దుష్పరిపాలనకు గోరీ!

నైజాం నవాబును పిశాచంగా వర్ణిస్తూ పాటలల్లిన కవుల క్రోధావేశాలు- ఆనాటి పాలకుల వికృతత్వాన్ని క్రూరత్వాన్ని కళ్లకు కడతాయి. గ్రామాల్లో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలదే సర్వం సహా పెత్తనం. నవాబు ప్రసాదంగా జాగీర్దార్లు విశేషాధికారాలతో రెచ్చిపోయేవారు. తరతరాల ప్రజాపీడనకు, భయంకర దాష్టీకాలకు, అమానుష నియంతృత్వ పోకడలకు నిజాముల పాలన పెట్టింది పేరు. నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలంటూ పదునైన సంపాదకీయాలు రాసిన కలంవీరుడు షోయబుల్లా ఖాన్ ఉనికినే నాటి నేతలు సహించలేకపోయారు. రజాకార్ల కిరాతకాల్ని తన వ్యాసాల్లో ఎండగట్టిన నేరానికి అంతటి ప్రతిభాశాలీ దుర్మరణం పాలయ్యాడు. ఖాకీ యూనిఫాం, నల్లటోపీ, కత్తి, బాకు ధారణతో 1940లో రజాకార్ వ్యవస్థ ఆవిర్భవించాక అరాచకాలు ముమ్మరించాయి. నాటి నరమేధం తలచుకుని తెలంగాణ మారుమూల పల్లెలిప్పటికీ మౌనంగా రోదిస్తాయి. భాగ్యనగరంలోని నారాయణగుడా నుంచి ఫీవర్ ఆస్పత్రికి నడిచి వెళ్లేందుకే స్త్రీలు భయభ్రాంతులకు లోనయ్యేవారంటే, గ్రామీణుల నిస్సహాయ దురవస్థను తేలిగ్గా ఊహించుకోవచ్చు. దోపిడీలు, హత్యలు, మానభంగాలు రజాకార్ల నిత్యకృత్యాలు. అందినకాడికి దోచుకొని పంటల్ని, పల్లెల్ని తగలబెట్టేసేవారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడినవారి నాలుకలు తెగ్గోసేవారు. పత్రికల్లో వార్తలు రాసినవారి చేతుల్ని నరికేసేవారు. ఎన్ని వేలమంది అత్యాచారాలకు గురయ్యారో లెక్కేలేదు. దౌర్జన్య పరంపరపై ఎదురు తిరిగిన గెరిల్లా పోరాటయోధుల నెత్తుటిధారలు తెలంగాణ నేలను తడిపేశాయి. పరకాల ప్రాంతంలో విచక్షణారహిత కాల్పులు నెత్తుటేళ్లు పారించిన ఘటన, మరో జలియన్ వాలాబాగ్ దురంతాన్ని తలపిస్తుంది. అలాంటి అసంఖ్యాక వీరుల అసమాన త్యాగఫలం, తెలంగాణ విమోచనం. దానికి దర్పణంపట్టే- గొడ్డలి మన్నుకరచి గడ్డిపోచ గెలిచిందన్న దాశరథి గేయంలో ఎంతో అంతరార్థముంది. అంతకుమించిన విషాదముంది!
ప్రపంచాన్నే అబ్బురపరచిన తెలంగాణ విమోచనోద్యమానికి బాటలు వేసింది రైతాంగ సాయుధ పోరాటమే. 'నాజీలను మించిన నైజాం సర్కరోడి'పై నిప్పురవ్వలై ఎగసింది సామాన్యులే. అది ఒక్క నిజాం నవాబుకు వ్యతిరేకంగా అమాంతం చండప్రచండమై రగులుకున్న పోరాటం కానేకాదు. భూమికోసం, భుక్తికోసం, భాషకోసం, ఆత్మగౌరవంకోసం... కుల మత వర్గ భేదాలకు అతీతంగా జనసామాన్యంలో రాజుకున్న తీవ్ర నిరసన అగ్నికణమై విముక్తి ఉద్యమంగా ప్రజ్వరిల్లింది. మతంమీద, మాట్లాడే భాషమీద, మానవత్వంమీద దెబ్బతీసిన రాచరికానికి గోరీ కట్టేదాకా జనాగ్రహం ఉపశమించలేదు. వెట్టి విముక్తిని, సంస్కృతీ పరిరక్షణను, అంతకుమించి స్వేచ్ఛగా మనుగడ సాగించే హక్కును లక్షించి బాధిత ప్రజానీకం సాగించిన పోరును ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆర్యసమాజం కదం తొక్కించిన తీరు అనుపమానం. కర్రలు, బరిసెలు, కారం ముంతలు, వడిసెలతోపాటు బర్మార్లు, తుపాకులతో- నిజాం ముష్కరులు, జాగీర్దార్లు, మక్తెదార్లు, ఇనాందార్లపై నాటి కదనకాహళి... శత్రుభీకరం! రజాకార్లకు దొరక్కూడదని నాగటికర్రుతో శరీరం చీల్చుకొని ప్రాణాలు వదిలేసిన ఆత్మాభిమానధనులు ఆనాడెందరో. బైరాన్‌పల్లి లాంటి ఊళ్లలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన బిడ్డలు, సంతానాన్ని పోగొట్టుకున్న పెద్దలు, జీవిత భాగస్వామి కనుమరుగైన అభాగ్యులు... ఎందరెందరో. సంస్థానంలో హిందూ ముస్లిముల మధ్య మత విద్వేషాలు, వైషమ్యాలు సృష్టించజూసిన నిజాం పాలకుల కుయత్నాలెన్నో వీగిపోయాయి. అసమాన నెత్తుటి త్యాగాలతో పురిటిగడ్డ స్వేచ్ఛకోసం పరితపించిన అలనాటి మహాయోధుల సంబంధీకులు నేడు కడు దీనస్థితిలో బతుకులీడుస్తున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగించిన విమోచనోద్యమం తాలూకు ఫలితాలు అట్టడుగు స్థాయికి చేరని దుర్దశ, పోరాటయోధుల దివ్యస్మృతినే మసకబారుస్తోంది. ఏ జాతికైనా సంస్కృతీ సంప్రదాయాలు, వేషభాషలే జీవగర్రలు. భూమి, భుక్తి ఆదరవులే ప్రాణాధారాలు. వాటి ఉనికిని దెబ్బతీసే ఘోర పాపాలకు ఎంతటి ఏలికలైనా మూల్యం చెల్లించి తీరాలి. తెలంగాణ విమోచనోద్యమంతో ముడివడిన వీరగాథలు ఎలుగెత్తి చాటుతున్న సందేశమిది!
(ఈనాదు, సంపాదకీయం, 17:09:2008)
_________________________________
Labels: Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home