My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, October 20, 2008

రసజ్ఞతా వారధులు

కేంద్రమంత్రిగా, పలుమార్లు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించిన గుల్జారీలాల్‌నందా నిజమైన గాంధేయవాది. ఆయన నిండు నూరేళ్ళూ జీవించారు. రాజకీయాల్లోంచి తప్పుకొన్నాక, ఢిల్లీలోని తన కూతురింట్లో ప్రశాంతంగా గడిపారు. నందా వందో పుట్టినరోజున కొందరు పాత్రికేయులు ఆయనను కలవడానికి వెళ్ళారు. అక్కడ అట్టహాసాలు, ఆడంబరాలు ఏమీలేవు సరికదా, నందా పల్చని సాదాసీదా ఖద్దరు బట్టలతో ఎదురై, కేవలం 'టీ'తో పిచ్చాపాటీ సరిపెట్టారు. పత్రికల వారికి అది చప్పగా అనిపించింది. 'మాజీ ప్రధానిని పట్టించుకోని ప్రభుత్వం', 'అర్ధాకలితో అమాత్యుడు'... వంటి శీర్షికలతో ప్రభుత్వాన్ని ఎండగట్టి, ఎంతోకొంత ఆర్థికసహాయం ఆయనకు ముట్టేలా చెయ్యాలని వారిలో కొందరు ఉత్సాహపడ్డారు. వెంటనే నందా తీవ్రంగా స్పందించారు. 'నేను గాంధేయవాదిని, నిరాడంబరంగా జీవించడమే నాకు ఇష్టం' అన్నారు. 'నెలనెలా పింఛను వస్తోంది, డబ్బుకు ఇబ్బందేంలేదు. గాంధీజీ లేరుకదా అని ఆయన చూపించిన మార్గాన్ని విడిచిపెట్టడం నాకు చేతకాదు' అనీ స్పష్టీకరించారు. 'ప్రభుత్వానికి నా గురించి సిఫార్సులు పంపడంద్వారా నన్ను బిచ్చగాణ్ని చేయకండి. వెళ్ళిరండి' అన్నారు. అదిగో అదీ- గాంధేయవాదమంటే! మహాత్ముడి సాహచర్యం ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. 'గాంధీజీకి నేను సమకాలికుణ్ని. బాపును నేను కళ్ళారా చూశాను'- అని, ఆనాటివారంతా ఛాతీ ఉప్పొంగేలా, మొహం వెలిగేలా ప్రకటించుకోవడాన్ని మనం ఈ కోణంలోంచి అర్థంచేసుకోవాలి. శ్రీరమణ 'బంగారు మురుగు' కథలో బామ్మ చేతికడియం మీద పెద్ద స్వాములవారు కన్నేశారు. ఆయనకన్నా గడుసుపిండం బామ్మ- 'ఇచ్చేటంతటిదాన్నా నేను!' అనేసి జారుకుంది. పైపెచ్చు 'ఇచ్చేదాన్నే అయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెంకోసం జోలెపట్టినరోజే ఇద్దును. మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్‌ కంపెనీకి ఇస్తానా?' అనేసింది. పీఠాధిపతుల ప్రభ గొప్పగా వెలుగుతున్న రోజుల్లో బామ్మ స్పందన- ప్రజల గుండెల్లో వారికన్నా గాంధీజీ స్థానం ఎంత ఎత్తయినదో తెలియజెప్పింది.

