My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, December 30, 2007

'మోడి'రాగం పాడుకుంటూ

- శంకరనారాయణ

'తన 'మత'మేదో తనది పర'మత'మసలే పడదోయ్‌' అంటూ కాంగ్రెస్‌ 'హస్త'సాముద్రికురాలు సోనియా గాంధీ గుజరాత్‌లో ఊరూవాడా తిరిగి భాజపా ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మీద దుమ్మెత్తిపోసినా ప్రయో'జనం' కలగలేదు. 'గాంధీ పుట్టిన రాష్ట్రమా ఇది' అని ప్రశ్నించినా కుదరలేదు. 'తోడి'రాగం పాడుకుంటూ జనం మోడీకే పట్టం కట్టారు. తమకు కాంగ్రెస్‌ మతం పడదని తేల్చిచెప్పారు. డొంక తిరుగుడు రాజకీయాలు తమ ఒంటికి పడవని చెప్పినట్టయింది. కమలములు 'ఓటు'బాసిన అనే పద్యం చదివినా, నరేంద్రది రెటమతం అని రెట్టించినా పప్పులుడకలేదు. నెహ్రూ కుటుంబానికి ఆటపట్టయిన ఉత్తరప్రదేశ్‌తోపాటు, గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రాహుల్‌గాంధీ 'చేతి'మీద కంగు తినిపించినట్టయింది. వంశపారంపర్యపాలన ముఖ్యం కాదు, అంశపారంపర్యపాలన ముఖ్యమన్నది 'జనసందేశ'మయింది! కాంగ్రెస్‌ పెద్దలు సతమతమయ్యారు. గుజరాత్‌లో గెలిచింది భాజపా కాదు, నరేంద్రమోడీ సాహసం అనేవాళ్లున్నారు. 'సాహసం శాయరా డింభకా, ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది' అని ఎవరో కలలో చెప్పి ఉంటారని కొంతమంది చమత్కరిస్తున్నారు.

''కుడి ఎడమైనా పొరపాటులేదోయ్‌ 'మోడి'పోలేదోయ్‌'' అని కమలదాసులు పాడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లు 'మనకు అంతటి సాహసవీరుడు, వాగ్ధాటిగల నేతలేడు'గా అని 'పోస్టు'మార్టమ్‌ సమావేశంలో అనుకున్నారు. ఏంచేసినా గత'జన'హేతుబంధనమే. మోడిని కాంగ్రెస్‌ వాళ్లు కలుపుమొక్కగా వర్ణించినా, అభిమానులు 'కలుపుగోలు మనిషి'గా వర్ణిస్తారు. అందరినీ 'భాయ్‌ భాయ్‌'అని పలకరించే మోడీకి అసమ్మతినేత కేశూభాయ్‌ కూడా మినహాయింపుకాదని, మళ్లీ ముఖ్యమంత్రి అందలం అందుతున్న తరుణంలో ఆయన దగ్గరికి వెళ్లారని గుర్తుచేస్తారు.

'ఇంతింతై వటుడింతై' అనడానికి నరేంద్రమోడి నిదర్శనం. ఒకప్పుడు టీ తెచ్చి ఇచ్చే కుర్రాడిగా సుపరిచితుడైన మోడీ గుజరాత్‌ భాజపాలో సాటిలేని వాడయ్యాడు. ''అద్వానీకి శిష్యుడైన మోడి గురువును మించిన లేదా ముంచిన శిష్యుడవుతాడన్న మిత్రభేదం కథను కూడా కొందరు 'పెన్‌'గట్టుకుని సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో విజయభేరి మోగించాక నరేంద్రమోడి రెచ్చిపోయి ''ఢిల్లీ పీఠం పట్టుకుపోతాన్‌'' అంటారని అందువల్లనే అద్వానీని హడావుడిగా ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించారన్న ప్రచారమూ ఉంది''

విషయం విషయమే, వినయం వినయమే అన్నది నరేంద్రమోడీ సిద్ధాంతం. అతని గొప్పతనం వల్లనే గెలుపు వచ్చింది తప్ప భాజపా ఘనత ఏమీ లేదని మీడియా కోడై కూసేసరికి నరేంద్రమోడీ బాధపడ్డారు. కంట తడిపెట్టారు. ''పార్టీ తల్లివంటిది. బిడ్డ ఎంత గొప్పవాడైనా తల్లి కన్నా తక్కువే'' అనేశారు.

గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ విజయభేరి మోగించాక ఆ పార్టీ వాళ్లంతా 'పదండి ముందుకు' అంటుంటే నరేంద్రమోడి మాత్రం 'పదండి వెనక్కు' అనేశాడు. అలనాటి జనసంఘ్‌లో కార్యకర్తల త్యాగాన్ని కొనియాడారు. ''పార్టీ బ్రహ్మ; పార్టీ విష్ణు; పార్టీ దేవో మహేశ్వరః'' అన్నట్టు మాట్లాడారు. ఆయన 'సంఘం శరణం గచ్ఛామి' అన్నారంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గుర్తొస్తుంది తప్ప బౌద్ధమతం ఎవరికి గుర్తుకు రాదు. నరేంద్రమోడీ ఏ పాట పాడినా 'హిందూ'ళ రాగంలో పాడతాడు. హిందూ మతమే హితమన్నట్టు మాట్లాడుతుంటారు. చివరకు ప్రభుత్వోద్యోగి ఎవరయినా 'సిక్కు'లీవ్‌ పెట్టినా, సిక్కులీవ్‌ ఎందుకయ్యా 'హిందూలీవ్‌' పెట్టుకో అని నరేంద్ర మోడీ అంటారని గుజరాత్‌లో చమక్కులు వినిపిస్తుంటాయి. అటువంటి మోడీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం వల్లిస్తుంటే విశ్వహిందూ పరిషత్‌, రా.స్వ.సే. సంఘ్‌ వంటివి కాస్త కినుక వహించాయి. ఎన్నో హిందూ మంత్రాలు ఉంటే అభివృద్ధి మంత్రం ఎందుకని బాధపడ్డాయి.

కాంగ్రెస్‌ పెద్దల తిట్లు దీవెనలని నరేంద్రమోడీ విశ్వాసం. ఒక్కో తిట్టూ అదనంగా ఒక్కో సీటు తెస్తుందనేది ఆయన విశ్వాసం. సోనియా 'మృత్యుబేహారులు' అని తిట్టేసరికి మోడీ లోలోపల నవ్వుకున్నారు. 'తినగ తినగ వేము తియ్యనగును, తిట్ట తిట్ట సీట్లు తెప్పలగును' అని అనుకున్నారు. అదే నిజమైంది. అమెరికా పెద్దల తిట్లు కూడా వరమే అయింది. వీసాను తిరస్కరించగానే గుజరాతీలందరిలో ఆయన మీద సానుభూతి ఏర్పడింది. రాజకీయాల్లో అనుకూలంగా ఉన్నవాళ్లవల్లనే నాయకులు బలపడతారనడానికి వీల్లేదు. వ్యతిరేకుల వల్ల కూడా బలపడతారు.

ఎంతయినా నరేంద్రమోడీకి మన రాష్ట్ర పాలకులకు ఉన్నన్ని, తెలివి తేటలు లేవు. తెలుగు రాజాలు ఎప్పుడూ లౌకికవాదం గురించి నొక్కి వక్కాణిస్తుంటారు. చిత్రమేమిటంటే తమది 'దేవుడి పాలన' అని పదే పదే అంటుంటారు. నరేంద్ర ఎప్పుడూ హిందూత్వం గురించి చెబుతుంటారు. అయినా తనది 'దేవుడి పాలన' అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంకో విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ ప్రభావం భారతీయ జనతాపార్టీ వాళ్లమీద కన్నా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వాళ్ల మీద ఎక్కువగా ఉంది. నరేంద్రమోడీ అభివృద్ధి మంత్రం పఠించి గెలిచారు కాబట్టి మేమూ అభివృద్ధి పఠిస్తామని ఇక్కడి కాంగ్రెస్‌ ఘనాపాఠీలు చెప్పుకొంటున్నారు. 'వాతలు' పెట్టుకుంటే రాతలు మారతాయా? కరీంనగర్‌ గుణపాఠం మరచిపోయారా? అని ఎవరన్నా వెక్కిరించినా వారికి వినిపించదు గాక వినిపించదు.
(Eenadu, 29:12:2007)
_____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home