My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, January 28, 2009

ఆనందోబ్రహ్మ

'ఇంద్రియాల తపన చల్లారి, శారీరక సుఖానుభూతితో మనిషి సేదతీరితే- అదే బ్రహ్మానందం!' అన్నది మను చరిత్రలో వరూధిని. కాదన్నాడు ప్రవరాఖ్యుడు. 'సుఖమూ, ఆనందమూ రెండింటి మధ్యా చాలా తేడా ఉంది. తుచ్ఛమైన ఇంద్రియ సుఖాలను స్వచ్ఛమైన ఆత్మగతమైన ఆనందంతో పోల్చి చూడటం చాలా తప్పు-' అంటూ ఆమె వాదనను తిరస్కరించాడు. 'ఆత్మలోని అంతర్గత శక్తి కారణంగా ఆనందం ఉద్భవిస్తుంది' అన్నాడు మార్కస్‌ అరిలియస్‌. సుఖం, సంతోషం, ఆనందం- వీటి మధ్య పెద్ద తేడా లేదనిపిస్తుంది చాలామందికి. 'నిఘంటువుల్లో చూస్తే కనపడదు. జీవితాల్లోంచి గ్రహిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది'- అంటారు అనుభవజ్ఞులు. సుఖానుభూతి శరీరానికి సంబంధించినది. సంతోషమనేది మానసికమైనది. ఆనందం మనిషి చైతన్యానికి చెందినది. సుఖం చాలా తేలిగ్గా దొరికే దినుసు. ఏకాంతం దానికి అనుకూలమైన వాతావరణం. కడుపే కైలాసమనే సామెత ఆ పాదులోంచే వచ్చింది. సంతోషం అంతకన్నా అరుదైనది. ఏదైనా మంచి సమాచారం విన్నప్పుడో, ఆత్మీయులను కలిసినప్పుడో- మనసుకు కలిగే ఒకానొక సంతుష్టి పేరు సంతోషం. అది ఎదుటివారితో పంచుకోదగ్గది, అలా పంచుకుంటే రెట్టింపయ్యేది. పదిమందికీ సంతోషాన్నిచ్చే ఒక అద్భుత విజయాన్ని సాధించినప్పుడు మనిషికి కలిగే అపురూప భావన పేరు ఆనందం. ఆత్మకు సంతృప్తిని కలిగించే పని సాధించడం ద్వారా మనిషికి వరంగా లభిస్తుందది. మనిషి పదిమందితో పంచుకోదగిందేగాని, అది ఒక్కడే అనుభవించేది కాదు. అలా పంచుకునేకొద్దీ అనేక రెట్లుగా పెరిగిపోవడం దాని స్వభావం. సీతాకల్యాణ గాథ విని ఆనందం పెల్లుబికి, అనసూయ ఆత్మీయంగా జానకిని కౌగిలించుకున్నదని వాల్మీకి రాశారు. పాకిస్థాన్‌పై భారత్‌ క్రికెట్‌ జట్టు గెలవగానే జనం ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడంలో వ్యక్తమయ్యేది ఆనందం! అది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా, తొందరగా వ్యాపిస్తూ ఉంటుంది.

