My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, February 23, 2009

టాపర్లు చదివే పద్ధతి ఇదే!

సత్య
చదవడం అంటే కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు.
చదివినదాన్ని అర్థం చేసుకోవడం,
గుర్తుపెట్టుకోవడం,
వ్యక్తీకరించడం,
పునర్నిర్మించటం కూడా.
ప్రపంచ వ్యాప్తంగా టాపర్లు అనుసరిస్తున్న శాస్త్రీయమైన పఠన పద్ధతిని తెలుసుకుందాం!

పాఠ్యపుస్తకాలూ, వ్యాసాలూ, నివేదికలూ లాంటి ఎలాంటివాటినైనా క్రమపద్ధతిలో చదివి గుర్తుపెట్టుకోవడానికి విద్యావేత్తలు ఓ శాస్త్రీయ విధానం రూపొందించారు. అదే SQ3R.దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన ఈ పఠన పద్ధతికి రూపకల్పన చేసిన విద్యావేత్త ఫ్రాన్సిస్‌ రాబిన్సన్‌. 1941లో రూపొందిన ఈ పఠన పద్ధతి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు పొంది, SQ4R,SQ7R విస్తృతితోపాటు SQRW సంక్షిప్త రూపం కూడా సంతరించుకుంది.
ఎన్ని రూపాంతరాలు వచ్చినా ఓ మంచి పఠన పద్ధతిగా కోట్లమంది సూపర్‌ విద్యార్థులు అనుసరిస్తున్న చదువు ఫార్ములా SQ3R.
ఆ ఫార్ములా మూల స్వభావాన్ని మార్చకుండా కొద్దిపాటి చేర్పులతో గరిష్ఠ లబ్ధి ఎలా పొందొచ్చో తెలుసుకుందాం.

విహంగ వీక్షణం (Survey)
SQ3R మొదటిది S- సర్వే. అంటే విహంగ వీక్షణం. వివరాల్లోకి పోకుండా విషయాన్ని తెలుసుకోవడం. దీనికి మరోపేరు క్విక్‌ రీడ్‌/ప్రీ రీడ్‌. ప్రముఖ విద్యావేత్త వై.సి. హాలన్‌ ఇది ఏడు దశల్లో ఉండొచ్చని సూచించాడు.

* వ్యాస సారాంశం ప్రతిఫలించేలా శీర్షిక ఉంటుంది. శీర్షికను చూడగానే దానికి సంబంధించి అదివరకే తెలిసిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
* మొదటి పేరాగ్రాఫ్‌ను చదవాలి. రచయిత తాను విశదం చేయబోయే విషయాన్ని ఇందులో ఆవిష్కరిస్తాడు.
* ఉప శీర్షికలను (Side headings) చూడాలి. ప్రధాన భావాలకు ఇవి టార్చిలైట్లుగా పనికొస్తాయి.
* పేరాల్లోని కీలక పదాలను (Key words)పట్టుకోవాలి. ఇవి ఇటాలిక్స్‌లో కానీ, ప్రత్యేక ఆకృతిలో కానీ ఉండవచ్చు.
* బొమ్మలు, రేఖాచిత్రాలు, టేబుల్స్‌ వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అసలు విషయం అర్థం కావడానికి ఇవి తోడ్పడతాయి.
* చివరి పేరాగ్రాఫ్‌ను జాగ్రత్తగా చదవాలి. విషయ సారాంశం ఇందులో ఉంటుంది.
* ఇవన్నీ పూర్తయ్యాక, కళ్ళు మూసుకుని మనం తెలుసుకున్న విషయాలను మననం చేసుకోవాలి. దీనివల్ల విషయంలోని ప్రధాన భావాలు స్పష్టమవుతాయి.
ఈ 'సర్వే' 4- 5 నిమిషాలు మించకూడదు.

