My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, June 13, 2017

2147~ పాటే వెన్నెల... పదమే ఊయల...

అమ్మ పాడే లాలి పాటలు.. అమ్మా అని బిడ్డ నోరారా పాడే పాటలు... అల్లరి వయసు విరహ గీతాలు.. ప్రేమికుల సరసాల సయ్యాటలు.. వ్యక్తిత్వానికి వన్నెలుదిద్దే నీతిపాఠాలు.. జీవిత సూత్రాల చద్దిమూటలు.. ఇలా తెలుగు సినీ సాహితీవనంలో సినారె వెదజల్లిన సౌరభాలెన్నో. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాల్లా ఆ పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయి.

‘అమ్మా అని నోరార పిలవరా.. ఆ పిలుపే అందరు నోచని వరమురా..’ అంటూ ‘మనుషులు మట్టిబొమ్మలు’లో బిడ్డల కోసం పరితపించే ప్రతి కన్నతల్లి ఆర్తిని అక్షరాల్లో ఆవిష్కరించారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా..’ అంటూ అమ్మ అనే మాటకు సరికొత్త భాష్యం చెప్పారు ‘ప్రేమించు’ చిత్రంతో. తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దుచేశారంటే ఉలికులికి పడతాడు..’ అంటూ చిన్ని కన్నయ్యలను అమ్మతో జోకొట్టించేశారు ‘జీవనజ్యోతి’లో.

అమ్మ గొప్పతనం గురించి చెప్పే క్రమంలో నాన్నను తక్కువ చేయలేదాయన. బిడ్డలను పూలతోటలో నడిపించేందుకు తాను ముళ్లబాటలో నడిచేందుకు సిద్ధమయ్యే తండ్రిని ‘ఓ నాన్నా నీ మనసే వెన్న.. అమృతం కన్న అది ఎంతో మిన్న..’ అని ‘ధర్మదాత’లో కీర్తించారు. ‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు.

ఇలాంటి కన్నప్రేమ గీతాలే కాదు.. కన్నె ప్రణయగీతాల్లోనూ తన చమక్కు చూపించారు సినారె.
‘వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. ‘పూజాఫలం’లో ‘పగలే వెన్నెల జగమే వూయల..’ అంటూ వూహాలోకంలో పరవశింపజేశారు. ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. ‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’ లో కళ్లకుకట్టారు. ‘నువ్వలా ముందుంటే నిన్నలా చూస్తుంటే..’ అని ‘గూఢచారి 116’ పాడుకున్నా, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా, ‘అమ్మమాట’లో ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు..’ అని కన్నెపిల్ల వాపోయినా, ‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్‌..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.

మెరిసే ముత్యాలు...: సినారె పాటల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సూక్తులు, జీవిత సత్యాలూ ఉన్నాయి. ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో. ‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో.
‘మంచి మిత్రులు’లోని ‘ఎన్నాళ్లొ వేచిన ఉదయం..’ పాటలో మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని ధైర్యమిస్తాడు.
‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు.
‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు.
‘రైతు కటుంబం’లో ‘ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము..’ అంటూ మట్టితో రైతు అనుబంధాన్ని ఆవిష్కరించారు.

Labels: , , , ,

Monday, December 15, 2014

1699- Q & A - `Fears over Sanskrit are emotional ­ with - clear caste and religious overtones'

Dec 15 2014 : The Times of India (Chennai)


Ganesh Devy is a Padma Shri awardee and Unesco Linguapax laureate who headed the People's Linguistic Survey of India 2010. Speaking with Robin David, Devy discussed why qualms around Sanskrit are emotional, effective ways of preserving Sanskrit's heritage ­ and which languages merit equal attention: 
 
Why do you say the current debate over reviving Sanskrit is more emotional than practical?

Today, very few people claim Sanskrit as their first language ­ it's not possible to buy a train ticket or even get Ayurveda medicine us ing Sanskrit. It is not a language of use any more. It's not been a language of use in India since the 17th century ­ and we're now in the 21st century. So, to whip up emotions about losing Sanskrit, then reviving it, is a purely emotive effort.
It is true that modern Indian languages are based on Sanskrit. But it is also true that modern Indian languages have been in existence for nearly 1,000 years now and can be studied seriously on their own. For great scholarship in English, you no longer have to study Latin and Greek.
It's an emotional issue ­ and it has very clear overtones of caste and religious identities.

You've fought to ensure certain languages don't die ­ why shouldn't Sanskrit be amongst those languages?

I fight for languages spoken by people in communities. They need to live on, so that the communities can continue their existence with dignity.
Some languages are seen as less important. Tribal languages are seen as inferior and backward. That is not desirable. But with Sanskrit, no one will ever look at its use as a sign of backwardness. On the contrary , if there's an individual who can speak or write Sanskrit, that's seen as a sign of scholarship. The fear is, we might forget the legacy of Sanskrit, rather than the life of Sanskrit. We have to make that distinction. There are ways of managing that fear by preserving manuscripts, building good libraries, digitising Sanskrit literature. Look at how the French take care of their language.
All Indian languages together constitute less than 1% of the international web space, which is not good.

If we strive to protect all our Indian languages, that would lead to a much better situation.
Many see English as a threat to Sanskrit ­ your view?

It definitely isn't. The use of the two languages is different. In India, we've managed successfully to allow languages to have different roles in our lives.
Our banking is done in English but our birth, death and marriage rituals are in Sanskrit. Certain domains of our lives are dominated by Persian even today ­ our entire entertainment domain is managed by languages that spring out of Persian.On the other hand, cricket comes from an English ethos.

To disturb the good harmony between different languages is not a good thing for India.
Which Indian languages deserve as much emphasis as Sanskrit?

Tamil, Telugu and Bengali ­ these are spoken by very large numbers and will survive this phase of lan guage decline.
From a business point of view also, these will be important in the future.

Labels: , , , ,

Sunday, February 23, 2014

1350- సంబురాల తెలంగాణ!

https://lh5.googleusercontent.com/-tnHtRxNdCPY/Ufd5nNddHsI/AAAAAAAAjM4/Fn2CaSV2rr8/s288/Telangan-state.jpg

సుమారు నాలుగు కోట్ల స్వరతంత్రులతో కోటి రతనాల వీణ సంబురాల సరిగమలు పలుకుతున్న వేళ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల దశాబ్దాల కల ఫలించబోతోంది. రాష్ట్రపతి మొహరు పడటమే తరువాయి, దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ తళుకులీననుంది. లక్షా 14వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 3.52కోట్ల(2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభాతో తెలంగాణ దేశంలో పదకొండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తోంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా నాలుగో స్థానంనుంచి ఆరోస్థానానికి, జనసంఖ్య పరంగా అయిదునుంచి పదోస్థానానికి పరిమితం కానుంది. 'అయిదున్నర దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండు చరిత్రను, తాము సాగించిన విస్తృతస్థాయి సంప్రతింపులను పరిగణనలోకి తీసుకొని ముందడుగేశా'మని నిరుడు జులై చివరివారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించినప్పటినుంచి, నేటిదాకా విభజన ప్రక్రియ అంతా- ఉద్విగ్నత, ఆవేశోద్రేకాల సమ్మిళితంగానే సాగింది. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా యాభై ఏడేళ్లక్రితం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ఎంత సున్నితమైనదో 2009 డిసెంబరులోనే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసివచ్చింది. పార్టీలు సైతం ప్రాంతాలవారీగా చీలిపోయిన విపత్కర వాతావరణంలోని భావోద్విగ్న తీవ్రతలను గుర్తించి- ఈ ఆరున్నర నెలల కాలావధిలో సర్వామోద పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండాల్సింది. ఆ పని చెయ్యని హస్తం పార్టీ అధిష్ఠానం- 2006లోనే ప్రత్యేక తెలంగాణకు 'సై' అన్న భాజపానూ విశ్వాసంలోకి తీసుకోలేకపోయింది. పర్యవసానమే, పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టడం నుంచి రాజ్యసభలో ఆమోదం పొందేదాకా అనుక్షణం ఎడతెగని ఉత్కంఠ; అయిదు కోట్లమంది ప్రయోజనాల్ని అసలేమాత్రం పట్టించుకోలేదంటూ సీమాంధ్రుల్లో తీవ్ర భయాందోళన. 'తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి' అన్నట్లు కేంద్ర సర్కారు అడుగడుగునా అప్రజాస్వామికంగా వ్యవహరించిందనడంలో మరోమాట లేదు. విపక్షాల అభ్యంతరాలన్నీ ఎగువ సభలో వీగిపోయిన నేపథ్యంలో, నవతెలంగాణ శిశూదయాన్ని స్వాగతించాలిప్పుడు!

వేర్వేరు పరగణాల్లో ఉన్న తెలుగువారంతా ఒక్కతాటిమీదకు వచ్చితీరాలన్న సమైక్య భావకాంక్షకు ఫలశ్రుతి- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఇప్పుడు తెలంగాణ వేర్పాటుకూ అలుపెరుగని ప్రజాందోళనే కారణం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదిక అయింది. కాకతీయుల కాలంలో కలిసి ఉన్న ఆంధ్రులు మళ్ళీ భారత రిపబ్లిక్‌లో ఏకమయ్యారన్న ఆనందానుభూతుల్ని అంతలోనే ఆవిరి చేసేలా ఒప్పందాల ఉల్లంఘనలు తెలంగాణవాదుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. సమైక్య రాష్ట్రం ఏర్పడిన పదమూడేళ్లకే వేర్పాటువాదం రాజుకోవడానికి పాలకుల తప్పిదాలే పుణ్యం కట్టుకొన్నాయి. 1973లో ప్రధానిగా ఇందిర ప్రతిపాదించిన ఆరుసూత్రాల పథకం అమలు సైతం వివాదగ్రస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కూర్పు బేషరతు కాదని, విద్యా ఉద్యోగాలు పారిశ్రామిక ప్రగతి సేద్యరంగం వంటివాటన్నింటా తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశం తెలంగాణ వేర్పాటు కాంక్షలకు ఎరువవుతూ వచ్చిందని తెరాస సిద్ధాంతకర్తగా జయశంకర్ లోగడే స్పష్టీకరించారు. పదమూడేళ్ల క్రితం తెలంగాణ సాధనే లక్ష్యంగా తెరాస స్థాపించిన బక్కమనిషి కేసీఆర్ ఉక్కు సంకల్ప దీక్షా దక్షతలతో ప్రజాకాంక్షకు ఉద్యమ రూపమిచ్చి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో శ్రేణుల్ని కదం తొక్కించారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా సమైక్యవాదం వినిపించిన సీనియర్ రాజకీయవేత్త చెన్నమనేని రాజేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ అవసరం ఎందుకొచ్చిందో తెలుగుదేశం తరఫున సాగించిన అధ్యయనంలో వివరించారు. వైఎస్ పాలన, అర్ధశతాబ్ది ప్రత్యేక తెలంగాణ వాదనను రెట్టింపు చేసిందని, భూముల్ని తెగనమ్మడం, 'సెజ్'ల దోపిడి, నదీజలాల తరలింపు తదితర ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకబాట పట్టిస్తున్నాయని ఆరేళ్లక్రితమే వాస్తవాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనసుల్లో తాము విచక్షణకు, దాష్టీకానికి గురి అవుతున్నామన్న భావన తీవ్రమైన ఆవేశకావేషాల దశకు చేరుకుందని, ప్రత్యేక తెలంగాణ డిమాండు పూర్తిగా అన్యాయమైనదేమీ కాదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టీకరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించిన పక్షంలో భిన్న ప్రాంతాలవారి భయాలు ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకొని వారికి భరోసా కల్పించాలనీ సూచించింది. ఆ భరోసాల అంశంలోనే కేంద్రప్రభుత్వం దాగుడుమూతలు, లేనిపోని వైమనస్యాలను పెంచాయని చెప్పక తప్పదు!

ఒక జాతి కట్టుబాటును మతంకన్నా ఎక్కువగా భాష శాసిస్తుందని, అందుకు తానే ఉదాహరణ అనీ ఉపఖండంలో భాషాప్రయుక్త దేశంగా బంగ్లాదేశ్ చాటింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 'యునెస్కో' నిర్వహిస్తోంది. ఈసారి మాతృభాషా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన మరో గుణపాఠం నేర్పుతోంది. ఓ జాతి కట్టుబాటుకు భాషా ప్రాతిపదిక ఒక్కటే సరిపోదని, అంతకుమించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంక్షలకు గొడుగుపట్టే సుపరిపాలన మరెంతో అవసరమనీ పాలకులు తెలుసుకోవాలి. 'సంబంధిత అన్ని వర్గాలతోనూ తగిన చర్చలు, ఏకాభిప్రాయ సాధన, సరైన సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పరిశీలన' అన్నవి 2004లో తొలి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలోని ముఖ్యాంశాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలహరణం తరవాత, పదహారో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళే 'సరైన సమయం' అంటూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు హడావుడి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం- రెండుపక్కలా కడ నిమిషందాకా ఉద్విగ్న వాతావరణాన్ని పెంచి పోషించింది. రాష్ట్రంలో, దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక దశలో తెలంగాణకు అనుకూలత చాటాయి. వాటి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగేస్తే అసలు గొడవన్నదే లేకపోయేది. మూడు ప్రాంతాల మధ్య సామరస్యంగా సయోధ్య సాధించగలిగితే విభజన చేయవచ్చని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీయే సూచించింది. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండే సుహృద్భావానికి ప్రోది చెయ్యాల్సిన కేంద్రప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించింది. పాలకుల రాజకీయ పాచికలు పెంచిన మనస్పర్ధల్ని పక్కన పెట్టి, ఇరువైపులా తెలుగువారి ఔన్నత్యం మరింతగా పరిమళించాల్సిన తరుణమిది. నీటి వనరుల పంపిణీ, విద్యుత్, ఉద్యోగులు, ఉమ్మడి రాజధానిలో కలసి పదేళ్లు పనిచేయడం వంటి అనేకాంశాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాల మధ్య సౌహార్దపూర్వక సంప్రతింపులు తప్పనిసరి. విభజన క్రమంలో భేదాభిప్రాయాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొంటూ సముజ్జ్వల భవిత నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెట్టపట్టాలు కట్టి సాగాలి!
(సంపాదకీయం, ఈనాడు, 21:02:2014)
__________________________________

