గడ్డుసవాళ్లు

పెద్దయ్యాకా రాక్షసుడయ్యే మనిషి సైతం బాల్యంలో మాత్రం దేవుడే! 'బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి... సతిని ముట్టని నాటి సాంబమూర్తి... ఉయ్యాల దిగని భాగ్యోన్నతుండు... తన ఇంటి క్రొత్త పెత్తనపు దారు' అని వర్ణించారు మహాకవి జాషువా. 'ఎవరు ఎరుంగరు ఇతనిది ఏ దేశమోగాని... మొన్న మొన్ననె ఇలకు మొలచినాడు... ఏమి పనిమీద భూమికి ఏగినాడొ! నుడువ నేర్చిన పిమ్మట అడుగ వలయు...' అనుకొని మాటలు నేర్చేదాకా వేచి చూడాలన్నారు. మనిషి జీవితంలో కొన్నేళ్లపాటు అమూల్య ఆనందాన్ని అందించే అమృతశక్తి బాల్యం- అన్నారు దాశరథి. ఆనందకరమైన బాల్యపు రోజుల్లో 'చినుకులను దిస్సమొలతో చని చేతులు చాచుకొంచు జగ్గుల నవ్వుల్ తనరగ, శాంతాదేవీ వనితామణి కొడుకు వాన వల్లప్పాడెన్' అన్నారు విశ్వనాథ.ఏం ఆడటానికైనా అసలు బాల్యం ఏదీ? సినిమా బురదలో, సెల్‌ఫోన్ వరదలో, టీవీ తుపానులో, ఇంటర్నెట్ ఉప్పెనలో బాల్యం మునిగిపోయి డ్రైనేజీలో కలసిపోయింది. అమాయకత్వం ఆవిరైపోయింది. బతుకులో సొగసు చివికిపోయింది. తొక్కుపలుకులు వినమరుగయ్యాయి. ముద్దుపలుకులు మోటతనాన్ని నింపుకొన్నాయి. బాల్యం- బాల్యంలోనే ముదిరిపోయింది.
ఇప్పుడు ఆ వినోద సాధనాలు, లైంగిక విజ్ఞాన సాధనాలుగా మారిపోయాయన్నది చాలామంది ఫిర్యాదు. అయినా ఇప్పటికీ అరవై ఎనిమిది శాతం పిల్లలకు లైంగిక సమాచారానికై తల్లిదండ్రులపై ఆధారపడటమే ఇష్టం- అంటున్నారు కెనెడియన్ అసోసియేషన్ ఫర్ ఎడాలిసెంట్ హెల్త్‌వారు. ఆ రకమైన సమాచారం చెప్పడం గాని, వివరించడం గాని తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా తయారైంది. 'బస్సుల్లో వెళుతున్నప్పుడో లేక ఏ కిరాణా షాపులో సరకులు కొంటున్నప్పుడో వీడి నోటినుంచి దూసుకొచ్చే ప్రశ్నలు నాకు వణుకు పుట్టిస్తున్నాయి' అని నాలుగేళ్ల బిడ్డల తల్లులూ వాపోతున్నారు. ఇబ్బందికరమైన దృశ్యాలు వస్తున్నప్పుడు ఛానెళ్లు మార్చేయడం, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినప్పుడు మాట మార్చేయడంవల్ల పిల్లలు అసంతృప్తికి లోనవుతారని, వారిలో ఆసక్తి మరింత పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాలం మారేటప్పుడు ఎదురయ్యే సాంస్కృతికపరమైన కుదుపు(కల్చర్‌షాక్) ఇప్పుడు తల్లిదండ్రులను వేధిస్తోంది. పిల్లలు కోరే లైంగిక సమాచారం అందివ్వడమే తల్లిదండ్రులకు మేలు అని నిపుణులు వాదిస్తారు. అలా ఇవ్వకపోతే వాళ్లు ఇతరత్రా(?) మార్గాలు వెతుక్కుంటారని, అపోహలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణుల అభిప్రాయం. అంటే ప్రతి కుర్రాడికీ ఒక్కో కొక్కోకమో, కామసూత్ర గ్రంథమో కొని చదివించాలేమోనన్న భయం, అపోహ తల్లిదండ్రుల్లో వ్యాపిస్తోంది. కాదు, చందమామ కథల్లా జంతుపాత్రల ఆధారంగా లైంగిక సమాచారం వివరించడం తేలికేనని నిపుణులు వివరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పటివరకూ పిల్లలు బాల్యాన్నే కోల్పోయారనుకుంటున్నాం, కొంపదీసి యౌవనాన్ని సైతం కోల్పోబోతున్నారా అని పెద్దలు అనుమానించాల్సి వస్తోంది!
(Eenadu, Editorial, 28:09:2008)
_____________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home