'ప్రాయ'స్నేహితులు!

దీన్ని గ్రహించడంలో ముఖ్యంగా తల్లిదండ్రులు విఫలమవుతారు. 'ఢిల్లీకి రాజు అయినా, తల్లికి బిడ్డడే' అని సామెత. రామాయణం అంతా మథించినా, సూర్యమండలందాకా ఎగిరి రెక్కలు కాలి, వింధ్యపర్వతంపై కూలిపోయిన సంపాతి గుర్తుంటాడేగాని, పర్వతాన్ని పెళ్ళగించుకుని వచ్చిన హనుమంతుడి సామర్థ్యం తమ పిల్లల్లో ఉంటుందని వారు నమ్మలేరు. పిల్లలు స్వేచ్ఛగా రెక్కలు విప్పార్చి, నింగిలోకి దూసుకుపోతామంటే వారు అడ్డుకుంటారు. ప్రాయం చాలా ప్రమాదకరమైనదని వారి భయం. పాఠశాల నుంచి కళాశాలకు మారే వయసును సావాసాలు ప్రభావితం చేస్తాయి. శైశవానికి యౌవనానికి మధ్య వయసును వ్యసనాలు బలంగా ఆకర్షిస్తాయి. కాశీఖండంలో గుణనిధిని వయస్సే చెడగొట్టింది. 'అవినయ నిధానమగు నీ నవయౌవన, శైశవముల నడిమి వయసునన్ గవిసెడు వ్యసన ఉద్రేకంబు అవగాఢము(లోతైనది) దీని మానవయ్య తనూజ!' అని తల్లి మొత్తుకుంది. దీన్ని గ్రహించిన మన పెద్దలు చక్కని పరిష్కారం చెప్పారు. 'పిల్లవాడికి అయిదేళ్లు వచ్చేదాకా చక్రవర్తిలా లాలించండి. ఆపై పదేళ్లు క్రమశిక్షణతో పనిపాటలు నేర్పండి. పదహారు వస్తే ఇక వాడు పిల్లవాడు కాడు... మీ స్నేహితుడు. స్నేహంగా దగ్గరకు తీసుకుని, చక్కని సలహాలిస్తూ మంచిదారిలో నడిపించండి' అని హితవు పలికారు. తల్లిదండ్రులు మిత్రులైనప్పుడు పిల్లల పడుచుదనం ప్రతిభకు కొలువు అవుతుంది. సృజనకు నెలవు అవుతుంది. జాతికి పరువు అవుతుంది.
'పద్దెనిమిది, పాతిక మధ్య వయసు పెద్దరికానికి బాటలు వేస్తుంది. ఈ సమయంలో ఎన్నో స్వాభావిక గుణాలు, మైలురాళ్లు, పరిమితులు వాటంతట అవే అలవడతాయి. ఆశ్చర్యపరచే విజయాలు, ఆకస్మిక పరాజయాలు మనిషికి పరిణతిని సాధించిపెడతాయి' అంటున్నారు అమెరికాకు చెందిన వయోజనుల అభివృద్ధి ప్రాజెక్టు నాయకుడు రే సింప్సన్. ఇటీవల ఆయన నేతృత్వంలో జరిగిన అధ్యయనం ప్రకారం పాతికేళ్లు వస్తేనేగాని పరిపక్వత, సంపూర్ణ అవగాహన కలగడంలేదు. మన సమాజం పద్దెనిమిదేళ్లకు వయోజనుడిగా గుర్తించి ఓటుహక్కును కల్పిస్తోంది. స్త్రీలకైతే, అది పెళ్ళికి తగిన వయసు అంటోంది. పెద్దరికం మాత్రం ఇరవైఏళ్ళ తరవాతే అంటున్నారు డాక్టర్ సింప్సన్. 'ముసలివాళ్ళు ప్రతిదాన్నీ నమ్ముతారు. నడివయస్కులు ప్రతిదాన్నీ అనుమానిస్తారు. యువకులు ప్రతిదాన్నీ తెలుసుకుంటారు' అన్నాడు ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్. అలా తెలుసుకోవడానికి ఆలోచన అవసరం. ఆలోచనాశక్తిని పెంపొందించడం, పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం పెద్దల బాధ్యత. అరికట్టడం కాదు, వారి ఆలోచనలను సరిదిద్దడం మన విధి. 'చెట్లు బతుకుతున్నాయి, జంతువులు పక్షులు బతుకుతున్నాయి. కాని అద్భుతమైన ఆలోచనాశక్తితో నిండుగా జీవించే మనిషిదే- అసలైన బతుకు' అంది యోగవాసిష్ఠం. అలాంటి ఆలోచనాపరుడు గెలీలియో తన పద్దెనిమిదో ఏట పెండ్యులం సిద్ధాంతం ప్రకటించాడు. అలెగ్జాండర్ ఇరవయ్యో ఏట అధికారం చేపట్టాడు. వాషింగ్టన్ తన ఇరవైమూడోఏట దేశానికి రాయబారి అయ్యాడు. మన పిల్లలూ ఆ వయసులోనే విజేతలు కాగలరు- మనం సహకరిస్తే!
(ఈనాడు, సంపాదకీయం, 10:08:2008)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home