My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, December 22, 2007

తల్లిచాటు బిడ్డలు

కుటుంబ నియంత్రణ అంశంపై వ్యాసరచన పోటీకి తన రచన పంపుతూ ఒక గడుగ్గాయి ''కృష్ణుడికి భార్యలెక్కువ... సంతానం తక్కువ. కుచేలుడికి ఒక్కతే భార్య... పిల్లలెక్కువ... కనుక జనాభా నియంత్రణ కోసం కృష్ణుడు అనుసరించినదే సరైన మార్గం'' అని సూచించాడు. అలాంటి కుటుంబ సంక్షేమ చిట్కాల సంగతి పక్కన ఉంచితే, పెళ్లికాగానే పిల్లల కోసం తహతహలాడే జంటల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటం విశేషం. 'స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలనుకుంటే- ఇల్లాలికి గౌరవ వాచకం తల్లి' అని భావించే జనాభా తక్కువేమీ కాదు. సంతానాన్ని సౌభాగ్యంగా భావించడం మనదేశంలో అనాదిగా వస్తోంది. అష్టఐశ్వర్యాల్లో సంతానాన్ని ఒకటిగా గుర్తించిన జాతి మనది. పిల్లలు కోరి దశరథుడు పుత్రకామేష్ఠి నిర్వహించాడని రామాయణం చెబుతోంది. 'సకల ఐశ్వర్య సమృద్ధులు నొకతల, సంతానలాభమొకతల' అన్నాడు శ్రీనాథుడు. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉన్నా పిల్లలు లేకపోతే తీరని లోటుగానే ఉంటుంది. చాలామందిలో మనోవేదనకు కారణమవుతుంది. పెళ్లయిన కొత్తల్లో ప్రతి అమ్మాయికీ ''ఏమ్మా ఏమైనా విశేషమా'' అనేది తరచూ ఎదురయ్యే ప్రశ్న. ''ప్రతి శిశువు ఆగమనమూ ఒక ఆనంద సందేశం... మనుషుల పట్ల దేవుడికి ఇంకా నిరాశ కలగలేదని చెప్పడానికి ఈ లోకానికి దిగివచ్చే ప్రతి శిశువూ ఒక ప్రత్యక్షసాక్ష్యం'' అన్నాడు విశ్వకవి. తాను గొడ్రాలిని కారాదన్నది ప్రతి ఇల్లాలి వాంఛ. పిల్లలు పుట్టకపోవడమనేది తన లోపమే అని బాధపడుతూ ''పిల్లల కనుగొనదలచిన ఇల్లాలు గతాగతంబు... అల్లరిపెట్టిన చెడును...'' అని జాగ్రత్తలు చెప్పిన కుమారీశతక కర్త వేంకట నరసింహకవి సూక్తులను తలకెక్కించుకుని, మగాళ్ల మారుమనువులకై ప్రోత్సహించే వెర్రి భార్యలు కూడా ఈ లోకంలో ఉన్నారు.

బుచ్చమ్మను ముగ్గులోకి దింపడానికి కన్యాశుల్కం నాటకంలో గిరీశం ప్రయోగించిన ఠస్సా - ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం' అన్న సామెతకు అతికినట్లుగా సరిపోతుంది. అందులో కూడా సంతాన ప్రసక్తే ముఖ్యమైన అంశం. 'మాటవరసకు మనం పెళ్లాడతాం అనుకుందాం... మనకు చిన్ని పిల్లలు పుడతారు. నేను కుర్చీ మీద కూచుని రాసుకుంటూంటే వచ్చి వాళ్లు నా చెయ్యి పట్టుకు లాగి, 'నాన్నా ఇది కావాలి. అది కావాలి' అంటారు. మీరు బీరపువ్వులాగా వొంటి సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ కుంకం పెట్టుకుని మహాలక్ష్మిలాగా పెత్తనం చేస్తూ ఉంటే, ఒక పిల్ల ఇటువైపు వచ్చి మెడ కౌగిలించుకునీ, ఒక పిల్ల అటువైపు వచ్చి మెడ కౌగిలించుకొనీ, అమ్మా ఇది కావాలి, అమ్మా అది కావాలి' అని అడుగుతారు. వాళ్లకి సరుకూ సప్పరా చేయించాలి...''- అదేదో సినిమాలో కాశ్మీరం నుంచి కొబ్బరిబొండాం అంటాడే ఆ స్థాయిలో గిరీశం బుచ్చమ్మను స్వప్న జగత్తులోకి ఎత్తేస్తాడు. మాయ మబ్బుల్లో తేలిపోతూ- కాబోయే పెళ్లి, పుట్టబోయే పిల్లలు, వాళ్లకు చేయబోయే సంబరాలు తలచుకుంటూ, బుచ్చమ్మ చులాగ్గా బోల్తాపడుతుంది. ఇప్పటి ఆధునిక యువతి బుచ్చమ్మ లాంటి వెర్రి వెంగళాంబ కాదు. ''మేఘ సందేశం ముందా, కుమారసంభవం ముందా'' అన్న పాతతరం చమత్కారాల్లోని హెచ్చరికల్ని ఒంటపట్టించుకుని, మేఘ సందేశాలను గిరిజా కల్యాణాలదాకా నడిపించిన తరవాతే కుమారసంభవానికి తెరతీస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్‌ డే, (ప్రేమికుల దినం) నుంచి సరిగ్గా తొమ్మిది నెలలు తిరిగేసరికి నవంబర్‌ 14 బాలల రోజు వస్తుందన్న వాస్తవం స్పష్టంగా తెలుసుకుని మసలుకుంటున్నారు.

