My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, July 31, 2009

ధీమంతులు


కమ్మని కలలొచ్చే వేళ మేలుకోకు... అని బుజ్జగిస్తుంది కవిత్వం. కాలం కలిసొచ్చేవేళ నిదురపోకు... అని హెచ్చరిస్తుంది జీవితం. ఆ రెండింటి మధ్యగల వైరుధ్యాన్ని పరిష్కరించలేక సగటు మనిషి నిత్యం సతమతమవుతూ ఉంటాడు. మనసుకూ బుద్ధికీ మధ్యా మనిషికి ఇదే బాపతు ఊగిసలాట. మనసు నిద్రనూ, బుద్ధి మెలకువనూ సమర్థిస్తాయి. కంటికి నచ్చిందల్లా కావాలంటుంది మనసు. నిజంగా దాంతో అవసరం ఉందో లేదో ముందు తేల్చుకొమ్మంటుంది బుద్ధి. దేనిమాట వినాలో తోచక మనిషి గందరగోళానికి గురవుతాడు. ఒత్తిడికి ఇదో ముఖ్య కారణం. అన్ని విషయాలపట్ల ఆసక్తిని ప్రోత్సహిస్తుంది మనసు. అనవసరమైన వాటి విషయమై హెచ్చరిస్తుంది బుద్ధి. 'ధ్యానము నిల్వదాయె... మది దారుణ కోర్కెలు సందడించె...' అని వాపోయాడొక కవి. మనసు బలోపేతమై, మనిషిని బుద్ధినుంచి దూరంచేసిందని దాని తాత్పర్యం. ధీ అంటే బుద్ధి, మతి అంటే ఆలోచన! ధీరుడు, ధీమతి, ధీయుతుడు, ధీమంతుడు వంటి పదాలన్నీ ఆ పాదులోంచే వచ్చాయి. వాటి ఉచ్చారణలోనే ఒకరకమైన ఉదాత్తత మనకు తోస్తుంది. బుద్ధిమంతుడు, ఉన్నతుడు, విద్వాంసుడు వంటి అర్థాలు స్ఫురిస్తాయి. దేవగురువు బృహస్పతిని ధీపతి అంటారు. ధీశక్తికి సర్వత్రా గౌరవం దక్కుతుంది. ధీశక్తికి ప్రేరణ కలిగించడం గాయత్రీ మంత్రం ఉద్దేశం. ధీశక్తిని పెంపొందించుకోవడానికి ధ్యానం మంచి సాధనం. ధ్యానం అంటే ధీ తో కలిసి యానం లేదా బుద్ధితో కలిసి నడవడం. ధ్యానాలు ఆసనాలు ప్రాణాయామాల వంటివి మతసంబంధమైనవి కావు. అవి యోగప్రక్రియలు. మానవ నాగరికతా చిహ్నాలు. సంపూర్ణ ఆరోగ్యానికి సాధనాలు. ఆ రకమైన సాధనలు లేకుంటే మనసుకు ప్రత్యేక అస్తిత్వం ఏర్పడుతుంది. మనిషిపై అదుపు సాధిస్తుంది. మనిషికన్నా వేరుగా పనిచేస్తుంది. స్వేచ్ఛగా విహరిస్తున్న మనసును కట్టడిచేసి, బుద్ధి నియంత్రణలోకి తెచ్చే సాధనమే ధ్యానం! ధీమంతుల జీవనవైఖరిలో ధ్యానం ఒక భాగం. మనిషిని ఉన్నత శిఖరాల దిశగా ప్రయాణానికి ప్రోత్సహించే ఉద్దీపకం. వ్యక్తిచేతనను ఉదాత్తపరచే ఒకానొక రసాయనిక ప్రక్రియ.

