరూ వివరించనక్కర్లేదు. తెలుగు బోధకుల్ని, అభ్యాసకుల్ని పాలకులు అన్ని విధాలా ప్రోత్సహిస్తే- భాషా పరిరక్షణలో అదే పెద్ద ముందడుగు. తెలుగు నేరిస్తే తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న భరోసా విద్యార్థుల్లో కలిగించాలి. దాదాపుగా కార్యకలాపాలన్నీ మాతృభాషలోనే చక్కబెడుతున్న తమిళనాడు, కేరళ శాసనసభల్ని చూసైనా 'ఆంగ్ల ప్రదేశ్' తీరు మారాలి. ఆధునిక శాస్త్ర ఫలితాల్నీ మాతృభాషల్లోనే ఇముడ్చుకొని పురోగమిస్తున్న జపాన్, జర్మనీ, చైనాల అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్వాలి. ఇటు పౌరులూ తెలుగు తల్లికి మల్లెపూదండలేసి మంగళారతులు పట్టేందుకు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు మారాలి!
(Eenadu, 02:12:2007)
______________________________________
Labels: Telugu language
0 Comments:
Post a Comment
<< Home