సరసతే అర్హత
ద్రాక్షాపాకం, కదళీపాకం, నారికేళపాకం అంటూ రచనాశైలిని మూడురకాలుగా చెబుతారు. ఠక్కున నోట్లో వేసుకునే ద్రాక్షపండులా- రచన తేలిగ్గా నాజూగ్గా ఉంటే, దాన్ని ద్రాక్షాపాకం అంటారు. వలిస్తేగాని తినడానికి రాని అరటిపండులా- కాస్తంత ప్రయత్నంతో బోధపడే రచన కదళీపాకంలోకి వస్తుంది. ఎంతో శ్రమపడితేగాని నోటికి దక్కదు కొబ్బరి. అలా ఆస్వాదించడానికి కష్టతరంగా అనిపించే శైలిని నారికేళపాకం అని పిలుస్తారు. స్త్రీ మనసు నారికేళపాకమని చాలామంది అభిప్రాయం. '...సత్యము కనుగొన్న! ఎంత రసికాగ్రణికైనను నారికేళపాకము కదా... కామినీ హృదయ కావ్యరసగ్రహణమ్ము!' అని ముత్తరాజువారి శ్రీకృష్ణ తులాభారం నాటకంలో కృష్ణుడు గట్టిగా తేల్చిచెప్పాడు. కృష్ణుడి స్వానుభవాన్ని బట్టిచూస్తే ఆ మాట ఒప్పుకోక తప్పదు. అర్థం చేసుకోవడమే అంత కష్టమైతే, ఇక స్త్రీ మనసును రంజింపజేయడమనేది ఎంత క్లిష్టమైనదో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. '...రసజ్ఞత ఇంచుక చాలకున్న (ఆ) చదువు నిరర్థకంబు' అని భాస్కర శతకకారుడు చెప్పినట్లుగా- సహనం ఓపిక లేకున్నా, సరసత తెలియకపోయినా రెండు నిండు జీవితాలు వృథా అవుతాయి. 'అర్ధరాత్రి రెండింటిదాకా మా ఆవిడ నిద్రపోకుండా కూర్చుంటోంది, ఏదైనా వైద్యం చెయ్యండి' అంటూ వచ్చాడొకాయన. డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు. 'అంతదాకా మేలుకుని ఆవిడ ఏం చేస్తుంది?' అని అడిగాడు. 'నేను బార్‌నుంచి వచ్చేదాకా కాచుకుని, కలిసి భోంచేద్దామంటుంది. రోజూ అలా అర్ధరాత్రిదాకా మేలుకుని కూర్చుంటే, ఆవిడ ఆరోగ్యం ఏంగాను?' అని ఆదుర్దాపడ్డాడు పతిదేవుడు. వైద్యం ఎవరికో తేల్చలేక డాక్టర్ సందేహంలో పడ్డాడు. కష్టమైనా ఓపికగా స్త్రీ మనసును అర్థంచేసుకోవడానికి, మెప్పించడానికి పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తేనే- పురుషులకు దాంపత్యంలో రుచి తెలుస్తుంది.
స్త్రీ మనసును రంజింపజేయాలని పురుషుడు, పురుషుడి హృదయాన్ని ఆకట్టుకోవాలని స్త్రీ పరస్పరం తహతహలాడటంలోనే దాంపత్య జీవన మకరందం దాగి ఉంది. ఈ రహస్యం గ్రహించిన జంట తమ జీవితంలో అంతులేని మాధుర్యాన్ని చవిచూస్తుంది. అలా పూనికతో జీవన మధురిమలను చవిచూసిన జంటలోని స్త్రీ స్పందన ఎలా ఉంటుందో చెబుతూ ఓ కవయిత్రి '...ఒక్కోసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలుంటాయి... ఏ యుగాలనాటివో తెలియని లిపి సముదాయాలుంటాయి... నీ స్పర్శ... అడవిపూల సువాసనలతో తేలివచ్చే గుర్తు తెలియని పక్షిపాటలా ఉంటుంది' అని వర్ణించారు. తృప్తిచెందిన స్త్రీ పరమ సుకుమార భావానికి ఇది సరసమైన వ్యాఖ్యానం. సున్నితమైన ఈ విషయాన్ని గ్రహించగల పురుషుడికి స్త్రీ తన గుండెల్లో స్థిరమైన చోటిస్తుంది. ఆ పురుషుడి స్పర్శకు స్త్రీ దేహం శ్రుతిచేసిన వీణలా ఝమ్మని స్పందిస్తుంది. కమనీయమైన కల్యాణి రాగాలాపన చేస్తుంది. ఆకాశంలో విహరిస్తుంది. '...ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెచ్చాడు' అని మురిసిపోతుంది. '...తనువంతటా మనసైన, మనసంతటా తనువైన... నేనైన తనలో పరిపూర్ణమై మేము...' అంటూ అపూర్వ ప్రణయ అద్వైత రాగాన్ని ఆలపిస్తుంది. '...కాంక్షా సౌందర్య తాండవ కీలల్లో దగ్ధమై ప్రభవించి, ప్రభవించి దగ్ధమై రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి శాంతి శాంతి' అంటూ అద్వైత సిద్ధిని పారవశ్యంతో స్మరిస్తుంది. భజిస్తుంది. అలా శారీరకంగాను, మానసికంగాను స్త్రీని రంజింపజేయగలగడమే పురుషుడి ఘనత. 'ఏం కావాలన్నా వెంటనే కొని పడేస్తున్నాం' అనుకోవడం పురుషులకు సహజం. శ్రమను తగ్గించే ఎన్నో గృహోపకరణాలకన్నా తన మాట వినే భర్తవల్ల స్త్రీ ఎక్కువ సుఖపడుతుందన్నది నిజం. అందుకే లోకంలో స్త్రీలు పురుషుణ్ని తమ కొంగున ముడేసుకోవాలని చాలా ఆశపడతారు.
స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యతకు ప్రేమానురాగాలే ఆధారభూమిక. మగవారిలో చిలిపితనం హాస్యప్రియత్వం సరసత రసజ్ఞత వంటివి స్త్రీలను ఆకర్షించే గుణాలు. అది తెలియని కొందరు గోసాయి చిట్కాలకు, తాయెత్తులకు ఎగబడతారు. అంబాలా నుంచి జలంధర్ నుంచి పోస్టులో విడిపించుకునే వశీకరణ ఉంగరాలకు డబ్బు తగలేస్తారు. మంత్రాలకు తంత్రాలకు ప్రయత్నిస్తారు. సత్యభామసైతం ద్రౌపదిని అదే అడిగింది. '...నీకు ఏవురు అనురక్తులగుట అత్యద్భుతంబు... వ్రతము పెంపొ! మంత్ర ఔషధ వైభవమ్మొ! వెలది! నీ విశేష సౌభాగ్య హేతువు(ఏమిటో) సెపుమ నాకు!' అని కోరింది. దానికి ద్రౌపది కోపించి 'మగువ యొనర్చు వశ్యవిధి మందులు మాకులు... మగనికి తెచ్చు రోగములు...' అని తిట్టిపోసింది. భర్త మనసు తెలుసుకుని అనురాగంతో దగ్గరకావడం ఒక్కటే మార్గమని బోధించింది. ఇదేమాట పురుషులకు సైతం వర్తిస్తుంది. స్త్రీలను ఆకట్టుకోవడానికి మందులు మాకులు ఏమీ ఉండవు. బోలెడు డబ్బుపోసి అంబాలా నుంచి తెప్పించిన మంత్రపూతమైన అంగుళీయకానికి, అంతర్వేది తీర్థంలో అర్ధరూపాయికి అమ్మే ఉంగరానికి తేడా ఏమాత్రమూ ఉండదు. స్త్రీని బాగా చూసుకోవడం ఒక్కటే, ఆమె మనసును గెలుచుకునే మార్గం! ఈ మాటను బ్రిటన్‌లోని నార్త్ ఉంబ్రియా విశ్వవిద్యాలయ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. తమను సంతోషంలో ఓలలాడించే పురుషులపట్ల స్త్రీలు మక్కువ పెంచుకుంటారని వారి అధ్యయనంలో తేలింది. క్రిస్టఫర్ మెకార్డీ పర్యవేక్షణలో జరిగిన పరిశోధన ప్రకారం సరసులూ హాస్యప్రియులూ అయిన పురుషుల సాంగత్యంలో స్త్రీలు సంతోషంగా జీవిస్తారని తేలింది. వరుడికోసం ఇచ్చే పత్రికా ప్రకటనల్లో- పురుషుల్లో హాస్యచతురతను ప్రధాన అర్హతగా స్త్రీలు కోరుకోవడాన్ని ఆయన ఉదాహరిస్తున్నారు. 'స్త్రీలను నవ్విస్తే- వాళ్లు లవ్విస్తారు' అని ఆయన సరసంగా చెబుతున్నాడు.
(ఈనాడు, సంపాదకీయం ,౨౬:౦౪:౨౦౦౯)
___________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home