My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, February 14, 2009

తెలుగు కథాసుధ- నూరేళ్ల పండగ

అడుగుజాడ గురజాడది...

సామాన్యుల సాహిత్య ప్రక్రియ కథ. లోకంలో కబుర్లు, కథలు ఒక్కసారే పుట్టి ఉంటాయి. రాసిన కథలకన్నా రాయని కథలు ఎక్కువ. పాత కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. పాత కథ. గతంనుంచి వర్తమానంలోకి చూస్తుం ది. నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలకు చెందిన కల్పనలు ఆ కథల్లో ఉంటాయి. కొత్త కథ. వర్తమానం నుంచి భవిష్యత్తువైపు చూస్తుంది. దానికి వాస్తవికత ప్రాణం. తెలుగులోనే కాదు భారతీయ భాషలన్నింటిలోను కొత్త కథ పుట్టి కొంచెం ఇటూ అటుగా నూరేళ్లయింది. కథ, చిన్న కథ, కథానిక అన్న పేర్లతో బాగా వ్యాప్తిచెందిన ఈ ప్రక్రియకు తెలుగులో తొలి కొండగుర్తుగా గురజాడ 'దిద్దుబాటు' కథను ఎంచుకున్నాం. దీనికన్నా ముందు తెలుగులో కథలున్నా, కథకు కావలసిన అన్ని మంచి లక్షణాలుగల మొదటి కథగా 'దిద్దుబాటు'ను గౌరవిస్తున్నాం. పరిశోధిస్తే 1880 నుంచి తెలుగు కథలు దొరకవచ్చునని కొందరు అంటున్నారు. భండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ వంటివారు గురజాడకు ముందే తెలుగు కథకు శ్రీకారం చుట్టారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అక్కిరాజు ఉమాకాంతం, పూడిపెద్ది వెంకటరమణయ్య వంటివారు ఈ తొలిదశలోనే కథలు రాశారు. 1930 నాటికి దాదాపు 35 పత్రికలు తెలుగు కథను బాగా వ్యాప్తిలోకి తెచ్చాయి. అప్పటికే 500 కథలు వచ్చాయి. రెండు వందల మంది కథకులు ఉండేవారు. ఈ నూరేళ్లలో తెలుగు కథల సంఖ్య లక్ష దాటింది. వందల సంఖ్యలో కథకులున్నారు. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకే ఆదరణ ఎక్కువ.

కథ పరిధి విశాలమైనది. మనిషి మనసులో ఎన్ని పొరలు ఉన్నాయో, మెదడులో ఎన్ని అరలున్నాయో, లోకంలో ఎన్ని చిక్కులు-చీదరలు ఉన్నాయో, వెలుగులు-వేడుకలు ఉన్నాయో వాటన్నింటినీ వెలికితీసి వేనవేల కథలు రాశారు తెలుగు కథకులు. వీరందరికీ కథ జీవిక కాదు, ఉపజీవిక. కథ రాయడం తప్ప ఇంకొక పని లేకుండా జీవితమంతా గడిపేసిన చాసోలాంటివారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
నూరేళ్ల తెలుగు కథను మూడు దశలుగా విభజించవచ్చు.
1880 నుంచి 1930 దాకా మొదటిదశ. ఈ దశలో కథకులు ప్రధానంగా సంస్కరణవాదులు.

1930 నుంచి 1970 దాకా రెండోదశ. ఈ దశలో అభ్యుదయవాదులు, తాత్వికులు, కళాప్రియులు, హాస్యకుశలురు కథకులుగా కనిపిస్తారు. ప్రయోగవాదం ఈ దశలోని మరో లక్షణం.

1970 నుంచి నేటిదాకా మూడోదశ. విప్లవవాదం, తత్సంబంధ అంశాలు ఈ దశకు ప్రధాన లక్షణాలు. ఈ మూడు దశల్లోను రెండో దశ తెలుగు కథకు మహర్దశ. మొదటి రెండు దశల్లోను తెలుగు కథ మధ్యతరగతి విద్యావంతులకు సంబంధించిన సాహిత్య ప్రక్రియ అయింది. మూడోదశలో వివిధ వర్గాలకు, వృత్తులకు, ఉద్యమాలకు చెందిన కింది తరగతుల విద్యావంతులు, మేధావులు కథారంగాన్ని కళకట్టించారు.

