చిన్ని చిన్ని ఆశ
ప్రాచీన ప్రాకృతగాథల్లో ఒక పచ్చిబాలింత ఉదంతం ఉంది. ఆమెది పూరిగుడిసె. బయట హోరున వర్షం. పాక పైకప్పు కొబ్బరాకు పందిరిలా ఎక్కడికక్కడ కారిపోతోంది. దుర్భరమైన తనస్థితిని తలచుకుని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఒళ్ళో పసిబిడ్డ తడిసిపోతాడన్న బెంగతో తన చీరకొంగును గొడుగులా ఎత్తి పట్టుకుంది. అయినా, ఆ శిశువు తడిసిపోతూనే ఉన్నాడు- వర్షపునీటి వల్లకాదు, ఆమె కార్చే కన్నీటివల్ల- అంటాడు కవి! అనునిత్యం దుఃఖంతో నానుతూ కష్టాలతో కుదేలవుతూ, నిస్సహాయంగా కుమిలిపోయే వ్యధార్తజీవుల యథార్థజీవిత సగటు ముఖచిత్రం సరిగ్గా అలాంటిదే. బాధలతో సతమతం కావడం ఒకవైపు, వాటినుంచి పారిపోయేందుకు అనువైన దారులను వెతుక్కోవడం మరోవైపు- మానవజీవితాన్ని సంక్షోభానికి గురిచేస్తున్నాయి. 'ఔను నిజం! ఔను నిజం! జీవఫలం చేదునిజం' అన్న మహాకవి పలుకులు ఆ దుస్థితికి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు. మనిషిని నిరాశ ఆవరిస్తోంది. భయం పీడిస్తోంది. బతుకు బరువై తోస్తోంది. ఇలాంటి సమయంలో మనిషి తప్పక గుర్తుచేసుకోవలసిన ఒక అద్భుతమైన మాట పేరు- 'ఆశ'. మనిషి బతుక్కి గొప్ప చేయూత- ఆశ! కొండెక్కిపోబోతున్న దీపానికి చమురు చుక్కలాంటిది ఆశ. విడిచిపోతున్న ప్రాణాలను పట్టి నిలబెట్టేది ఆశ. 'చిగురంత ఆశ- జగమంత వెలుగు' అన్నది పరమసత్యం. సీతాన్వేషణ క్రమంలో హనుమంతుడు తిరిగితిరిగి విసిగి వేసారిపోయాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చనిపోదామని సైతం అనుకున్నాడు. చితాం కృత్వా ప్రవేక్ష్యామి... సమిద్ధమ్ అరణీసుతమ్... అరణి సంభవుడైన అగ్నిని రగిల్చి ఆ చితిలో దేహత్యాగం చేద్దామని సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆ స్థితిలో ఎక్కడో... అంతరాంతరాల్లో చిన్న ఆశ మొలకెత్తింది. సీతమ్మ కంటపడుతుందన్న విశ్వాసం చివురించింది. బతికి యున్నచో సుఖములు బడయవచ్చు... జీవన్ భద్రాణి పశ్యతి... అనుకున్నాడు. తిరిగి ప్రయత్నం సాగించాడు. అద్భుత విజయం సాధించాడు. తాను బతికాడు, తోటి కపివీరుల్నీ బతికించాడు.