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Labels: , , , , , , , ,

Friday, February 21, 2014

1349- Telangana, Demerger:A long journey

Here are some events, some going back to 1948, that have preceded the formation of Telangana state.
______________________________________

Hyderabad: With the Lok Sabha passing the bill for bifurcation of Andhra Pradesh Tuesday, decks have been cleared for formation of Telangana as the 29th state in India. Following are the major events in the history of Telangana since 1948:
1948: Indian Army annexes princely state of Hyderabad, which comprised different regions, including Telangana.
1950: Telangana became Hyderabad State.
1952: First elections held in Hyderabad State.
Nov 1, 1956: Telangana merged with Andhra State, which was carved out of Madras State, to form Andhra Pradesh, a united state for Telugu-speaking people.
1969: 'Jai Telangana' movement for separate statehood to Telangana began. Over 300 people killed in police firing.
1972: 'Jai Andhra' movement began in coastal Andhra for separate Andhra State.
1975: Presidential order issued to implement six-point Formula, providing some safeguards to Telangana.
1997: BJP supported demand for Telangana state; in 1998 election, it promised 'one vote two states'.
2001: K Chandrasekhara Rao floated Telangana Rashtra Samithi (TRS) to revive Telangana movement.
2004: TRS fought elections in alliance with Congress, wins five Lok Sabha and 26 assembly seats. UPA includes Telangana issue in common minimum programme.
2008: TDP announced support for Telangana demand.
2009: TRS contested elections in alliance with TDP but its tally came down to two Lok Sabha and 10 assembly seats.
Sep 2: Chief minister Y S Rajasekhara Reddy died in helicopter crash, triggering political uncertainty.
Oct 2009: Chandrasekhara Rao began fast-unto-death for Telangana state.
Dec 9: Centre announced decision to initiate the process for formation of Telangana state.
Dec 23: Following protests in Rayalaseema and Andhra regions (Seemandhra) and en mass resignations of MPs and state legislators, centre put the process on hold citing need for consensus.
Feb 3, 2010: Centre set up five-member Srikrishna committee to look into Telangana issue.
Dec 2010: Srikrishna committee submitted its report, suggested six options
July 30, 2013: UPA coordination panel and Congress Working Committee decided to carve out Telangana state. Protests in Seemandhra.
Oct 3, 2013: Union cabinet approved the proposal to divide Andhra Pradesh. A Group of Ministers (GoM) was constituted to prepare the roadmap after consultations with all stakeholders.
Oct 25, 2013: Chief minister N Kiran Kumar Reddy raised banner of revolt against Congress leadership. He wrote letters to president and prime minister urging them to stop bifurcation process.
Dec 5, 2013: Union cabinet approved draft Andhra Pradesh Reorganisation Bill 2013 prepared on the basis of recommendations by the GoM. Bill sent to President Pranab Mukherjee with a request to make a reference to Andhra Pradesh legislature to obtain its views under Article 3 of the Constitution.
Dec 9: The President gave time till Jan 23 to the state legislature to give its views.
Dec 12, 2013: Bill brought to Hyderabad in a special aircraft and amid tight security.
Dec 16, 2013: Bill introduced in both houses of state legislature amid clashes between Seemandhra and Telangana lawmakers.
Jan 8, 2014: After disruptions for several days, debate finally began on the bill in assembly and council.
Jan 21, 2014: State government sought four more weeks to debate the bill. The President gave one week.
Jan 27, 2014: Chief Minister Kiran Kumar Reddy gave notice to assembly speaker for a resolution to reject the bill.
Jan 30, 2014: Amid ruckus, both houses of state legislature passed by a voice vote official resolutions, rejecting the bill and appealing to the President not to send the bill to parliament.
Feb 5, 2014: Chief minister staged sit-in in Delhi to oppose bifurcation.
Feb 7, 2014: Union cabinet cleared the bill and rejected Seemandhra leaders' demand to make Hyderabad a union territory. Bill sent to the President for his approval to table it in parliament.
Feb 11, 2014: Congress expelled six MPs from Seemandhra for moving no-confidence motion against government.
Feb 13, 2014: Bill introduced in Lok Sabha amid clashes between MPs from Seemandhra and Telangana. L. Rajagopal, a MP from Seemandhra, used pepper spray in the house. Speaker suspended 16 MPs, including Rajagopal, for rest of the session.
Feb 18, 2014: Lok Sabha passes Telangana bill
______________________________________

Labels: , , , , ,

Sunday, October 20, 2013

1275- తెలుగు జాతిరత్నం




శోకం- శ్లోకం పలికితే రామాయణం. ఆకలి- అక్షరాభ్యాసం చేస్తే తెలుగువారికొక జ్ఞానపీఠం! పనసపండు తన రహస్యాన్ని పరిమళం రూపంలో చెప్పినట్లుగా, రచయితలు తమ ఆకలిని అక్షరాల రూపంలో ఈ లోకానికి వివరిస్తారు. అక్షరాలతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్షరాలతోనే ఆత్మారాముడు తృప్తిచెందినట్లు భావిస్తారు. అక్షరాలకు అంజలి ఘటిస్తారు. తమ నుంచి అక్షరాలను వెలువరిస్తోంది కనుక ఆకలినీ గౌరవిస్తారు. 'ఆకలి నా రచనలకు ప్రేరణ' అని సగౌరవంగా ప్రకటించడంలో రావూరి భరద్వాజ స్ఫురద్రూపిగా కనిపిస్తారు. ఆకలి ఆయనను జ్ఞానిని చేసి పై మెట్టుపై కూర్చోబెట్టింది. జ్ఞానపీఠాన్ని కట్టబెట్టింది. ఆకలిని గౌరవించడమంటే అట్టడుగు వర్గాన్ని గౌరవించడమే! అత్యున్నత జ్ఞానపీఠాన్ని అందుకున్నప్పుడు భరద్వాజ అదే చెప్పారు. 'నేను సామాన్యుణ్ని... గట్టిగా చెప్పాలంటే అంతకన్నా తక్కువవాణ్ని' అన్నారాయన. పిడికెడు మెతుకులకోసం ఆయన వ్యవసాయకూలీగా పనిచేశారు. పశువులు కాశారు. బొగ్గుపనిలో మాశారు. పేపర్లు వేశారు. కలప అడితిలో, కమ్మరి కొలిమిలో, పొగాకు కొట్టులో పనిచేశారు. ఆకలి అన్ని పనులూ నేర్పింది! ఏడో తరగతి మానేసిన కుర్రాణ్ని జీవితం చదువుకున్న గొప్ప విద్యావంతుణ్ని చేసింది. పదిహేడేళ్లకే రచయితను చేసింది. సాహిత్య అధ్యయనాన్నే విద్యాభ్యాసంగా మార్చింది. బతుకు పుస్తకాలను చదివించింది. రాయించింది. 'నాకు సంబంధించి నా జీవితానికి, రచనకు వైరుధ్యం లే'దని చెప్పిన రావూరి భరద్వాజ- సహస్ర వృత్తుల శ్రమజీవుల జీవన సమరాన్ని గుండెలకు హత్తుకొనేలా అక్షరీకరించిన ధన్యజీవి!

చూసినవారి గురించే రాశాడాయన. 'జీవనసమరం' దానికి గట్టి సాక్ష్యం. అందులో పాత్రలు అందరికీ పరిచయమైనవేగాని, వాటిని చిత్రించడం మాత్రం భరద్వాజకే సాధ్యం. అట్టడుగు వర్గమంటే సాంఘిక అసమానతలకు గుర్తు. అణచివేతకు, అవమానాలకు ఆలవాలం. ఆకలి దహిస్తుంటే... ఆక్రోశం, అణిచివేస్తుంటే- ఆందోళన సహజం. ఆ రెండూ అక్షరరూపం దాల్చినప్పుడు ఆ అక్షరాల్లోంచి మాడుతున్న పేగు వాసన ఉబికివస్తుంది. రావూరి రచనల్లోని జీవలక్షణం ఆ ఘాటువాసనే! సమాజంలోని అట్టడుగు జీవుల్ని సాహిత్యలోకపు అందలాలెక్కించిన భరద్వాజ రచనల్లో- రాగిణి, కొత్తచిగుళ్లు, కాదంబరి, నాలోని నీవు, అంతరంగిణి, ఐతరేయం, ఒకింత వేకువకోసం, పదహారు నెలలపాటు 'ఈనాడు' దినపత్రికలో ధారావాహికగా ఆకట్టుకున్న 'జీవనసమరం'... వంటివన్నీ ఒక ఎత్తు. ఆయనకు జ్ఞానపీఠాన్ని అందించిన 'పాకుడురాళ్లు' మరో ఎత్తు. అందులో రంగస్థల సహజ జీవి 'మంగమ్మ'- తళుకుబెళుకుల సినీతార 'మంజరి'గా తర్జుమా అయిన తీరు విషాద రమణీయం. అందులోని అక్షరాలు అంతరంగ లోతట్టు పొరల గవాక్షాలు. గుండెపొరల్లోంచి విచ్చుకున్నవి కాబట్టి, వాటి తడి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ రచనకారచన ప్రత్యేక శైలితో, విభిన్న ధ్వనులతో, కాకువు విశేషంతో మనలను పలకరిస్తుంది. రచయితగా భరద్వాజ స్థాయిని నిరూపిస్తుంది. రావూరి జీవితానికి గట్టి ఓదార్పు అక్షరం. ఆయన జీవితానికి తీర్పు అక్షరం. అక్షరం ఆసరాతో మనసు తేలికపడ్డ ప్రతి రచయితలాగే- భరద్వాజ సైతం అక్షరానికి నివాళి అర్పించారు. అక్షరానికి జీవితాన్ని ముడుపుకట్టి దాని నీడన ఆశ్రయం పొందారు.

రావూరి జీవితానికి మరో చల్లని నీడ- ఆయన భార్య కాంతం! కాంతాన్ని- కాంతమ్మా అని పిలవడం భార్యగా ఆమె సాధించిన గొప్ప గౌరవం. 'భగవంతుడు కూడా నీ రూపంలో కనబడితే తప్ప నేనిప్పుడు గుర్తించలేను కాంతం' అన్న భరద్వాజ- 'నేనిప్పుడు నిరీహస్థితిలో ఉన్నా'నంటూ చేసిన అక్షరార్చన అజరామరం! ఆమె మరణం ఆయన చేత స్మృతికావ్యాలు రాయించింది. అక్షర నీరాజనాలు పలికించింది. మాడుతున్న పేగు వాసనలాగే మట్టి వాసన కూడా ఆయన సాహిత్య జీవలక్షణం. 'పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం నడిచివచ్చిన పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం దారిచూపిన పాదాలకు కృతజ్ఞతలు... నన్ను అనుసరించిన పాదాలకు కృతజ్ఞతలు' అన్నాడొక కవి. రావూరి చితికట్టెల చిటపటలు కూడా బహుశా అవే మాటలను వినిపించి ఉంటాయి. మరింత నిశితంగా వినిఉంటే, ఆ చితిమంటల సవ్వడి నుంచి 'మంగమ్మ'కు కృతజ్ఞతలు...' అనీ తప్పక వినపడే ఉంటుంది. ఆమె 'మంజరి'గా మారకుంటే 'పాకుడురాళ్లు' నవలా లేదు, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠమూ లేదు. జీవితంలో మేలుచేసిన ప్రతి సందర్భానికీ, ప్రతి వ్యక్తికీ, పదేపదే ధన్యవాదాలు చెప్పుకొన్న భరద్వాజ- తన చరమదశలో విశ్వనాథ, సినారెల సరసన చోటుకల్పించిన ఆ స్త్రీమూర్తికి తప్పక కృతజ్ఞతలు చెప్పినతరవాతే అనంతవాయువుల్లోకి ప్రయాణం సాగించి ఉంటారు. పల్చని దేహంతో, నెరిసిన గెడ్డంతో అచ్చతెనుగు రూపురేఖలతో ఆంధ్రదేశాన్ని అలరించిన రావూరి భరద్వాజ తన ఆరోప్రాణం దగ్గరికి పరుగెత్తిన పతి... మనకిక తీయని స్మృతి. తెలుగుజాతికి మరో జ్ఞానపీఠం దక్కడానికి అవసరమైన స్ఫూర్తి! 'ఆవిరి ఓడలో జలధియానమొనర్చు బాటసారులు'గా వర్ణించాడు- మనుషుల్ని మహాకవి జాషువా. ఎవరి రేవు రాగానే వారు దిగి వెళ్ళిపోతుంటారు. రావూరి భరద్వాజ దిగవలసిన రేవు వచ్చింది. ఆయన దిగి వెళ్ళిపోయాడు- నిశ్శబ్దంగా!

(ఈనాడు, 20:10:2013)
__________________________

Labels: , , ,

Friday, August 23, 2013

1254-సాహితీ మాలతీ.. మనకిక లేరు!




అక్షర చైతన్య శీలి... కన్నుమూశారు. అశేష పాఠక 'హృదయనేత్రి'.. వీడ్కోలంటూ వెళ్లిపోయారు. 'ప్రమదావనం' శీర్షికతో తెలుగు పత్రికా ప్రపంచాన్ని మహిళల దిశగా అడుగులేయించిన కలం.. నిశ్చలమైంది.ఎప్పటికప్పుడు కొంగొత్తగా ఎగసిపడ్డ 'పాత-కొత్త కెరటాల' పాళీ.. ప్రాణధారను కోల్పోయింది. లాలనగా, తార్కికంగా, గద్దింపుగా 'అడగండి చెబుతా!' అన్న పెద్దరికం... మాటయినా అడగకుండా సెలవు తీసుకుంది.

