డబ్బిస్తే చాలు...
ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ చక్రవర్తి- తన జైత్రయాత్రను మధ్యలోనే ముగించి, తిరుగు ప్రయాణమయ్యాడు. బాబిలోనియా వద్ద తీవ్రంగా జబ్బుపడ్డాడు. దేశదేశాలనుంచి ప్రముఖ వైద్యులను పిలిపించారు. ఫలితం లేకపోయింది. దేహయాత్రను చాలించే స్థితిలో, చుట్టూచేరి విలపిస్తున్న బంధుమిత్రులతో అలెగ్జాండర్ అన్నాడు- 'మీరంతా ఎందుకలా బాధపడుతున్నారు? నేను మామూలుగా పోతున్నానా? ప్రపంచ ప్రసిద్ధులైన ముఫ్పయిమంది వైద్యుల సహాయంతో మరణిస్తున్నాను!' అని. ధీరుడైనవాడు మరణాన్ని అలా తీసుకుంటాడు. 'నీ పూజకోసం పూచినపూవును నేను. తుంచడానికి ఎందుకింకా ఆలస్యం?'- అని దేవుణ్నే ప్రశ్నించాడు విశ్వకవి రవీంద్రుడు. కొందరి మరణం చూస్తే ముచ్చటేస్తుంది. 'మనమూ అలాగే పోతే ఎంత బాగుంటుంది!'- అనిపిస్తుంది. ప్రాణం విడిచిపెట్టేసినా, కొందరి మొహాలు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉంటాయి. శ్రీ పరమహంస యోగానందజీ 1952 మార్చి ఏడోతేదీన తమ దేహయాత్ర చాలించారు. తరవాత ఇరవై రోజులపాటు వారి పార్థివదేహం ఏ రకమైన శారీరక క్షయాలకూ గురికాలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చచ్చిపోవడానికీ, దేహాన్ని విడిచిపెట్టడానికీ చాలా తేడా ఉంది. ధన్యజీవులు దేహాలను సునాయాసంగా విడిచిపెట్టేస్తారు. మిగిలినవారి విషయంలో ప్రాణాలు పోవడమే ఉంటుంది. 'నేను చనిపోతున్నాను' అనేది ఆసురీభావన. 'శరీరాన్ని నేను విడిచిపోతున్నాను' అనేది అమృతభావన. జీవించిన విధానాన్నిబట్టి మనిషి మరణప్రక్రియ ఆధారపడుతుంది. చివరి క్షణంలో తండ్రి నోట 'నారాయణ' పదంలో సగమైనా పలికిద్దామని, కొడుకులు తాపత్రయపడి, జనపనారను తెచ్చి ఆయన కళ్ళముందు ఆడించారు. అతికష్టంమీద కళ్ళు తెరచి 'అది పీచు' అన్నాడు తండ్రి. అదే చివరి మాట అయింది!
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారికి విజయవాడలో సన్మానం జరిగేనాటికి ఆయన కడువృద్ధులు. శిష్యులంతా ఆయనను చేతుల మీద ఎత్తుకుని ఇంట్లోంచి బయటికి తీసుకొస్తుండగా చూసి వీధిలో వారంతా 'అయ్యోపాపం' 'ఎప్పుడు' అంటూ కంగారుగా వచ్చి చేరారు. చెళ్ళపిళ్ళవారు నవ్వుతూ 'ఫర్వాలేదురా అబ్బాయ్! నేను చనిపోతే నలుగురూ వస్తారని తేలిపోయింది. ధైర్యం వచ్చింది'' అన్నారు. మనిషి పోయాడని తెలిసేసరికి- వెళ్ళిచూడాలని బంధుమిత్రులందరికీ అనిపించిందంటే- ఆ మనిషి గొప్పగా బతికాడని అర్థం. 'పీడ విరగడ అయింది' అని అనిపిస్తే ఆ మనిషి బతుకు వ్యర్థం. అందుకే నలుగురినీ మంచి చేసుకోవాలని చెబుతారు. పాడెను మోయడానికి కనీసం నలుగురు అవసరమని అందులో సూచన. జీవిత నాటకరంగం మీదకు ప్రవేశం ఎంత ముఖ్యమైనదో, నిష్క్రమణం అంత ముఖ్యమైనది. వీధిగడపపై ఉంచే చమురుదీపాన్ని 'దేహళీదత్తదీపం' అనేవారు. అది నట్టింట్లోకే కాదు, వీధిలో నడిచే బాటసారులకు కూడా వెలుగుచూపించేది. జీవితాన్ని అలా దేహళీ దత్తదీపంగా మలచుకున్న మనిషి చనిపోతే, ఊళ్ళకి ఊళ్ళే శ్మశానానికి కదలివచ్చేవి. మళ్ళీ కళ్ళు తెరుస్తాడేమో అనే ఆశతో పాడెను ఒకసారి నేలమీదకు దింపి చూసేవారు. ఎవరికివారే తమ సొంతమనిషి పోయినట్లు ఎగసి వచ్చే దుఃఖంతో విలవిలలాడితే అది నిజానికి చావుకాదు, స్వర్గప్రాప్తి! కడసారి చూపుకోసం ప్రజలు తహతహలాడారంటే ఆ మనిషిది అమోఘమైన మరణం. ధన్యమైన జీవితం. ఒక గాంధీ పోతే ఈ జాతి అంతా అలా విలపించింది. ఒక నెహ్రూ చనిపోతే అలా ఎడబాటుకు గురయింది. తనకోసం ఏడ్చేవాళ్ళు నలుగురుంటేనే- బతుకైనా, చావైనా! మనిషి అంతిమయాత్రనుబట్టి నిర్ణయించవచ్చు- ఎలా జీవించాడనేది!