ప్రశ్నించడం (Question)

చదివినదాని నుంచి ఫలితం సాధించాలంటే... ఆ చదివే విధానం క్రియాశీలం (active) గా ఉండాలి. అసలు ఎందుకు చదవాలి, ఏం తెలుసుకోవాలనేది స్పష్టం కావాలి. అందుకు ఉపకరించేది ప్రశ్న. 'ప్రశ్నలకు సమాధానం రాబట్టే విధానం'తో చదవడం వల్ల విషయం బాగా ఒంటబడుతుంది. అందుకు మనం తయారుచేసుకునే ప్రశ్నలనిధి (క్వశ్చన్‌ బ్యాంక్‌) దోహదం చేస్తుంది. పాఠం చివర ఇచ్చే ప్రశ్నలూ, అధ్యాపకుడు అడిగే ప్రశ్నలూ, పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలూ ఈ 'నిధి'లో ఉండేట్టు చూసుకోవాలి. ఇంకా...

* ఉపశీర్షికలకు ప్రశ్నల రూపం: వ్యాసంలోని ఉపశీర్షికలను ప్రశ్నలుగా మార్చివేసి వాటిని నోట్సులో రాసుకోవాలి. ప్రశ్నకూ, ప్రశ్నకూ మధ్యలో జవాబులు రాసుకోవడానికి వీలుగా నాలుగైదు వాక్యాలు రాసుకునే జాగా వదిలివేయాలి.
* భావ స్పష్టత: ప్రతి రచయితా తన భావ ప్రకటన కోసం కొన్ని నిర్దిష్ట పదాలను వాడతాడు. ఆ పదాలకుండే అర్థాన్ని తెలుసుకుంటే తప్ప అతని భావం స్పష్టం కాదు. ఉదాహరణకు... లౌకికవాదం (సెక్యులరిజం) అనే పదం మన రాజ్యాంగంలో ఉంది. దానికి వివరణ లేకపోవటం వల్ల లౌకికవాదానికి ఎవరికి తోచిన అర్థం వారు తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. అలాంటి పదమే సామాజిక న్యాయం. అందువల్ల నిర్దిష్ట పదాలను ప్రశ్నించుకోవాలి.
* విషయ యదార్థత: రచయిత చెప్పే విషయాలు యథార్థమైనవేనా అని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించడం వల్ల భావ స్పష్టత, విషయ యదార్థత అవగతమవుతాయి.

3 R:- READ, RECITE and REVIEW

చదవడం (READ)

3 R మొదటి R-READ - చదవడం.
* సమాచారంలో అప్రధాన భావాలనుంచి ప్రధాన భావాలను వేరు చేయాలి. ముఖ్యమైన భావాలను, కీలక పదాలను పట్టుకొని వాటి అర్థాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.
* రచనలో ఓ నిర్మాణం (Structure) ఉంటుంది. అందులో ఉపోద్ఘాతం, అసలు విషయం, ముగింపు ఉంటాయి. విషయంలో కొన్ని ముఖ్య భావాలు పరిణామ క్రమంలో ఉంటాయి. ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగితే రచయిత ఆంతర్యం అవగతమై, విషయం అర్థమవుతుంది; స్పష్టంగా గుర్తుంటుంది.

* వ్యాసంలో కొంత భాగాన్ని చదివాక, ఎంతవరకు మనం అర్థం చేసుకున్నామో సింహావలోకనం చేసుకోవాలి. దాన్ని మన సొంత మాటల్లో సమీక్షించుకోవాలి. జ్ఞాపకానికి రానివాటిని తిరిగి చూడాలి. ముఖ్యమైన భాగాలను అండర్‌లైన్‌ చేసుకోవాలి. మనకు స్ఫురించిన భావాలు మార్జిన్లో రాసుకోవాలి. ఇది విషయ అవగాహనకు ఎంతగానో దోహదపడుతుంది.