తెలుగు సాహిత్యానికి తనదైన సుగంధాలద్ది బుధవారం నేలరాలిన మాలతీ... సాహితీ, వ్యక్తిగత జీవనం ఆద్యంతం చైతన్యశీలంగానే సాగింది. 'పఠనం ఒక తీరని దాహం. ఆ దాహం ఎప్పటికైనా తీరుతుందో లేదో..!' అంటుండేవారు మాలతీచందూర్. నిజానికి ఆమె తుదిశ్వాస వరకు ఆ దాహం తీరలేదనే చెప్పాలి. ఆమె తన ప్రాణాపాయకర 'కణితి' గుర్తించిన తర్వాత కూడా తన శీర్షిక కోసం పుస్తకాలతో నెచ్చెలిమి నెరపుతూనే ఉన్నారు. మాలతీగారి రచనా ఔన్నత్యానికి పుస్తకపఠనం ఒక ఎత్తయితే.. చందూర్ జీవనభాగస్వామ్యం మరొక ఎత్తు!! ఇవి రెండూ కలిసే తనను మంచి రచయిత్రిగా చేశాయని అంటారు మాలతీ... ఆమెకే సాధ్యమైన నిరాడంబరతతో. కానీ పుస్తకపఠనాలు, పరిచయాలే ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయా? అంటే కాదనే అంటారు ఆమెతో కాస్త పరిచయం ఉన్నవాళ్లెవరైనా. మాలతీచందూర్‌లో సహజంగానే ఉన్న ఓ అన్వేషణా దృక్పథం, ఎన్నడూ ప్రతికూల భావాలు దరిచేరనీయని నిబ్బరం, గొప్పదనం ఎక్కడున్నా వెదికిపట్టి వెంబడించే చైతన్యశీలత.. ఆమె సహజగుణాలు. వాటికి పుస్తకపఠనం, చందూర్ జీవనభాగస్వామ్యం గోడచేర్పుగా అమరాయి.

రవ్వదుద్దులు...
నూజివీడులో ఆమె ఎప్పుడూ మగరాయుడిలాగే అల్లరి చేస్తూనే ఉండేవారట. 80 ఏళ్లు పైబడ్డాక కూడా ఆ చలాకీతనం చెక్కు చెదరలేదు. సున్నితమైన హాస్యం ఆమెను వీడలేదు. నూజివీడులో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాక మేనమామ చందూర్ ఇంటికి వెళ్లారు. మావయ్యతో కలిసి సాహితీసభలకు వెళుతుండేవారు. 1945-46లోనే తొలిసారిగా విశ్వనాథ, కృష్ణశాస్త్రి, గాయకుడు ఎంఎస్ రామారావు, చలం పరిచయమయ్యారు. సాహిత్యమండలి తరపున వేసిన శశాంక నాటకాల్లో అనూరాధ పాత్ర కూడా పోషించారు. అప్పట్లో క్రమం తప్పకుండా చదువుతున్న ఆనందవాణి పత్రికలో తన తొలికథ 'రవ్వల దుద్దులు' రాశారు. అమ్మ జ్ఞానాంబ మాలతీ బాధ్యత పూర్తిగా మామయ్యకే అప్పగించి.. పెళ్ళి చేశారు. పెళ్ళయాక మద్రాసు వచ్చారు. అక్కడే పెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు. మద్రాసు మహానగరంలో స్వాతంత్య్రం వచ్చాక రిజిస్టర్ అయిన తొలి వివాహం ఆ దంపతులదేనంటారు! ఆకాశవాణిద్వారా ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఆ కుటుంబానికి పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతో తొలిసారి ఆకాశవాణిలో టాల్‌స్టాయ్‌పై 15 నిమిషాలు ప్రసంగించారు. ప్రపంచ సాహిత్యంపై ఆమె వేసిన తొలి అడుగు అది. పాతకెరటాలకు ఒకరకంగా అప్పుడే బీజం పడింది. పాతకెరటాలు, కొత్తకెరటాల ద్వారా ఆమె 350 ప్రపంచ పుస్తకాలను పరిచయం చేశారు.

47 ఏళ్లపాటు 'ప్రమదావనం'!
1952లో ఆంధ్రప్రభలో ప్రమదావనం శీర్షిక ప్రారంభించిన కొత్తల్లో దానికి కనీస స్పందన కరవైంది. మాలతీ అందులో 'లేడీస్ హోమ్' కోణం ప్రవేశపెట్టి.. వైవిధ్య పుంతలు తొక్కాక తిరుగులేకుండా పోయింది. 47 ఏళ్లపాటు నిరాఘాటంగా సాగి తెలుగు పత్రికా ప్రపంచంలో రికార్డు సృష్టించిన శీర్షిక అది. ఆ శీర్షికలోని సమాధానాలు చదివి ఐఏఎస్‌లుగా మారినవారున్నారు. 'చంపకం-చెదపురుగులు'తో ఆమె తొలినవల. 'హృదయనేత్రి' కేంద్ర సాహిత్య అకాడమీ అందుకుంది. శతాబ్ది సూరీడు, ఆలోచించు వంటి 30 నవలలు రాశారు. '1970-80ల నాటి న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగినులు.. ఇలా అన్నివృత్తుల మహిళలనూ మానవీయ పాత్రలుగా మలచిన రచయిత్రి అప్పట్లో మరొకరు లేరు. తన జీవితాన్ని అంతే క్రమశిక్షణగా, ప్రణాళికాబద్ధంగా, నిరాడంబరంగా మలచుకున్న నిజకథానాయిక ఆమే'నంటారు ప్రముఖ రచయిత్రి ఓల్గా. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా తమిళం నేర్చుకుని శివశంకరి(ఒక మనిషి కథ), జయకాంతన్(కొన్ని సమయాల్లో కొందరు మనుషులు), సుజాతా రంగరాజన్, పుదుమైపిత్తన్‌లాంటివారిని తెలుగు పాఠకులకు దగ్గర చేశారు. 'మాలతీ అనువాదంతోనే తెలుగుదేశంలో నాకు ఎంతోమంది అభిమానులు వచ్చారు. ఇక్కడి సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. ఎంత గొప్ప రచయిత్రో అంత మంచి స్నేహశీలి తను. మాలతీ స్నేహం మరిలేదనంటే ఎలా నమ్మను?!' అని 'ఈనాడు'తో ఆవేదన వ్యక్తంచేశారు తమిళరచయిత్రి శివశంకరి. 

(ఈనాడు , 22:08:2013)
_________________________________

Labels: , , , , , , , ,

Tuesday, December 18, 2012

పోతపోసిన ప్రజాకవి

భారతీయ సంస్కృతికి మూలకందాలు మూడు గ్రంథాలు. వాల్మీకి వ్యాసమహర్షుల విరచితాలు రామాయణ భారత భాగవతాలు. తొలి రెండూ ఆంధ్రావనికి అందాయి. భాగవతంమీదే ఎవరిచూపూ పడలేదు. చూపుపడినా చేయిసాచే సాహసం ఏ కవీ చేయలేదు! హయగ్రీవ బ్రహ్మవిద్యగా నామాంతరం ఉన్న భాగవతం కవిత్వ కార్కశ్యానికి పరాకాష్ఠ కావడమూ కారణం కావచ్చు. ఆ మహాభాగవత ఫలం ఒక తెలుగు చిలుక కోసం మీదుకట్టీ ఉండవచ్చు. వీరశైవాన్ని ప్రచారం చేసిన సోమనాథుని 'పాలుకుర్తి'కి చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలో ఉంది ఆ చిలుక. పేరు పోతరాజు. భోగినీ దండకాన్ని ఒక రాచవలరాజు వీనులకు విందుగా వినిపించిన రాసిక్యానుభవం అప్పటికే ఆ శుకరాజు సొంతం. ఆ 'శుకముఖ సుధాద్రవం'గా భాగవతం అందటం తెలుగువారు చేసుకున్న అదృష్టం. సంస్కృత భాగవతం పారాయణం నిరంతరాయంగా సాగే రోజుల్లో ఏ దివ్యక్షణాన పోతన్నకు శ్రీమన్నారాయణ ప్రపంచాన్ని వివరించాలన్న కుతూహలం రేగిందో! పనిగట్టుకొని ఒక నిండుపున్నమి రాత్రి గోదావరీనది సైకతాన మహేశ్వర ధ్యానానికని సాగడమేమిటి! కాంతాసమేతుడైన ఓ రాజముఖ్యుడు కనిపించి 'భవబంధ విముక్తి' మార్గంగా భాగవతాన్ని తెలుగు చేయమని పురమాయించటమేమిటి! అది శ్రీరామచంద్రమూర్తి ఆనగా పోతన భావించడమేమిటి! చరిత్రకు అందని సంఘటనల వాస్తవావాస్తవాలను నిర్ధారించడం కష్టం కానీ... 'శూలికైన దమ్మి చూలికైన' తెలిసి పలుకుట కష్టమైన భాగవతాన్ని 'అందరూ' మెచ్చే విధంగా బమ్మెర పోతన తెలుగు చేయడం మాత్రం ఏ చరిత్రా కాదనలేని సత్యం. అది, తెలుగు భాష చేసుకున్న పుణ్యం!

భాగవతం తెలుగుసేతే ఒక విశేషమైతే... భాగవతంలోని విశేషాలు ఇంకెన్నో! కమ్మని కావ్యాన్ని ఏ ప్రభువుకో అంకితమిచ్చి వెయ్యిన్నూట పదహార్లు సంభావనగా పుచ్చుకొమ్మని ఒత్తిళ్లు వచ్చే ఉంటాయి. పోతరాజు అంతపనీ చేస్తాడేమోనన్న భీతితో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడలు కవిగారి ఇంటి గడపన చేరి 'కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ' ఏడ్చిందట. 'నిను నా కటికిం కొనిపోయి యల్ల క/ ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము'మని భారతికి పోతన బాస చేశాడట. రాజుల్ని కాదనడానికి ఎంత సాహసం కావాలీ! ప్రారంభంనుంచీ బమ్మెర పోతనది ప్రత్యేక మార్గమే. రామచంద్రుని ఆనతో చేస్తున్నానన్న రచన ఆరంభంలోనే పోతన సంప్రదాయానికి విరుద్ధంగా నాలుగు ఉత్పలమాలలతో శ్రీకృష్ణుడికి షష్ఠ్యంతాలు సమర్పించాడు. కృష్ణ చరిత్ర మధ్యలో శ్రీరామ కథను విస్తారంగా చెప్పి ఆ లోటును పూడ్చుకున్నాడు. వీరశైవ మతానుయాయి అయిన కేసన వంశాన పుట్టీ పరమ భాగవతోత్తముడిగా రూపాంతరం చెందిన విచిత్ర చరిత్ర పోతరాజుది. అర్థంలేని నిషేధాలను ధిక్కరించడంలో పోతన్నది ఎప్పుడూ ముందు వరసే. లాక్షణిక ధిక్కారం చేసి వేశ్యయే కావ్యనాయికగా తెలుగులో 'భోగినీ దండకం' రాసి కొత్త ఒరవడి పెట్టిన సృజనకారుడు పోతరాజు. సంప్రదాయ లక్షణంగా వస్తున్న కుకవి నింద చేయనేలేదు. శబ్దాలంకార ప్రియుడేకానీ... వ్యర్థ పదప్రయోగాలకు, అపస్వరాల లౌల్యానికీ పోతన బద్ధ విరోధి. సంస్కృత సమాసభూయిష్ఠమైన రచనలను ఒక వర్గంవారు ఆదరించేవారు. అచ్చ తెనుగు రాతలను మెచ్చుకునే విజ్ఞులు మరికొందరు. మధ్యేమార్గంగా అందరినీ మెప్పించే శైలిని స్వీకరించి తెలుగు భాగవతాన్ని పండిత పామర శిరోధార్యంగా మలచిన లౌకిక అలౌకిక యోగి పోతన- పోతపోసిన ప్రజాకవి.

పోతనగారి మహాశివుడు హాలాహలం మింగబోతున్నా పక్కనే ఉన్న సర్వమంగళ వారించదు. జగత్కల్యాణం ఆ జగన్మాత లక్ష్యం. సంప్రదాయానుసారం గొల్లలు చేసే ఇంద్రయాగాన్ని ప్రశ్నించి 'కానలు, కొండలు, పసుల గాదిలివేల్పులు గొల్లవారికిన్' అంటూ ప్రకృతిపూజ అవసరాన్ని ప్రతిపాదిస్తాడు శ్రీకృష్ణుడు. గీతలో చెప్పిన కర్మయోగ ఆవశ్యకతను ప్రజోపయోగంగా మలచడం ఆ నాయకుడి లక్షణం. కాళింది మడుగులో పడ్డ బిడ్డను తలచుకొని ఎర్రన్న సృజించిన యశోదమ్మ ఎడాపెడా ఏడిస్తే... పోతన్న సృష్టించిన తల్లిమాత్రం 'తండ్రీ! నీవు సర్పదష్టుండవైయున్న నిచట మాకు ప్రభువు లెవ్వరింక' అని రోదిస్తుంది. బిడ్డ క్షేమంకన్నా ముందు ప్రజల యోగక్షేమాల చింత ఆ తల్లిది. బాల ప్రహ్లాదుడు జాతి లక్షణానికి విరుద్ధంగా హరిభక్తిలో పడినప్పుడు హిరణ్యకశ్యపుడిలోని తండ్రి స్వజాతి రక్షణ గురించే బెంబేలుపడతాడు. శ్రీకైవల్య సిద్ధికని శ్రీకారం చుట్టిన భాగవత రచనలో పోతన అడుగడుగునా తపించింది కేవలం మోక్షప్రాప్తి మార్గాలకోసమే కాదు. తనసృష్టి- తనచుట్టూ ఉన్న లౌకిక లోకానికీ ఒక చక్కని సత్వదృష్టినీ కలిగించాలన్న తపన పోతనది. అడుగడుగునా పాఠకుల గుండెను తడుముతూ, తడుపుతూ సాగింది కనుకనే శ్రీమదాంధ్ర మహాభాగవతం కాలపరీక్షకు ఎదురు నిలిచి తెలుగువారి గుండెల్లో మతాలకతీతంగా నిలబడింది. భాగవతం ప్రజాదరణకు కేవలం భక్తి ప్రభావమే కాదు- మంద్ర గంభీర గమనంగల శైలీకారణమే! 'పోతన భాగవతం సహజధారా విలసితం, ఓజః ప్రసాద గుణోజ్జ్వలితం' అంటారు వామపక్ష భావాభిమాని అయిన ఆరుద్ర! భాగవతంలోని వివిధ ఘట్టాలు, పలుకుబడులు, పద్యాలు తెలుగుజాతి జీవనంలో నీళ్లలో పాలుగా కలగలిసిపోయాయి. కరుణశ్రీ అన్నట్లు 'అచ్చపు జుంటి తేనియల, నైందవ బింబ సుధారసాల గో/ ర్వెచ్చని పాలమీగడల, విచ్చెడి కన్నె గులాబి మొగ్గలన్/ మచ్చరికించు మధుర మంజుల మోహన ముగ్ధ శైలి'ని తెలుగు మనసులకు రుచి చూపించిన సుకవి పోతన. అలాంటి కారణజన్ముణ్ని కన్న తెలుగుతల్లి ధన్యచరితే కదా! 

