హాస్య నటుడు నగేష్ కన్నుమూత
చెన్నై, న్యూస్‌టుడే:
ప్రముఖ హాస్యనటుడు నగేష్ ప్రేక్షకులకు విషాదాన్ని పంచి కనిపించని లోకానికి వెళ్లిపోయారు. అస్వస్థత కారణంగా చెన్నైలోని స్వగృహంలో శనివారం[31:01:2009] ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు వెయ్యి చిత్రాల్లో నటించిన ఘనతనుఆయన సొంతం చేసుకున్నారు. ఆయన భార్య 2006లో చనిపోయారు. 1933 సెప్టెంబరు 27న కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు సమీపంలోని చెయ్యూరులో కృష్ణారావు, రుక్మిణమ్మ దంపతులకు జన్మించిన నగేష్ అసలు పేరు గుండురావు.
తెలుగు ప్రేక్షకులకు నగేష్‌గా పరిచయం ఉన్న ఆయనను చిత్ర పరిశ్రమలో నాగేష్‌గా పిలుస్తారు. నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తారు. కొంతకాలం రైల్వేశాఖలో ఉద్యోగం చేశారు. అనంతరం దానికి స్వస్తి చెప్పి సినిమాల్లో నటించేందుకు చెన్నై చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్‌కుమిళి చిత్రం ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యారు. నగేష్ నటించిన చివరి చిత్రం కమల్‌హాసన్ పదిపాత్రలు పోషించిన దశావతారం. 75 ఏళ్ల నగేష్‌కు ఆనంద్‌బాబు, రమేష్‌బాబు, రాజేష్‌బాబు అనే కుమారులున్నారు. వీరిలో ఆనంద్‌బాబు నటుడు.
నగేష్ మరణవార్త తెలియగానే తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, మనోరమ, వైజీ మహేంద్రన్, పాండిరాజన్, కుమరిముత్తు, నాంజిల్ మనోహర్, జీవా, దర్శకులు ఎస్‌ఏ చంద్రశేఖర్, ముక్తా శ్రీనివాసన్ తదితరులు నగేష్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం చెన్నై బెసెంట్‌నగర్ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆయన మహానటుడు... రజనీకాంత్:
నగేష్ దక్షిణాది చిత్రపరిశ్రమలో మహానటుడు. హాస్యమే కాక నవరసాలనూ పండించారు. సినీ పరిశ్రమలో బాగా కష్టాలు పడ్డారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.
నాకు తీరని లోటు... కమల్‌హాసన్: నగేష్ మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. బాలీవుడ్ నటుడు మహ్మద్‌చేత గురువు అనిపించుకున్న గొప్ప నటుడు. నేను కథానాయకుడిగా నటించిన మగలిల్ మట్రుం చిత్రంలో ఆయన చనిపోయే పాత్రలో నటించారు. ఇప్పుడు ఆయన్ను నేను ఆ పాత్రలో వ్యక్తిగానే చూస్తున్నాను.
చిత్రసీమకు తీరని లోటు:
వైఎస్, బాబు, చిరు
హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రముఖ హాస్యనటుడు నగేష్ మృతి చిత్రసీమకు తీరని లోటని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో తనదైన నటనతో ఆయన చెరగని ముద్ర వేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాస్యనటుడు నగేశ్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారమిక్కడ వేర్వేరు ప్రకటనల్లో వారు నగేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మృతి తెలుగు, తమిళ చిత్రరంగాలకు తీరని లోటని పేర్కొన్నారు.
(ఈనాడు, ౦౧:౦౨:౨౦౦౯)
_______________________________________
Labels: Cinema, Cinima/ Telugu, Personality
0 Comments:
Post a Comment
<< Home