అంతరంగ ఆవిష్కరణ : జగ్గి వాసుదేవ్
మతం
అనాది నుంచి మనిషి తోటివాడితో సంఘర్షిస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో వనరులు కొద్దిగా ఉండటమే అందుకు కారణం. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తొలినుంచి సంఘర్షణ పథంలో నడిచాడు. కొత్త ఆర్థికనియమాలూ చట్టాలూ చక్కటి పంపిణీ విధానాలూ సరైన అవకాశాలు కల్పించడం వంటి చర్యలతో ఆ సంఘర్షణ తొలగిపోతుంది. కానీ మానవాళి ఎదుర్కొంటున్న మరో పెనుసమస్య మతమౌఢ్యం అంత తేలిగ్గా లొంగేది కాదు. మనమేదైనా ఆస్తి కోసం తగాదా పడితే కొంతకాలానికైనా మన తప్పు మనకు తెలిసే అవకాశం ఉంది. అదే దేవుని పేరిట యుద్ధం వెుదలైతే దానికి ఇక అంతెక్కడుంటుంది? అది అనంతంగా కొనసాగే వైషమ్యం. కొంతమంది తమను తాము దేవుని సైనికులం అనుకుంటారు. అలాంటివారు ఆ తరహా భావాలను వదులుకుంటే మార్పు సాధ్యమవుతుంది.
----------------------
ధ్యానం
ధ్యానం అంటే సాకార రూపమైన దైవాన్ని తల్చుకోవడం కాదు. మనలో నిగూఢంగా ఉండే అనంతమైన శక్తిని ప్రేరేపించుకోవడం. బుద్ధినీ మనసునూ ఏకం చేసుకోవడం. మనలోని మానవీయ గుణాల్ని మరింతగా పెంచుకోవడం. అందుకోసం మంత్రతంత్రాలను ఆశ్రయించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. నిశ్శబ్దంగా కూర్చుని కూడా సాధించవచ్చు. మనశ్శాంతినీ మనోవికాసాన్నీ పొందడమే ధ్యానం పరమార్థం.
------------------------
యోగా
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన నేటికాలానికి యోగా అవసరమా' అనే ప్రశ్న వేస్తుంటారు కొందరు. దానికి నా సమాధానం ఇదీ... భౌతిక సుఖజీవనానికి శాస్త్రసాంకేతిక పరిశోధనలున్నట్లే మానసిక సుఖజీవనానికి యోగా ఉంది. దాన్ని సరైన పద్ధతుల్లో సంపూర్ణంగా అందించగలిగితే దేహానికెంతో మేలుచేస్తుంది. మన జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి అనుభూతులు కలగాలి అనేది మనమే నిర్ణయించుకోగలగాలి. ఆ శక్తిని యోగా మనకు అందిస్తుంది. అలాంటప్పుడు 'యోగా అవసరమా?' అన్న ప్రశ్నే అసంబద్ధమౌతుంది.
----------------------------
మానవసేవ
సమాజం అంటే వేర్వేరు వ్యక్తులు కాదు. ఒకే మహాపదార్థంలో అణువులు. కాబట్టి మానవసేవ చేయడమంటే తనకు తాను మేలు చేసుకోవడమే. ప్రతివ్యక్తీ తోటివారి మేలు కోరితే సామూహిక వ్యవస్థ వల్ల అంతిమంగా తానూ లాభం పొందుతాడు. వేర్వేరు దారాలు సరిగ్గా పెనవేసుకుంటేనే కదా వస్త్రం అందంగా రూపొందేది. ఈ సమాజమనే వస్త్రంలో పోగుల్లాంటివారు వ్యక్తులు. ఆ వస్త్రంలో ఏదారం తెగినా దాని అందం దెబ్బతింటుంది. అందుకే ప్రతివ్యక్తీ తనకు సాధ్యమైనంతవరకూ తోటివారికి సేవ చేయాలి. వెుత్తంగా సమాజం బాగును కాంక్షించాలి.
(ఈనాడు, ౦౮:౦౨:౨౦౦౯)
___________________________
Labels: Religion
0 Comments:
Post a Comment
<< Home