శృంగార రసాస్వాదన
ఇటీవల ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రంలో ఒక స్త్రీ పాత్ర చీటికీ మాటికీ తనను సమర్పించేసుకుంటాను అని సరదాపడుతూ ఉంటుంది. నిజానికి అది చాలా పెద్దమాట. శారీరకంగాను, మానసికంగాను స్త్రీని ఉత్తేజపరచి, తన వ్యక్తిత్వంతో రంజింపజేయగల మగవాడికే- స్త్రీ తనను పూర్తిగా సమర్పించుకుంటుంది. కేవలం పురుషుడి లైంగిక పాటవానికి ప్రశంసగా దాన్ని అర్థం చేసుకుంటే మనం స్త్రీత్వాన్ని చులకన చేసినవారం అవుతాం. స్త్రీ ఆశించే సంపూర్ణ శృంగారపురుష లక్షణాలను వివరిస్తూ 'సరసుడవంచు, సూనశరశాస్త్రపటిష్ఠుడవంచు, పండితాభరణుడవంచు, సన్మధురవాక్చతురత్వయుతుండవంచు, భాసుర నవయౌవనస్ఫురిత సుందరగాత్రుడవంచు ఎఱింగి- కామ రణముకోరివచ్చినది మానిని, నీవెటుల ఆదరింతువో' అని ఒక అవధాని ప్రశ్నించారు. సూనశరశాస్త్రపటిష్ఠత అంటే- కామశాస్త్ర పాండిత్యం! మదనశాస్త్ర పరిజ్ఞానం సాధించిన జంటదే అసలైన ఆనందం. వారిదే నిజమైన శృంగారం. వారి సంభోగం- సమభోగం! ఈ రోజుల్లోవి చాలామటుకు చట్టబద్ధమైన మానభంగాలే తప్ప- ఆనంద శృంగార సమభోగాలు కావు. ముద్దరాలిని సైతం క్షణాల్లో ఉత్తేజితురాల్ని చేసి, పరవశంలో ముంచెత్తగల పురుషుడి చేతిలో స్త్రీ- విద్వాంసుడి చేతిలో శ్రుతి చేసిన వీణ అవుతుంది. స్తబ్ధత ఆవరించి సివంగిలాంటి స్త్రీ సైతం జడత్వంలోకి జారుకుంటే- అదీ పురుషుడి నిర్వాకమే. అలాగే ప్రపంచాన్ని అవలీలగా శాసించే పురుషుణ్ని పడకగదిలో పసిబాలుణ్ని చేసి ఆడించడం కామశాస్త్రజ్ఞురాలి చాతుర్యం. వరూధినిలో 'కామశాస్త్ర ఉపాధ్యాయిని' లక్షణాలు గ్రహించి ప్రవరుడు ముందే జాగ్రత్తపడ్డాడు. అలాంటి కిటుకులు తమకు తెలిసినా- వాటిని 'వెలయాలి చేష్టలు'గా భావించే స్త్రీలు ఈ రోజుల్లోనూ ఉన్నారు. ప్రపంచానికి కామశాస్త్రాన్ని బోధించిన దేశంలో- శృంగార దాంపత్య సమభోగం ఇప్పటికీ సరైన పాళ్లలో లేకపోవడానికి, రకరకాల మనోవికారాలు ప్రబలడానికి ఇవన్నీ కారణాలు. మనదేశంలో లైంగిక విద్యాబోధనకు ఇదే పునాది.
ఆ మాట వినగానే మొదట్లో సంప్రదాయం ఉలిక్కిపడింది. నొసలు చిట్లించింది. 'కారు నడపడాన్ని కరస్పాండెన్స్ కోర్సులో నేర్పేదెలా?' అని ప్రశ్నించింది. ఇప్పటికీ చాలామందికి సందేహం- పిల్లలకు ప్రాక్టికల్స్ నేర్పుతారేమోనని! లైంగికవిద్యపట్ల పెద్దలకు అవగాహన లేకపోవడంవల్లనే ఈ అపోహ. ఈ రోజుల్లో సినిమాలు, ఛానెళ్లు, ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. పూర్వకాలంలో బిచ్చమెత్తుకుంటూ చదువుకున్న బ్రహ్మచారి కథ భారతంలో చెప్పారు. మూడుసార్లు అడిగి పెట్టకపోతే తిరిగి వెళ్ళిపోవడం అతని అలవాటు. అది తెలిసిన ఆ ఇంటి ఇల్లాలు స్నానం మధ్యలో ఆపి, తడిబట్ట చుట్టుకుని వచ్చి, భిక్ష ఇవ్వబోయింది. ఆ తొందరలో ఆమె వక్షోజాలు బ్రహ్మచారి కంటపడ్డాయి. 'ఏమిటవి' అని ఆశ్చర్యంగా అడిగాడు. వివేకవంతురాలైన ఆ గొప్ప ఇల్లాలు పరమ నిర్మలమైన అతని చూపులను సరిగా అర్థం చేసుకుంది. 'నాకు పుట్టబోయే బిడ్డకోసం భగవంతుడు పాలు దాచిపెట్టిన పసిడి గిన్నెలివి' అంది. ఈ రోజుల్లో ఆ స్థాయి అమాయకత్వాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది. అలాంటప్పుడు పాఠశాలల్లో లైంగిక విద్యాబోధన ఇంకా ఎందుకంటే- పాలిండ్లు దేనికో చెప్పడానికే! మనిషి లైంగిక అవయవాల నిర్మాణం ఎలాంటిదో, వయసును బట్టి వాటిలో వచ్చే మార్పులేమిటో, వాటిని దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో బోధించడమే లైంగిక విద్య లక్ష్యం. అపోహలను తొలగించడం ముఖ్యమైన అవసరం. మూతికాలిన పిల్లి మజ్జిగను కూడా వూదుకుంటూనే తాగిందని సామెత. తొలినాళ్ళ అయోమయాలు, గందరగోళాలు శృంగారజీవితంపై శాశ్వతంగా ప్రభావం చూపించగలవని రుజువైంది. శరీర నిర్మాణంపై కనీస అవగాహన కొరవడితే ఆరోగ్యకర జీవనానికి భరోసా ఏదీ?