యుగపురుషులు లేదా చారిత్రక పురుషుల ఉనికి అంత గొప్పగా ఉంటుంది. వారి మాట తీసివేయలేం. వారిని వెనుతిరిగి చూడకుండా వెళ్ళలేం. వారున్న రోజుల్లో జీవించడమే చాలు- మనిషి తాను గొప్పగా చెప్పుకోవడానికి!
ఐన్‌స్టీన్‌ అంతటివాడు గాంధీజీకి సమకాలికుణ్నని గర్వపడ్డాడు. అలాంటివారు అన్ని రంగాల్లోనూ ఉంటారుగాని, అరుదుగా ఉంటారు. వారితో మాట్లాడామని, వారిని చూశామని, వారిని ఎరుగుదుమనీ చెప్పుకోవడం మనిషికి నిజంగానే గర్వకారణం. ఎందుకంటే వారి గొప్పదనాన్ని గుర్తించడమనేది కూడా అభినందించదగినదే కనుక. 'ఏ గతి రచియించిరేని సమకాలమువారది మెచ్చరేగదా!' అని చేమకూర వేంకటకవి వాపోయింది- ఈ గుర్తించడం తెలియనివారి గురించే. 'తమ పూర్వీకులు సాధించిన ఘనవిజయాలను తలచుకొని గర్వపడలేనివారు- రాబోయే తరాలవారు తమను గుర్తించుకోదగ్గ ఘనకార్యాలేవీ సాధించలేరు' అంటాడు లార్డ్‌ మెకాలే. 'ఈ సంసార మిదెన్ని జన్మలకు ఏనీ-మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా? సత్కావ్య నిర్మాణరేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా?' అని ప్రశ్నించారు విశ్వనాథ. ఒక వాల్మీకి రుషి ఘనతను, ఒక 'రుషివంటి నన్నయ్య' ఘనతను గుర్తించి గౌరవించిన విశ్వనాథ- తరవాతి తరం కూడా గర్వపడే కవిత్వం అందించగలిగారన్నది మనం గ్రహించాలి. ఇక్షోణిన్‌ నినుబోలు సత్కవుల్‌... అంటూ శ్రీనాథుడూ, ఉన్నతగోత్ర సంభవము... అంటూ ఎర్రాప్రగడా పూర్వకవులను స్తుతించడంలో ఆంతర్యమిదే. ఒక సొగసైన వాక్యాన్ని గుర్తించి ఆనందించగలవారికే- మరో అందమైన వాక్యాన్ని సృష్టించాలన్న తపన ఉంటుంది. ఆధునికుల్లో అలాంటివారైన విశ్వనాథను వినడానికీ, శ్రీశ్రీని చూడటానికీ సాహితీప్రియులంతా అప్పట్లో ఎంతో కుతూహలం, మరెంతో గౌరవం చూపించేవారు. 'విశ్వనాథ భావుకకోటి' అందరూ ఆ బాపతే!

ఈ తరానికి గాంధీవాదం పస తెలియడానికి, రాజకీయ రంగంలో నందా వంటి గాంధేయవాదుల అంకితభావం కారణం అనుకుంటే-
సాహిత్య రంగానికి చెందిన విలువలు గాని, ఈ దేశపు పాండిత్యమూ రసజ్ఞతా సజీవంగా ఉండటానికిగాని, సాహితీప్రియులైన భావుకకోటి కారణం. సాంస్కృతిక రంగంలో- ముఖ్యంగా అలవాట్లు, అభిరుచులు, సంప్రదాయాలు కొత్తతరానికి వ్యాపించడానికి కారణం ఎవరంటే- రసజ్ఞులైన సామాన్యులు! యుగసంధిలో నిలిచి, వారు రెండు తరాలకు వారధిగా వ్యవహరిస్తారు. పైన మనం చెప్పుకొన్నవన్నీ యుగసంధిలోని ఘట్టాలే. పాతతరం మంచి అలవాట్లు కొత్త తరానికి వ్యాపించేందుకు వీలుగా రసజ్ఞతకు సంబంధించిన పూలవంతెనలు కట్టేది యుగసంధిలోని ఆ పుణ్యపురుషులే. 'చదువది ఎంతగల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు' అని భాస్కర శతకకారుడు చేసిన సూచన వారికి తెలుసు. మనకు సంబంధించి యాభైల్లో, అరవైల్లో పుట్టి చదువూ రసజ్ఞతా కలిగిన వారంతా ధన్యజీవులు. వారిమూలంగానే కొన్ని పాతతరం విలువలతో కొత్తతరానికి పరిచయం ఏర్పడుతుంది. వారెంత అదృష్టవంతులంటే- సినీరంగపు పసిడియుగంతో వారికి బాగా పరిచయం. సాహిత్యరంగపు నిరుడు కురిసిన హిమసమూహాలతో బాగా చనువు. వారికి తామరపూలు తెలుసు, తాటిముంజెలు తెలుసు. తేగలంటే తెలుసు, దబ్బాకు తరవాణీ తెలుసు. వారికి బళ్ళారి రాఘవ తెలుసు, భానుమతి తెలుసు. బడే గులాం అలీ తెలుసు, బాలమురళీ తెలుసు. బాపూ బొమ్మ, శోభానాయుడు నృత్యం, షణ్ముఖి పద్యాలు తెలుసు. ఇవన్నీ రాలిపడిన బాదంకాయల్ని కొట్టితీసిన తాజా పప్పులనుకుంటే- ఈ రోజుల్లోవి సూపర్‌మార్కెట్‌లో ప్యాక్‌చేసిపెట్టిన బాదంపప్పులు. రెండింటికీ తేడా తెలిసినవారూ, తెలియజెప్పగలవారూ కనుకనే, వారిని అదృష్టవంతులని అనేది.
(Eenadu, Editorial, 05:10:2008)
____________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home