శృంగార యోగం



యోగసాధన ద్వారా మనిషి తాను సుఖంగా బతుకుతూ లోకాన్ని సుఖంగా బతకనివ్వడం సాధ్యమవుతుంది. 'నేను, నాది' అనే పరిధిలోంచి 'మనము, మనది' అనే పరిధిలోకి వ్యాపించడం కుదురుతుంది. కనుక ఇంటాబయటా బతుకులో ప్రశాంతత లభించడానికి అవకాశాలు పెరుగుతాయి. దానికితోడు యోగప్రక్రియల ద్వారా మరో గొప్ప ప్రయోజనం సిద్ధిస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యోగసాధన శృంగార జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుందన్నది వాటి సారాంశం. ఆరోగ్యానికి మాత్రమే కాక శృంగారానికి ఉత్ప్రేరకంగానూ యోగసాధన పనికొస్తుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. శృంగారంలో అసంతృప్తికి లోనయ్యే మహిళలు భారతీయ యోగసాధనల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చునంటున్నారు. వారిలో లైంగిక ఆసక్తిని ప్రేరేపించడం మొదలు భావప్రాప్తిని కలిగించడం వరకు యోగా తోడ్పాటు అందిస్తుందని తేలింది. అలాగే పురుషుల్లో శీఘ్రస్ఖలనంతో పాటు ఎన్నో సమస్యలను నివారించడమూ సాధ్యమని చెబుతున్నారు. 'మైండ్‌ఫుల్‌నెస్' అనేది దీని అంతటికీ కారణంగా వారు విశ్లేషిస్తున్నారు. మనిషి తాను ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో దానిపట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండటాన్నే వారు మైండ్‌ఫుల్‌నెస్‌గా చెప్పారు. దాన్నే మనం 'వర్తమానంలో ఉండటం' అంటాం. నిన్నటి దిగులులోనో, రేపటి బెంగలోనో కాకుండా ఈ క్షణంలో మనిషి తనతో తాను ఉండటమే ఏకాగ్రత. యోగప్రక్రియల ద్వారా అలాంటి ఏకాగ్రతను సాధిస్తే శృంగార జీవితం రసమయం అవుతుందన్నది ఆ పరిశోధనల సారాంశం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ యోగా మేలు చేస్తుందని వారు గట్టిగా చెబుతున్నారు. ఇది తెలిస్తే యోగ సాధనలపై మోజు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. బద్ధక యోగాసనాలకు బదులు ఇష్టపూర్తి సాధనలు మొదలవుతాయంటున్నారు. యోగ సాధనల ప్రయోజనం మరింత విస్తృతంకావడం- ఆనందం, ఆరోగ్యం!
(ఈనాడు, సంపాదకీయం, ౦౧:౦౨:౨౦౦౯)
________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home