My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, September 02, 2008

హనుమంతుడి విశ్వరూపం


భారతీయులకు హనుమంతుణ్ని వివరంగా పరిచయం చేసిన కావ్యం- వాల్మీకి రామాయణం! ఒక భీష్ముడు, ఒక దశరథుడు, ఒక విశ్వామిత్రుడు తెలిసినంత బాగా మనకు- మన సొంత తాత ముత్తాతల గురించి తెలియదు. అందుకు కారణం- వ్యాసవాల్మీకులు. వారి పాత్ర చిత్రణా చాతుర్యం కారణంగా- ఆయా పాత్రలతో మనకు గట్టి పరిచయం, చనువు ఏర్పడ్డాయి. పరిచయం పెరిగిన ఫలితంగా క్రమంగా వారంతా పురాణ పురుషులే తప్ప, కల్పిత పాత్రలు కారనే ఒకానొక ప్రగాఢ విశ్వాసం బలంగా వేళ్లూనింది. విశ్వాసం బలపడిన కొద్దీ, మూలానికి అతీతంగా కూడా ఆయా పాత్రల గురించి ఊహించడం మొదలైంది. క్రమేపీ వాళ్లలో కొందరు దైవాలుగా దర్శనం ఇచ్చారు. హనుమంతుడు దేవుడైంది ఆ విధంగానే. భక్తుడి విశ్వాసానికి ప్రతిరూపమే- భగవంతుడు! భక్తుడి భావనలు ఎన్ని విధాలో, భగవంతుడికి అన్ని రూపాలు. భక్తుడి విశ్వాసం ఎంత బలమైనదో, భగవంతుడు అంత బలమైనవాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో హనుమంతుడు భక్తుడే తప్ప, భగవంతుడు కాడు. శ్రీరామచంద్రుణ్ని సైతం భగవంతునిగా వాల్మీకి పేర్కొనలేదు. 'పురుషోత్తముడు' అన్నాడంతే! 'అంజనానందనం వీరం- జానకీ శోకనాశనం' అన్నంత వరకే వాల్మీకి చిత్రణ. దాన్ని అందిపుచ్చుకున్న అన్నమయ్య 'బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి సేతల హనుమంత!' అన్నాడు. భక్తి, వినయం, వివేకం, బలం, ధైర్యం, వాక్పటిమ, సమయజ్ఞత వంటి ఉన్నతోన్నత గుణాల మేలు కలయికగా వాల్మీకి హనుమను పరిచయం చేశాడు. ఆ చిత్రణ భక్తుల గుండెల్లో ఎంతటి బలమైన ముద్రవేసిందంటే- యత్రయత్ర రఘునాథకీర్తనం, తత్రతత్ర కృత మస్తకాంజలి... ఎక్కడెక్కడ శ్రీరామనామం వినవస్తున్నా- అక్కడక్కడల్లా వినయంగా తలవంచి, చేతులు మోడ్చి, ఆనంద బాష్పాలు చిందించే హనుమంతుడు సాక్షాత్కరించడం మొదలైంది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన పిల్లవాణ్ని 'ఆంజనేయ దండకం చదువుకుని పడుకో నాన్నా... భయం లేదు' అంటూ వీపుమీద జోకొట్టిన అమ్మ చేతిస్పర్శలా, ఓదార్పు వచనంలా- హనుమ అనే భావన ధైర్యం చెబుతూ వచ్చింది. చెలిమి చేసిన వానర సహచరులకీ, చేరదీసిన ప్రభువు సుగ్రీవుడికీ, ఆరాధ్యదైవమైన శ్రీరాముడికీ సైతం సహాయపడిన 'అభయ' ఆంజనేయుడు తమ పాలిట సర్వభద్రంకరుడన్న గట్టి విశ్వాసం భక్తుల్లో వ్యాప్తిచెందింది.