(14:10:2012, ఈనాడు )

__________________________

Labels: ,

Saturday, August 21, 2010

జయహో కృష్ణరాయ!


'కారే రాజులు, రాజ్యముల్‌ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనం గలదే...?' అన్నాడు పోతనామాత్యుడు భాగవతంలో. బలిచక్రవర్తి నోట ఆయన పలికించిన ఆ సత్యవాక్కు అక్షరాలా ఆణిముత్యమే. ఈ లోకయాత్ర ముగిసిన వేళ- సిరులూ సంపదలూ తమ వెంట తీసుకువెళ్లలేరెవరూ. ఎన్ని రాచరికాలు, ఎంతమంది రాజులు, ఎవరి ఏలుబడులు ప్రజల స్మృతిపథంలో ఇప్పుడు నిలిచి ఉన్నాయి? స్థాపించిన సామ్రాజ్యాలు, మిడిసిపాటుతో సాగించిన దొరతనాలు, కట్టుకున్న సౌధాలు, కూడబెట్టిన సిరులతోపాటు తమ నామధేయాలూ కాలగర్భంలో కలిసిపోయిన ఏలికలు ఎందరో! జనరంజకంగా, యశఃకాములై ప్రవర్తిల్లినవారి పేర్లే జగత్తులో చిరస్థాయిగా వర్ధిల్లుతాయి. వారి కీర్తిసౌరభాన్ని వందలు, వేల ఏళ్లయినా వెదజల్లుతూనే ఉంటాయి- అదృశ్యంగా. తెలుగునేలను సంతోష చంద్రశాలగా, శౌర్యస్థలిగా, సకల కళల కాణాచిగా తేజోమయం చేసిన ప్రభువు కనుకనే శ్రీకృష్ణదేవరాయల పేరు- చెక్కుచెదరని శిల్పంలా, చెరిగిపోని శిలాక్షరంలా నేటికీ సజీవంగా మిలమిలలాడుతోంది. అయిదేళ్ల ఏలుబడితోనే మొహం మొత్తించే పాలక నిక్షేపరాయళ్లున్న ఈ రోజుల్లోనూ- అయిదు శతాబ్దాల క్రితంనాటి ఏలిక కృష్ణరాయల పేరు సమ్మోహన మంత్రమై మోగుతూ అందరికీ చిరస్మరణీయమవుతుండటం అందుకు దాఖలా. ఆయన పట్టాభిషిక్తుడై అయిదువందల ఏళ్లు దాటిన సందర్భమిది. రాజకీయంగానే కాక, సాంస్కృతికంగానూ దక్షిణాపథాన్ని ఏకం చేసిన రాయలవారిని స్మరించుకుంటూ తెలుగుజాతి వేడుకల్ని నిర్వహిస్తున్నది అందుకే.

తెలుగునేలను ఏలిన విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణరాయలు స్వతహాగా కన్నడ దేశస్తుడు. అమ్మపలుకు తుళు. సంస్కృతంలో కావ్యాలల్లినవాడు. సకల భాషలకు జననిగా వాసికెక్కిన సంస్కృతంపైనా ఆయనకు మక్కువే. ద్రావిడ భాషా కుటుంబంలో పెద్దక్కగా పేరొందిన తమిళ'మొళి' మీదా గౌరవమే. వాటితోపాటు కన్నడ కస్తూరి పరిమళాల్నీ తన ఆస్థానంలో గుబాళింపజేసినవాడే. అయినా- పది బాసలు తెలిసిన ఆ ప్రభువు 'బాస యన యిద్ది' అంటూ ఎలుగెత్తి చాటి, మణిమకుటం పెట్టింది మాత్రం తెలుగుభాషకే! అందుకే ఆయన తెలుగు రాయలయ్యాడు. తెలుగువారికి ఆరాధనీయుడయ్యాడు. బంగారు పళ్లెరానికి గోడ చేర్పువలె- భాషకు పాలకులు గొడుగుపడితే, సారస్వత వికాసం మూడు పూవులూ ఆరు కాయలుగా విరాజిల్లుతుందనడానికి... రాయల పాలనలో అపూర్వ గౌరవాదరాలను సొంతం చేసుకున్న తెలుగు వెదజల్లిన విద్వత్‌కాంతులే తార్కాణం. ఆ కాలంలో తెలుగు అక్షరం కొత్త నడకలు నేర్చింది. కొత్త సోయగాలు సంతరించుకుంది. 'మరపురాని హొయల్‌' చిలికించింది. ప్రబంధమై నర్తించింది. ఆచార్య రాయప్రోలు అన్నట్లు 'విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు' కప్పించిన రోజులవి. సారస్వత మూర్తులను 'న భూతో...' అన్న రీతిన సమ్మానించిన రాజు రాయలవారే. మనుచరిత్ర కర్త ఆంధ్రకవితా పితామహుడు పెద్దనామాత్యుడు 'ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి/ కేలూత యొసగి యెక్కించు'కున్నవాడు ఆయన. తనకు అంకితమిచ్చిన ఆ ప్రబంధాన్ని స్వీకరించేవేళ, పెద్దన పల్లకిని 'తనకేల యెత్తి పట్టిన'వాడు. తెలుగు కవీంద్రుడు ఆనాడు కవితా రాజసంతో దక్కించుకున్న రాజ లాంఛనమది! హృద్యమైన పద్యం వినిపిస్తే 'స్తుతమతి ఐన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకెట్లు కల్గె/ ఈ అతులిత మాధురీ మహిమ?' అంటూ పరవశించిన కవితా పిపాసి రాయలు.

రాయలవారి 'భువనవిజయ' సభామంటపం సాహితీ గోష్ఠులకు వేదిక. అష్టదిగ్గజాలుగా విఖ్యాతులైన కవీశ్వరులకు నెలవు. సారస్వత చర్చలకు, కవితా పఠనాలకు ఆటపట్టు. తెలుగు సాహితీ సరస్వతి కొలువు తీరిన ఆస్థానమది. ఆంధ్రభోజుడు ఆయన! సమరాంగణంలోనే కాదు, సాహితీ రంగంలోనూ రాయలు సార్వభౌముడే. మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము- తెలుగు సాహిత్యంలో పంచ మహాకావ్యాలని ప్రతీతి. ఆముక్తమాల్యద కృతికర్త కృష్ణరాయలే. శృంగార నైషధాన్ని మినహాయిస్తే, మిగిలిన మూడు కావ్యాలూ రాయలవారి ఆస్థాన కవుల అమృత కరస్పర్శతో అక్షరాకృతి దాల్చినవే. తెలుగులోని అయిదు మహాకావ్యాల్లో నాలుగు, రాయల కాలంలోనే వెలువడటం- ఆయన హయాములో విద్యానగరం తెలుగు భాషాభారతిని సమున్నత పీఠంపై అధిష్ఠింపజేసిందనడానికి దర్పణం. తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగానిది ఓ అధ్యాయం. దానికి అంటుకట్టింది రాయల కాలమే. అప్పటివరకు అనూచానంగా వస్తున్న అనువాద కావ్య రచనల పద్ధతికి కవులు స్వస్తి చెప్పి, ప్రబంధ రచనా సంప్రదాయానికి శ్రీకారం చుట్టేలా బాటలు పరచినవాడు రాయలు. అనంతర కాలంలో తెలుగునాట రెండు, మూడు శతాబ్దాలు కొనసాగిన సంప్రదాయమది. అపారమైన ప్రతిభా వ్యుత్పత్తులతో, అనితరసాధ్యమనిపించే రీతిలో ఆయన రచించిన ఆముక్తమాల్యద- రాజనీతి, వైరాగ్య, భక్తి బంధుర మహాకావ్యంగా పండితుల ప్రశంసలందుకున్న ప్రౌఢ ప్రబంధం. రాయల యుగం తెలుగు సాహిత్యానికి సంబంధించి స్వర్ణ శకం. ఆయన ఆస్థానంలో అగ్రపూజలందుకున్నదీ, అందలాలెక్కిందీ తెలుగు భాషే. కవుల్ని ఎత్తుపీటపై నిలపడమే కాదు, స్వయానా తానూ తెలుగులో మహాకావ్యం రాసిన రాజకవి కృష్ణరాయలు. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు/ ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ/... దేశ భాషలందు తెలుగు లెస్స' అంటూ రాయలు కట్టిన పద్యం- ప్రతి తెలుగు ముంగిటా నిత్య రంగవల్లికై వెలుగులీనాలి. ప్రతి తెలుగు గుండె తలుపునూ తట్టాలి. తెలుగువారి జాతీయగీతమై ఎదఎదలో రవళించాలి. తెలుగువారందరూ తెలుగు అక్షరానికి పట్టం కట్టినప్పుడే- రాయలవారి పట్టాభిషేక పంచశత ఉత్సవాలకు సార్థకత. తెలుగు రాయల స్మృతికి నికార్సయిన నివాళి అదే! (ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౭:౨౦౧౦)
____________________________

Labels: , ,

Sunday, November 01, 2009

తెలుగు మాటకేదీ పలుకుబడి?

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్



దేశంలోనే భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. సుసంపన్నమైన చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం తెలుగుభాష సొంతం. ఆంధ్రరాష్ట్ర అస్తిత్వానికి కారణమైన అమ్మభాష- కాలం గడుస్తున్నకొద్దీ తెలుగునాట మసకబారుతుండటమే కలచివేస్తున్న అంశం. అటు బోధనలోనూ, ఇటు జనవ్యవహారంలోనూ తెలుగు మాట అప్రాధాన్యాంశంగా మారుతోంది. తెలుగు ప్రాభవం కొడిగట్టడానికి కారణాలెన్నో ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగం, సంస్కృతి, విజ్ఞానాల్లోనూ; ప్రజల వ్యాసంగాల్లోనూ కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం తెలుగుభాషపై పడుతోంది. మనభాషపై సాంస్కృతికంగా సంస్కృతం, పాలనపరంగా అరబిక్‌, పర్షియన్‌; శాస్త్ర సాంకేతికపరంగా ఆంగ్లభాషల ప్రభావం ఎక్కువ. ఈ కారణంగా తెలుగులో అన్యభాషల పదాలు వేలకొద్దీ చేరిపోయాయి. ఫలితంగా తెలుగుభాష నిత్య వ్యవహారంనుంచి క్రమంగా పక్కకు జరుగుతోంది.

ఆవిరైపోతున్న అధికార భాష
తెలుగువాడు 'నిద్ర' సంస్కృతంలో లేవడంతో తెలుగు 'కునుకు' కునుకు తీసింది. బ్రష్‌ చేయడంలో 'పదుంపుల్ల' అరిగిపోయి విరిగిపోయింది. 'పళ్లపొడి' పొడైపోయింది. 'టిఫిన్‌' దెబ్బకు చద్దన్నాలూ అంబళ్లూ పులిసిపోయాయి. 'లంచ్‌'లు, 'డిన్నర్‌'ల దెబ్బకి కూడు కాస్తా నోటికి దూరం అయ్యింది. తెలుగు కూర 'ఫ్రై', 'కర్రీ' అయిపోయింది. సాయంత్రం 'స్నాక్స్‌'లో పైటన్నం ఎటో కొట్టుకుపోయింది. ఈ వాక్యాలు వినడానికి చమత్కారంగానూ అతిశయంగానూ అనిపించినా ఇవి తెలుగు భాషపై ఆంగ్ల ప్రభావానికి దర్పణం పడతాయి. 'అన్యదేశ్యాలు వాడితే తప్పేముంది? దానివల్ల భాష విస్తృతమవుతుంది కదా' అన్న అభిప్రాయమూ వ్యాప్తిలో ఉంది. అదీ నిజమే. కానీ, అన్యదేశ్యాల వాడకం ప్రాథమిక పదజాలం నశించిపోయేంతగా ఉంటేనే సమస్య. సాధ్యమైనంతవరకూ నూతన పదబంధాలను సృష్టించాల్సిన చోట వాటినే వ్యాప్తిచేయాలి. కుదరని చోట అన్యభాషా పదాలను వాడితే తప్పులేదు. తమిళంలో ప్రాణవాయువు అనే తత్సమపదం 'పిరాణ వాయువు' అనే తద్భవంగా వ్యాప్తిలో ఉంది. తమిళులు దానితో సంతృప్తి చెందక 'ఉయిర్‌ కాట్రు' అనే దేశ్యపదాన్ని తయారుచేసి వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. మన వాక్యంలో వ్యాకరణం తెలుగులో ఉంటుంది, పదాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాక్యరచన, క్రియలు, నామవాచకాలపై ఆంగ్లప్రభావం మితిమీరడమే దీనికి కారణం. ఈ ప్రభావాన్ని తగ్గించి తెలుగుభాషా వాడకాన్ని పెంచాలంటే మన భాషలో కూడా ఆధునిక వస్తువులకు ప్రత్యామ్నాయంగా అదే అర్థం స్ఫుర్తించే విధంగా నూతన పదబంధాలను సృష్టించాలి.

ఏ అంశాన్నయినా ఆంగ్లంలో చెప్పడమే నవనాగరకతగా చెలామణీ అవుతోంది. వ్యవహారంలో ఉన్న ఆంగ్లపదాలకు సరైన ప్రత్యామ్నాయాలు తెలియకపోవడంవల్ల ఆంగ్లపదాల సంఖ్య తెలుగులో అధికమవుతోంది. దీనివల్ల మన భాషలో రాటుదేలిన పదజాలమంతా క్రమంగా మసకబారిపోతోంది. ఏదైనా కొత్తపదం ఆంగ్లంనుంచి తెలుగులోకి ప్రవేశించినప్పుడు ఆ పదాన్ని అలాగే వాడుతున్నారు. ఇరుభాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఆ ఆంగ్లపదానికి సరైన ప్రత్యామ్నాయ తెలుగుపదాన్ని అన్వేషించేందుకు కృషి చేయడం లేదు. మరోవైపు- కొన్ని సందర్భాల్లో అదే ఆంగ్లపదం సామాన్యజన వ్యవహారంలో సొంతభాషలోనికి మారుతుంటుంది. దొంగోడ, డబ్బిళ్ల, తవ్వోడ, గ్యాసుబండ వంటివి ఎంతో సహజంగా మూలానికి దగ్గరగా ఉంటూ తెలుగుతనాన్ని పుణికిపుచ్చుకున్నాయి. వీటి సృష్టికర్తలు సామాన్యులే. ఇలాంటివారు కొత్తపదజాలాన్ని సృష్టిస్తే దాని ప్రామాణికత ఎంత అన్న సందేహం వెన్నాడుతూనే ఉంటుంది. ఇక తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాలు చేసిన కొద్దిపాటి కృషి ప్రజలకు సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు.

