ఆకాశంలో అద్భుతం!
సీత జాడ వెతుకుతూ లంకలో ప్రవేశించిన హనుమంతుడికి నిద్రపోతున్న రావణాసురుడు కంటపడ్డాడు. రావణుడు ఎలా ఉన్నాడో చెబుతూ- మాషరాశి ప్రతీకాశం... మినుముల కొండలా ఉన్నాడని వాల్మీకి వర్ణించాడు. ఆ పోలికలో ఒక విశేషం ఉంది. మినుములు దేహానికి బాగా పటుత్వాన్నిస్తాయి. మినపసున్ని దానికి ఉదాహరణ. ఇనుము లోపంతోనో, కీళ్ళనొప్పులతోనో బాధపడేవారిచేత మన పెద్దలు మినుములు దానం చేయించడంలో రహస్యం అదే! అయితే మినుములు తింటే బుద్ధి క్షీణిస్తుంది. శరీర దారుఢ్యం బాగా ఉన్నవాడేగాని, సీతాపహరణం విషయంలో మాత్రం రావణుడు బుద్ధితక్కువగా ప్రవర్తించాడని అందులో ధ్వని. సముద్రాన్ని దాటేటప్పుడు చారణామార్గంలో వెళ్ళాడని హనుమ గురించి వాల్మీకి చేసిన వర్ణన యోగశాస్త్ర సంబంధిత సూచన. తిరిగి వచ్చేటప్పుడు నక్షత్రాల ప్రస్తావన- జ్యోతిషశాస్త్ర ప్రకర్ష. ఆవిధంగా శాస్త్ర పాండిత్యాన్ని కవిత్వంలో ప్రదర్శించగలవారిని పండితకవులనడం పరిపాటి. కావ్య గౌరవాన్ని శాస్త్ర పాండిత్యం అనేక రెట్లు పెంచుతుంది. వ్యాస మహర్షి భారతంలో ప్రదర్శించిన అపార శాస్త్రజ్ఞతను పండితలోకం విశేషంగా ప్రశంసించింది. భారతాన్ని సర్వశాస్త్ర సంగ్రహంగా నన్నయ వర్ణించాడు. శిశుపాలుని ఆగడాలను నారదుడి ద్వారా విని శ్రీకృష్ణుడు కుపితుడు కాగా భృకుటి ముడిపడింది. అలా ముడిపడిన కనుబొమను మాఘకవి 'ధూమకేతువులా ఉంది' అన్నాడు. తోకచుక్క ఆకారాన్ని మనం గుర్తు చేసుకుంటే- ఆ పోలికలోని సొగసు బోధపడుతుంది. తోకచుక్క వినాశకారి అని ప్రతీతి. అది కనపడితే ప్రజలు ఇప్పటికీ అశుభమని భావిస్తారు. కృష్ణుడి నుదుట పొడిచిన తోకచుక్క శిశుపాలుడి పాలిట యమపాశంగా మాఘుడు సూచించాడన్నమాట.