ఇప్పుడు మరో ప్రధానమైన పనిచేయాలి. ప్రశ్నలుగా మార్చుకున్న ఉపశీర్షికలకు తగిన జవాబులు ఈ చాప్టరులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. నోట్సు పుస్తకంలో రాసుకున్న ప్రశ్నల కింద వదిలిన స్థలాల్లో ఇప్పుడు జవాబులు రాసుకోవాలి. జవాబులు లేనిపక్షంలో ఆ ప్రశ్నలను తీసివేయాలి. లేదా ఆ ప్రశ్నలకు జవాబులు మరో పుస్తకంలో దొరికితే వాటిని ఇక్కడ లిఖించుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల రచయిత ఏం చెప్పాడో, ఎంత చెప్పాడో తెలుస్తుంది. ఎక్కడెక్కడ జవాబులు పేలవంగా ఉన్నాయో, వాటి నాణ్యత పెంచడానికి ఏమేం పాయింట్లు చేర్చాలో విశదమవుతుంది.

వల్లెవేయడం (RECITE)

3 R లో రెండో R 'RECITE'. అంటే తిరిగి చెప్పటం/ వల్లె వేయటం. ప్రశ్నలకు రాసుకున్న సమాధానాలను చూడకుండా వల్లించగలగాలి. ఎవరైనా మిత్రుడికి చెప్పాలి లేదా తానే వల్లించుకోవాలి. ఇలా ఏది చేసినా అది రచయిత మాటల్లో కాకుండా సొంత మాటల్లో చెప్పాలి.

ఒకసారి చదివిన విషయాన్ని తిరిగి చదవకపోతే రెండు వారాల్లోపల దాదాపు 80 శాతం సమాచారాన్ని మర్చిపోతామనీ, అలాకాక చదివిన విషయాన్ని వెంటనే వల్లెవేయడం వల్ల 80 శాతం విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చనీ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

వల్లెవేయడం మౌఖికంగానే ఉండనక్కర్లేదు. చదివినదాన్ని రాయడం కూడా వల్లెవేయడమే. వీటితోపాటు- చదివినదాన్ని ఇతరులకు బోధించడం ద్వారా ఎక్కవ నేర్చుకోవచ్చని విద్యావేత్తలు వివరిస్తున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు స్టీవెన్‌ ఆర్‌ కవీ తన సెమినార్‌ ప్రారంభంలో ఈ పద్ధతి గురించి వివరించి దాన్ని అభ్యాసం చేయిస్తాడు. బోధించడం ద్వారా నేర్చుకోవడం (Learning through teaching)) అనేది శక్తిమంతమైన ప్రక్రియ అంటారాయన.

సమీక్షించుకోవడం (REVIEW)

3 R మూడోది 'రివ్యూ'. అంటే సమీక్షించుకోవడం. మనం తయారుచేసుకున్న ప్రశ్న జవాబుల్లో ఉండే స్టడీ గైడ్‌ను తరచూ చూసుకుంటూ అందులోని అంశాలను సమీక్షించుకుంటూ ఉండాలి. కొద్దిపాటి సమయం దొరికిన ప్రతిసారీ వాటిని చూస్తూఉండాలి. చూడడం అంటే పైపై చూడటం కాదు.

* విషయానికి లోతు (Depth)ఉంటుంది. ఒకే విషయానికి సంబంధించిన వేర్వేరు అంశాలను నిశితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు... చంద్రయాన్‌- ఈ గురించి మాట్లాడేటప్పుడు మన రాకెట్ల పరిజ్ఞానం గురించీ, ఇంతవరకు భారత్‌లో, ఇతరదేశాల్లో జరిగిన పరిశోధనల గురించీ, చంద్రమండలంపై జరగబోయే పరిశోధనల గురించీ, వాటివల్ల భారత్‌కూ, ప్రపంచానికీ లాభాల గురించీ, భవిష్యత్తులో జరగబోయే పరిశోధనలకు ఇది ఎంతవరకూ సహకరించగలతో ఆ వైనం గురించీ... ఇలా లోతుగా తెలుసుకోవాలి.

*విషయానికి విపులత (Width))ఉంటుంది. అనేక అంశాలకు చెందినవాటి గురించి తెలుసుకోవడమన్నమాట. ఉదాహరణకు... శాస్త్ర సంబంధమైన అంశాలనే కాకుండా చరిత్ర, సంగీతం, సాహిత్యం, మనో విజ్ఞానం, యాజమాన్య విద్య లాంటి అంశాల గురించి తెలుసుకోవడం, వాటి దృష్ట్యా విషయాన్ని విశ్లేషించడం.