ఓ కవి రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. మనసంతా దిగులుగా ఉంది. ఏవేవో ఆలోచనలతో బరువెక్కింది. అంతలో ఒక చిన్ని పాపడు ఆయన దృష్టిని ఆకర్షించాడు. 'బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి...' అనుకున్నాడు. తనవైపు చిట్టిచేతులు ఊపుతూ, బోసినవ్వులు చిందిస్తూ, కేరింతలు కొడుతున్న ఆ పసివాడు అంత నిశ్చింతగా హాయిగా ఎలా ఉన్నాడన్న
ఆలోచన మొదలైంది. ఎంతోసేపు మథనపడ్డాక, 'సతత ఆనంద స్వరూపుడగుట చేసి...' అని తీర్మానించాడు. కాసేపటికి మరో గొప్ప సత్యం ఆయనకు బోధపడింది. పిల్లవాడి ఆనందానికి కారణం వెతికే క్రమంలో- అప్పటివరకు ఆవరించిన దిగులు, విచారం తనలోంచి తొలగిపోయాయని కవి గుర్తించాడు. మనసు తేలిక పడినట్లు, ఒంటరితనం దూరమైనట్లు ఆయనకు అర్థమైంది. సంచీలోంచి డైరీ తీసి ఒక వాక్యం రాసుకున్నాడు. 'ఆనందం ఒక అంటువ్యాధి' అని. తెలుగులో ప్రసిద్ధుడైన ఒక రచయిత సుమారు అయిదొందల పేజీల తన గ్రంథాన్ని 'జీవితం- ప్రకృతి మనకిచ్చిన బహుమతి. సంతృప్తి- మనం ప్రకృతికి ఇచ్చే బహుమతి' అంటూ ముగించారు. వంతెనలకు బదులు గోడలు కట్టుకోవడమే మన అసంతృప్తులకు కారణం అన్నారాయన. ఈ రెండు ఉదాహరణలను శ్రద్ధగా పరిశీలిస్తే- జీవితాల్లోంచి పారిపోతున్న ఆనందపు శాశ్వత చిరునామా మనకు లభ్యమవుతుంది. ఆనందం దొరికినప్పుడు ఈ ప్రపంచమంతా అద్భుతంగా తోస్తుంది. దుఃఖంనుంచి విముక్తి లభిస్తుంది. నిజానికి ఆనందమనేది ఈవేళ ఆడంబరం కానేకాదు- అది ఒక అవసరం! భయంనుంచి, దుఃఖం నుంచి, ఒంటరితనంనుంచి త్వరగా బయటపడటానికి మనిషికి కావలసిన ఇంధనం అది. ఉత్తేజానికి ఉత్ప్రేరకమది. జీవితం అనేది మనిషికి లభించిన కానుక. ఆనందం మనిషి సాధించవలసిన వేడుక!

స్వభావరీత్యా కవి తన డైరీలో తమాషాకి 'ఆనందం ఒక అంటువ్యాధి' అని రాసుకున్నాడుగాని, అందులో అసత్యం ఎంతమాత్రమూ లేదు. అది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు ప్రొఫెసర్‌ నికొలస్‌ క్రిస్టకస్‌. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలుకు చెందిన పరిశోధక బృందానికి నాయకుడాయన. 21-70ఏళ్ళ వయసులోని సుమారు అయిదువేలమందిని ముప్ఫయ్యేళ్ళ పాటు సుదీర్ఘంగా పరిశీలించి- ఆ బృందం వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 'ఆనందం ఒక అంటువ్యాధిలాంటిదే. ఆత్మీయులతో పంచుకొనేకొద్దీ చిరు తరంగంలా అది మరింతగా ఎగసిపడుతూనే ఉంటుంది. ఆనందాన్ని ఒంటరిగా ఆస్వాదించడం సాధ్యంకాదు. అది వ్యక్తిగతమైన అనుభూతి ఎంతమాత్రమూ కాదు. ఒక వ్యక్తి ఆనందంలోని మజా- తాను అభిమానించే వ్యక్తుల ఆనందంతో ముడివడి ఉంది' అని ఆ బృందం నిర్ధారించినట్లు లండన్‌లోని బ్రిటిష్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
అందమైన
పరిసరాల మధ్య ఆత్మీయుల అనురాగంతో తడిసి ముద్దయినప్పుడు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా! దాని పేరే మరి ఆనందం- అని ఆ బృందం సభ్యులు అంటున్నారు. ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు మిత్రులు, సన్నిహితులు, బంధువుల అభినందనలతో ఆ విజేత ఉత్సాహం రెట్టింపవుతుంది. అంటే గెలుపులోని మజాను ఒంటరిగా ఆస్వాదించడం కాదు, తన ఆనందాన్ని పదిమందితో పంచుకోవడం ద్వారా మరింతగా పెంచుకోవచ్చు- అని వారంటున్నారు. అందుకే మనిషి పదిమందితో తన ఆనందాన్ని పంచుకోవడానికి ఇష్టపడతాడట. అంతేకాదు- ఆనందాన్ని కనుగొన్న మనిషికి సత్ప్రవర్తన, సాయంచేసే గుణం అలవడతాయి. తద్వారా ఇతరుల్లో పరివర్తనకు ఆ వ్యక్తి కారణమవుతాడని ఆ బృందం విశ్లేషించింది. పిల్లవాడు ఏదో ఖరీదైన వస్తువు పగలగొట్టాడని కోపంగా చెయ్యెత్తుతాం. ఆ పసివాడు ఆనందంగా నవ్వుతూ మనకేసి చూసినప్పుడు అంత కోపమూ వెంటనే కరిగిపోయి మనం మంచివాళ్ళుగా మిగిలిపోమూ! అదీ... ఆనందం ప్రభావం!
(ఈనాడు, సంపాదకీయం, 14:12:2009)
________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home