మనదేశం
ఎవరి దేశమంటే వారికి ఎంతో ఇష్టం, అది సహజం. దేశాభిమానం దోషం కాదు. ఇతర దేశాలపట్ల, ఆ ప్రజల పట్ల చులకన భావం ఏర్పడినా, తన దేశంపట్ల అభిమానం మితిమీరి దురభిమానంగా మారినా- ఎదుటివారికి వెగటు పుడుతుంది. వెనకటికోసారి ఇలాగే ఒక ఇంగ్లిషాయన ''బ్రిటిష్ మహాసామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు తెలుసా'' అంటూ అదే పనిగా గొప్పలు చెబుతున్నాడు. తాపీ ధర్మారావు ఆ పెద్దమనిషిని ఆపి ''సూర్యుడు మీ దేశంలో ఎందుకు అస్తమించడో తెలుసా?'' అని అడిగారు. ఆయన తెల్లబోయాడు. అప్పుడు ధర్మారావే తాపీగా చెప్పారు-''చీకట్లో వదిలేస్తే మీరు నమ్మదగినవారు కాదు... చీకటిపడితే మీ ప్రవర్తన సరయినది కాదని సూర్యుడికి బాగా తెలుసు. అందుకే ఇక్కడ ఆయన అస్తమించడానికి జంకుతాడు''! ''దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టిపెట్టోయ్. గట్టిమేల్ తలపెట్టవోయ్''- అని గురజాడ ప్రబోధించడంలో ఉద్దేశమదే అనిపిస్తుంది. కేవలం మాటల్ని కోటలు దాటించడం కాదు, మేలు చేసే పని ఏదైనా తలపెట్టడమే దేశభక్తికి చిహ్నమని మహాకవి భావంగా తోస్తుంది. ''అత్యున్నతమైన ఆశయాలు, ఉదాత్తమైన లక్ష్యాలు, ఉత్తమమైన భావాలు కలిగిన ఒక వ్యక్తి కోరుకునేవన్నీ భారతదేశంలో ఉన్నాయి కనుక నాదేశం నాకు చాలా ఇష్టమైన దేశం'' అన్నారు మహాత్మాగాంధీ. ఈ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు కనుక రాయప్రోలు ''విపుల తత్వము విస్తరించిన విమల తలమిది'' అంటూ మనదేశాన్ని కొనియాడారు. కృష్ణశాస్త్రి వంటి భావకవి కలంలో 'జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి'గా ఆవిష్కృతమైన ఈ పవిత్రదేశం, ఆంధ్రపురాణ కర్త మధునాపంతులకు 'మంగళక్షితి'గా దర్శనమిచ్చింది. ''ఇతర క్షోణిని లక్షలిచ్చినను గానీ పుట్టను... ఈ భారత క్షితిపై వేద పురాణ శాస్త్ర కృతి రాశి స్థానమీ మంగళక్షితిపై...'' పునర్జన్మ కావాలనుకోవడాన్ని 'దివ్యజ్జీవ సంస్కారం'గా భావన చేశారాయన.
కళాకారుల అభిప్రాయమూ అంతటిదే. మన మంగళ వాయిద్యం సన్నాయి మాదిరిగా ఉత్తరాదిలో భజంత్రీలకు పెళ్ళి పందిళ్ళకూ పరిమితమైన షెహనాయికి అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలపై కనకాభిషేకాలు జరిపించిన రససిద్ధుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్. అమెరికాలో స్థిరపడవలసిందిగానూ, ఈ 'పూర్ ఇండియా'లో లేని సకల సదుపాయాలను అందుకోవలసిందిగానూ ఆయనను ఆహ్వానిస్తే- ''నన్ను తీసుకెళతారు సరే, ఈ గంగామాయిని అమెరికా ఎలా రప్పించగలరు?'' అని అడిగారాయన. భిస్మిల్లాఖాన్‌కు వారణాసి అన్నా గంగానది అన్నా ప్రాణసమానం. 'ఇస్ దేశ్‌మే గంగా బెహతీహై'! అదొక్కటిచాలు- ప్రపంచదేశాల మధ్య భారతదేశం సగర్వంగా తలెగరేయడానికనేది ఖాన్ దృఢాభిప్రాయం. సరిగ్గా అలాగే ప్రకటించాడు జర్మనీ మేధావి మేక్స్ ముల్లర్ కూడా. 'పునర్జన్మంటూ ఉండి ప్రభువును ఏమని ప్రార్థిస్తావ'ని అడిగితే 'గంగానదీ తీరాన పుట్టించమంటా'నని స్పష్టంగా చెప్పాడాయన. ఆ మధ్య ఒక సర్వే నిర్వహిస్తే విదేశాల్లో స్థిరపడిన ఆధునిక యువతరంలో తొంభైశాతం తమ వృద్ధాప్య జీవితాన్ని మనదేశంలోనే గడపాలని ఉందని, మళ్ళీ ఈ దేశంలోనే పుట్టాలని ఉందని తమ నిశ్చితాభిప్రాయంగా ప్రకటించారు.
