తెలుగు భాస్కరుడు అస్తమించాడు!
చెన్నై, న్యూస్‌టుడే:
చెన్నైనగరంలో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా ఆయన హాజరీ తప్పదు. ఎక్కడ తెలుగు పలుకు వినిపించినా నుదుట కుంకుమబొట్టు, చేతిలో సంచి, సాదాసీదా వస్త్రాలతో ఎంతెంతో శ్రమకోర్చి వెళ్లే ఆయన జీవనయానం ఆగిపోయింది. తమిళనాడు తెలుగువారు ప్రవాసులుకారని తీవ్రంగా వాదించే ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. నగర చిన్నారులను ఊరేగింపుగా తీసుకెళ్లి... వీధివీధినా తెలుగు నినాదాలు వినిపించినా ఆ కాళ్లు ఆగిపోయాయి. చెన్నైలోని తెలుగు ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి మురిసిపోయినా ఆ చేతులు అచేతనాలయ్యాయి. అవును! మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం వ్యవస్థాపక కార్యదర్శి పేరిశెట్ల భాస్కరుడు తుది శ్వాస విడిచారు. తెలుగు తల్లి ఉచ్ఛ్వాసనిశ్వాసలో కలిసిపోయారు.
తెలుగు తల్లి ముద్దుబిడ్డ పేరిశెట్ల భాస్కరడు సోమవారం మృతిచెందారు. ఆయన వయసు 66 ఏళ్లు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరణి సమీపంలోని కుమ్మరపేట ఆయన స్వస్థలం. తల్లితండ్రుల కాలంలోనే ఉత్తరచెన్నై చాకలిపేటలో స్థిరపడ్డారు. రాష్ట్ర రహదారి విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో కన్నుమూశారు. భాస్కరుడు అంత్యక్రియలు మంగళవారం ఉదయం 6.30 గంటలకు కొరుకుపేట ఎంజీఆర్ నగర్‌లోని శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు
తెలుగు నూరిపోశారు...
తమిళనాట తెలుగు వికసించాలంటూ... వినిపించాలంటూ గత 30 ఏళ్లుగా నినదించారాయన. ఉత్తరచెన్నైలోని నేటి యువతకు వార్షిక వూరేగింపులతో తెలుగుపాలను నూరిపోశారాయన. ఆయనకు డాక్టర్ సీఎంకేరెడ్డి నేతృత్వంలోని అఖిల భారత తెలుగు సమాఖ్యతో అవినాభావ సంబంధం ఉంది. దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ప్రతి ఏడాది అమరజీవి పొట్టి శ్రీరాములు, పిట్టి త్యాగరాయ చెట్టి జయంతి, వర్థంతి వేడుకలు, వీరపాండియ కట్టబ్రహ్నన జయంతి, వర్థంతి వేడుకలు, తెలుగు ఉగాది వేడుకలు, హరికథా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. గత జులైలోఅనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నా కూడా తిరుచ్చిలో జరిగిన తెలుగు సాంస్కృతిక ఉత్సవాలకు వెళ్లి వచ్చారాయన. ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రగాఢ సంతాపం...
మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం వ్యవస్థాపక కార్యదర్శి పేరిశెట్ల భాస్కరుడు మృతిపట్ల పలువురు తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ సీఎంకేరెడ్డి తమ సమాఖ్య నిర్వాహకులతో కలిసి కొరుకుపేటలోని పేరిశెట్ల భాస్కరుడు నివాసానికెళ్లి భౌతిక కాయానికి పూలమాలేసి నివాళులర్పించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, పోయస్‌గార్డన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నాగరాజు, మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం అధ్యక్షుడు ఎంఆర్ సుబ్రహ్మణ్యం, ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు, మద్రాసు తెలుగు యువసేన ఉపాధ్యక్షుడు ఇ.పెంచలస్వామి తదితరులు భాస్కరుడు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
'ఆర్థిక స్తోమత లేకపోయినా తెలుగు కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన లోటు చెన్నైలోని తెలుగు సంఘాలకు తీరని లోటు.'
- సీఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు
'తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలనే డిమాండుతో మేం చేపట్టిన కరపత్రాల ఉద్యమంలో ఆయనది కీలకపాత్ర. తమిళనాడులో మాతృభాష తెలుగు భాష వికాసానికి తన వంతు కృషిచేసిన అరుదైన వ్యక్తుల్లో ఆయనా ఒకరు.'
- కృష్ణారావు, అధ్యక్షుడు, ద్రావిడ దేశం
'ఆయన సంఘం తరపున ఒక వైపు తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇతర సంఘాలు జరిపే తెలుగు కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. భాస్కరుడి మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటు.
- గుడిమెట్ల చెన్నయ్య, జనని ప్రధాన కార్యదర్శి
ఎప్పుడూ మేమిద్దరమే ఒకటిగా తిరిగేవాళ్లం. అలా నా సహచరి నాకు తీరని లోటుమిగిల్చాడు
- లయన్ నాగరాజు
(ఈనాడు , ౧౦:౦౨:౨౦౦౯)
__________________________________
Labels: Personality, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home