నాజూకుపైనే మోజేలనో?

రోజువారీ పనులను చక్కబెట్టుకోడానికి శరీరానికి నిత్యం కొంత శక్తి అవసరం. వైద్య పరిభాషలో దాన్ని 'ఎఫర్ట్ టాలరెన్స్' అంటారు. రోజూ వ్యాయామం చేస్తూ పుష్టికరమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఆ చేవను గణనీయంగాపెంచవచ్చునని వైద్యశాస్త్రాలు చెబుతున్నాయి. 'తిండి కలిగితే కండ కలదోయ్- కండగలవాడేను మనిషోయ్' అన్నమహాకవి ప్రబోధం ఇక్కడ స్మరణీయం. దేహానికి రోగ నిరోధక శక్తి, కష్టాన్ని తట్టుకునే సామర్థ్యం ఆహారం ద్వారాలభిస్తాయి. ఆహారాల్లో అన్నం ప్రధానమైనది. శరీర పోషణకు అన్నం, శ్రమను దూరం చేసేందుకు జలం, జీవశక్తినీ ధాతుపుష్టినీ చేకూర్చేందుకు పాలు శ్రేష్ఠమైనవని ఆచార్య చరకుడు ప్రకటించాడు. 'మనిషిలో బలం- జఠరాగ్ని దీప్తిని బట్టిఉంటుంది. వీర్యపుష్టిపై జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక అగ్నిదీప్తినీ, వీర్యబలిమినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి' అనిచరకసంహిత బోధించింది. అందుకోసం పాటించవలసిన ఆహార నియమాలను, వ్యాయామ విధానాలను సూచించింది. వాటి ఆవశ్యకతను వివరించింది. వ్యాయామంవల్ల శరీర లాఘవం, పనితనం, స్త్థెర్యం, కష్టానికి ఓర్చుకునే శక్తికలుగుతాయని ప్రాచీన గ్రంథాలు వెల్లడించాయి. పూర్వకాలంలో రాజులు వ్యాయామ సూత్రాలను గట్టిగా పాటించేవారు. రాయవాచకంలో స్థానాపతి వివరించిన కృష్ణరాయల నిత్య వ్యాయామ విధానాలు చాలా ప్రసిద్ధమైనవి. సమాజంలోనూవ్యాయామ క్రీడలకు గుర్తింపు లభించేది. శరీర దారుఢ్యాన్ని బాగా పెంచుకుని కుస్తీ పోటీల్లో పాల్గొనే వస్తాదులకుప్రోత్సాహం లభించేది. ఇనుప నరాలు ఉక్కు కండరాలతో జవం జీవం తొణికిసలాడేలా యువత శరీర పటుత్వాన్నిపెంపొందించుకోవాలని వివేకానందుడు పిలుపిచ్చాడు. 'ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్?' అనిగురజాడ వాపోయాడు.
వ్యాయామ ప్రక్రియ ఇన్నాళ్ళూ పురుషులకే పరిమితమవుతూ వచ్చింది. ఆరోగ్య సాధనంగానే తప్ప, సౌందర్యదోహదకారిగా దానికి గుర్తింపు లేదు. బలిష్ఠమైన చేతులు, కండలు తిరిగిన దేహం, విశాలమైన ఛాతీ... తదితరాలుమగసిరికి చిహ్నాలుగా నిలిచాయి. '...ఎకరం పాతికఛాతీ ఎకాయెకిన కొలుత్తుంటే ఏనుగు తొండాలు రెండు ఎనకనవాటేశాయి...' అన్న పల్లెపడుచు మురిపెం దానికి సాక్ష్యం. టెన్నిస్ మాజీ తార మార్టినా నవ్రతిలోవా ముంజేతి కండరాలుచూసి కంగారుపడిన క్రిస్ ఎవర్ట్ లాయిడ్లా- క్రీడాకారిణులైన పడతుల చేతుల మోటతనం స్త్రీలకు సైతం ఎబ్బెట్టుగాఉంటుంది. అందుకే స్త్రీలు సున్నితమైన వ్యాయామాలకే పరిమితమయ్యారు. ఆరోగ్యానికి, చురుకుదనానికి అవసరమైనవ్యాయామాలు చేస్తూనే నాజూకుదనానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వ్యాయామాల్లో కొంత సౌందర్య దృష్టి ప్రవేశించింది. అందంగా కనబడాలన్న తహతహతో స్కిప్పింగులు, జాగింగులు ఎక్కువయ్యాయి. దాంతోపాటు శోష రాకుండాపౌష్టికాహారం తీసుకోవాలన్న సూత్రం మాత్రన్ మరుగునపడింది. శరీరాకృతికి 'జీరోసైజ్' కొలతను ప్రాచుర్యంలోకి తెచ్చినఒక హిందీనటి నిస్త్రాణతో కళ్ళు తిరిగిపడిపోయిన సంఘటన దానికి ఉదాహరణ. మగ తారల విషయానికి వస్తే గతంలో 'వి' షేపు శరీరం ఒక ఆకర్షణ. ఇప్పుడు కొలతల ప్రకారం ఆయాచోట్ల కండలు తిరిగి శరీరం బలిష్ఠంగా కనపడటం కొత్త విశేషం. 'సిక్స్ ప్యాక్' షోకును ఒక నటుడు ప్రచారంలోకి తెస్తే, 'ఎయిట్ ప్యాక్' ఆకృతితో మరో నటుడు ఆకట్టుకుంటున్నాడు. దేహాన్ని చెక్కిన గ్రీకుశిల్పంలా తీర్చిదిద్దే క్రమంలో కఠిన వ్యాయామాలతోపాటు బలమైన ఆహారమూ ముఖ్యపాత్రవహిస్తుందన్న విషయం అభిమానులు గుర్తుంచుకోవాలి. నటుల్ని అనుకరిస్తూ గుండు కొట్టించుకోవడం, కండలుపెంచడం, ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించడంతో సరిపోదు- వారు తినే పుష్టికరమైన ఆహారం సంగతీ తెలుసుకోవాలి. లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది.
(ఈనాడు, సంపాదకీయం,౨౫ :౦౧:౨౦౦౯)
_____________________________
Labels: HEALTH, Life/telugu
0 Comments:
Post a Comment
<< Home