ఈ విధంగా విషయం లోతునూ, దాన్ని విపులతనూ సమీక్షించగలిగితే దాన్ని అర్థం చేసుకోవడం తేలిక. అంతే కాదు, దానివల్ల విషయ వ్యక్తీకరణలో నిండుదనం వస్తుంది.

పఠనంలో ఈ ఐదు అంశాలనూ విహంగవీక్షణం, ప్రశ్నించడం, చదవడం, వల్లెవేయడం, సమీక్షించుకోవడం చేయగలిగితే ప్రతి విద్యార్థీ ఓ సూపర్‌ విద్యార్థి కాగలుగుతాడు.

ఈ SQ3Rపాటు ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందుతున్న మరొక విధానం- 'పవర్‌ రీడింగ్‌'. దీని పవర్‌ ఏమిటో చూద్దాం!

whysatyanarayana@yahoo.co.in

(ఈనాడు, చదువు , ౨౩:౦౨:౨౦౦౯)

_____________________________


'పవర్‌ రీడింగ్‌'
మెల్లగా చదివితే మేలా?
సత్య
కొందరిది మెల్లగా చదివే అలవాటు. మరికొందరు వేగంగా చదివేస్తుంటారు. వీటిలో ఏ పద్ధతి సరైనది? చక్రానికి వేగం పెరిగేకొద్దీ దాని శక్తి పెరుగుతుంది కదా? చదువు కూడా అంతే! వేగం పెరిగేకొద్దీ, దాని పవర్‌ పెరుగుతుంది. పుస్తకాల్లోని విషయాన్ని వేగంగా గ్రహించడానికి విద్యావేత్తలు పరిశోధించి కనిపెట్టిన కొన్ని కిటుకులున్నాయి. వాటిని తెలుసుకుందామా?




సగటు విద్యార్థుల దృష్టిలో చదవటం అంటే ఓ సబ్జెక్టు గురించి తెలుసుకోవడం/దాన్ని అర్థం చేసుకోవడం. ఉత్తమ విద్యార్థుల దృష్టిలో- వీటితోపాటు పుస్తకంలోని కీలక సమాచారాన్ని వేగంగా రాబట్టి ఒంటపట్టించుకోవడం కూడా. దీనికి వారు ఉపయోగించే పద్ధతే 'పవర్‌ రీడింగ్‌'. ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత వేగంతో చదవాలో వివరించే ప్రక్రియ ఇది.

పవర్‌రీడింగ్‌ ప్రక్రియనూ, పదబంధాన్నీ ప్రాచుర్యంలోకి తెచ్చిన విద్యావేత్త రిక్‌ ఆస్ట్రోవ్‌. పఠనంపై జీవితకాలం పరిశోధించిన ఆస్ట్రోవ్‌ 1978లోనే పవర్‌ రీడింగ్‌ కోసం ఓ కోర్సును ప్రారంభించాడు. ఈయనతోపాటు 'ఏడమ్‌ కూ' అనే యువ విద్యావేత్త కూడా దీనిపై కొత్తకోణాలు ఆవిష్కరించాడు.

పవర్‌ రీడింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన అంశాలు పరిశీలిద్దాం.

1. కీలక సమాచారం సేకరించడం
ఓ పుస్తకంలో ఎన్ని పేజీలు చదివామనేది కాదు; దాన్నుంచి ఎంత విలువైన సమాచారాన్ని సేకరించామనేది ముఖ్యం. ఏ పుస్తకంలో అయినా కేవలం 20 శాతం మాటలే మొత్తం సమాచారాన్ని అందిస్తాయి. ఇవే కీలక పదాలు (కీ వర్డ్స్‌). వీటిలోనే విషయం- అసలైన పవర్‌ ఉంటుంది. మిగతా 80 శాతం అప్రధానమైన, శక్తిహీనమైన వ్యర్థపదాలే. కీలక పదాలనూ, కీలక భావాలనూ మిగతా అప్రధాన పదాల నుంచి వేరు చేసి ఒంట పట్టించుకోవడమే పవర్‌ రీడింగ్‌.
రాతలోని 20 శాతం పదాల్లోనే సారమంతా ఉంటే మిగతా 80 శాతం పదాలను రచయితలు ఎందుకు ఉపయోగిస్తారనే సందేహం వస్తుంది.

