నవజీవన సారం
అన్యోన్యత అనేమాట ఆలుమగల విషయంలో అన్వయించినంత సహజంగా ఇంకెక్కడా కాదు. దాంపత్య జీవనంలో అనురాగానికి అదే బలమైన పునాది. 'వెలిగించవే చిన్ని వలపుదీపం...' అంటూ సంసారంలో మాధుర్యపు వెలుగుకోసం నాయకుడు ఎదురుచూస్తాడు. ఈ ఎలుగు నీదేనురా... వూపిరి నిలిచేదాకా... ఈ జనమ కడదాకా... అంటూ నాయిక ముచ్చటగా బదులిస్తుంది. అలాంటి వారి దాంపత్యం పాలు, తేనె కలగలసినంత చులాగ్గా కలుస్తుంది. అటువంటి సంసారం నిజానికి గొప్ప వరం. చూసేవారికీ నయనానందకరం. అలాకాకుండా 'ఈరోజు పెళ్ళిరోజు కదా.. ఏం చేద్దాం.. అంటే రెండు నిమిషాలు మౌనంగా నిలబడదాం...' అన్నట్లుగా ఉంటే జీవఫలం చేదువిషం అవుతుంది. ఎంకి నాయుడుబావల అన్యోన్య దాంపత్యం 'మాంజిష్ఠారాగం' అన్నారు సినారె. పసుపు ఎరుపు రంగులు కలిస్తే మాంజిష్ఠ వర్ణం అంటారు. పసుపు మంగళకరమైన అనుభూతులకీ, ఎరుపు రంగు గాఢానురాగానికీ చిహ్నం. పైకి స్ఫుటంగా కనబడటం, స్థిరంగా నిలవడం వాటి లక్షణం. ఏడ నీ కాపురమే ఎలుతురు పిల్లా.. అని నాయుడు అడిగితే, నీ నీడలోనె మేడకడత నాయుడు బావా... అంటూ గడుసుపిల్ల ఎంకి సిద్ధపడుతుంది. దాంతో ఆ వెలుతురు పిట్టకు నాయుడు తన వెచ్చని గుండెలో చల్లని గూడు కల్పించాడు. కళ్లెత్తితేసాలు... కనకాభిసేకాలు ఎంకి వంటి పిల్ల లేదోయ్... లేదోయ్.. అని మురిసిపోయేవాడు. ఎంత గొప్ప అవగాహన ఉన్నా, భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడు పొరపొచ్చాలు తప్పవు. అలిగిన ఎంకి పుట్టింటికి వెళ్ళిపోయేది. పడుచు జంటల మధ్య ప్రణయకలహాలు వలపునకు ఎంతటి బలవర్ధకాలో మునిమాణిక్యంవారి కాంతమ్మను అడిగితే చెబుతుంది. ఏడుంటివే ఎంకి ఏడుంటివే.. అని నాయుడు వాపోయేవాడు. ఎన్నెలల సొగసంత ఏటిపాలేనా అని ఎంకి నిట్టూర్చేది. మళ్ళీ కలిసే సమయానికి '...రవల వెలుగుల గంగ'లా అనురాగధార పెల్లుబికి ఆ జంటను తన్మయుల్ని చేసేది. ఇలా జీవితాన్ని పండించుకున్నవారి జీవన అద్వైత సిద్ధి '...పగలురేయి ఎడబాటు ఎరుగరెవ్వరోయి?... శంకరుడు, సతి అచట... ఇంకెవ్వరిచట...!' అని ప్రశ్నించే స్థాయికి చేరుతుంది.