స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలతో ప్రారంభమైన తొలిదశలోని కథ- మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల చిత్రణదాకా పలు విషయాలమీద దృష్టి సారించింది. హాస్యకథలు, వినోద కథలతోపాటు దేశవిదేశాల ఇతర భాషల కథలకు అనువాదాలూ ఈ దశలో వచ్చాయి. కథలు సంపుటాలుగా రావడం, కలంపేర్లతో రావడం ఈ దశలోనే మొదలైంది. కథల్లోని వాతావరణమంతా మధ్యతరగతి సంస్కృతి, సంప్రదాయాలతో కూడినదిగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, తెలంగాణం ఈ దశలో కథాకేంద్రాలుగా ముందుకు వచ్చాయి. ఎందరో గొప్పవారు కథలు రచించినా వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చింతా దీక్షితులు, చలం, మునిమాణిక్యం, మొక్కపాటి, విశ్వనాథ, అడవి బాపిరాజు, భమిడిపాటి కామేశ్వరరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటివారు ఈ దశ ముగిసేటప్పటికి గొప్ప కథకులుగా రాటుతేలారు. వాడుక భాష కథల భాష అయింది. ఈ మొదటి దశలోనే తెలుగు కథలో రకరకాల శైలీభేదాలు పుట్టాయి. పాత్రచిత్రణలోను, శిల్పసాధనలోను కథకులు శ్రద్ధ చూపారు.

రెండోదశలో- అక్రమాలతో రాజీపడలేని అభ్యుదయ దృక్పథంగల యువకులు కథారచనలో ప్రవేశించారు. ఇతర రచయితల కన్నా కథకులు ఈ దశలో ప్రజాజీవితానికి సన్నిహితులయ్యారు. వాస్తవికతకు భంగం కలగకుండా జీవితసత్యాన్ని నిరూపిస్తూ కథాశిల్పాన్ని పోషించడం ఈ దశలోని కథకుల లక్ష్యం. ఒక పక్క శిల్పం, ఇంకొకపక్క ప్రయోగం అనే జోడుగుర్రాల స్వారీ చేసిన కథకులూ ఈ దశలో కనిపిస్తారు. హాస్యంతోపాటు వ్యంగ్యం, అధిక్షేపంతో కూడిన కథలు ఈ దశలో పుష్కలంగా కనిపిస్తాయి. పండితులు, పరిశోధకులు, కళాకారులవంటివారు ఈ దశలో కథారంగంనుంచి నిష్క్రమించారు. శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్‌, కృష్ణశాస్త్రి వంటి కవులు మాత్రం కథలూ రాశారు. పూర్తిగా మాండలిక శైలిలో కథలు రాయడం ఈ దశలో మొదలైంది. ఇలా రాసినవారిలో మా గోఖలే మొదటి గుర్తింపు పొందారు. తరవాత ఈ మార్గం ప్రాచుర్యం పొందింది. కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌, పాలగుమ్మి పద్మరాజు, బలివాడ కాంతారావు, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం, కొమ్మూరి వేణుగోపాలరావు, శీలా వీర్రాజు, మంజుశ్రీ, హితశ్రీ, వాకాటి పాండురంగారావు, ముళ్లపూడి వెంకటరమణ వంటి హేమాహేమీలెందరో ఈ దశలో కథాక్షేత్రంలో బంగారు పంటలు పండించారు. ఉత్తరాంధ్ర కథకత్రయం చాసో, రా.వి.శాస్త్రి, కాళీపట్నం రామారావు ఈ దశలో కథారచనను ఆరంభించి మూడోదశకు దిక్సూచులుగా నిలబడ్డారు. కథ బహుళవ్యాప్తి పొంది నవల, కవిత్వం వంటి ఇతర ప్రక్రియల వ్యాప్తికి అడ్డు తగిలిందన్నది ఈ దశలో వచ్చిన విమర్శ.