* మొట్టమొదటిసారి ఓ పుస్తకాన్ని చదివేటప్పుడు విషయం స్పష్టంగా అర్థం కావడానికీ, భావాల మధ్య సంబంధాన్ని తెలియజేయడానికీ ఈ అప్రధాన పదాలు అవసరమవుతాయి.
* కానీ రెండోసారీ, మూడోసారీ చదివేటప్పుడు ఈ వ్యర్థపదాలే 80 శాతం కాలాన్ని హరించివేస్తూ ఉంటాయి.
రైతు వరి చేను నుంచి ధానాన్ని వేరుచేసి, మిగతా గడ్డీగాదరను వదిలేసినట్టుగా పుస్తకంలోని కీలక పదాలను సేకరించి, మూలసారాన్ని గ్రహించి, పిప్పిని వదిలెయ్యాలి. ఇది పవర్‌ రీడింగ్‌కు ప్రాణం.

2. అర్థం చేసుకుంటూ చదవటం (comprehension)
పుస్తకంలోని ఒక్కో పదం ఒక్కో ఇటుక లాంటిది. వాటిని ఓ క్రమపద్ధతిలో పేర్చి తన భావాలకు వాహికగా తయారుచేస్తాడు రచయిత. పాఠకుడు వాటిని గ్రహించి, రచయిత భావాన్ని ఇటుక ఇటుకగా తన మనసులో పునర్నిర్మించుకోవాలి. దాన్ని సక్రమంగా నిర్మించుకుంటేనే రచయిత భావం పాఠకునిలో ఆవిష్కారమవుతుంది.

రచయిత ఒక్కోసారి కొత్త పదాలనూ, పదబంధాలనూ సృష్టిస్తుంటాడు. అదివరకే ఉన్న పదాలను కొత్త అర్థాల్లో వాడుతూ ఉంటాడు. అలాంటివాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

చదవడం అడవిలో ప్రయాణం లాంటిది. పాఠకుడు సాఫీగా ప్రయాణించడానికి అడవిలో ఓ దారి ఏర్పాటు చేస్తాడు రచయిత. అయితే ఆ ప్రయాణంలో తారసిల్లే అనేక చెట్లలాంటి భావాల మధ్య దృష్టి చెదరి పాఠకుడు దారితప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దారి తప్పిన ప్రయాణికుడు తెలిసిన దారి దగ్గరకు తిరిగి వచ్చి ప్రయాణం సాగించి, గమ్యం చేరతాడు. అలాగే పాఠకుడు కూడా తాను మరోమార్గంలో వెళ్తున్నట్టు గ్రహించగానే తెలిసిన విషయం దగ్గరకు చేరుకుని తిరిగి చదవడం ప్రారంభించాలి.

3. ఏకాగ్రత పాటించడం (concentration)
ఓ పని చేస్తున్నపుడు మూడు ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి.
ఒకటి: చేస్తున్న పని.రెండు: దానికి సంబంధించిన ఆలోచనలు.
మూడు: దానికి సంబంధం లేని ఆలోచనలు.
చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైతే ఏ ఆలోచనలూ రావు. వచ్చినా పనికి సంబంధించిన ఆలోచనలై ఉంటాయి. అప్పుడే పూర్తి ఏకాగ్రత కుదురుతుంది. అయితే అది అందరికీ సాధ్యం కాదు.

