వాఁహ్.. తాజ్

ఆనందమే కానక్కరలేదు... విరహమైనా కావచ్చు, వియోగమైనా కావచ్చు- అది కళాత్మక రూపం దాల్చినప్పుడు ఎదుటివారికి రసానుభూతిని కలిగిస్తుంది. కనుకనే విషాదభరితమైన నాటకాన్ని వేదికపై వీక్షిస్తున్నప్పుడు సైతం ప్రేక్షకుడికి ఆనందమే లభిస్తుంది. అదే కళాత్మక సృష్టి ప్రత్యేకత! తాజ్‌మహల్ కూడా అలాంటి ఒకానొక అపురూపమైన సృష్టి. నిజానికి అది వెన్నెల వాటిక కాదు- చేదు జ్ఞాపకాల పేటిక, విషాదమాలిక, వియోగ గీతిక. ఆ విషయం తెలిసినా అరుదైన ఆ సౌందర్యాన్ని ప్రేమించకుండా ఉండలేం. ఒకానొక ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ మాధుర్యాన్ని అణువణువూ పీల్చుకుని, ప్రేమకు అజరామరమైన తీపిగుర్తుగా ఠీవిగా మిగిలిపోవడం ఆ కట్టడంలోని కళాత్మక విశేషం. అద్దం మీదపడి మెరిసినట్లుగా- వెన్నెల ఆ శ్వేతసౌధంపై ప్రతిఫలిస్తుంటే చూసి ఆనందించడం ఎంతటి గొప్ప అనుభూతి! ఒక్క రసజ్ఞుడి గుండె చిరుసవ్వడికి ఎన్నో తరాల ప్రేమికుల గుండెచప్పుళ్లు ప్రతిధ్వనులుగా మారుమోగుతుండటం ఎంత గొప్ప విశేషం! ఏమనాలి ఆ జాబిలి కూనను... ఎలా వర్ణించాలి ఆ ధావళ్యాన్ని... ఏ భాషలో అక్షరబద్ధం చేయగలం ఆ అనుభూతి దొంతరలను! అందుకనే తాజ్‌మహల్ గురించి కవిత్వాలు ఎప్పటికీ కొత్తవి పుట్టుకురావడమే తప్ప- పూర్తి అయిపోవడం ఉండదు. 'తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు?' అని నిలదీయడం ఒకానొక వర్గస్పృహకు గుర్తే తప్ప- మహాకవికి దాని సౌందర్యం పట్ల చిన్నచూపులేదు. 'ముగ్గేలా తాజ్‌మహల్ మునివాకిటిలో...' అని ప్రశ్నించడం దానికి తార్కాణం.
తాజ్‌మహల్ ఇటీవల మరో సంచలనానికి కారణమైంది. విశ్వజనీనతకు, సహృదయ సంస్పందనకు మాతృకగా నిలిచింది. మరో ప్రతిరూపానికి మూలమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మరో తాజ్‌మహల్ వెలసింది. నకళ్లు పుట్టేకొద్దీ అసలుకు విలువ పెరుగుతుంది. అనువాదాలు పెరిగేకొద్దీ మూలగ్రంథానికి ప్రతిష్ఠ చేకూరుతుంది. అలా తనకో ప్రతిబింబం తయారయ్యేసరికి అసలు తాజ్‌మహల్ ప్రాశస్త్యం ఇనుమడించింది. అహసనుల్లా మోనీ అనే బంగ్లాదేశీ సంపన్న చలనచిత్ర దర్శకుడు తొలిసారిగా 1980లో తాజ్‌మహల్‌ను దర్శించాడు. దాని సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఇంతటి గొప్ప ఆనందానుభూతిని తన దేశప్రజలు చాలామంది పొందలేకపోతున్నారన్న వూహ తోచింది. పేదప్రజలైన తన దేశీయులు ఈ ఆనందాన్ని దక్కించుకోవాలంటే- వారంతా భారతదేశానికైనా రావాలి లేదా తాజ్‌మహల్‌ను బంగ్లాలో సాక్షాత్కరింపజేయాలి. వీటిలో రెండోదే సాధ్యమని మోనీ అనుకున్నాడు. అమోఘమైన తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన రూ.290 కోట్లు వెచ్చించాడు. ఢాకాకు ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో మరో తాజ్‌మహల్ నిర్మాణం పూర్తిచేశాడు. ఇటలీ నుంచి ప్రత్యేక మార్బుల్, బెల్జియం నుంచి వజ్రాలు తెప్పించారు. 160 కిలోల రాగిని వినియోగించారు. భారత్ నుంచి నిర్మాణ శాస్త్రజ్ఞులు, శిల్పకళా నిపుణులు వెళ్లారు. అత్యాధునిక నిర్మాణ సామగ్రి తోడ్పాటుతో భారీ కట్టడం అయిదేళ్లలో పూర్తయింది. అది అచ్చం ఆగ్రాలోని తాజ్‌మహల్‌లాగే కనపడుతోందంటున్నారు. ఎంతసేపూ యుద్ధ వాతావరణంలో, ఉగ్రవాద భయంతో, ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న ప్రపంచానికి ఇలా ఒక శ్వేత శాంతికుసుమాన్ని కానుక చేయాలన్న వూహ కలగడమే మోనీ ఘనతకు నిదర్శనం అంటున్నారు సామాజికవేత్తలు. అసలు తాజ్‌మహల్ నిర్మాణంలో షాజహానుకు ముంతాజ్ పట్ల ప్రేమ ప్రేరణగా నిలిచింది. అదే మోనీకి అయితే తన దేశ ప్రజలు అందరూ ఆనందించాలన్న తపన ప్రేరణ అయింది. రెండోది మరింత ఉదాత్తమైంది కదా అంటున్నారు భావుకులు. నిజమే మరి!
((ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౧:౨౦౦౯)
__________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home