మాతృభాషలో బోధనాభ్యాసాలు చేస్తే మిగిలినవారికంటే వెనుకబడిపోతామన్న అపోహలు సైతం తెలుగుభాష వెనుకబాటుకు కారణమవుతున్నాయి. జపాన్‌, రష్యా, చైనా ప్రజలు పూర్తిగా మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అంతర్జాతీయంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాలు ఎంత ముందంజలో ఉన్నాయో తెలిసిందే. ఆంగ్లభాషను విడిచిపెట్టాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. రష్యన్లు ఆంగ్లాన్ని రష్యన్‌ భాషలోనూ, చైనీయులు చీనీ భాషలోనూ అభ్యసిస్తున్నారు. కానీ తెలుగునాట మాత్రం మాతృభాషను సైతం ఆంగ్లంలోనే నేర్చుకునే దురవస్థలో కొందరు మగ్గుతున్నారు. భారతీయ భాషలన్నీ పదసంపదలో సుసంపన్నాలు. వాడుకలో లేకపోవడంవల్లే ఈ భాషలు వెనుకబడిపోతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన తరుణమిది. ఆంగ్లభాషపై వ్యామోహంతో శాస్త్రసాంకేతిక విద్యాబోధనకు తెలుగు పనికిరాదని చేసే వాదనలో అర్థం లేదు. వాడుకలోకి తీసుకువస్తే ఆధునిక విజ్ఞానాన్ని అలవోకగా అందించగల శక్తి మాతృభాషకు ఉంది.

తెలుగుభాషను పరిరక్షించి, పరిపుష్టం చేయాలంటే కాలానుగుణంగా వచ్చి చేరే అన్యదేశాలకు సమానార్థకాలను సృష్టించుకోవడం తక్షణావసరం. శాస్త్రీయ అంశాలతోపాటు, వ్యవహార భాషకు సంబంధించీ సమానార్థక పదాలను తయారుచేసుకోవాలి. విద్యావిషయిక పారిభాషిక పదకల్పనలో తత్సమపదాలకే ప్రాధాన్యం ఎక్కువ. అది అనివార్యమే కాదు, సౌలభ్యం కూడా. వివిధ శాస్త్రాలకు సంబంధించిన పారిభాషిక పదాలు సులభగ్రాహ్యం కావని; వాటికన్నా ఆంగ్లపదాలే సులభంగా ఉన్నాయన్న వాదన ఒకటి ఉంది. శాస్త్రం బుద్ధిగ్రాహ్యం కాబట్టి కష్టంగా ఉన్నప్పటికీ తత్సమపదాలను ఉపయోగించాల్సిందే. కానీ- నిత్యవ్యవహారంలోని అన్యభాషాపదాలకు సాధ్యమైనంతవరకు అచ్చతెలుగు పదాలతో సమానార్థకాలను సృష్టించుకోవడం మంచిది. తొలినాళ్లలో పత్రికలు, అకాడమీలు, కొన్ని విశ్వవిద్యాలయాలు పెద్దయెత్తున ఈ కృషి చేశాయి. కాలం గడుస్తున్నకొద్దీ కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు, విద్యలు రంగప్రవేశం చేశాయి. వీటికి సంబంధించిన సాంకేతిక పారిభాషికపదాలకు తెలుగు పదాలను సృష్టించుకోవడంలో ఎక్కడలేని అలసత్వం కనిపిస్తోంది. అన్నిరంగాల పారిభాషిక పదాలకు మారుగా తెలుగులో పదకల్పన చేయమనడం ఇక్కడ ఉద్దేశం కాదు. సాధ్యమైనంతమేరకు, ఆయా సాంకేతిక పదాలకు ప్రాంతీయ భాషల్లో సమానార్థకాలను తయారుచేసుకోవడం తప్పుకాదు. దీని సాధ్యాసాధ్యాలపై పెద్దయెత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా భాషను తీర్చిదిద్దాల్సిన బాధ్యత భాషాశాస్త్రవేత్తలపై ఉంది. ఆంగ్లపదాలను ఉపయోగించక తప్పని పరిస్థితుల్లోనూ- గట్టి ప్రయత్నం చేస్తే దేశయంగా నూతన పదబంధాలను సృష్టించడం అసాధ్యమేమీ కాదు. ఇది మొండిగా అన్యభాషాపదాలను తిరస్కరించే ఛాందసవైఖరిగా మాత్రం మారకూడదు. రామ్‌ మనోహర్‌ లోహియా అన్నట్లు కేవలం రెండున్నర లక్షల పదసంపద ఉన్న ఆంగ్లంలో కంటే- ఆరు లక్షల పదాలున్న తెలుగులో భావవ్యక్తీకరణ సులభం. అందుకే ఆంగ్లపదాలకు మారుగా నూతన పదనిర్మాణం జరగాలి. ఇది తెలుగు అస్తిత్వాన్ని విస్తరింపజేసే ప్రయత్నంలో భాగం.

నూతన ఆంగ్ల పద నిర్మాణ ప్రక్రియ ఏ భాషకైనా ప్రాణావసరమే. 'ఆక్స్‌ఫర్డ్‌' నిఘంటువును అయిదేళ్లకోసారి పునర్నిర్మిస్తుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా అన్యదేశ్యాలను చేర్చడం; కొన్నింటికి కొత్త పదాలను కల్పించడం; భాషావ్యవహారంలో పదాలకు జతపడుతున్న కొత్త అర్థాలను స్వీకరించడం వంటివాటిని చేస్తుంటారు. తెలుగులో ఆంగ్లభాషాపదాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సమానార్థక పదాలను సృష్టించుకోవడంలో ప్రయత్నలోపం తప్ప మరే కారణమూ కనిపించదు. తొలుత తెలుగులో మహానిఘంటు నిర్మాణం జరగాలి. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నించాలి. తెలుగులో మహానిఘంటువు ఏర్పడితే కనీసం పదేళ్లకు ఒకసారయినా దాన్ని సవరించుకోవచ్చు.
కొత్త పదాలకు శ్రీకారం
గతంలో సమానార్థక పదసృష్టి ఓ నియమంగా జరిగేది. అర్థాన్ని బట్టి మన భాషలో ఒక పదాన్ని స్థిరపరచుకొని వాడేవారు. ఇప్పుడు శీర్షికల్లోనూ ఆంగ్లపదాలే దర్శనమిస్తున్నాయి. తొలినాళ్లలో సమానార్థక పదనిర్మాణానికి మన పత్రికా సంపాదకులు కొన్ని విధానాలను అనుసరించేవారు. తమిళ ఆకాశవాణిలో ప్రతిరోజూ కొత్తపారిభాషిక పదాలకు సంబంధించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. కిందటిరోజు ఆంగ్లపత్రికలో వచ్చిన కొత్త పారిభాషిక పదాలకు తమిళంలో సమానార్థకాలను తయారుచేసి ప్రసారం చేస్తారు. ఆ రకంగా వాటిని ప్రజల నిత్యజీవన వ్యవహారంలో భాగం చేస్తారు. ఇంగ్లిషు మాటలను ఉపయోగించకుండానే రాసేందుకు హిందీ, తమిళం, కన్నడ వంటి భాషాపత్రికల్లో విలేకరులు ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు ఇటీవల స్వైన్‌ఫ్లూ జ్వరానికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఆ పదాన్ని మన పత్రికలు యథాతథంగా వాడాయి తప్ప కొత్తపదాన్ని సృష్టించలేదు. కన్నడిగులు దాన్ని 'హందిజ్వర' అని తమభాషలోకి తర్జుమా చేసుకున్నారు. స్వైన్‌ఫ్లూ వంటి పదానికి అనువాదం దొరకడం కష్టమే. చక్కటి కొత్తపదాన్ని తయారుచేసినప్పుడు అది వాడుకలో చేరిపోతుంది. రామాయణం, మహాభారతం వంటి ఉద్గ్రంథాలను తెలుగు చేసుకోగలిగిన మనకు- నేటి అవసరాలను తీర్చే మాటలను కూడగట్టుకోవడం అసాధ్యమేం కాదు. కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రికను వారపత్రికగా స్థాపించిన తరవాత 1938లో పారిభాషిక పదకోశాన్ని నిర్మించారు. ఆ మాటలను కందుకూరి వీరేశలింగం 'వివేకవర్థిని'ద్వారా, కొండా వెంకటప్పయ్య కృష్ణాపత్రిక ద్వారా ప్రచారం చేశారు. నైట్రోజన్‌కు నత్రజని, నికిల్‌కు నిఖలం, ఆక్సిజన్‌కు ప్రాణవాయువు, ఫొటోసింథసిస్‌కు కిరణజన్య సంయోగక్రియ అని తెలుగు చేసింది కాశీనాథులవారే.

సుసంపన్నమైన భాష- జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు, కీర్తి ప్రతిష్ఠలకు ప్రతీక. అపారమైన ప్రేమాభిమానాలుంటే అమ్మభాషను రక్షించుకోవడం, కొత్త దిశలకు విస్తరింపజేయడం అసాధ్యం కాదు. జనబాహుళ్యంలో సువ్యాప్తమైన భాషను ప్రభుత్వం అక్కున చేర్చుకుని ఆదరించాలి. ప్రభుత్వం అండగా నిలిచి, పాలన వ్యవహారాల్లో చోటు కల్పించినప్పుడే తెలుగుకు భద్రత, గౌరవం. భాష సామాజిక ఆస్తి. ఈ భావన తమిళుల్లో బలంగా వేళ్లూనుకుని ఉంది. తమిళనాడులో 'తిరుక్కురళ్‌' చదవనిదే ఇప్పటికీ ఏ సభా ప్రారంభం కాదు. 'మాతృభాష మనకి కళ్లు... ఆంగ్లభాష కళ్లజోడు' అని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అంటుంటారు. గుండెల్లో అంతటి అభిమానం ఉండబట్టే తల్లిభాషలోకి అన్యభాషాపదాల చొరబాటును తమిళులు అంగీకరించలేకపోతున్నారు. ఎంత మమకారం పెంచుకున్నా పరభాష ఏ రకంగానూ తల్లిభాషకు సాటికాదు, రాదు!
(ఈనాడు, ౦౧:౧౧:౨౦౦౯)
____________________________

Labels:

Sunday, November 23, 2008

పూర్వ వైభవంతో నవ ప్రాభవం!

ఎందరో మహానుభావులు... అందరూ విజయసారథులే!

డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి

(రచయిత విజయనగరం మహారాజ కళాశాల (విశ్రాంత)
తెలుగు శాఖాధ్యక్షులు)


'ఇది విభాత మహోత్సవమ్మేమొ! ఇదియు
నూత్న కల్యాణ తూర్య మనోజ్ఞ గాన
నృత్య కోలాహలమ్మొకో! ఇది సువర్ణ
మంగళాక్షతా శీర్వర్ష మగునొ, కాదొ!'

అన్న కృష్ణశాస్త్రి పద్యం స్మరణకు వస్తోంది. తెలుగు భాషకు కాలం కలిసి వచ్చింది. తోటి భాషల సరసన తలఎత్తుకుని నిలవగలిగింది. ప్రజల కోరిక, ఉద్యమకారుల కృషి, ప్రభుత్వం ఒత్తిడి, ఎన్నికలవేళ, రాజకీయాల్లో మార్పులు- ఇలా ఇన్ని కారణాలు ఒక్క ఉదుటున ముసురుకుని వచ్చిన కారణంగా తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి దక్కింది. ఇది తెలుగు ప్రజల సమష్టి విజయం. ఏ ఒక్కరి దయాధర్మభిక్షగా లభించిన వరం కాదు. ఇంతకాలం మనం పోగొట్టుకున్న ప్రతిష్ఠను తిరిగి మనమే నిలుపుకొన్నాం. ఈ తరుణంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల ప్రాచీన ప్రాభవం ఏమిటో, తెలుగువారి చరిత్ర ఏమిటో తేటతెల్లం చేసి మనకు అందించిన మహానుభావులెందరికో మనం కృతజ్ఞతలను ప్రకటించుకోవలసి ఉంది.

నిస్వార్థ పరిశోధనల ఫలం
మన జాతి- బ్రాహ్మణాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నకాలం నుంచీ ఉంది. మన భాష మూడువేల ఏళ్లనుంచి కనిపిస్తూంది. మన సాహిత్యం నన్నయకు ముందు కాలంనుంచి ఉంది. మన చరిత్ర శాతవాహనుల కాలం నుంచి స్ఫుటంగా కనిపిస్తుంది- ఇలా ఇన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? నూటయాభై ఏళ్లకు ముందు తెలుగు ప్రజలకు ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియవు. అప్పుడు దొరికేవన్నీ తాటాకుల పుస్తకాలు, రాళ్లమీద, రాగిరేకుల మీద చెక్కిన శాసనాలు మాత్రమే. అవన్నీ ఎక్కడెక్కడో చీకటి కొట్లలో నిద్రిస్తూ ఉండేవి. తాటాకుల పుస్తకాల్లోని లిపిని అర్థం చేసుకోవడం అందరికీ తెలిసేది కాదు. ఆ రాసే విధానం వేరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కవిధంగా ఉండేది. తెలుగే అయినా లిపిలో ఎన్నో తేడాలుండేవి. అన్నమయ్య రాసిన 32వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడిఉన్న సంగతి 70 ఏళ్లకు పూర్వం ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఆ దశలోనే ఉండిపోతే ఈ భాష ప్రాభవం ఇప్పటివాళ్లకు తెలిసేది కాదు. మన చరిత్ర, సంస్కృతి మనకు అందేవికావు.