కవులు, కళాకారులు, ప్రాచీనులు, ఆధునికులు, భారతీయులు, పాశ్చాత్యులు, హిందువులు, ముస్లిములు, జానపదులు... అందరిదీ ఇదే ధోరణి! ఈ సాహిత్యం, ఈ జీవజలాలూ, ఈ గాలీ, ఈ నేలా... ఏమిటిదంతా? ఒకేరకమైన ఈ భావ పరంపర ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నది? మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఈ గాలి నుంచి ఈ మట్టి నుంచి ఈ జలాల నుంచి ఏ దివ్య భావనల్ని మన శరీరాల్లోని జీవాణువులు గాఢంగా పీల్చుకుంటున్నాయి? అమోఘమైన ఏ పవిత్ర చైతన్యపు సూక్ష్మాతి సూక్ష్మమైన అణురజం మన రక్తంలోకి ఇంకిపోతోంది? మహర్షులు, మహాపురుషుల ఉనికిలోని ఏ వైశిష్ట్యం మనదేశానికి ప్రపంచ దేశాలన్నింటా ఒక ప్రత్యేకతను, పూజార్హతను ఆపాదిస్తున్నది? మహర్షుల కవిత్వాల్లో ఒదిగిన, మహానుభావులు తమ తమ కళాస్వరూపాల్లో పొదిగిన మహోదాత్త జీవ సంస్కారాలను, ఆశయాలను, లక్ష్యాలను, భావాలను వేటిని ఆకళించుకున్నాక- మహాత్ముడు ఈ దేశంపట్ల పరమప్రీతిని పెంపొందించుకుని 'నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను' అని ప్రకటించాడు? ఈ దేశాన్ని ప్రేమించడమంటే దాని జీవలక్షణాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన పెంచుకోవడమే. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్న పానీయాలు, వస్త్రాభరణాలు, కళాసంగీత సాహిత్య విజ్ఞాన విశేషాలు, భాషలు, జీవితంపట్ల ప్రజల విశిష్ట దృక్పథం... ప్రజల మనుగడలోంచి తొంగిచూసే ఎన్నో అంశాలను కలిపి పోగేస్తే అది ఆ దేశ సాంస్కృతిక స్వరూపం. ఒక జాతి నాగరికతను, ఔన్నత్యాన్ని అంచనా వేయాలంటే ఆ దేశంలో విలసిల్లిన సాంస్కృతిక వైభవాన్ని క్షుణ్నంగా అర్థంచేసుకోవాలి. అది ఉన్నతమైన స్థితిలో ఉంటే- ఆ జాతిని ఆ సంఘాన్ని మనం నాగరికంగా అభివృద్ధి చెందిన జాతిగా సంఘంగా కీర్తించాలే తప్ప వాటి జనాభా లెక్కల్ని బట్టికాదు. 'నాగరికత అనే పదార్థానికి రూపాన్నిచ్చేది సంస్కృతి' అని అరిస్టాటిల్ నిర్వచించడంలోని ఆంతర్యం అదే. ఆ రకమైన సమగ్ర స్వరూపాన్ని దర్శించాడు కాబట్టే మేక్స్ ముల్లర్- ''సమస్త విద్యలకు సర్వశాస్త్రాలకు సకల కళలకు స్థావరం భారతదేశం. ప్రపంచ దేశాలకు నాగరికతను భిక్షగా పెట్టిన దేశమది'' అని విస్పష్టంగా ప్రకటించాడు. అంతటి గొప్ప దేశం భారతదేశం! మనమంతా ఆ దేశం వారసులం!
(Eenadu, 09:12:2007)
______________________________________
Labels: India/Telugu
0 Comments:
Post a Comment
<< Home