అలాంటి తెలివైన స్త్రీల చేతుల్లో పిల్లల భవిష్యత్తు పదిలంగా ఉంటుందని ఇటీవలి శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైఫాకు చెందిన శాస్త్రవేత్తలు మానవ సంబంధాలపై విస్తృతమైన పరిశోధనలు చేసి 'తల్లిచాటు బిడ్డలే సర్వ స్వతంత్రులు' అని తేల్చిచెప్పారు. 'సాధారణంగా తల్లిదండ్రుల నుంచి వేరుపడి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, వారి జీవితాల్లో పెద్ద ఆనందాలేమీ ఉండవు... అదే తల్లిదండ్రులతో కలసి ఉండి, జీవితంలో స్థిరపడినవారికి మాత్రం తమ ఆనందాల్ని పంచుకునే వీలుంటుంది' అని ఆ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఇరిట్‌ యానిర్‌ మైకు గుద్ది మరీ చెబుతున్నారు. ''నా వలె ఈతడు శాస్త్రపండితుడు కాదు. నిత్యదర్శకుడునూ కాదు. వీనికెటుల ఇట్టి గొప్ప జ్ఞానమబ్బె''నని ఆశ్చర్యపడుతున్న కౌశికుడికి మహాభారతంలో ధర్మవ్యాధుడు ''జననుత! వీరు నా జననియు జనకుండు సూవె, వీరలకు శుశ్రూష సేసి, ఇట్టి పరిజ్ఞాన మేను ప్రాప్తించితిన''ని వినయంగా జవాబిచ్చి, జ్ఞానబోధ చేస్తాడు. ప్రవరుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ వారినెలా సేవించుకునేవాడో పెద్దన వివరించారు. మన ప్రాచీన వాంగ్మయం ఇలా తల్లిదండ్రులతో సహజీవనం చేసిన కొడుకుల సౌభాగ్యాన్ని గొప్పగా వర్ణిస్తుంది. ''తల్లిదండ్రులతో కలిసి ఉండటం, వారితో కలిసి భోజనం చేయడం, మాట్లాడటంవల్ల పిల్లలు తమలోని భావాల్ని పెద్దలతో పంచుకునే వీలుంది... క్లిష్ట పరిస్థితుల్లో వారికి తల్లిదండ్రుల అండ లభిస్తుంది... ఫలితంగా వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పనిచేసినా తల్లిదండ్రులతో నిర్భయంగా చర్చించే వీలు వారిలో స్వతంత్ర భావాల్ని తీసుకువస్తుంది'' అని డాక్టర్‌ ఇరిట్‌ యానిర్‌ స్పష్టంగా చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే పెళ్లి అనగానే వేరు కాపురాలు పెట్టి రకరకాలుగా దాంపత్య సుఖ జీవనసారం గ్రోలడం ఎలాగని తీవ్ర పరిశోధనలు జరిపిన తరాలన్నీ- ఇప్పుడు పిల్లల్ని పెంచడం ఎలాగన్న విషయంపై దృష్టిని కేంద్రీకరించవలసిన సమయం వచ్చిందనిపిస్తుంది. ఇటీవలి పోకడలు గమనిస్తే కనడం ఎలాగనేకన్నా పెంచడం ఎలాగనే దానిపైనే శ్రద్ధ పెరిగినట్లు తోస్తోంది. పెంపకం సరిగ్గా లేకుంటే 'కనిపించుట లేదు' అనే ప్రకటనల స్థానంలో ''కని-పెంచుట లేదు'' అనేవి చోటుచేసుకుంటాయని కొత్తతరం గుర్తించడం శుభ పరిణామం!
(Enadu,16:12:2007)
____________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home