ఉదాత్తమైన వ్యక్తిత్వంతో విశేషంగా ఆకర్షించి, భక్తుల హృదయాల్లో దేవునిలా ఎదిగిపోయిన హనుమకు ఎంతో ప్రాచుర్యం లభించింది. లక్ష్మణుడికీ, భరతుడికీ ఎక్కడా విడిగా గుడులు లేవు. హనుమ శ్రీరాముడికన్నా అధిక సంఖ్యలో తన పేరిట మందిరాలు వెలసిన చరిత్రను సొంతం చేసుకున్నాడు. దివ్య దేవాలయ ప్రాంగణం వంటి రామాయణంలో సుందరకాండను గర్భగుడిగా స్థిరపరచి, దాన్ని నిత్య పారాయణకాండగా మలిచాడు. వానరుడై జన్మించి, భక్తునిగా పరిచయమై, దైవంగా ఎదిగినవాడు హనుమంతుడు. సముద్రాన్ని లంఘించే ఘట్టంలో ఆయన నందీశ్వరుడిలా ఉన్నాడని (గవాంపతి రివాబభౌ), చారణాచరితేపథి... చారణా మార్గంలో పయనిస్తున్నాడని వాల్మీకి చేసిన వర్ణనల్లో రహస్య సంకేతాలను ఆకళించుకున్న భక్తుల గుండెల్లో ఆయన త్రివిక్రముడిలా ఎదిగాడు. భక్తుల సంగతి అలా ఉంచి, ఇటీవల ఆయన పిల్లలకు బాగా చేరువ అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో మొట్టమొదటి పూర్తి నిడివి యానిమేషన్‌ చిత్రంగా రూపొందిన 'హనుమాన్‌' చిత్ర విజయం పెను సంచలనం సృష్టించింది. యానిమేషన్‌ ప్రక్రియకు జవసత్వాలు అందించింది. పిల్లలను విశేషంగా ఆకర్షించగల పురాణశ్రేష్ఠుడిగా హనుమ గొప్ప గుర్తింపు పొందాడు. పెద్ద హీరో అయ్యాడు. యానిమేషన్‌ రంగ ప్రముఖుడు శంభూఫాల్కే మాటల్లో- హనుమ 'ట్రెండ్‌ సెట్టర్‌' అయ్యాడు. ఎందరో ప్రముఖులు ఆ చిత్ర హక్కులకు పోటీపడ్డారు. ముందుగా తాను లంకలోకి పోయి, అమ్మవారిని దర్శించి వచ్చి ఆ పిదప తనవారందరినీ లంకకు తీసుకువెళ్ళినట్లే- ఇప్పుడు విదేశాల్లోకి అడుగుపెట్టిన హనుమ తనతోటి పురాణ పాత్రలకు సైతం విదేశీ ప్రయాణానుభూతి కలిగించబోతున్నాడు. రావణ, అర్జున, గణేశ, భీమ, లవకుశులు వంటివారు ప్రయాణికుల జాబితాలో ఉన్నారు.

రాముడికి బదులుగా ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు రాజ్యపాలనా బాధ్యతలను వహించిన విషయం మనం రామాయణంలో చదివాం. కేంద్ర సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన లక్నోలోని సర్దార్‌ భగత్‌సింగ్‌ కళాశాల సరిగ్గా ఆ విధానాన్నే అమలుచేస్తోంది. ఆ కళాశాల పాలకమండలి తమ ఛైర్మన్‌గా ఆంజనేయ'స్వామి'ని ఎన్నుకుని తీర్మానం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ స్వామిపేరు మీద జరుగుతాయి. పాలకమండలి సమావేశాల్లో స్వామికి ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేశారు. స్వామి ప్రతినిధిగా ఉప ప్రధాన అధికారి వివేక్‌ కాంగ్రి అధికారిక నిత్యవిధులు నిర్వహిస్తారు. రామలక్ష్మణులకు లక్ష్యసాధనలో దారి చూపించిన ఆంజనేయుడు తమ సంస్థ విజయాలకు తప్పక దారి చూపిస్తాడని వారు గట్టిగా నమ్ముతున్నారు. వారి నమ్మకం సరే, అమెరికా అధ్యక్ష పదవికి తన దారి సుగమం కావడానికి కూడా సాక్షాత్తు ఆంజనేయుడే కారణం కాగలడని డెమొక్రాట్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా బలంగా విశ్వసిస్తున్నారు. హనుమంతుడి బొమ్మతోగల బ్రాస్లెట్‌ను ఆయన నిత్యం చేతికి ధరిస్తున్నారు. 'నమ్మినవాడు చెడిపోడు' అని సామెత. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే- హనుమ అనుగ్రహంతో ఒబామా గట్టెక్కేలాగే ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుణ్ని మోసంచేసే ప్రజలున్నారు గాని, ప్రజల్ని మోసంచేసే దేవుడు లేడన్న భక్తుల విశ్వాసం మరోసారి రుజువయ్యేలా ఉంది. దేవుడు దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడన్న ప్రశ్నకు వేదం గొప్ప జవాబు చెప్పింది. స భగవః కస్మిన్‌ ప్రతిష్ఠితః- ఇతి స్వే మహిమ్ని!- ఆయన తన మహిమలోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అంది. విశ్వాసం గలవారికి ఆ మహిమ నిజం; లేనివారికి కట్టుకథ!
(ఈనాదు, సంపాదకీయం, 22:06:2008)
_____________________________

Labels: , ,

0 Comments:

Post a Comment

<< Home