కడసారిచూపు అనేది ఆత్మీయతకు సంబంధించిన చేత. అంత్యేష్టి అనేది వైదిక సంస్కారాలకు సంబంధించిన మాట. దూరంగా ఉన్న బంధుమిత్రులంతా వచ్చేవరకు ఆగి, వారికి చివరిచూపు దక్కనిచ్చి, ఆ తరవాతే అంత్యక్రియలు నిర్వహించడం- చనిపోయిన మనిషికి లభించే కనీస గౌరవం! అంత్యక్రియలకు హాజరుకావడం వెనుక మానవీయమైన కొన్ని మహత్తర విలువలున్నాయి. గుండెతడికి సంబంధించిన కొన్ని తీయని గుర్తులున్నాయి. ఆత్మశాంతికి సంబంధించిన ఆనవాళ్ళున్నాయి. 'కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం, రెప్పపాటుసేపు మనిషి జీవితం' అని కవి అన్నట్లు జీవితపు క్షణికతను గుర్తుచేసే గొప్ప పాఠాలున్నాయి. అవన్నీ త్వరలో ప్రశ్నార్థకాలు కాబోతున్నాయి. బ్రిటన్‌లోని సౌతాంప్టన్ శ్మశానవాటిక ఆన్‌లైన్ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారానికి ముందుకు వచ్చింది. ప్రత్యేక వాహనాలు వచ్చాక రుణం తీర్చుకోవడాలు, భుజం మార్చుకోవడాలు తగ్గిపోయాయి. కొంత డబ్బు చెల్లిస్తే- ఎవళ్ళో వచ్చి మోసుకుపోతున్నారు. ఇప్పుడు సౌతాంప్టన్ శ్మశానంవారు మరో సరికొత్త సదుపాయం ప్రకటించారు. నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు- రుద్రభూమికి వెళ్ళేపని కూడా లేదు. దహనవాటికపై జరిగే తంతులుగాని, ఖననదృశ్యాలుగాని నేరుగా ఇంటర్‌నెట్‌లో చూపించేస్తారు. ఇంట్లోనే కూర్చుని వాటిని తిలకించవచ్చు. ఒకవేళ దానికీ ఆపూట తీరిక లేకుంటే- డీవీడీల్లో సైతం భద్రపరచి ఇస్తారు. ఒక్కో డీవీడీకి మన కరెన్సీలో నాలుగువేల రూపాయల దాకా ఖర్చవుతుంది. తల్లి మరణానికి తల్లడిల్లిపోయి... 'నీ కొంగు పట్టుక నీదువెంట పోవుటకులేక కన్నీటిబొట్లు రాల్తు..'నని విలపించిన నాయనికి సహానుభూతిగా కంటతడిపెట్టిన సహృదయులు- గుండెతడిని ఆవిరిచేస్తున్న ఈ పరిణామాలకు ఏమైపోతారో తలచుకుంటేనే భయం వేస్తోంది. ఈ సరికొత్త సదుపాయం మనిషి సమాధికా, మానవత్వం సమాధికా?
(ఈనాడు,సంపాదకీయం, 06:04;2008)
___________________________________
Labels: Life/telugu
1 Comments:
వైరాగ్యంలో ముంచేసింది మీ కలెక్షన్ .
బొల్లోజు బాబా
9:28 pm
Post a Comment
<< Home