కొన్ని వాక్యాలు/పేరాగ్రాఫులు చదివాక అకస్మాత్తుగా మనసు చదువుతున్న విషయాన్ని విస్మరించి మరేవో విషయాలను తరుముకుంటూ పోతుంది. అలాంటప్పుడు ఏకాగ్రత భగ్నమై చదివే విషయం అర్థం కాకుండా పోతుంది. అందువల్ల చదివేటప్పుడు ధ్యాసంతా చదివే విషయంపైనే కేంద్రీకరించాలి.

పనిలో నిమగ్నం కావడం, పనికి సంబంధించిన ఆలోచనలు చేయడం, పనికి ఆటంకం కలిగించే ఆలోచనలను విస్మరించడం కేవలం ఏకాగ్రతతోనే సాధ్యం.

4. పఠనంలో వేగం (speed reading)
చక్రానికి వేగం పెరిగేకొద్దీ దాని శక్తి పెరుగుతుంది. అలాగే చదువు వేగం పెరిగేకొద్దీ, చదువు పవర్‌ పెరుగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో నిలవాలంటే విషయాన్ని వేగంగా అందిపుచ్చుకోవడం తప్పనిసరి. అందుకు కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలి.

సగటు విద్యార్థి కన్ను ప్రతి పదాన్నీ పలకరిస్తుంది. పదం నుంచి అది మరో పదానికి వెళ్ళడానికి కనీసం అరసెకను కాలాన్ని కేటాయిస్తే నిమిషంలో 120 మాటలు మించి చదవడానికి వీలు కాదు. దీనివల్ల చదువు సాగదు.

చదువులో వేగం పెరగాలంటే మన కన్ను చూడవలసింది ఒకసారి ఒక పదాన్ని కాదు; కనీసం రెండు మూడు పదాలను. అలా చేస్తే నిమిషంలో 240-360 పదాలను పూర్తిచేయవచ్చు. ఇది మధ్యస్థ విద్యార్థి చదివే వేగం.

అయితే ఉత్తమ విద్యార్థి నిమిషానికి 600-840 మాటలను అవలీలగా పూర్తిచేస్తాడు. అతని కన్ను 5 నుంచి 7 పదాలను క్లిక్‌మన్పిస్తుంది. అంటే సగటు విద్యార్థి కంటే ఉత్తమ విద్యార్థి మూడు రెట్లు వేగంగా చదువుతాడు.

వేగంగా చదవడానికి ఈ కొత్త అలవాటుతో పాటు అంతవరకూ ఉన్న కొన్ని పాత అలవాట్లను మార్చుకోవాలి. అవి...

*పెదాలతో చదవడం (lip reading):కొందరు పైకి బిగ్గరగా చదువుతారు. కొందరు పైకి చదవకపోయినా పెదాలతో చదువుతారు. పెదాల కదలిక వేగాన్ని నియంత్రించి వేస్తుంది.
*అంతర్వాణి (sub-vocalisation):కొందరి పెదాలు కదలవు. కానీ లోపల ఓ అంతర్వాణి వాళ్ళకు చదివి వినిపిస్తూ ఉంటుంది. ఇది వేగాన్ని మందగిస్తుంది.
*చదువులో వూగిసలాట (regression):చాలామంది చదువుతూ తిరిగి వెనక్కివచ్చి చదివిందే చదువుతూ ఉంటారు. ఓ అంచనా ప్రకారం ఒక పేజీ పూర్తయ్యేసరికి దాదాపు నలబైసార్లు ఈ ఊగిసలాట జరుగుతుంది. ఇది విలువైన కాలాన్ని హరించివేస్తుంది.

ఈ విధంగా కీలక సమాచారాన్ని సేకరించడం, చదివినదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, విషయంపై ధ్యాసపెట్టటం, వేగంగా చదవడం అనే అంశాలు కలిసిన పఠన విధానమే పవర్‌ రీడింగ్‌. అయితే ఈ అంశాలన్నీ వేటికవే కాకుండా పరస్పర ఆధారితంగా (synergistic approach) ఉన్నపుడే వీటినుంచి నిజమైన పవర్‌ ఉద్భవిస్తుంది.