'యావద్భారత వర్షమున- దేశ భాషలలో నగ్రగణ్యమై, లోకోత్తరమైన సంస్కృతభాషతో సమాన ప్రతిపత్తి గడించి అతి విస్తృతమై, అపారమై, బహుముఖ సాహిత్య ప్రక్రియలతో భారత జాతీయ భాషగా రూపొందదగిన తెలుగు భాషా విశిష్టత, వ్యక్తిత్వము వెలుగులోనికి వచ్చుట లేదు. మౌలిక పరిశోధనయనగా అముద్రితములైన తాళపత్ర గ్రంథ పరిశోధన. వాఞ్మయ చరిత్రకు ప్రాచీన కవుల కృతులే ప్రాతిపదికలు, ప్రధానాధారములు. తెలుగు భాషలో పూర్వకవి కృతులన్నియు తాళపత్ర గ్రంథములలో నిక్షిప్తములై యున్నవి. అందువలన తెలుగు వాఞ్మయ చరిత్ర అముద్రితములైన తాళపత్ర గ్రంథములపైనే పూర్తిగా ఆధారపడి యున్నదనుట నిర్వివాదాంశము' అని నిడుదవోలు వేంకటరావు అన్నారు. ఆ మౌలిక పరిశోధన 19వ శతాబ్ది చివరి పాదం నుంచి మొదలైంది. ఆనాటి పరిశోధకులకు నేటి పరిశోధకులకుండే వనరులేవీ ఉండేవి కావు. ఎందరెందరో మహానుభావులు ఎన్నో చిక్కులను ఎదుర్కొని, స్వార్థం లేకుండా, బతుకు ఈడ్వడానికి చాలిన జీతాలు లేకపోయినా తొట్టతొలి పరిశోధనలను పట్టుదలతో కొనసాగించారు. వారిలో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు లక్ష్మణరావు, నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఖండవల్లి లక్ష్మీరంజనం, నిడుదవోలు వేంకటరావు, తిరుమల రామచంద్ర వంటివారు ప్రముఖులు. వీరందరి కంటే ముందుగా బ్రౌన్‌దొర మాట చెప్పుకోవాలి. వీరందరూ కొనసాగించిన పరిశోధనలు, పరిష్కరణల కారణంగా వెలుగుచూడని ఎన్నో గ్రంథాలు ముద్రణ భాగ్యానికి నోచుకొని ఈ అమూల్య వారసత్వం మనకు దక్కింది. ఇప్పుడు వారందరినీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వారి సేవలను మననం చేసుకోవాలి. వారిని ఆరాధించాలి. 1850-1950 మధ్యకాలంలో ఇంతటి కృషి జరిగి ఉండకపోతే మనకు గతం లేదు, భవిష్యత్తు లేదు.

ఒకపక్క అన్ని రంగాల్లోను తెలుగు ప్రాచీనతను వెల్లడించి దాన్ని ఎప్పటికీ నష్టపోకుండా కాపాడుకోవాలి. ఇంకొకపక్క తెలుగువారు అన్ని రంగాల్లోను ఆధునిక ప్రపంచంలో పోటీకి దిగాలి. భాష- సాహిత్యం- కళలు- విజ్ఞానం- సంస్కృతి- ఇలా అన్ని విషయాల్లోను ఈ పరిస్థితి ఉంది. మన తెలుగు పెద్దలు ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నారు. పండితులు, పరిశోధకులు, పరిష్కర్తలు, చరిత్ర పరిశోధకులు ఇందులో మొదటి భాగంకోసం ఆకలి, నిద్ర అని చూడకుండా; సంసారం- స్వార్థం పట్టించుకోకుండా, విసుగూ విరామం లేకుండా కృషిచేశారు. మన భాషను, సాహిత్యాన్ని ఆధునికం చేయడానికి గిడుగు, గురజాడల మార్గాన్ని అనుసరించి ఎందరో పాటుపడ్డారు. రచయితలు అటు సంప్రదాయ మార్గంలోను, ఇటు ఆధునిక మార్గంలోను ఆకుల మీద ఒకరు నడిస్తే చిగుళ్లమీద ఇంకొకరు నడిచి ఒకరు గనులను తవ్వి రత్నాలు రాసులుపోస్తే ఇంకొకరు మెట్ట-పల్లం ఏకం చేసి రాజనాలు పండించారు. వీరందరి కృషిని వ్యాప్తి చేయడానికి ప్రజలందరూ తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల మీద ఆసక్తి, అభిమానం, గౌరవం పెంచుకోవడానికి పత్రికలు మరువలేని కృషిచేశాయి. సరస్వతి, చింతామణి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, అముద్రిత గ్రంథ చింతామణి, గృహలక్ష్మి, రెడ్డిరాణి, భారతి, త్రిలిజ్ఞ, తెలుగు జనానా, కల్పలత, ఆంధ్రభారతి, సువర్ణలేఖ, కృష్ణాపత్రిక, సాహితి, గోల్కొండ పత్రిక, ప్రబుద్ధాంద్ర- వంటి పత్రికలెన్నో లేకపోతే మన ప్రాచీన, ఆధునిక భాషా సాహిత్యాలు ఇంతగా అభివృద్ధి పొంది ఉండేవికావు. ఈ తరం వారికి ఆ పత్రికల పేర్లు తెలియవు. రూపురేఖలు తెలియవు. అవి నడిచిన తీరుతెన్నులు తెలియవు. కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు (పోలవరం జమీందారు), వీరేశలింగం, గిడుగు, అక్కిరాజు ఉమాకాన్తమ్‌, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆండ్ర శేషగిరిరావు, ముట్నూరు కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో ప్రముఖ పత్రికా వ్యవస్థాపకులు, సంపాదకుల గురించి ఈతరం వారికి బాగా తెలియదు. తెలుగు విశ్వవిద్యాలయం వారుగాని, తెలుగు అకాడమీ వారుగాని ఆ కాలంలోని పత్రికల ముఖపత్రాలను దొరికిన మేరకు సేకరించి ఆ పత్రికల చరిత్రను- చేసిన సేవను గురించి సంగ్రహ వ్యాసాలు రాయించి నేటితరానికి అందిస్తే బాగుంటుంది. తెలుగు భాష ప్రాచీనతను సంరక్షించి మనకు తెలియజేసి ఆధునికతకు మార్గం వేసిన పత్రికలకు, పత్రికాధిపతులకు, సంపాదకులకు ఈ సమయంలో సముచితమైన కృతజ్ఞతలను తెలుపుకోవడానికి ఇదొక మార్గం.

కొంతకాలంగా మనమంతా ఎదురుచూస్తున్న ప్రాచీనతా ప్రతిపత్తి మన భాషకు వచ్చింది. ఇందువల్ల కొత్తగా కలిగిన మేలు ఏమిటి? పాఠశాలల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాల దాకా, వరుణయాగం నుంచి వ్యాపార జగత్తుదాకా తెలుగును గురించి ఏమి చెప్పవలసి వచ్చినా ఆంగ్లమాధ్యమంలో చెప్పుకోవలసిన దుర్దశలో ఉన్నాం మనం. ప్రస్తుతం అలా కాదనుకోవడం ఆత్మవంచన తప్ప ఇంకొకటి కాదు. ఈ ప్రాచీనతా ప్రతిపత్తి మనకెలాంటి సంతోషాన్ని కలిగించబోతోంది? ఇంక ఉత్సవాలు జరుగుతాయి. ఊరేగింపులు జరుగుతాయి. కొందరి మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. మరికొందరికి పురస్కారాలు, పారితోషికాలు లభిస్తాయి. అంతటితో ఆ వేడి చల్లారిపోతుంది. ఆ తరవాత ఏం చెయ్యాలి? మనకు లభించిన ఈ అవకాశాన్ని, గౌరవాన్ని ప్రయోజనకరంగా, తెలుగు ప్రగతికి మార్గంగా మలచుకోవడానికి మనమేమి చేయాలి? మేధావులు ఆలోచించవలసిన విషయమిది. నిర్మాణాత్మకమైన కృషి ఆరంభం కావలసిన సమయమిది.

నిరంతరం భాషకు నీరాజనం
ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల మనకు అదనపు నిధులు వస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రాచీనతను సంరక్షించుకోవడం. దీని ప్రయోజనం ఏమిటి? ఆధునిక, వైజ్ఞానిక ప్రపంచపు సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యంగల భాషగా తెలుగును ఆధునికంగా తీర్చిదిద్దుకోవడమే దీని ప్రయోజనంగా మనం ఎంచుకోవాలి. ప్రాచీన విజ్ఞానం ఆధునిక వికాసానికి మూలం కావాలి. ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోను, విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు భాషాధ్యయన కేంద్రాలు నడుపవచ్చు. ఇది మన ప్రతిష్ఠ పెరిగే మార్గమే. ఇప్పుడు చాలామందికి తెలుగు పరిశోధక పట్టభద్రులకు కూడా పట్టుమని పది పద్యాలు నోటికి రావు. వాడుక భాషలో తప్పులు లేకుండా పది వాక్యాలు రాయలేరు. వేదికనెక్కి తడుముకోకుండా పది నిమిషాలు మాట్లాడలేరు. ఈ పరిస్థితి తొలగిపోవాలంటే ముందు ఇల్లు సవరించుకోవాలి. మండలస్థాయి నుంచి తెలుగు భాషా కుటీరాలు ఏర్పడాలి. స్వచ్ఛంద సంస్థల సహాయంతో తెలుగు వారందరూ తప్పులులేకుండా రాయడం చదవడం నేర్చుకునేలా చేయాలి. ముందుగా ప్రజలకు తెలుగు మీద అభిమానం పెరిగేలా చేయాలి. ఇందుకు తెలుగులో గొప్ప రచనలు రావాలి. మనకిప్పుడు కావలసినది గతవైభవం కాదు, భవిష్యత్తులో పొందగల ప్రాభవం. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, సాంస్కృతిక మండలి, అధికార భాషాసంఘం వంటి సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలి. విశ్వవిద్యాలయాల పాఠ్యప్రణాళికలు, పరిశోధనలు భాషను ఆధునికంగా తీర్చిదిద్దే కృషిని చేపట్టాలి. ప్రాచీనతా సంరక్షణకు ఆధునికతా వికాసానికి తమ జీవితాలను ధారపోసిన మహామహుల జయంతులను, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించి యువకుల్లో భాషాభిమానం నింపాలి. ప్రవాసాంధ్రుల సేవలను గుర్తించాలి. వారి సహకారాన్ని అందుకోవాలి. ప్రవాసాంధ్ర సంఘాలనన్నింటినీ ఏకతాటిమీదకుతెచ్చి వారి కృషిని వ్యాపార వాణిజ్యాల మీద, రాజకీయాల మీద కంటే భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలమీద ఎక్కువగా కేంద్రీకృతమయ్యేలా ప్రయత్నాలు చేయాలి.

మన భాషను ఆధునిక ప్రపంచ అవసరాలను తీర్చే భాషగా మార్చడంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి చాలా తక్కువ. మనకు కొత్తగా వచ్చిన ఈ అవకాశాన్ని అందుకు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మన భాషలో మహారచయితలు పుట్టే అవకాశాలను మనమే కల్పించుకోవాలి. అప్పుడే తెలుగుభాష ప్రాచీనతా ప్రతిపత్తి అర్థవంతమవుతుంది. ప్రాచీనతా ప్రతిపత్తిగల గొప్ప ఇతర భాషలు కొన్ని ఉన్నాయి. ఆసక్తి కలవారు అవి ఇప్పుడు ఎటువంటి దశలో ఉన్నాయో తెలుసుకోవాలి. మనకు లభించిన ఈ ప్రాచీన భాషా ప్రతిపత్తి ఆ దశలో మిగిలిపోకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్రం కోసం మనవాళ్లు ఎలా పోరాడారో అందరకూ తెలుసు. చివరకు మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడొక కవి 'మన స్వతంత్రం ఒక మేడిపండు- దరిద్రం మన రాచపుండు' అన్నాడు. తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించిన ఈ శుభతరుణంలో తిరిగి ఇటువంటి వ్యాఖ్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ప్రభుత్వంమీద, మేధావుల మీద, ప్రజల మీద ఉంది.
(Eenadu, 02:11:2008)
____________________________

Labels:

చక్కని తెలుగుకు చాంగుభళా!

- రావూరి ప్రసాద్‌
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది? సంగీతంలో సప్తస్వరాలు సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్‌ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!



ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్‌ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్‌ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి!
(Eenadu, 07:11:2008)
____________________________

Labels:

Monday, August 04, 2008

గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌!

అమ్మభాషకేల దుర్గతి?
- డాక్టర్‌ తూమాటి సంజీవరావు
'జనని సంస్కృతంబు సకల భాషలకు' అంటే నేడు మండిపడేవారు తెలుగువారు. ఈ విషయంలో అభిప్రాయ భేదాలుండవచ్చు. సంస్కృత సాహాయ్యంవల్ల తెలుగు భాష భ్రష్టుపట్టిందని వీరి అభిమతం. ఈ కోణంలో ఒక అర్ధ శతాబ్దికాలంగా సమాజంలో అభిప్రాయం బలపడింది. ఫలితంగా- సంస్కృత జ్ఞానంలేని తరం ఒకటి తయారై, దానిని ద్వేషించడం మొదలయింది. ఆపై పరిస్థితులు మారాయి. సంస్కృత జ్ఞానం లేకపోవటం వలన మనం నష్టపోతున్నాం అనే జ్ఞానోదయం కొంతమందికి కలిగింది, మరి కొంతమందికి కలుగుతూ ఉంది. మన విద్యా విధానంలో ఇప్పుడు భారతీయ భాషలకంటే ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఎక్కువైంది. అయినా, విద్యార్థులు తెలుగుకంటే సంస్కృత భాషను చదివితేనే పరీక్షల్లో మార్కులు ఎక్కువగా ఇస్తారనే భావంతో, దానిని అభ్యసించడమూ ఎక్కువయింది. ఫలితం- సంస్కృత భాషా బోధన పెరిగింది. ఇటువంటి సంస్కృత భాషను మన విద్యారంగంలో 'క్లాసికల్‌' భాషగా పరిగణిస్తున్నాం.