1970 తరవాత కథారచనకు విప్లవోద్యమం ప్రధాన భూమికైంది. విరసం ఆవిర్భావం దీనికి దోహదం చేసింది. భూషణం రాసిన 'కొండగాలి' కథాసంపుటంతోపాటు 'ఇప్పుడు వీస్తున్న గాలి', 'కొలిమంటుకొంది'వంటి కథాసంపుటాలు ఈ భావజాలాన్ని వ్యాప్తి చేశాయి. శ్రీకాకుళ పోరాటంతో రాజుకున్న ఈ నిప్పు తెలంగాణాకు వ్యాపించి అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య వంటి కథకులనెందర్నో ఈ దిశకు మళ్లించింది. మొదటిదశలో వెనుకబడినా రెండోదశలో కె.సభా, మధురాంతకం రాజారాం వంటి రచయితలతో పరిపుష్టిని పొందిన రాయలసీమ కథ మూడో దశలో అన్ని ప్రక్రియలకన్నా ముందంజ వేసింది. దళితవాదులు, స్త్రీవాదులు, మైనారిటీవాదులూ తమ కలంపోరుకు కథను ఆయుధంగా ఎంచుకున్నారు.

తొలినాడు తెలుగు కథకు జన్మనిచ్చిన భండారు అచ్చమాంబ మొదలు నేటి జాజుల గౌరి వరకు ఎందరెందరో ప్రతిభాశాలురైన మహిళలు తెలుగు కథకు ప్రతిష్ఠ చేశారు. తొలిదశలోనే పదిహేనుమంది రచయిత్రులు కథలు రాసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆ తరవాత రెండు దశల్లో వీరి సంఖ్య తామరతంపరగా పెరిగింది. ముఖ్యంగా 1960-80 మధ్యకాలం కథాప్రక్రియలో మహిళాయుగంగా రాణకెక్కింది. ఈ సమయంలో రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, లత, సులోచనారాణి, రామలక్ష్మి, భానుమతీ రామకృష్ణ, మాలతీ చందూర్‌ వంటి వారెందరో మంచి కథలు రాశారు. మూడోదశలో ముదిగంటి సుజాతారెడ్డి, ఓల్గా, కుప్పిలి పద్మ వంటివారు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పోరాటశీలత నిండిన కథలు రాస్తున్నారు. చాగంటి తులసి వంటివారు హిందీ, ఒరియా భాషల నుంచి అనువాదాలు చేశారు, చేస్తున్నారు. తెలుగు కథకు పాలగుమ్మి పద్మరాజు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు వంటి కథకులు మంచి కీర్తిని ఆర్జించిపెట్టారు.

కథతోనే కథావిమర్శ కూడా తెలుగులో పుట్టింది. కథలమీద పరిశోధన చేసినవారు, వ్యాసాలు రాసినవారు ఎందరో ఉన్నారు. ఎంత సాధించినా తెలుగు కథకు షష్టిపూర్తి అయిన తరవాత అందులో సహజత్వం కొరవడిందని, పాత్రలు ఆకాశంనుంచి ఊడిపడినట్లుంటున్నాయని, శిల్పప్రాధాన్యం తగ్గిందని, సొంత గొంతుతో కథలు పలికేవాళ్లు తెలుగులో తక్కువని, నీరసంగా, నిర్వికాసంగా, నిష్ప్రతిభగా ఉందని ప్రముఖ విమర్శకులు చెబుతూ వచ్చారు. నేటి కథకులు ఈ విమర్శలకు దీటుగా సమాధానమిచ్చే గొప్ప కథలు రాసి ప్రపంచ కథాసాహిత్యంలో తెలుగు కథకు విశిష్టస్థానం కల్పించాలి.
- డాక్టర్‌ యు.ఎ. నరసింహమూర్తి
(రచయిత విజయనగరం మహారాజ కళాశాల
(విశ్రాంత) తెలుగు శాఖాధ్యక్షులు)
(ఈనాడు, ౦౭:౦౨:౨౦౦౯)
------------------------------------------------

Labels:

0 Comments:

Post a Comment

<< Home