పుస్తక సమీక్ష
విస్తృతమైన పరిశోధానానుభవంతో అనేక ప్రాంతాలు తిరిగి దేవదాసీ వ్యవస్థకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించేందుకు జరిగిన ప్రయత్నం ఈ పుస్తకం. ప్రతి మాటా, పేర్కొన్న ప్రతి సందర్భం ప్రత్యక్ష వీక్షణమే అన్న తృప్తిని పాఠకులకు మిగిల్చేందుకు రచయిత్రులు పడ్డ తపన అణువణువునా కన్పిస్తుంది. దేవదాసీల జీవనంలోని చికటికోణాల ఆవిష్కరణ మనసులను ద్రవింపజేస్తుంది. చరిత్రను, ముఖ్యంగా స్త్రీ సంబంధ అంశాలపై నిత్యం కృషి చేసేవారి ఊహకు కూడా అందని విషయాలను ఇందులో చేర్చారు. దేవదాసీల కోణంలో మహిళల లైంగికత్వం మీద ఉండే కంట్రోళ్లను ఛేదించుకుని బయటకు వచ్చేందుకు జరిగిన పోరాటాలను చెప్పారు. వేశ్యలుగా, కులసతులుగా విభజించి వారిని సమాజం ఎలా నిర్వచించిందో చెబుతూ సాహిత్యంలో ఆ అంశం ప్రతిఫలించిన పరిస్థితులను ఉదాహరణలతో వివరించారు. ఆనాటి సాంఘిక, ఆర్థిక, సామాజిక కోణాలను చారిత్రక, మానవశాస్త్ర దృక్పథంతో చెబుతూ, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకోసం సాంఘిక, నైతిక సంస్కరణలు తెచ్చేందుకు ముత్తులక్ష్మీరెడ్డి పడ్డ ఆరాటాన్ని పేర్కొన్నారు. సమగ్రచర్చకు దారులుతెరిచే పుస్తకమిది.
దేవదాసీ వ్యవస్థ
రచన: వకుళాభరణం లలిత, మల్కాపల్లి ప్రమీలారెడ్డి
పేజీలు: 423; వెల: రూ.150/-
ప్రతులకు: అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్,
రోడ్ నం.6, ఈస్ట్‌మారేడ్‌పల్లి, సికింద్రాబాద్.
అత్యంత సన్నిహితమైన ఉర్దూ భాషా సాహిత్యాలను తెలిపే పుస్తకాలు తెలుగులో తక్కువే. అడపాదడపా జరిగిన కృషి అందుబాటులో లేని తరుణంలో సదాశివ 'ఉర్దూ సాహిత్యం' వచ్చింది. ప్రణాళికాబద్ధం కాకపోయినా ఉర్దూ భాషా సాహిత్యాల ఆవిర్భావ వికాసాల వివరాలెన్నో ఉన్నాయి. అమీర్‌ఖుస్రూ నుంచి హైదరాబాదీల వరకు సంప్రదాయం నుంచి ఆధునికం దాకా నవలా కథానికా ఇతర ప్రక్రియల వివరాలతో సహా ఉర్దూ సాహిత్య ప్రపంచాన్ని స్థూలంగా ఆవిష్కరించిన సాహిత్యచరిత్ర గ్రంథమిది. మతాతీతంగా మహత్తు చూపిన నజీర్ కవిత్వాన్ని అనువదించినా మీర్జాగాలిబ్ గజళ్ల అందచందాలను వివరించినా వెుహమ్మద్ ఇక్బాల్‌ను విశ్లేషించినా అధికారంతోపాటు అనునయంతో సదాశివ రచన ఆప్తవాక్యంలా సాగింది. ఉటంకించిన కవిత్వానికి దాదాపు అన్ని చోట్లా తన అనువాదం కూడా యిచ్చి సదాశివ గొప్ప సేవ చేశారు. ముఖ్యంగా సాహిత్యకారులంతా చదవాల్సిన పుస్తకం.
ఉర్దూ సాహిత్యం;
రచన: డా.ఎస్.సదాశివ
పేజీలు: 207; వెల: రూ.100/-
ప్రతులకు: తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, సందేశ్‌భవన్
ఛత్తాబజార్, హైదరాబాద్-2.
_________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home