పార్వతి, శంకరుల దాంపత్యం- వాక్కు అర్థంలా ఒకదానికి ఒకటి అవిభాజ్యం. వారిద్దరూ పైకి రెండుగా కనపడతారుగాని నిజానికి ఒక్కరే అన్నాడు కాళిదాసు- కుమారసంభవంలో. సీతారాములూ అంతే, వారిద్దరూ ఒకరికోసం మరొకరు సృజితులైనట్లుంటుంి అన్నారు విశ్వనాథ. అశోకవనంలో సీత రాముడి ప్రతిరూపంలా ఉన్నదంటాడు హనుమ. ఆకృతి రామచంద్ర విరహాకృతి... కనుబొమతీరు స్వామి చాపాకృతి... అంటూ ప్రారంభించి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞామూర్తియై... అని వర్ణించారు విశ్వనాథ. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము... రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము... అన్నారు. సీత కనిపించకపోయేసరికి శ్రీరాముడు తల్లడిల్లిపోయాడు. ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డాడు. ''సీత మాయింటి మహాలక్ష్మి. నా కళ్లకు అమృతవర్తి... ఇయంగేహే లక్ష్మీ రియం అమృత వర్తిర్నయనయోః...'' అన్నాడు ఉత్తరరామచరిత్రలో. ఇప్పటికీ వివాహ శుభఘడియల్లో సీతారాములను, ఆదిదంపతులను ఆరాధించడం ఈ జాతికి ఆనవాయితీ. కల్యాణక్రతువులో- ధర్మేచ అర్థేచ కామేచ అంటూ ప్రతిజ్ఞలు చేయిస్తారు. పురుషార్థ సాధనలో ఒకరినొకరు అతిక్రమించమని, భారతీయ సంస్కృతిలో స్థిరపడిన ధార్మిక విలువలను కొనసాగిస్తామని దాని అర్థం. దాంపత్య జీవ విలువలను కాపాడతామని వాగ్దానం చేయిస్తారు. స్నేహంగా ఉంటామని చెప్పిస్తారు. భార్యాభర్తల అంతఃకరణాల్లో స్నేహసంసర్గం కారణంగా జనించే ఆనందానుభూతి పేరే సంతానం అన్నాడు భవభూతి. భార్యాభర్తలు స్నేహమాధుర్యాలను తమ జీవితాల్లో పండించుకోవాలి. ప్రేమానురాగాలను నింపుకోవాలి. ఒకరి కంటికి ఒకరు వెలుగుగా మనుగడ సాగించాలి. వెలుగునీడల్లో కలిసి నడవాలి. అదే దాంపత్యమంటే అని మన పెద్దలు చెప్పారు.
వయసులో ఉండగా ప్రేమానురాగాలు పటిష్ఠంగా ఉండటం సహజం. వయసుమీరాక, అనారోగ్యం ఆవరించాక మానవ సంబంధాల్లో మార్పులు వస్తాయి. దాంపత్య జీవితంలోనూ అంతేనా అనేది ప్రశ్న. అందుకే పెద్దయ్యేసరికి పరిపూర్ణత రావాలని పెద్దలు ఆశిస్తారు. ఒకరికొకరు అనేస్థితికి చేరుకోవాలని చెబుతారు. దాంపత్య జీవితంలో మధురాద్వైత స్థితిని సాధించాలని బోధిస్తారు. దాంపత్యం అనేది తమలపాకు లాంటిది. ఆదిలో అది లేతనౌజు. ఆ పిదప అది కవటాకు. తరవాత పండుటాకు. దాంపత్యమనగా, తాంబూలమనగా ఆద్యంతమూ రసవంతమే అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి. హార్వర్డ్ మెడికల్ స్కూలు పరిశోధకులు డాక్టర్ నికొలస్ క్రిస్టకిస్- ఇటీవల ఒక విశేషం వెల్లడించారు. భాగస్వామి అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పుడు రెండోవారికి ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన గమనించారు. ఒకోసారి అది మరణానికీ దారితీస్తోంది. భార్య ఆసుపత్రి పాలయితే భర్త మరణించే అవకాశం 22శాతం ఉంటోంది. భర్త ఆస్పత్రి పాలయినప్పుడు భార్య మరణించే అవకాశం 16 శాతమట. ఇది వ్యాధులనుబట్టి మారుతుందని, రుగ్మత తీవ్రమైనదైతే భాగస్వామిపై ప్రభావం ఇంకా ఎక్కువశాతం ఉంటుందంటున్నారు. ఇది వింటుంటే ఎంతలేదన్నా భార్యభర్తలమధ్య ఒకరిపై ఒకరికి మమతానురాగాలు ఉండితీరతాయనిపిస్తుంది. దాంపత్య జీవితంపై గౌరవం పెంచే సమాచారమిది. సుఖంలోనే కాదు కష్టంలో సైతం నేను నీతోడుగా ఉంటున్నానని చెప్పడంగా దీన్ని పరిగణించాలి. కష్టాలకు, అనారోగ్యాలకు లోనయి ..చెదరిన హృదయమె శిలయైపోగా... నీ వ్యధ తెలిసి నీడగ నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము... అని మహాకవి చెప్పిన మాట మళ్ళీ రుజువవుతోంది. దాంపత్యం అంటే 'తోడు' అనేదే సరైన అర్థమని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎంకినాయుడు బావల అన్యోన్య అనురాగబంధం, సీతారాములు, పార్వతీపరమేశ్వరుల అద్వైత బంధం మానవుల్లో కూడా నిరూపితమవుతోంది.
(Eenadu, 09:03:2008)
============================
Labels: Life/telugu
2 Comments:
i glanced through your blog. it is really excellent. i wonder how you could make it out in all these years. it is really a great effort. i wish i would read it completly one time.
bolloju baba
11:35 pm
బొల్లోజు బాబాగారు, నెనర్లు.
2:31 pm
Post a Comment
<< Home