నేను బాగుండాలి, మీరూ బాగుండాలి అనేది చిన్నమాటేగాని- దాని ప్రభావం చాలా గొప్పది. వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లో సంచలనం థామస్ హేరీ 'అయామ్ ఓకే... యు ఆర్ ఓకే'కి కేంద్రవృత్తం అదే. 'ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా అమలుచేస్తే ప్రతి మనిషికీ అంతులేని ఆనందం లభిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది' అంటాడు హేరీ. 'సర్వేజనాః సుఖినోభవన్తు' అనే ఆర్యోక్తికి భావానువాదం అది. జీవితంలోంచి మనిషి పారిపోవడాన్ని భారతీయ సారస్వతం కూడా ఎన్నడూ సమర్థించదు. ఆశావహమైన దృక్పథంతో సానుకూల వైఖరితో ముందుకు సాగాలన్నదే మన పెద్దల తీర్పు. 'కర్మాణి కుర్వన్నేవ జిజీ విషేత్' కర్మాచరణంతో మనిషి జీవించడాన్ని కోరుకోవాలన్నది- భారతీయ సామాజిక జీవనానికి మూలసూత్రం! క్షణశః కణశశ్చైవ విద్యామ్ అర్థంచ సాధయేత్... క్షణక్షణమూ విద్యనూ కణకణంగా డబ్బునూ సంపాదిస్తూనే ఉండాలని నిర్దేశించిన ఈ దేశం- పనినే తప్ప పలాయన వాదాన్ని ఏనాడూ బోధించలేదు. 'ఇక ఏడురోజులే బతుకుతావు' అన్నప్పుడు పరీక్షిత్తు బెంగతో ఏడుస్తూ కూర్చోలేదు. భాగవత శ్రవణం ద్వారా- చనిపోతున్నానన్న స్థితినుంచి తాను శరీరాన్ని విడిచిపెడుతున్నానన్న స్థితికి చేరాడు. మృత్యువు పట్ల కూడా సానుకూల ధోరణిని ప్రదర్శించాలన్నది భాగవత సందేశం. విజేతలెవరూ పారిపోరు. పారిపోయేవారంతా విజయానికి దూరమవుతున్నట్లు లెక్క. మాట్లాడటం సరిగా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్ చర్చిల్ ప్రపంచం చెవులొగ్గిన వక్త అయ్యాడు. పొట్టివాడివి, సినిమాలకు పనికిరావు పొమ్మన్న చార్లీఛాప్లిన్ నటనకే పాఠ్యగ్రంథం అయ్యాడు. గెలవాలన్న కోరిక కడుపులో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే- ఆశావాదం, సానుకూల దృక్పథం!
సానుకూల వైఖరి, ఆశావహ దృక్పథం మనిషికి విజయాన్ని అందిస్తాయని వ్యక్తిత్వ వికాసగ్రంథాలు వివరిస్తున్నాయి. ఆశావాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల హార్వర్డ్‌కు చెందిన హెల్త్‌వాచ్‌లో ప్రచురితమైన ఒక నివేదిక- ఆయుర్దాయం పెరగడానికి సైతం ఆశావాదమే కారణమని తెలియజెప్పింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో నిరాశావాదులకన్నా ఆశావాదులు త్వరితంగా కోలుకుంటున్నట్లు ఆ పరిశోధనలో బయటపడింది. త్వరగా నిరాశకు గురయ్యేవారిలో అధిక రక్తపోటు మూడురెట్లు ఎక్కువనీ, గుండెజబ్బుల ముప్పు రెండు రెట్లనీ తేలింది. ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి ప్రమాదవశాత్తూ దగ్ధం కావడంతో- థామస్ కార్లయిల్ అంతటి గొప్ప రచయిత నిస్పృహకు లోనయ్యాడు. కుంగిపోయాడు. ఒకరోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడ నిర్మిస్తున్న తాపీమేస్త్రీ పనితనం చూసి స్ఫూర్తిపొంది, రోజుకో పేజీ రాసినా చాలనుకుంటూ- ఆశావహ దృక్పథంతో తిరిగి రచన చేపట్టాడు. అది మొదటిదానికన్నా బ్రహ్మాండంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపడి, రెట్టించిన ఉత్సాహంతో ఉద్గ్రంథాన్ని పూర్తిచేశాడు. జేజేలు అందుకున్నాడు. 'మనిషి చనిపోవచ్చుగాని- ఓడిపోకూడదు' అని పాశ్చాత్యగ్రంథాలు బోధిస్తాయి. 'నువ్వు' చనిపోవడం అనేదే ఉండదు, ఎందుకంటే నువ్వు అమృతపుత్రుడివి- అని భారతీయ తత్వశాస్త్రం ధైర్యం చెబుతుంది. నిండునూరేళ్లు చూద్దాం. జీవం తొణికిసలాడుతూ నూరేళ్లూ ఉందాం. నూరేళ్లూ సంతోషంగా ఉందాం. నూరేళ్లూ విందాం. నూరేళ్లూ మాట్లాడుతూ ఉందామని ప్రోత్సహిస్తుంది. మనిషి సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలే ఉంటుందని తప్పక గుర్తుంచుకోవాలి!
(ఈనాడు, సంపాదకీయం, 14:09:2008)
___________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home