కామశాస్త్రం దేనికని అడిగితే- 'భూమి సారం, విత్తనం సత్తా, పనిముట్లు నేర్పుగా వాడుకోవడం బాగా తెలిసి చేసే వ్యవసాయానికీ, గుడ్డెద్దు చేలో పడిన బాపతు సేద్యానికీ తేడా లేదా?' అని ప్రశ్నించారు వాత్సాయన మహర్షి. లైంగికవిద్యల విషయంలోనూ సరిగ్గా అలాగే భావిస్తున్నారు పాశ్చాత్యులు. 'మెక్సికోలో పన్నెండేళ్ళ వయసులోనే బోధిస్తున్నారు, మీరేమిటి? పదిహేనేళ్ళు వచ్చేదాకా లైంగికవిద్యను పరిచయమే చెయ్యడం లేదు' అని వారు వాపోతున్నారు. 'ప్రపంచ శృంగార జీవిత ముఖచిత్రం 2008- లైంగిక పటిమకు మార్గం' అనే అంశంపై ఒక్కోదేశంలో వెయ్యిమంది చొప్పున ఇరవై ఆరు దేశాల్లో భారీ సర్వే నిర్వహించిన ఒక బృందం- లైంగిక విద్యాబోధన ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేసింది. లైంగిక వ్యాధులపట్ల మన అవగాహనను అభినందించిన ఆ బృందం- గర్భనిరోధపు కిటుకులను మనం సరిగా నేర్చుకోవడం లేదని నిరాశపడింది. పాల్గొనే ఇద్దరినీ గెలిపించి, విజయ ఆనందశిఖరాలకు చేర్చే ఏకైక క్రీడ శృంగారమనీ, దానికి మించిన సుఖానుభూతి లేదనీ ఎందరో అంగీకరిస్తారు. పెద్దలు దానిపై ఒక మాట చెప్పారు. దాంపత్యజీవితంలో లైంగిక సుఖానుభూతి, పూర్తి సంతృప్తి- యౌవనానికి శోభ చేకూర్చడమే కాదు; ఉద్రేకాలు చల్లారి, అనురాగాలుగా మారి- వృద్ధాప్యం సైతం శృంగార పరిమళభరితం అవుతుందన్నారు. లోపాముద్ర అడవిలో నడచి నడచి అలసిపోతే- ఆమె నుదుట 'చెమటమొగ్గలు' పూశాయన్నాడు తెనాలి రామకృష్ణుడు. అగస్త్య మహర్షి అది గమనించి, ఆమెను చెట్టునీడకు చేర్చి, తన వేలిగోటితో వాటిని సుతారంగా చిదిమి విచ్చుకునేలా చేశాడట. భర్త చూపించిన ఆ ఆప్యాయతకు ఆ తల్లి మనసులో పేరుకునే పరమ సుకుమార భావం ఏ తరహాదో తెలిస్తే- 'వృద్ధాప్యంలో శృంగారం' అనే మాటకు అర్థం బోధపడుతుంది. సామాను మొయ్యలేక ఆయాసంతో రొప్పుతున్న భార్యను- బస్సు దాటిపోతోందంటూ బూతులు తిట్టే మనకు కామసూత్రాలే కాదు, మహర్షుల జీవనవిధానాలూ- ఎన్నో ధార్మిక శృంగార పాఠాలు నేర్పుతాయి, గ్రహించాలేగాని!
(ఈనాడు, సంపాదకీయం, 20:07:2008)
___________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home