చదువులో వేగం పెరగాలంటే మన కన్ను చూడవలసింది ఒకసారి ఒక పదాన్ని కాదు; కనీసం రెండు మూడు పదాలను. అలా చేస్తే నిమిషంలో 240-360 పదాలను పూర్తిచేయవచ్చు. ఉత్తమ విద్యార్థి నిమిషానికి 600-840 మాటలను అవలీలగా పూర్తిచేస్తాడు. అతని కన్ను 5 నుంచి 7 పదాలను క్లిక్మన్పిస్తుంది. అంటే సగటు విద్యార్థి కంటే ఉత్తమ విద్యార్థి మూడు రెట్లు వేగంగా చదువుతాడు.
చాలామంది చదువుతూ తిరిగి వెనక్కివచ్చి చదివిందే చదువుతూ ఉంటారు. ఒక పేజీ పూర్తయ్యేసరికి ఇలా దాదాపు నలబైసార్లు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలవాటు మన విలువైన కాలాన్ని హరించివేస్తుంది.
చూపు పుస్తకంపైన, చిత్తం...
విషయం అర్థం కావాలంటే దానిపై ధ్యాస పెట్టాలి. ధ్యాస నిలవాలంటే వేగం కావాలి. మెల్లగా చదివితే ధ్యాస నిలవదా అని సందేహం రావొచ్చు.

విద్యానిపుణుల పరిశోధనల ప్రకారం మెల్లగా చదివేవారి దృష్టి పక్కదారులు (divert)పడుతుంది. వేరే సంగతుల మీదికి షికార్లు పోతుంది. 'చూపు శివుడి మీద, చిత్తం చెప్పుల మీద' అన్నట్టు- చూపు పుస్తకంపైన, చిత్తం మాత్రం చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటుంది. మనసు నిలకడగా ఒకచోట ఉండాలంటే వేగంగా చదివే అలవాటు నేర్చుకోవాలి.

గంటకు 10 కి.మీ. వేగంతో కారు నడిపే వాడికీ, గంటకు వంద మైళ్ళ వేగంతో కారు నడిపే వాడికీ తేడా ఏమిటి? 10 కి.మీ. వేగం నిజానికి వేగమే కాదు. మాత్రం వేగానికి రోడ్డు మీద ధ్యాస నిలవదు. చూపు చుట్టుపక్కల పెత్తనానికి పోతుంది. అందే వంద కిలోమీటర్ల వేగంతో వెళితే దారిమీద తప్ప వేరే దానిమీద ధ్యాసకు అవకాశమే ఉండదు. కాబట్టి వేగంగా చదివితే గానీ ధ్యాస కుదరదు. పైగా మన కన్ను, మనసు కూడా నిమిషానికి 20,000 మాటలకు పైగా చదివి, అర్థాన్ని గ్రహించగలిగే శక్తిమంతమైన సాధనాలు. 'పాల్స్కీల్‌' ఫొటో రీడింగ్పద్ధతి ద్వారా నిమిషానికి 25,000 మాటలు అర్థం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు.

అయితే... సగటు విద్యార్థి నిమిషానికి 200 మాటలే చదువుతాడు. అంటే తన శక్తిలో ఒక శాతం మాత్రమే వినియోగించుకుంటూ మిగతా 99 శాతాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. దీన్ని మరోలా చెప్పాలంటే గంటకు 200 కి.మీ. వెళ్ళగల కారును గంటకు 2 కి.మీ. మందగమనానికే వినియోగించడం లాంటిది. దీనివల్ల ధ్యాస కుదరదు; చదివింది కూడా అర్థం కాదు.

వేగంగా చదవడం వల్ల విషయంపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం వల్ల విషయం లోతుగా అర్థమవుతుంది. అర్థమైన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి అర్థం చేసుకోవడం, ఏకాగ్రత, వేగంగా చదవడం పరస్పర ఆధారితాలు. ఇవి పవర్రీడింగ్కు ప్రాణాధారమైన అంశాలు.


(ఈనాడు, చదువు, ౦౨:౦౩:౨౦౦౯)
_______________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home