మనం మరచిన మాతృభాష
సంస్కృత భాషను సుసంపన్నం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం వారు- అప్పటి మానవ వనరుల శాఖామాత్యులు ప్రత్యేక నిధులను సమకూర్చటంతో ఒక ప్రణాళికాబద్ధంగా దాని అభివృద్ధిని చేపట్టారు. ఆ సమయంలో డీఎంకే వారు ఆ కూటమిలో భాగస్వాములే. వారికి గల భాషాప్రేమ చాలా ఎక్కువ. ద్రావిడ పార్టీల వారికందరికి తమిళభాష మాత్రమే ద్రావిడ సంస్కృతికి మూలమనే విశ్వాసం. సంస్కృత భాషను 'వడమొళి' (ఉత్తరాది భాష)గా పరిగణిస్తారు. వారు తమ భాషపై సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావాలను మందులాగా వాడుకొంటున్నారు. సంస్కృత భాషా ప్రాచుర్య విషయంలో వారికి ఇబ్బంది లేకున్నా, తమ భాషకు కూడా అటువంటి ప్రత్యేక నిధులను సమకూర్చుకొనటంలో కృతకృత్యులు అప్పట్లో కాలేకపోయినా, యూపీఏ కూటమి అవతరణ సమయంలోనే, తమ మద్దతును కోరే కాంగ్రెస్‌ పార్టీ దగ్గర సెమ్మొళి అంతస్తును ఇచ్చేలా నియమం ఏర్పరచుకుని, ఆపైనే కూటమిలో చేరారు. ఫలితంగా యూపీఏ అధికారం చేపట్టిన తరవాత తమిళ భాషకు క్లాసికల్‌ భాష (సెమ్మొళి) హోదాను సాధించుకున్నారు. ఏ రాజకీయ పక్షం వారు పోరాడకపోయినా, సంస్కృత భాషకు క్లాసికల్‌ అంతస్తు లభించింది. తమిళానికి రాజకీయ ఒత్తిడివల్ల ఆ పని జరిగింది.

'అంధాన్‌ రాతి ఇతి-ఆంధ్రః, ఆంధ్రః ఏవ ఆంధ్రః' అని ఆంధ్ర శబ్దవ్యుత్పత్తిని చెప్పే అలవాటు కూడా ఉంది. అంటే గుడ్డివాళ్లకు కూడా ప్రకాశాన్ని తెలియజేసేవాళ్లు తెలుగువాళ్లని అభివర్ణించుకుంటాము. కానీ, క్లాసికల్‌ (సెమ్మొళి) అంతస్తు విషయంలో మనం గుడ్డివాళ్లగానే మిగిలిపోయాం. తమిళానికి ఇచ్చేవరకు నిద్రపోయాం, ఆపై మేల్కొన్నాం! దాదాపు నాలుగేళ్లనుంచి రకరకాలుగా పోరాడుతున్నా, పరిస్థితి మాత్రం 'ఎక్కడ వేసిన గొంగడి' అక్కడే అన్నట్టు ఉంది. 'క్లాసికల్‌' పదానికి తెలుగు అనువాదంగా- శ్రేష్ఠ, విశిష్ట, ప్రాచీన పదాలను మనవాళ్లు వాడుతున్నారు. ఇవన్నీ పర్యాయార్థకాలే అయినా, సరియైన పదానువాదం ఇంతవరకు చేసుకోలేకపోయాం. తమిళులు 'సెమ్మొళి' అని ఒక పదాన్ని వాడుతున్నారు. తమిళ సాహిత్యం సంగ కాలానికే ప్రారంభమయింది. 'తొల్కాప్పియ' వ్యాకరణ గ్రంథం క్రీస్తుపూర్వం తయారయింది. వారి 'తిరుక్కురళ్‌' ద్రవిడవేదమట. అలాగే ఆరాధిస్తారు. వారి ప్రాచీన గ్రంథాలు 'మణిమేగలై', 'శిలప్పదికారం' వంటివి వారికి తలమానికాలు. ఇటువంటి ప్రాచీన సాహిత్యాన్ని చూపి, వారు తమ భాషను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు సాహిత్యం పుట్టుక నన్నయతోనని మనవాళ్ల సంరంభం. మొదటి తెలుగు వ్యాకరణం నన్నయ్య కృతం- ఆంధ్ర శబ్ద చింతామణి. సంస్కృత భాషలోనే అదికూడా విరచితం. దానికి వచ్చిన వ్యాఖ్యానాలు కూడా సంస్కృత భాషలో రాసినవే. తెలుగు భాషలో తెలుగుభాషకు గాను చిన్నయసూరి రాసిన వ్యాకరణమే 'బాల వ్యాకరణము'. దానికిగల పూరణమే ప్రౌఢవ్యాకరణము. చిన్నయ వ్యాకరణం అసమగ్రమని 1926లో మల్లాది సూర్యనారాయణ శాస్త్రి 'ఆంధ్ర భాషానుశాసనము' పేరిట ఒక వ్యాకరణ గ్రంథం రచించారు. 1958లో వాంగ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్య 'వ్యావహారిక భాషా వ్యాకరణం' వెలువరించారు. ఇవి తెలుగులో గల మౌలిక వ్యాకరణాలు. తెలుగు సాహిత్యమంతా అనువాదమని మన ఆధునికులు ప్రచారం చేసి, మహాపరాధం చేశారు భాషకు. అనువాదంవేరు. అనుసృజన వేరు. మన కవులు సంస్కృత వాంగ్మయాన్ని మదించి, అందలి విషయాన్ని తమదైన బాణీలో రచించారు. కాబట్టి అపోహలను వీడి, అనుసృజన ఎంతటి గొప్ప విషయమో తెలుసుకోవాలి. మచ్చుకు ఒక ఉదాహరణను గమనించండి. 'శృంగార నైషధం'లో శ్రీనాధుడు ఒకచోట 'వనజదళ నేత్ర! విహరింతు, శృంగార వనములోన' అంటాడు. ఇక్కడ 'వనజదళనేత్ర' శబ్దంలోని 'వన' పదానికి నీళ్లు అని, 'శృంగార వనములోన' అనే చోటగల 'వన' పదానికి అడవి, తోట అని అర్థం. ఒకే పద్యపాదంలో విరుద్ధార్థాలు కలిగిన 'వన' శబ్దాన్ని వాడిన విధం మన తెలుగు కవికే సాధ్యమైంది. ఇటువంటి అంశాలను వెలికితీసి మన భాషా ఔన్నత్యాన్ని లోకానికి తెలియజేయాలి. అది ప్రస్తుతం ఉద్యమంలో ఎంతవరకు స్థానాన్ని పొందిందో చెప్పలేము.

నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాధ, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, చేమకూర వేంకటకవితోపాటు నాచన సోమన, మొల్ల, భాస్కరుడు, ముద్దుపళని వంటి కవులు, కవయిత్రులు వెలయించిన సాహిత్యం సంస్కృత జన్యమైనా, అనుసృజనాత్మకం అనే విషయం మరువకూడదు. సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావంతోపాటు, తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్న భాష మన తెలుగు. నన్నయ నాటికే ఛందస్సుందరత్వం కనబడుతుంది. సంస్కృత వృత్తాలతోపాటు దేశీయ ఛందస్సులోని కంద, సీస, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కర వంటివి సుప్రయుక్తాలు. ప్రత్యేక సారస్వతాన్ని తెలుగులో అప్పకవి అందించాడు. పద్య, గద్య, చంపూ నాటకాది సంస్కృత ప్రక్రియలను పుణికి పుచ్చుకున్న మన తెలుగువారు వాటితో మాత్రమే సంతృప్తి చెందలేదు. విప్లవ కవిత్వం, భావకవిత్వం, దిగంబర కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నవల, కథలు, కథానికలు, గేయాలు, నానీలు, ప్రక్రియలతోపాటు స్త్రీవాద, దళితవాద, మైనారిటీ వాద సాహిత్యం కూడా వెలుగు చూసింది. తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన విశిష్ట ప్రక్రియ అవధాన ప్రక్రియ. అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచసహస్రావధాన పర్యంతం ఎదిగింది. నేత్ర, నాట్యావధానాలు కూడా సుప్రసిద్ధాలు. ద్వ్యర్థి, త్య్రర్థి, చాతురర్థికాలతోపాటు శతార్థక కావ్యాలు వెలిశాయి. తెలుగువారి శతక సాహిత్య ప్రక్రియ వైశిష్ట్యం కలది. చిన్నవారిని, పెద్దవారిని కూడా ఆకట్టుకోగలది శతకం మాత్రమే. 'ఉదాహరణ ప్రక్రియ'ను గుర్తుపెట్టుకున్నవారు చాలా అరుదు. మన వాగ్గేయ సాహిత్యం త్యాగరాజుతో మొదలయి ముమ్మూర్తులతో విరాజిల్లింది. త్యాగరాజు నేటి తమిళనాడు ప్రాంతంలోనివారని కొట్టి పారేస్తారేమో! రాయలసీమలోని అన్నమయ్య, తెలంగాణలోని రామదాసు, కోస్తాలోని క్షేత్రయ్యలను తీసి పారేవేయలేం కదా! త్రిలింగదేశం వారే కదా ఈ మువ్వురు! ఇంతటి విలువైన సాహిత్య సంపదను ఉట్టంకించకుండా, పెంకులు, రాళ్లు, రప్పలమీద పరిశోధనచేసి, గీతలను ఆధారంగా చేసుకుని ప్రాచీన భాషాస్థాయి కావాలంటే వస్తుందా!

'నేటి తెలుగు భాషను కాపాడండి. నేడు తెలుగు భాషను కాపాడండి' అనే వేదన, ఆవేదనను వెలిబుచ్చుతున్నవారున్నారు. వ్యవహారిక, గ్రాంధిక రూపాలలో భాషను చూస్తున్నాం. రూపాలు వేరైనా, సమస్యల జోలికి పోలేదు. పరిష్కారాల ఊసేలేదు. తెలుగు భాషకు గల ప్రత్యేకాక్షరాలైన అరసున్న, ఱ (బండి ర) చ, జ(దంత్య చకార, జకారాలను)ను వదులుకున్నాం. నేడు అక్షరాల సంఖ్య ప్రశ్నార్థకం!

తెలుగు నేతలు ఆలోచిస్తున్నారా?
తెలుగు అకాడమీ లక్ష్యాల్లో మూడోది: 'తెలుగు భాషను ఆధునీకరించి (ఆధునికీకరించి) సుసంపన్నం చేసే కృషిలో భాగంగా ప్రమాణీకరించడం, పరిశోధనలు నిర్వహించడం.' అయితే అందుకు పరిస్థితి నేడు భిన్నంగా ఉంది. ఆ సంస్థ సంచాలకుల మాటల్లో చెప్పాలంటే 'సిబ్బంది కొరత. దీనివలన భాషా సమీక్ష, పరిశోధన వంటి అకాడమీ మౌలిక ఆశయాలు కుంటుపడుతున్నాయి.' ఈ వాస్తవాన్ని గమనించండి. సముచిత రీతిలో స్పందించండి. అధికార భాషా సంఘాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆరోపణ ఉంది. తెలుగు అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఏటా వచ్చే మొత్తం ఆరులక్షల రూపాయలు మాత్రమే. ఈ మొత్తాన్ని జీతాలకోసం ఇస్తారు. ఇది విద్యుత్‌ ఛార్జీలకు కూడా చాలదు. హిందీ అకాడమీకి మనరాష్ట్ర ప్రభుత్వం 48లక్షల రూపాయలు ఇస్తుంది. ఇంతకంటే ఘనమైన విషయం- ఉర్దూ అకాడమీకి మూడు కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు గల ప్రాధాన్యమిదీ! తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి పరిస్థితిని కల్పిస్తే, రాష్ట్రేతరాంధ్రుల స్థితిగతులు ఇంక ఎలా ఉంటాయో గమనించగలరు! కరుణానిధి తమిళ భాషా సాహిత్యాలలో దిట్ట. 'తొల్కాప్పియ వ్యాకరణ గ్రంథానికి 15 ఏళ్ల క్రితమే వ్యాఖ్యానం వెలయించారు. అది ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయింది. ఆయన రచనలను చైనా భాషలోకి కూడా తర్జుమా చేయిస్తున్నారు. ప్రపంచ జనాభాలో మొదటి స్థానాన్ని వహించిన చైనీయులకు కూడా తమ సాహిత్యం అందుబాటులో ఉండాలనే కోరిక తమిళులది. ఇది వారి అనువాద శక్తియుక్తులకు సాక్షాత్కారం. కరుణానిధి ఇటీవల 'సెమ్మొళి' సంస్థకు తమ సొంతపైకం ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. భాషా సాహిత్యాలకోసం వారి దాతృత్వం మన తెలుగు(నే)తలలో ఉందా! పార్టీల విషయం మరవండి. తెలుగుకోసం ఆలోచించండి!!
(ఈనాడు,03:08:2008)
__________________________

Labels:

Sunday, December 02, 2007

మన తెలుగు తల్లికి...

'ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు పూజ సల్పితినో ఇందు పుట్టినాడ కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురంబగు తెనుగు మాతృభాష' అని పులకించిపోయారు రాయప్రోలువారు. అంతటి ఆరాధనభావంతో తల్లిభాషను నెత్తిన పెట్టుకుంటున్నవారు నేడు ఎందరున్నారు? ప్రపంచంలో అనేక భాషలున్నాయి. ఎవరి భాష వారికి గొప్ప. అదేం విచిత్రమో- ఇప్పుడు ఎందరికో ఇతర భాషలంటేనే మోజు. 'మాతృభాషా తృణీకారం మాతృదేవీ తిరస్కారం' అన్నారు గాంధీజీ. హితోక్తుల్ని ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారి సంఖ్య పెరిగిపోతున్నచోట కనిపించేది మాతృభాషా తృణీకారమే. 'పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడప దాటనివాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు' తల్లిభాషకు దూరమవుతున్నాడన్నది చేదునిజమే. స్వయంగా కన్నడ ప్రభువైనా 'దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతించాడు. సొంతంగా అద్భుత తెలుగు ప్రబంధం 'ఆముక్త మాల్యద'ను సృష్టించింది ఆయనే. రాయల ఏలుబడిలో భువన విజయ కవితా గోష్ఠులది మరపురాని చరిత్ర. నాటితో పోలిస్తే- వెలాతెలా పోతున్న నేటి తెలుగును చూసి, భాషాభిమానుల్ని నిలువునా దిగులు ఆవరిస్తోంది. అత్యున్నత మానవతా విలువలు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన తెలుగుభాష తనను కాచి కాపాడేదెవరని ఆక్రోశించే దుర్గతి నేడు దాపురించింది. తల్లిభాషను రక్షించుకోవాలని ఎలుగెత్తి చాటేందుకు తాజాగా తిరుపతి వేదికైంది. మన భాషా సాహితీ సౌరభాలను, వెలుగు జిలుగులను అందరికీ పంచేందుకే తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు తలపెట్టామన్నది నిర్వాహకుల మాట. తప్పెటగుళ్లు, తాళాలు, బాజాలు, కొమ్ముబూరల సవ్వళ్లతో మార్మోగిన తిరుపతి- తల్లిభాషను కాపాడాలన్న నినాదాలతో ప్రతిధ్వనించింది. ఈ పిలుపు ఎందరికి మేలుకొలుపు అవుతుందన్నదే ప్రశ్న.