కావ్యంతో మాఘుడి జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యం లోకానికి వెల్లడైంది. మాఘం(శిశుపాలవధ)లోని శాస్త్ర రహస్యాలను, మేఘం (కాళిదాసు మేఘసందేశం)లోని ధ్వని విశేషాలను గ్రహించేసరికి తన బతుకు తెల్లారిపోయిందన్నాడు- మల్లినాథ సూరి! సారావళిలో కల్యాణవర్మ మాదిరిగానే- శిశుపాలవధలో మాఘుడు ప్రస్తావించిన అనేక యోగాల్లో దురుధరాయోగం ప్రధానమైనది. దేవ గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు ఒకే రాశిలో చంద్రుడితో కలిసి ఉంటే ఆ జాతకుడు విశేష భాగ్యవంతుడవుతాడని జాతకాభరణంలో డుంఢిరాజు వర్ణించాడు. చంద్రునికి ఇరువైపులా అటు పన్నెండో ఇంట్లోను, ఇటు రెండో ఇంట్లోను శుభగ్రహాలుంటే అది దురుధరాయోగమని జ్యోతిష శాస్త్ర పరిభాష! శిశుపాలుడి దుండగాల గురించి చర్చిస్తూ... అటూ ఇటూ ఉద్దవుడు, బలరాములతో కృష్ణుడు వస్తుంటే- గురు శుక్రులతో కలిసిన చంద్రుడిలా ఉన్నాడంటాడు మాఘుడు. శ్రీకృష్ణుడు చంద్రవంశీయుడన్న ధ్వని అలా ఉంచి, అది శుభయోగం, కనుక వారి ఆలోచన ఫలిస్తుందని మాఘుడి సూచన. అలాగే రాజసూయ యాగసభకు వస్తుంటే కృష్ణుణ్ని భీమార్జునులు ఇరువైపులా అనుసరించారు. 'యోగం... ఉభయ గ్రహాంతర స్థితికారితం... దురుధరాఖ్యం ఇందునా...' అని మాఘుడు వర్ణించాడు. గురువు, శుక్రుడు, చంద్రుడు- ఈ శుభగ్రహ త్రయ యోగాన్ని 'శ్రేష్ఠవృత్తి యోగం' అని మరికొందరంటున్నారు. ఇదంతా జ్యోతిష శాస్త్ర పాండిత్య ప్రకర్షకు నిలువుటద్దం. మన కవుల అపార కృషికి నిదర్శనం.
జ్యోతిషం శాస్త్రమవునా కాదా, నమ్మవచ్చా లేదా- అనే వాదనను పక్కన పెడితే... పూర్వకవుల విశేష శాస్త్ర పరిజ్ఞానాన్ని, వారి కల్పనలలోని గొప్ప వూహాశాలితను మనం అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు ఉపకరిస్తాయి. ఆ మూడు శుభగ్రహాల కలయిక యోగదాయకమని జ్యోతిష శాస్త్రం చెబుతుంటే- 'అద్భుతం' అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల ఆకాశంలో సరిగ్గా అదే అద్భుతం ఆవిష్కృతమైంది. గురు శుక్ర గ్రహాలు- చంద్రుడికి ఇరువైపులా చేరి శాస్త్రజ్ఞులకు విశేష ఆసక్తి కలిగించాయి. నెలవంక వంపుతీరి నోరుగాను, ఆ గ్రహాలు రెండూ కాస్త పైన కళ్లు మాదిరిగాను కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వాస్తవానికి రాత్రిళ్ళు ఆకాశంలో మూడు నుంచి అయిదు గ్రహాలను నేరుగా చూడవచ్చు. అయితే గుర్తించడం కష్టం. ఈసారి మాత్రం గురు శుక్ర గ్రహాలు మరీ దగ్గరగా వచ్చి స్పష్టంగా కనపడ్డాయి. వచ్చే జనవరి రెండోవారం వరకు అలా కనిపించే అవకాశం ఉంది. వాటిలో బాగా కాంతిమంతమైనది శుక్రగ్రహం. రెండోది గురు గ్రహం. గురు శుక్ర గ్రహాలు అలా దగ్గరగా రావడం చాలా అరుదని, దాన్ని కంజెక్షన్ అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుభప్రదమనీ దేశానికి యోగకారకమనీ జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశమనే చంద్రుణ్ని ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు భయంకర ఉగ్రవాదం రాహుకేతువుల్లా పట్టి పీడిస్తున్న తరుణంలో గురు శుక్రులు చంద్రుడికి ఇరువైపులా చేరి దురుధరాయోగమో- శ్రేష్ఠ వృత్తి యోగమో- పేరేదైనాగాని దేశానికి శుభం చేకూర్చగలిగితే అంతేచాలు... అని సామాన్యుడు గొణుక్కుంటున్నాడు. ఆకాశంలో అద్భుత దృశ్యాలను ఆసక్తిగా గమనించే యువతరానికి- వాటి వెనుక జ్యోతిష శాస్త్ర రహస్యాలుగాని, ఖగోళ శాస్త్ర విశేషాలుగాని తెలిస్తే- ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుందన్నది సత్యం.
(ఈనాడు, సంపాదకీయం, 07:12:2008)
_________________________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home