My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, November 19, 2008

మూగజీవ భాష

- శంకరనారాయణ
జవం, జీవం ఉన్న భాషగా తెలుగు రాటుతేలడానికి మూగజీవాలను అడ్డంపెట్టుకుని మాట్లాడటమే ప్రధాన కారణమని ఎవరూ పరిశోధించకుండానే తేలిపోయింది. 'ఏమిటయ్యా! ఈ తమాషా?' అని ఎవరయినా అడిగితే- తమాషా నాది కాదు మరాఠీవాడిది అని తెలుగువాడు తిప్పి కొడతాడు. తిప్పితిప్పి కొడతాడు. జంతుతంత్రానికి పెద్దపీట వేసిన పరవస్తు చిన్నయసూరి పంచతంత్రాన్ని ఎవరు చదివినా జై కొడతాడు. తెలుగు సామెతలను నెమరు వేసుకున్నా ఇదే వరస! (నెమరు వేసుకోవడాన్ని పశువులు కదా చేసేది మనుషులు కాదు కదా అన్నా తెలుగుదొర వినడు! నా'మాట' తీరు అంతేనంటాడు.) తెలుగువాడికి కోపమొస్తే ఎదుటివాణ్ని 'అడ్డమైనవాడు' అంటాడు. అడ్డమైనవాడు అంటే పశువు అని తిట్టినట్టు. ఎందుకంటే మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. ఇదీ సృష్టి రహస్యం. తెలుగువాడు తిట్టినా పొగిడినా మూగజీవాల ప్రస్తావన లేనిదే గడవదు. గాడిద చాకిరి చేస్తున్నానని తన మీద తాను సానుభూతిని ఒలకబోసుకునే తెలుగువాడు ఎదుటివాడి మీద చిందులు వేసేటప్పుడు 'గాడిద కొడకా' అని తిట్టడానికి వెనకాడడు. అంతేకాదు, 'వీడా! నా కొడుకంచు గాడిద ఏడ్చింది'అన్న మాటనూ తన నోటనే పలికిస్తాడు. 'అడ్డగాడిద' అనే తెలుగువాడి తిట్టు ఇంకో భాషలో కనబడదు. దీన్ని అనువాదం చేసే మొనగాడు ఇంకా పుట్టలేదు. ఎవరైనా తనను ఇబ్బంది పెడితే 'నన్ను గాడిదను చేశావు కదయ్యా' అని నిష్ఠూరమాడతాడు. అయినదానికీ, కానిదానికీ గాడిద ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలంటాడు. 'నీవు పాడితే గాడిదలు వస్తా'యని సాటి గాయకుడి మనస్సును గాయపరుస్తాడు. 'సంగీతానికి నేను, సౌందర్యానికి నువ్వు' అని గాడిద ఒంటెతో అంటుందని ఎగతాళి చేస్తాడు. గాడిద మంచిది, అనదు కాబట్టి సరిపోయింది కానీ- 'నేను శ్రావ్యంగా పాడలేనంత మాత్రాన పాటలు వినడానికి రాకూడదా?' అంటే, తెలుగు నవాబు దగ్గర జవాబు లేదు. గాడిదలకు సంగీతం రాకపోయినంత మాత్రాన సాహిత్యమూ తెలియదని ఎగతాళి చేయడం అన్యాయం. 'కొండవీటిలో గాడిద నీవునుం కవివి కాదు కదా అనుమానమయ్యెడిన్‌' అని కవిసార్వభౌముడు శ్రీనాథుడు అంతటివాడు అనడం ఎంత అన్యాయం! గాడిద ఏం పాపం చేసిందని ఇన్ని మాటలు పడాలి? భారత రాజ్యాంగం ముందు మనుషులందరూ సమానమే గానీ తెలుగు భాషారాజ్యాంగంలో గుర్రమూ, గాడిదా సమానం కావు. గుర్రాన్ని గాడిదనూ ఒకే గాట ఉంచవద్దని తెలుగువాడు పదేపదే మొత్తుకుంటాడు. పేచీపెడితే గాడిదగుడ్డు అంటాడు. తనకు ఎవరైనా పాదాభివందనం చేస్తుంటే వచ్చినవాడు వసుదేవుడేమోనని 'విచారిస్తుంటాడు!' గాడిద పరిస్థితి ఇలా ఉంటే 'కుక్క'చావు కుక్కది. తెలుగువాడు కుక్క విశ్వాసవంతమైన జంతువు అని ఒకపక్క పొగుడుతూ, ఇంకోపక్క 'కనకపు సింహాసమున శునకము కూర్చుండబెట్టి' అంటూ రాగాలాపన చేస్తుంటాడు. కుక్కను తంతే డబ్బులు రాలతాయని తెలిసినా సదరు అమాయక జీవిని ఏడిపిస్తుంటాడు. 'కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదగలవా?' అని సవాలు విసురుతాడు. వ్యవహారం చెడిపోతే 'కుక్కలు చింపిన విస్తరి' అయిందంటాడు. 'కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు' అని ఈసడిస్తాడు. 'కుక్క తోక వంకరలే' అని ఒక్క ముక్కలో ముక్క చీవాట్లు పెట్టినంత ఘోరంగా ముఖం పెడతాడు. కుక్కను వదలకుండా 'వరస'పెట్టి తిడతాడు. 'ఒసేయ్‌ కుక్కా అంటే ఏమిటే అక్కా' అన్నట్టు ఉందంటాడు తెలుగువాడు. 'చూస్తే చుక్క లేస్తే కుక్క' అని నఖశిఖ పర్యంతం పరిశీలించి చెబుతాడు. 'అవసరం తీరితే అక్క మొగుడు కుక్క' అంటాడు. కుక్కల్నీ విభజించి పాలిస్తాడు. 'మొరిగే కుక్క కరవదు' అంటాడు. చివరకు కుక్కల తిండినీ 'లెక్క' పెడతాడు. కూరలేని తిండి కుక్క తిండి అంటాడు. తెలుగువాడి గొడవ ఒకటి కాదు. 'నక్క జిత్తులు' అంటాడు- 'పాము పగ' అంటాడు. 'నత్త నడక' అంటాడు. 'కోతి చేష్టలు' అంటాడు. భాషతో 'కోతి కొమ్మచ్చి' ఆడతాడు. గిట్టనివాడిది 'కోతి మొహం' అంటాడు. 'అసలే కోతి... కల్లు తాగింది' అని తెలుగువాడు అన్నా, వాడి మీద అభిమానంతో కోతి పరువునష్టం దావా వేయడంలేదు. ఒక్కోసారి కోతిలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయిందని బాధపడతాడు. నక్క బావకు ఎన్ని జిత్తులున్నా తెలుగువాడి ఎత్తుల ముందు అది చిత్తు కావలసిందే. 'నక్క ఎక్కడ నాగలోకమెక్కడ?' అని తేల్చి పారేస్తాడు. 'ఈనగాచి నక్కల పాలు చేసినట్లు' అవుతోందని అదోరకండా చూస్తాడు. 'నక్కలు బొక్కలు వెదుకును' అని పద్యం! అయినా అవి ఏం పాపం చేశాయని పద్యం పాడి మరీ దుష్ప్రచారం?
(Eenadu, 18:11:2008)
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home