వెనకటి తరం రచయితలు కొందరు లాల్చీ ధారణ, బెంగాలీ పంచెకట్టు, రవీంద్రుడి మార్కు గడ్డంతో వంగ కవిత్వాన్ని భుజాన మోసేవారు. 'ఠస్సా చెప్పి రంజింప చేద్దా'మనే గిరీశం తరహాలో- ఆంగ్లంపై అమిత అనురక్తి ప్రదర్శించేవారి సంఖ్యాధిక్యానికి నాడూ నేడూ కొదవ లేదు. జీలకర్రలో కర్ర లేకపోవచ్చుగాని తెలుగువాడిలో వాడికి లోటు లేదన్న గర్జనలకూ ఏనాడూ కరవు లేదు. జనవరి, మార్చి, మే, జులై నెలల పేర్లతో- 'జనవరిష్టుడు శ్రీరామచంద్రమూర్తి మేలుగూర్చుట వ్రతముగా మెలగినాడు మహిని రాక్షసులన్‌ బరిమార్చినాడు సూర్యవంశపు జూలయి శోభలీనె' అని తమాషా పద్యాలల్లిన నేర్పరులిక్కడ ప్రభవించారు. తెలుగు చేవ ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పూర్వీకులు ఇక్కడివారేనని, కేరళలో నంబూద్రి నాయర్లు సైతం తెలుగువారేనని, కర్ణాటకలో వైదిక బ్రాహ్మణులు మన భాషీయులేనని సంబరపడతాం. ఆది శంకరాచార్యులు మొదలు అన్నాదొరై వరకు ఎందరో తెలుగువారేనని మురిసిపోతాం. తెలుగు భాషా పరిరక్షణ సంగతేమిటంటే- ముందు వెనక అంతా... నిశ్శబ్దమే. 'దేశంలో తెలుగుభాషది రెండోస్థానం (ఇది జనాభాకు సంబంధించి!) ప్రాశస్త్యంలో మొదటిస్థానం అనేది నా వ్యక్తిగతాభిప్రాయం...'- అదీ, శ్రీశ్రీ మాట. తెలుగు పదాలకున్న శబ్దమాధుర్యం మరే భాషకూ లేదు. ఏ సాంకేతిక అభిప్రాయాన్ని అయినా, ఏ వైజ్ఞానిక విషయాన్ని అయినా సునాయాసంగా ప్రకటించే శక్తి తెలుగు భాషకుందని ప్రొఫెసర్‌ హాల్డేన్‌ లాంటి విజ్ఞాన వేత్తలెందరో ఒప్పుకొన్నారు. అయితేనేం... మాతృభాషపట్ల పలువురు తెలుగువారి నిరాసక్తత, ప్రభుత్వ ఉదాసీనత- ఎడాపెడా జోడుకత్తులై ఘన వారసత్వాన్ని తెగనరుకుతున్నాయి. ప్రజల కాలానుగుణ అవసరాలు తీర్చలేని ఏ భాషైనా ఉనికి కోల్పోక తప్పదు. ఆ ప్రమాదం తెలుగుకు వాటిల్లకూడదన్న ముందుచూపు కనబరచినప్పుడే మన భాషకు మళ్లీ వెలుగు!

దేశంలోనే మనది మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం. సమున్నత భాషా సాంస్కృతిక వారసత్వ సంపద మన సొంతం. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు...' అంటూ ఒకప్పుడు మన్ననలందుకున్న భాష నేడు అడుగడుగునా ఎందుకు మసకబారుతోంది? ప్రతి రాష్ట్రానికీ ఆ రాష్ట్ర భాషే అధికార భాషగా ఉండాలని, పరిపాలన వ్యవహారాలన్నీ రాష్ట్ర భాషలోనే జరగాలని నెహ్రూ గిరి గీశారు. 'తెలుగు బాసను జుంటితేనెయని పొగిడి పొరుగింటి పులుపుపై మరులు' పెంచుకుంటున్న అవ్యవస్థ తెలుగు తేజాన్ని హరింపజేస్తోంది. జాతీయ భాష కాగల అర్హత ఒక్క తెలుగుకే ఉందన్నది మహాకవి వాక్కు. దాన్ని వెక్కిరిస్తున్న రీతిగా- సంస్కృతం, తమిళాల్ని ప్రాచీన భాషలుగా గుర్తించిన కేంద్రం వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులూ మంజూరు చేసింది. తెలుగుపై శీతకన్నేసింది. వచ్చే సంక్రాంతిలోగా ప్రాచీన భాష హోదాను అనుగ్రహించకపోతే తెలుగుజాతి సామూహిక నిరశన తప్పదని తిరుపతి భాషా బ్రహ్మోత్సవాల్లో తీర్మానం చేశారు. రెండు నెలలక్రితం విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. అక్కడ జాతీయ సమైక్యతే రచయితల లక్ష్యమని, తెలుగు భాషా పరిరక్షణ వారి బాధ్యతేనని గవర్నర్‌ తివారీ చెప్పారు. ప్రభుత్వం తనవంతుగా ఏం చేయాలో ప్రత్యేకించి ఎవరూ వివరించనక్కర్లేదు. తెలుగు బోధకుల్ని, అభ్యాసకుల్ని పాలకులు అన్ని విధాలా ప్రోత్సహిస్తే- భాషా పరిరక్షణలో అదే పెద్ద ముందడుగు. తెలుగు నేరిస్తే తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న భరోసా విద్యార్థుల్లో కలిగించాలి. దాదాపుగా కార్యకలాపాలన్నీ మాతృభాషలోనే చక్కబెడుతున్న తమిళనాడు, కేరళ శాసనసభల్ని చూసైనా 'ఆంగ్ల ప్రదేశ్‌' తీరు మారాలి. ఆధునిక శాస్త్ర ఫలితాల్నీ మాతృభాషల్లోనే ఇముడ్చుకొని పురోగమిస్తున్న జపాన్‌, జర్మనీ, చైనాల అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్వాలి. ఇటు పౌరులూ తెలుగు తల్లికి మల్లెపూదండలేసి మంగళారతులు పట్టేందుకు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు మారాలి!
(Eenadu, 02:12:2007)
______________________________________

Labels:

Sunday, September 30, 2007

తరిగిపోతున్న భాషా సంపద

భాష ముఖ్యోద్దేశం మన భావం అవతలివారికి చక్కగా తెలియడం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పూర్వ పండితులు, కవులు కొందరు ఎవరికీ అర్థంకాని పాషాణ పాకంలో గ్రంథాలు రాసి ప్రజలపైకి విసిరేశారు. గ్రంథం ఎంత అర్థం కాకుండా ఉంటే అంత గొప్ప అన్న అభిప్రాయమూ ఒకప్పుడు ప్రబలిపోయింది. ఆ దశలో ఏ కవిత్వమైనా, కావ్యమైనా తేలికభాషలో నలుగురికీ అర్థమయ్యేట్లు ఉండాలనీ అలా ఉంటేనే వాటికి సార్థకత చేకూరుతుందనే వాదన పుట్టుకొచ్చింది. వాదాలు ముదిరి గ్రాంథిక, వ్యవహార భాషా పండితుల మధ్య సిగపట్లదాకా వెళ్ళింది వ్యవహారం. ''గ్రాంథిక గ్రామ్య సంఘర్షణమ్మున జేసి మరిచిపోయితిని వాఞ్మయపు సొగసు, వ్యర్థవాద ప్రతివాదమ్ములనొనర్చి వదలి వైచితిని భావ ప్రశస్తి...'' అంటూ ఆ సందర్భంలోనే ఓ కవి చింతించాడు. భాషల విషయమై ఇటువంటి వాదోపవాదాలు ఎన్నెన్నో. ''జీవలోకమందు జీవించు భాషలు జనుల తలపుదెలుపు సాధనములు'' అన్నారో కవి. భాష మన ఆలోచనలు తెలపటానికే కాదు, వాటిని దాచుకోవటానికీ ఉపయోగపడుతుంది- అన్నాడు తన మాటలతో బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగల చతురుడొకడు. ''నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌'' అంటాడు గిరీశం. ఆయనతో రోజుల తరబడి మాట్లాడిన వెంకటేశం ఎంత విద్యను ఒంటపట్టించుకొన్నాడో కాని - పరీక్షలు మాత్రం ఆనవాయితీగా ఫెయిలవుతూనే వచ్చాడు.

ఒకప్పుడు లాటిన్‌, సంస్కృతం వంటివి రాజభాషలుగా చలామణీ అయ్యాయి. సంస్కృతంలో నుంచే అన్ని భాషలూ పుట్టాయని భారతీయులు నమ్మితే, లాటినే సర్వభాషలకు పుట్టినిల్లని పాశ్చాత్య దేశాలవారు భావిస్తారు. ప్రస్తుతానికి ఈ రెంటినీ మృతభాషలుగా కొందరు పరిగణిస్తున్నారు. ''ఎల్లభాషలకు జనని సంస్కృతమె'' అని నమ్మే సంస్కృత భాషాభిమానులు ఆ విషయాన్ని ఒప్పుకోరు. సంస్కృతం మృతభాషకాదు అమృతభాష అని వారు వాదిస్తారు. ప్రపంచంలో భాషా పరిజ్ఞానం బహుముఖాలుగా విస్తరించి ఉంది. మారుమూల ప్రాంతాల్లో కొద్దిమంది మాత్రమే మాట్లాడే భాషలు ఎన్నో ఉన్నాయి. కథా సాహిత్యానికి ఒరవడి అని చెప్పదగ్గ 'బృహత్కథ' అనే గ్రంథాన్ని గుణాఢ్యుడు అనే కవి పండితుడు పైశాచీ భాషలో రాశాడు. సంస్కృతం, ప్రాకృతం, దేశీ భాషలన్నీ తెలిసిన మహా విద్వాంసుడాయన. అయినా తన గ్రంథ రచనకు పైశాచీ భాషనే ఎన్నుకున్నాడు. ఆ భాషలో తన రక్తంతో భూర్జపత్రాలపై ఆ ఉద్గ్రంధాన్ని రచించాడు. బృహత్కథ మొదట్లో పండితాదరణను పొందకపోయినా తరవాత ఎన్నో భాషల్లోకి అనువాదమై ఇప్పటికీ సాహిత్యాభిమానుల ఆదరణకు పాత్రమవుతోంది. పైశాచిక భాష ప్రస్తుతం ఉందో లేదో ఎవరికన్నా తెలుసో తెలియదో కాని, బృహత్కథ మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. తెలిసి చెప్పగలిగినవాళ్లుంటే అందులోని కథలు పిల్లలకు ఆకర్షకంగానే ఉంటాయి. పైశాచివంటి అంతరించిపోయిన అంతరించిపోతున్న భాషలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరికొన్ని భాషలు ఇతర భాషా ప్రభావంతో తమ అసలు స్వరూపాన్నే కోల్పోతున్నాయి. ''గంగతల నుండి కావేరి కాళ్ళదాక వెలిగిన'' తెలుగు ఠీవి ప్రస్తుతం ఇంగ్లిష్‌ ప్రభావంలో పడి ఏవిధంగా మసకబారిపోతున్నదీ వేరే చెప్పనక్కరలేదు.

ప్రపంచం మొత్తంమీద ఏడు వేలకు పైగా భాషలున్నట్లు ఒక అంచనా. వాటిలో సగానికిపైగా భాషలకు లిపి లేదు. లిపి ఉన్నా లేకపోయినా ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషల్లో సగానికిపైగా అంతరించిపోయే దశలో ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతోందంటున్నారు. ముఖ్యంగా ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని మధ్యప్రాంతం, తూర్పు సైబీరియా, ఓక్లహామా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే కొన్ని భాషలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరినాటికి సగానికిపైగా భాషలు అంతర్థానమై పోగలవని అంటున్నారు. అదృశ్యమై పోవటానికి సిద్ధంగా ఉన్న భాషల గురించి అధ్యయనం చేయటానికి డేవిడ్‌ హారిసన్‌ అనే భాషా శాస్త్రవేత్త పూనుకొన్నాడు. ఈయన మరికొందరు శాస్త్రజ్ఞులతో కలిసి అంతరించిపోయే ప్రమాదమున్న భాషల వివరాలను సేకరిస్తున్నాడు. అందుకోసం హారిసన్‌ బృందం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తోంది. అంత్య దశలో ఉన్న భాషలు తెలిసినవారిని కలిసి ఆయా భాషలలో వారిని మాట్లాడించి హారిసన్‌ బృందం రికార్డు చేస్తోంది. దీనివల్ల ఆ భాషలు పూర్తిగా మరుగునపడకుండా కొంతవరకన్నా కాపాడవచ్చునని శాస్త్రజ్ఞుల భావన. అమెజాన్‌ తీర ప్రాంతంలోని ఆండీస్‌ పర్వత సానువుల్లో నివసించే ప్రజలు మాట్లాడే భాషలపై స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల ప్రజలు తమ భాషలకు బదులుగా స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషలనే ఉపయోగిస్తుండటంతో వారి అసలు భాషలు అంతరించిపోతున్నాయి. ఇంగ్లిష్‌ భాషా ప్రభావంవల్ల కొన్ని భాషల అసలు స్వరూపమే మారిపోతోంది. ఉదాహరణకు తెలుగుపై ఆంగ్ల ప్రభావం ఎంతగానో ఉంది. రెండు మూడు ఇంగ్లిష్‌ ముక్కలు లేకుండా తెలుగులో మాట్లాడటం కుదరటంలేదు. ఒకవేళ అలా మాట్లాడినా అవతలివారికి అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎవరి భాషలపట్లవారు శ్రద్ధ వహించి అవి మరుగునపడిపోకుండా కాపాడుకోవాలి. పరాయిభాషల ప్రభావంవల్ల తమ మాతృభాష అసలు స్వరూపమే మారిపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది!
(Eenadu, 30:09:2007)
______________________________

Labels: