తెలుగుధనం

ప్రాచీనం కావచ్చు, ఆధునికం కావచ్చు- రచన గొప్పదనం సహృదయ పాఠకుడికి అది కలిగించే అనుభవ విశేషాన్ని బట్టి ఉంటుంది. ఆ అనుభవం పాఠకుడిలో ఎన్నో ప్రవృత్తులకు కారణమవుతుంది. రామాయణాది ప్రాచీన కావ్యాల అధ్యయనం- మనిషిని మంచి యోగ్యుడిగా చేస్తుంది. ఆధునిక రచన కన్యాశుల్కం చదవడం పూర్తయ్యేసరికి మనలోపలి గిరీశాన్ని మనం గుర్తించగలుగుతాం. అదీ సాహిత్య ప్రయోజనం! పాలకడలిని చిలికినప్పుడు పుట్టుకొచ్చిన కాలకూట విషాన్ని- జనహితం కోరి మింగేయవయ్యా అని భర్తకు అనుమతి ఇచ్చింది సర్వమంగళ. '...మంగళ సూత్రమ్ము నెంత మది నమ్మినదో...' అన్నాడు పోతన్న. ఆ భావం ఇంకితే బండరాయి వంటి గుండెకాయ సైతం కరిగి నీరవుతుంది. నీ కవితాకన్య చాలా సొగసుగా ఉంది- అన్నవారే '... మీదే కులము? అన్న ప్రశ్న వెలయించి, చివుక్కున లేచి పోవుచో బాకున క్రుమ్మినట్లగును...' అని కవి మనసు విలవిల్లాడిందని తెలిస్తే- మనకీ గుండె కలుక్కుమంటుంది. 'హృదయ సంబంధి' సాహిత్యం మనిషిలో కలిగించే సంస్కారాలకు ఇవి ఉదాహరణలు. మనిషితనానికి చిహ్నాలు. వేసవికాలంలో ఒకోసారి పెద్దగా సుడిగాలి రేగి, పొడవైన గుండ్రని దుమ్ము చక్రాలు ఏర్పడతాయి కదా! ఆ ఆకారాన్ని బట్టి కాబోలు, వాటిని 'ఎగిరే బావులు' అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. నూతులు ఎగరడమేమిటయ్యా అంటే తమలోని నీళ్ళను నీ వేడి పూర్తిగా పీల్చేసింది మొర్రో- అని సూర్యుడికి విన్నవించుకోవడానికి అవి ఆకాశంలోకి లేచాయి అన్నాడు. బుద్ధితో ఆలోచించి గ్రహిస్తే- ఆహాఁ అనిపించే ఊహ అది. బాలరాముడు ఓంకారంలా ఉన్నాడు చూడండి అన్నారు విశ్వనాథ. బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాలుణ్ని వూహించుకుని, ఆ భంగిమను తెలుగు 'ఓం' అక్షరంతో పోల్చిచూస్తే ఆ దర్శనం మనకీ లభిస్తుంది. ఇది 'బుద్ధిసంబంధి' సాహిత్యం తీరు.
'నన్నయ తిక్కనలు ప్రయోగించినంత గొప్పగా శబ్దాన్ని ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు... మహారాజుకు నన్నయ గురువు... పెద్దన సార్వభౌముని ప్రాణస్నేహితుడు... శ్రీనాథుడు కవుల కవి... వేమన రెక్క ముడవని భరత పక్షి, కాలాలు దాటి ఇంకా ఎగిరివస్తూనే ఉంది...-' ఆయా కవుల జీవధాతువును పట్టిచ్చే ఈ విశ్లేషణ కృష్ణశాస్త్రిది. ఇది బుద్ధిగతమైన వివేచన. బుద్ధిసూక్ష్మతకు సూచన. తిరువళ్ళిక్కేన్ దేవాలయం ఏనుగుకు రోజూలాగే ప్రసాదాన్ని అందించాడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. ఆ రోజెందుకోగాని ఏనుగు తన తొండంతో భారతిని ఎత్తికొట్టింది. ఆయన మరణించిన రోజున మరో ప్రముఖ కవి వాలి విలపిస్తూ- 'తమిళ చెరుకుగడను తిరువళ్ళిక్కేన్ ఏనుగు మింగేసింది' అన్నాడు. కృష్ణశాస్త్రి మరణించారని తెలిసి శ్రీశ్రీ- 'అద్దం బద్దలైంది... రోదసి రోదించింది... షెల్లీ మళ్ళీ మరణించాడు... వసంతం వాడిపోయింది' అన్నాడు. ఇది గుండెల్లోంచి పొంగే స్పందన. రసజ్ఞతకు సూచన. 'ఎయ్యది హృద్యము? అపూర్వం బెయ్యది?' అని అడిగి వూరుకోలేదు మనవాళ్ళు. అంటే- హృదయ సంబంధి, బుద్ధి సంబంధితో సరిపెట్టుకోలేదు. '...ఎద్దాని వినిన ఎరుక సమగ్రమగు?' అనీ ప్రశ్నించారు. ఎరుక కలగడం సాహిత్యం తాలూకు పరమ ప్రయోజనం! భారతీయ సాహిత్య అధ్యయనం గొప్ప ఉదాత్త లక్ష్యాలతో కూడుకున్నది. నన్నయ్య వెలుగుతో, తిక్కన్న తెలుగుతో, పోతన్న ఎలుగుతో... కనీస పరిచయం లేకుండా- 'నేను తెలుగువాణ్ని' అని ఎవరైనా ఎలా చెప్పుకోగలరు? అశోకవనంలో సీతాదేవిలా ఉంది ప్రస్తుతం తెలుగు భాష! ప్రాచీన భాష హోదాతో రాజయోగం అమరింది. చెర విముక్తికి దారి దొరికింది. పఠన యోగాన్ని కూడా మనం పట్టిస్తే- అగ్నిపునీత అయి లక్ష్యాన్ని చేరుకుంటుంది. తెలుగు భాష ఘనతను వివిధ కోణాల్లోంచి గ్రహించి అటు కవులూ, ఇటు భావుకులూ దాని వైభవాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కృషిచేస్తే అదే పదివేలు!
(Eenadu, 16:11:2008)
_________________________________________
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home