'ఆరోగ్యం అంటే ఒంట్లో రోగం లేకపోవడం ఒకటే కాదు- శారీరక మానసిక కక్ష్యలన్నింటా నిరంతరం ఉల్లాసంగా ఉండటం'- అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. యోగ ప్రక్రియలు దానికి అనువైన సాధనాలు. సాధారణ వ్యాయామాలు, పౌష్టిక ఆహారనియమాలు శరీరానికి ఎలాగో- ధ్యానాలు, ఆసనాలు మనసుకు అలాగ! మనోవిశ్లేషణ ఆధారిత చికిత్సావిధానం (కుయేయిజం)లో ధ్యానానిది ప్రముఖస్థానం. ధ్యానముద్రలు మనిషి నాడీమండలంపై చూపగల ప్రభావాన్ని భారతీయ శాస్త్రగ్రంథాలు చాలాచోట్ల వివరించాయి. ధ్యాన సమయంలో మనిషిలో వ్యాపించే గాఢమైన నిశ్శబ్దాన్ని పరమహంస యోగానందజీ 'ఒక యోగి ఆత్మకథ'లో విశ్లేషించారు. '... ఈ నిశ్శబ్దం బొక కోటి శబ్దముల కేనిన్‌ మించి బోధించెడిన్‌' అంటూ దాని ప్రభావాన్ని కవి వర్ణించారు. ఆ తరహా నిశ్శబ్దస్థితి మౌనంకంటే భిన్నమైనది. ఎంతో అమూల్యమైనది. అనుభవజ్ఞులకు మాత్రమే తెలుస్తుందది. ఆ రుచి తెలిసినవాడు ధ్యానాన్ని జీవితంలో విడిచిపెట్టడు. అలాగే ధ్యాన భంగిమల్లో రామణీయకతను గుర్తించి వర్ణించిన కవులూ ఉన్నారు. వారిలో కాళిదాసు ముందు వరసలోనివాడు. కుమారసంభవమ్‌లో పార్వతీదేవి ధ్యాన భంగిమను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం (స్థితాఃక్షణం.. ప్రథమోదబిందవః) చిరస్మరణీయం. మళ్లీ అంతటి గడుసుతనాన్ని ప్రదర్శించినవాడు నన్నెచోడుడు. తలపై రాలిన తొలకరి చినుకులు ఆమె నాభిదాకా ప్రయాణించిన వైనాన్ని అపురూపంగా వర్ణించాడు. తాను చెప్పకుండానే ఆ ధ్యాన భంగిమను పద్మాసనంగా మనకి తోపింపజేశాడు. కనుక ధ్యానానికి చెందిన ముద్రలు, భంగిమలు చేస్తున్నవారికి శారీరకంగాను, మానసికంగానూ మేలుచేస్తాయి. చూస్తున్నవారికి సైతం ముచ్చట గొలుపుతాయి.

మనసును అదుపుచేసే ధ్యానాలు నియమాలూ తనకు ఒంటబట్టలేదన్నారు విశ్వనాథ. 'కవితారూపతపస్సు చేసెదను శ్రీకంఠా! మనస్సంయమాది విధానంబులు చేతకానితనమైతిన్‌...' అంటూ తనకు తెలిసిన కవిత్వ విద్యద్వారా వాటి ఫలితాలను చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. మరి ఆ వెసులుబాటులేని వారి సంగతి ఏమిటి? మొదట్లో కొద్దిగా కష్టంగా తోచినా, సాధన చేస్తూపోతే ధ్యానం ఏమంత అసాధ్యమైంది కాదు- అంటున్నారు పరిశోధకులు. విలువను గుర్తిస్తే దానిపై గురి కుదురుతుందంటున్నారు. మనసు వికసించాలంటే ధ్యానాన్ని మించిన సులువైన ప్రక్రియ లేనేలేదని వారి అభిప్రాయం. డాక్టర్‌ ఎలీన్‌ లూడెర్స్‌ నాయకత్వంలోని లాస్‌ఏంజెలిస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ధ్యానం ప్రభావాన్ని నిశితంగా పరిశీలించారు. విపాసన, సమత వంటి వివిధ ధ్యాన ప్రక్రియలను ఆచరిస్తున్న సాధకుల మెదళ్ళను శక్తిమంతమైన ముక్కోణపు ఎమ్మారైల సాయంతో పరీక్షిస్తే- కొన్ని భాగాలు విశాలంగా ఉన్నాయని తేలింది. మనిషిలోని భావోద్వేగాలను నియంత్రించే థాల్మస్‌, గైరస్‌, కోర్టెక్స్‌, హిప్పోకేంపస్‌ వంటి మెదడులోని విభాగాలు మామూలు కన్నా పెద్దవిగా ఉన్నాయి. ఫలితంగా వారిలో సానుకూల దృక్పథం చాలా హెచ్చుస్థాయిలో ఉన్నట్లు, భావోద్వేగాలను సులువుగా అదుపు చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. నిత్యం పది నుంచి తొంభై నిమిషాలపాటు తాము ధ్యానం చేస్తున్నామని, తమ చైతన్యంలో ఎన్నో మార్పులను గమనించామని, పరిశోధనలో పాల్గొన్న సాధకులు అంటున్నారు. మనో వికాసానికి ధ్యానమే మహత్తరమైన సాధనమని వారంతా ముద్రపట్టి మరీ చెబుతున్నారు. గొప్పగా జీవించాలనే కోరిక గలవారంతా ధ్యానం చేసి తీరక తప్పదంటున్నారు. సంక్లిష్టభరితమైన ఈ అధునాతన జీవనశైలిలో ఒత్తిడి బారినుంచి మనిషిని రక్షించేది నిశ్చల ధ్యానమేనని వారందరి నిశ్చిత అభిప్రాయం.
(
ఈనాడు, ౨౪:౦౫:౨౦౦౯)
__________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home