గుండెమంటలార్పే కన్నీళ్లు...

భావోద్వేగాలు స్త్రీలకే సొంతమా, పురుషులకు మాత్రం ఉండవా అంటే- లేకేం, శ్రీరామచంద్రుడంతటివాడు సరయూ నదిని చూసేసరికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ''ఈ తీరంలోనే మా అమ్మా నాన్న నా చేయి పట్టుకుని నడిపిస్తూ, నదీ సౌందర్యాన్ని పరిచయం చేశారు... మరి నేను వారి చేతులు పట్టుకుని నడిపిస్తూ వారికి ప్రాణసుఖం కలిగించేదెన్నాళ్ళకో!'' అని సీతతో చెప్పుకొని వాపోయింది- భావోద్వేగాలకు లోనుకావడంవల్లనే కదా అన్నాడొక రచయిత. అయినవాళ్ళు దూరమైనప్పుడు దుఃఖం కలగడం సర్వసహజం. దానికి స్త్రీ పురుష భేదంలేదు. నిజానికి ఉద్వేగం కారణంగా కన్నీరుపెట్టే జీవి ఈ సృష్టిలో మనిషి ఒక్కడే. అదే మనిషి ప్రత్యేకత. భార్యావియోగదుఃఖం నుంచి బయటపడే క్రమంలో 'వరలక్ష్మీ త్రిశతి' రచించారు విశ్వనాథ. కన్నతల్లి మరణం తీరని శోకాన్ని రగిల్చినప్పుడు 'నీవు మడిగట్టుకుని పోయినావు పండ్లు, పుష్పములు తీసికొని- దేవ పూజ కెటకొ! నేను నీ కొంగు పట్టుకు నీదువెంటపోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు''నని విలపించారు నాయని సుబ్బారావు. ''ప్రియురాలు మరణింప ప్రియుడు కట్టించె కన్నీటి తలపోతగా తాజమహల్'' అని వివరించారో కవి. కావ్య నిర్మాణానికి ఉపక్రమించబోయే కవులంతా ''ఏడిచి ఎన్నాళ్ళయినదీ ఎద! అశ్రులు కనుమోసులందు ఓడిచి ఎన్నినాళ్ళయినదోయి'' అంటూ బాధపడతారని కవితా నిర్మాణ వ్యూహాలను వెల్లడించారు కృష్ణశాస్త్రి. ''రేయి కడుపున చీకటి చాయవోలె... నా విషాదమ్ములో దాగినాడ నేనె'' అని తన స్వవిషయమూ వెల్లడించారు. మొత్తంమీద ఎవరికైనా కన్నీరు సహజమేనని, గుండె బరువును తగ్గించేందుకు అది చాలా అవసరమని జనం అంతా నమ్ముతూ వచ్చారు. అలా అని కన్నీరే శాశ్వతంకాదు. ''గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు... ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు'' అని ఓదార్పుచెప్పారు మనసు కవి. 'ఏడవకండి ఏడవకండి' అని వెన్నుతట్టి ధైర్యం చెప్పారు మహాకవి.
కన్నీరు అందరికీ సహజమే గాని, అబ్బాయిలకంటే అమ్మాయిలు ఐదురెట్లు ఎక్కువగా కన్నీరు కారుస్తారు. ఏడ్చే సమయం సాధారణంగా ఒకటి రెండు నిమిషాలు... అంటున్నారు శాస్త్రజ్ఞులు. ''కన్నీళ్ళను బలవంతంగా అడ్డుకోవడం వల్లనే అబ్బాయిల విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటోంది'' అంటున్నారు. ఆధునిక జీవనశైలిలో రెండు పదుల వయసులోనే కుటుంబాలకు దూరంగా ఉద్యోగ బాధ్యతలను నెత్తికెత్తుకున్న యువతరం తరచూ భావోద్వేగాలకు గురికాక తప్పదనీ, వాటిని సహచరులతో పంచుకోవడం మంచిదనీ సలహా ఇస్తున్నారు. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం- అబ్బాయిలు కూడా కన్నీటి అవసరం, ప్రయోజనం అర్థం చేసుకుంటున్నారు. ఈ తరం జీవనశైలిలో ఒదిగేందుకు సున్నితమైన లక్షణాలను అలవరచుకోవాలని వారు గుర్తిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కన్నీరు మంచి ఔషధమన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కష్టం వచ్చినప్పుడు ఓదార్పు కోసం భార్య ఒడిలో తలదాచుకుని, రెండు కన్నీటి చుక్కలు రాలిస్తే మగతనానికి వచ్చిన లోటేమీలేదని భావిస్తున్నారు. ప్రేమ విఫలంకావడం, అనుకున్న ఉద్యోగం రాకపోవడం వంటి విషయాల్లోనూ సాంత్వనకోసం అబ్బాయిలు కాసేపు ఏడవడానికే సిద్ధపడుతున్నారు. భావకవితా ఉద్యమం సమయంలో చాలామంది కవుల్లాగే- భావుకతను గౌరవిస్తున్న నేటి యువతరం సైతం సున్నితమైన భావాలను అలవరచుకోవడం, వాటికి స్పందించడం మంచిదే. ముద్దుముద్దుగానా లేక బావురుమని ఏడవడమా అనేది మాత్రం ఎవరికివారు తమకెదురైన పరిస్థితులను బట్టి తేల్చుకోవడం మేలు. మోతాదు ఎంతనేది కాదు, ఏడుపు బాపతు అవసరాన్ని గుర్తించడమే ముఖ్యం అంటున్నారు సామాజిక శాస్త్ర నిపుణులు.
(Eenadu, 03;02:2008)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home