ధర్మం-విశ్వకల్యాణం
- ఎమ్.నాగేంద్రప్రసాద్
'బహుజన హితాయ బహుజన సుఖాయ' అన్నది భారతీయుల ఐక్యభావం. విశ్వకల్యాణానికై తపస్సు చేసి తపోధనులైన వారున్న పుణ్యభూమి ఈ భారతదేశం. లోకకల్యాణాన్ని కోరి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని భారతీయులు జీవనాన్ని గడపాలన్నది మన వేద సారాంశం.
శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. సమస్త ధర్మాలకు వేదమే మూలం. ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేది ధర్మశాస్త్రం. జీవితంలో వివిధ దశల్లో ఏ విధంగా వ్యవహరించాలి? సమాజంలోని రకరకాల వ్యక్తులతో ఎలా వ్యవహరించాలన్న ప్రవర్తన నియమావళిని తెలిపేదే స్మృతి. ఈ ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనవి. 'చోదనా లక్షణో అర్థో ధర్మః' అని జైమిని అన్నాడు. ఒక వ్యక్తి చేయవలసిన విధుల్ని బోధించేది ధర్మం. సత్యం, అహింస, దయ, శౌచం వంటివి సామాన్య ధర్మాలు. మానవ సమాజంలోనే విశేష ధర్మాలు రూపొందాయి. సమాజం స్థాణువు కాదు పరిణామ శీలమైనది కాబట్టి ధర్మంలో కాలానుగుణమైన మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ధర్మానికి మూల పదం 'ధృ', ధరించి ఉంచేది ధర్మం. ధర్మమనగా ఆశింపదగిన గమ్యం. ఇది సౌఖ్యాన్ని, బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. భారతీయుని జీవనసరళికి ప్రధానమైనది ధర్మం. సర్వానికి ధర్మమే మూలం. 'యతో అభ్యుదాయ, నిశ్రేయ ససిద్ధిః సధర్మః'. ఏది అభ్యుదయాన్ని, మోక్షాన్ని, సిద్ధింపజేయగలదో అదే ధర్మం.
తిండి, నిద్ర, భయం, మైథునం మనుషులకు పశువులకు సమానమే కాని, వ్యత్యాసం ధర్మవర్తనమే! ధర్మం లేనివాడు పశువుతో సమానమే! ధర్మం చేతనే అర్థకామాలు సంపాదించాలని భారతం చెబుతోంది.
ధర్మమనేది ఒక పెద్ద వటవృక్షం. దాని నీడలో మానవులంతా విశ్రాంతి పొందగలరు. శాంతి, ఆనందాలతో జీవనం సాగించగలరు. ధర్మమనేది దేశ, కాలాలకు బందీకాదు. అది యావత్ ప్రపంచానికి వాస్తవమైన దారి చూపగలదు. ఈ సృష్టి అంతా ధర్మం మీదనే ఆధారపడి ఉంది. ధర్మం మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది తప్ప వారిని వేరు చేయదు. మానవత్వం, సమానత్వం, సహనతత్వం, అఖండత్వం ధర్మానికి మూలాధారాలు. జీవితాన్ని జీవింపజేసే కళే ధర్మం. ఆత్మ, పరమాత్మలను కట్టివేసేది, అనుసంధానం చేసేదే ధర్మం. ధర్మానికి పరీక్ష మానవత్వమే!
మన బంధువర్గం, మిత్రబృందం, పదవి-అధికారం, సార్వజన సమ్మానం మరింకేదైనా సరే మనల్ని ఒంటరిగా వదిలేస్తాయి కాని ధర్మం అలా కాదు. మనిషి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నా మనిషితోపాటు వెళ్తుంది ధర్మం. అందువలననే అది మనిషికి నిజమైన తోడు-నీడ. నిజమైన మిత్రుడు, సంబంధి, గురువు కూడా!
ధర్మాన్ని సర్వకాలాల్లో అనుష్టించి ప్రతిష్ఠించడానికే సీతాదేవిని, లక్ష్మణుణ్ని శ్రీరామచంద్రుడు వదిలిపెట్టవలసి వచ్చింది ధర్మం పాటించడానికి. స్వ, పర భేదం లేదని అందరికి ఒకే ధర్మం వర్తిస్తుందని నిరూపించి ధర్మాన్ని ఆయన నిలబెట్టాడు.
లోకంలో ధర్మ ప్రతిష్ఠాపన చేయడానికి శ్రీరామచంద్రుడు మానవరూపం దాల్చాడు. అందుకే రామావతారం మహత్తరమైంది. ధర్మాచరణకు అవకాశం ఉండటం వలననే మానవజన్మ శ్రేష్ఠమైనదని చెబుతారు.
ధర్మం మూలతత్వాన్ని అవగాహన చేసుకుని జీవితానికి కావలసిన సుఖ, శాంతుల్ని తృప్తిని చేకూర్చకొనగలం. అందుకే మనిషికి నిరంతరం తోడుగా నిలిచే ఈ ధర్మాన్ని నిత్యమూ అనుసరిస్తూ సేవించాలి.
(Eenadu, 27:11:2007)
_____________________________
Labels: Religion
0 Comments:
Post a Comment
<< Home