పుష్కర సందేశం
................................................ ఈ దేశంలో పుష్కరాలంటే- ప్రజల సామూహిక ఆధ్యాత్మిక చైతన్యపు విరాట్ స్వరూపానికి చిరునామాలు. జాతి జీవనాడికి స్పష్టమైన ఆనవాలు. భారతీయతకు చెందిన చేవ్రాలు!
ఏ నదిలోనైనా పుష్కరాల వేళ సమస్త దేవతలూ కొలువుతీరి ఉంటారని ప్రజల విశ్వాసం. గీర్వాణ యక్షోరగ సిద్ధసాధ్య గంధర్వ విద్యాధర పూర్ణతీరే... అంటూ తీర్థాలను కొనియాడటం ఆనవాయితీ. పుష్కరుడంటే వేరెవరో కాదు, వరుణుడే! 'సకల తీర్థమయుడు... సన్మార్గ సంధాత... పుష్కరుండు చేరు పుణ్యఘడియ... పసుపు ముద్ద పులిమి పారాణి కైసేసె... తెలుగు పేరటాలు... కడలి ఆలు' అని కవి చమత్కరించడంలో ఆంతర్యం అదే. తీర్థమంటే పుణ్యస్థలం. పుణ్యపురుషులకు ఆశ్రయం కల్పించిన స్థలం తీర్థం అవుతుందన్నది మహాకవి కాళిదాసు 'కుమార సంభవమ్'లో చెప్పిన మాట. పుణ్య పురుషులు, రుషులు నదీతీరాల్లో విడిది చేసి, లోక కల్యాణార్థం హోమాలు చేపట్టేవారు. యజ్ఞాలు నిర్వహించేవారు. తిరిగి తమ లోకాలకు తరలిపోతూ దీక్షారూపమైన తపస్సులను వారు నదీజలాల్లో విడిచిపోతారని పురాణాలు చెప్పాయి. యాగ నిర్వహణకోసం సోమలతను నూరి, రసం తీసేందుకు నదీజలాలను వారు ఉపయోగిస్తారు(సోమార్థా ఆపః). ఆ జలాలను 'వసతీవరులు' అంటారు. యాగానంతరం మిగిలిన ఆ పుణ్యజలాలను నదుల్లో కలిపేస్తారు. ఫలితంగా నదీజలాలకు ఎనలేని ప్రభావం, పవిత్రత చేకూరతాయని పెద్దలు చెప్పారు. ఆ యజ్ఞాల్లోని హవిస్సులను స్వీకరించడానికై వివిధ దేవతలు ఆ తీర్థాల్లో కొలువు చేస్తారు. దేవతలకు ఆతిథ్యం ఇచ్చే నిమిత్తం పుష్కరుడు వచ్చి చేరతాడు. ఇదీ వరస! 'బ్రహ్మ బిందువులంతటి పావనంబులయిన వసతీవరుల్దెచ్చి అఖిల రుషులు... యజ్ఞ సంపూర్తి వేళ నీయందు గలుప... పావనోదార జలరూప వీవు...!' అని కవులు స్తుతించడంలో విశేషమదే. రుషుల దీక్షా తపస్సులు నదీజలాలకు పవిత్రత చేకూరుస్తాయని వేదం సైతం నిర్ధారించింది. ...అప్సు దీక్షా తపసీ ప్రావేశయన్... అప్సు స్నాతి సాక్షా దేవదీక్షా తపసీ అవన్థే... అనే యజుర్వేద మంత్రం దాన్నే వివరించింది.
ఒకో నదిలో ఏడాది చొప్పున పన్నెండు పుణ్య నదుల్లో తీర్థరాజు అనే పుష్కరుడు నివాసం ఉంటాడు. కాబట్టి ప్రతినదికీ పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. మకరరాశిలోకి దేవగురువు బృహస్పతి ప్రవేశంతో తుంగభద్రకు గత ఏడాది పుష్కరాలొచ్చాయి. పుష్కర వేళల్లో ఆ పన్నెండు నదులకూ ఒకే తరహా పవిత్రత చేకూరినప్పటికీ- ఏ నది ప్రత్యేకత దానిదే! గంగానది మాదిరిగా దక్షిణం నుంచి ఉత్తర వాహినిగా ప్రవహించడం, నేరుగా సముద్రుడితో సంగమించకుండా కృష్ణతో కలవడం... వంటివి తుంగభద్ర ప్రత్యేకతలు. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యంలో మరో అడుగు ముందుకు వేసి- నీతో సంగమం లభిస్తే సముద్రుడిక వేరే నదికేసి కన్నెత్తి చూస్తాడా? 'గంగా సంగమం ఇచ్చగించునె! మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమొనర్చునె...!' అని ప్రశ్నించాడు. పడమటి కనుమల్లో తుంగ, భద్ర రెండుగా పుట్టి ఈశాన్యం వైపు ప్రవహించి 'తుంగభద్ర'గా అవతరించిన ఈ పుణ్యనది- శృంగేరీ శారదా పీఠాన్ని సమ్మానించింది. హంపీ విరూపాక్షుణ్ని ఆరాధించింది. రాఘవేంద్ర స్వామిని అర్చించింది. ఆంధ్రభోజుణ్ని అభినందించింది. విజయనగర సామ్రాజ్యాలను దీవించింది. ఇప్పుడు పుష్కరాల పేరుతో ప్రజల్ని విశేషంగా ఆకర్షించింది. వారి జీవనాడిని ప్రతిబింబించింది. మహర్షులు, మహాపురుషుల ఉనికి నదీతీరాలకు ఎంతటి ఉదాత్తతను ఆపాదించింది! మనిషి ప్రమేయం లేకుండానే మానవ శరీరాల్లోని జీవాణువులు ఈ గాలిలోంచి, ఈ మట్టిలోంచి, ఈ జలాల్లోంచి ఏ తరహా చైతన్య విశేషాన్ని పీల్చుకుంటున్నాయో... మానవత్వపు మహా ఇతిహాసాల సారమైన ఏ సద్గుణ వివేక సంపుటి నదీజలాలతోపాటు మన రక్తంలో ఇంకిపోతోందో... ఏకత్వ భావనను భారతీయతను మనకు అనుభూతం చేస్తోందో- స్థిమితంగా ఆలోచించి ఆకళించుకోవడం ఇక మన కర్తవ్యం. అదే పుష్కరాల సందేశం! ప్రజల మనోభావాలతో మమేకమై వారి ఆలోచనల్ని, ఆంతర్యాలను అర్థం చేసుకున్నప్పుడు ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. పండుగలనగా, తీర్థాలనగా, పుష్కరాలనగా ప్రజలకు ఎనలేని మక్కువ. అది తరతరాలుగా ప్రజల్లో జీర్ణమైపోయిన ఒకానొక సంస్కారం. భారతీయతకు చిహ్నం. జాతి సమైక్యతకు దర్పణం.
(ఈనాడు, సంపాదకీయం, ౨౧:౧౨:౨౦౦౯)
______________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home