పున్నామ నరకం

తరాలు మారాయి. మనిషిలో స్వార్థం పురివిప్పుకొంది. మనం మనది- అనే విశాలభావన నుంచి మనిషి నేను నాది అనే సంకుచిత ధోరణిలోకి జారిపోయాడు. ఉమ్మడికుటుంబ వ్యవస్థ చీలిపోయింది. నూక్లియర్ కుటుంబం అని ముద్దుగా పిలుచుకునే ఒంటిపిల్లి రాకాసి కొంపలు వెలశాయి. ఒకప్పడు పరువు అనుకున్న వృద్ధులు క్రమంగా బరువు అయ్యారు. వృద్ధులను సేవించడంకన్నా వృద్ధాశ్రమాలను పోషించడం సులువైంది. వారిని వదిలించుకోవడమెలా అనే ఆలోచన మొదలైంది. ''మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్,'' వారిని భక్తితో సేవించు., అనే మంచి మాటలు సైతం చెవికి ఎక్కడం లేదు. తల్లిదండ్రులకు తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు పుత్ర శబ్దానికి అర్హుడు- 'ప్రీణాతి యః సుచరితైః పితరం స పుత్రో' వంటి హితోక్తులు, పితృభక్తి కలవాడే నిజమైన పుత్రుడు- 'తే పుత్రాయే పితుర్భక్తాః' వంటి సూక్తులు గాలిలో కలిసిపోయాయి. వృద్ధాశ్రమానికి విరాళం ఇమ్మంటే మా అమ్మానాన్నలను తీసుకెళ్ళండి అనడం మొదలెట్టారు. ఆఖరికి- వృద్ధులను జాగ్రత్తగా చూసుకోకపోతే మూణ్నెల్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ప్రభుత్వమే చట్టం చేయాల్సి వచ్చింది. భర్తను కోల్పోయిన స్త్రీలు తమ జీవిత శిశిరాల్లో సొంత ఇంట్లోనే పనిమనుషులుకావడం సామాజిక శాస్త్రవేత్తల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. శ్రమ దోపిడికి గురయ్యే స్త్రీలు, పెన్షన్ రాని పురుషులూ వారివారి జీవిత సంధ్యాసమయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు వింటుంటే- హృదయవిదారకంగా, తీతువుపిట్ట కూతల్లా తోస్తున్నాయి. 'దయ' అనే మాటను ఈ జాతి మరచిపోవడం తీవ్రంగా కలవరపెడుతోంది.
ఇటీవల వెలుగు చూసిన మరో అమానుషధోరణి ఏమంటే- దివ్యక్షేత్రాలను సందర్శించాలనీ, పుణ్యతీర్థాలు సేవించాలనీ ఆశపడే వృద్ధుల్లో చాలామందికి ఆ కోరికే ఉరితాడవుతోంది. గంగ ఒడ్డున మరణించడం స్వర్గప్రాప్తినిస్తుందన్న విశ్వాసంకొద్దీ మకర సంక్రాంతి రోజున గంగ బంగాళాఖాతంలో లీనమయ్యే గంగాసాగరక్షేత్రాన్ని దర్శిద్దామని వచ్చిన వృద్ధుల్లో కొందరి అనుభవాలు తల దిమ్మెరపోయేలా చేశాయి. వయసు పడమటికి వాలిన తల్లిదండ్రులను పోషించడం ఇష్టం లేని సంతానం- వారిని నిర్దాక్షిణ్యంగా అక్కడే వదిలేసి తమదారి తాము చూసుకున్నారు. ఇంకా విషాదమేమంటే ఆ ముసలివారు తాము 'దారి' తప్పిపోయామనుకుంటున్నారు. నిజంగా దారితప్పినవారూ, దయ తప్పినవారూ తమవారేనని, వీరికి తెలియనే తెలియదు. ఆకలితో అలమటిస్తూ అనాథల్లా వీధుల్లో తిరుగుతున్న ఆ పండుటాకులను బజరంగ్ పరిషత్ అనే సంస్థ చేరదీసి ఆదరించి బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి దూరప్రాంతాల్లోని వారి స్వగృహాలకు చేర్చింది. తీరా అక్కడికి వెళ్ళిన ఆ సభ్యులకు భయంకర అనుభవం ఎదురైంది. మానవత్వం లేకుండా ఎక్కడో దూరప్రాంతాల్లో విడిచిపెట్టేసి వచ్చిన తమ వృద్ధులు గంగాసాగరక్షేత్రంలో మరణించి ముక్తి పొందారని గ్రామస్థులను ఆ కుటుంబసభ్యులు మభ్యపెడుతున్నారు. నమ్మించడానికి తమ పెద్దలకు అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పరువు నిలుపుకోవడం కోసం బతికున్నవారికి దుష్కర్మకాండలు జరిపించేస్తున్న తమ సంతానాన్ని చూసి ఆ ముసలివారంతా ఏమైపోయి ఉంటారో ఊహించుకుంటే శరీరం జలదరిస్తోంది. తమ జీవిత చరమాంకంలో ఆ వృద్ధులకు జరిగిన అవమానానికి గుండె బరువెక్కుతోంది. ఒక్కసారి గుండెలపై చెయ్యేసుకుని చెప్పండి- మనం ఎటువెడుతున్నాం?ఓ మహాత్మా.. ఓ మహర్షీ... నీ దేశం ప్రస్తుత ముఖచిత్రం ఎంత వికృతంగా ఉందో చూశావు కదూ! యే సబ్‌కో సన్మతి దే భగవాన్ అని మరోసారి ప్రార్థించవూ...
(Eenadu, Editorial, 27:01:2008)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home