ఆధునిక స్వయంవరం
ఒక నిండు సభ... దానిలో బారులుతీరి విలాసంగా కూర్చున్న రాకుమారులు... వరమాల చేతపట్టి మేలిముసుగు ధరించి మందగమనంతో కదలివచ్చే అందాల రాకుమార్తె... తన మనసు గెలిచినవాడి మెడలో ఆమె దండ వేయడం... ఫెళ్లున పెళ్లి జరిగి ఆ జంట ఒకటికావడం- ఇదీ, స్వయంవరం అనేసరికి మన మనసులో తోచే దృశ్యమాలిక. ఇందుమతీదేవి స్వయంవరాన్ని కాళిదాసు ఇదే తరహాలో వర్ణించాడు. ఆమెను 'కదలుతున్న దీపశిఖ'తో సొగసుగా పోల్చి చెప్పిన శ్లోకాన్ని రఘువంశమ్ చదివిన వారెవ్వరూ మరిచిపోలేరు. పూర్వం కిరసనాయిలు లాంతర్ల రోజుల్లో పెట్రోమాక్సు దీపాల ప్రభ గొప్పగా వెలిగింది. పెళ్లి వూరేగింపుల్లో అటో నలుగురు, ఇటో నలుగురు నెత్తిన దేదీప్యమానంగా వెలిగే పెట్రోమాక్సు దీపాలతో నడుస్తుండగా మధ్యలో కొత్తజంటలు వూరేగేవి. వూరేగింపు అంటే 'ఈ జంటకు పెళ్లయిందహో' అని వూరందరికీ చాటింపు. ఆ క్రమంలో ధగద్ధగాయమానమైన దీపాల కాంతి ఏ ఇంటిముందు ఆగితే- ఆ ఇల్లు ఈ వెలుగుతో ఒక్కసారిగా ప్రకాశించేది. వూరేగింపు ముందుకు సాగగానే చీకట్లోకి జారుకునేది. అదే పద్ధతిలో ఇందుమతి ఒక రాకుమారుడి ముందు ఆగి, అతని గురించి ఇష్టసఖులు వివరించే భోగట్టాను వింటున్నంతసేపు- ఆశతో, విజయోత్సాహంతో ఆ రాకుమారుడి మొహం కళకళలాడేది. ఆమె ముందుకు పోగానే నిరాశతో చిన్నబోయేది. అవమానంతో నల్లబడేది. ఈ పరిణామం అంతా మన మనసులో బొమ్మ కట్టేలా కాళిదాసు ఆమెను కదిలే దీపశిఖతో పోల్చాడు. స్వయంవరం అనేసరికి ఇందుమతి, అజమహారాజుల కథ గుర్తొచ్చేలా చేశాడు. స్త్రీలకు ఆ రకంగా నచ్చిన వరుణ్ని చేపట్టే అవకాశం, స్వేచ్ఛ స్వయంవరం ద్వారా లభించేవి. సుకుమారమైన స్త్రీల మనోభావాలకు, వ్యక్తిత్వాలకు ఆనాటి సమాజం ఇచ్చిన గౌరవంగా స్వయంవరాలను అభివర్ణించవచ్చు.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. స్త్రీల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా జరిగిన స్వయంవరాలూ ఉన్నాయి. కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలికలను భీష్ముడు ఆ రకంగానే ఎత్తుకొచ్చాడని భారతం చెప్పింది. పిలుపు లేకుండానే రావణుడు సీతాస్వయంవరానికి వచ్చి బలప్రదర్శనలో భంగపడ్డాడని కొన్ని రామాయణాలు చెప్పాయి. అలాంటి ప్రమాదాలను ముందే పసిగట్టిన రుక్మిణీదేవి తనదైన మార్గాన్ని ఎంచుకుందని భాగవతం చెప్పింది. రుక్మిణిదీ ఒకరకం స్వయంవరమేనని చెప్పుకోవాలి. కృష్ణుడి గురించి ఆమె నారదాదులవల్ల వింది. పూర్తిగా ఇష్టపడింది. 'నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది. నీ ఆన! నాన(సిగ్గు) లేదు' అంటూ సూటిగా తేటమాటలతో సందేశాన్ని పంపింది. రుక్మి, శిశుపాలుడు అడ్డుకుంటారనీ, వారితో పోరుకు సైతం సిద్ధమై రావాలని సూచిస్తూ 'రాజన్యానేకపసింహ' అని కృష్ణుణ్ని దర్జాగా సంబోధించింది. తనను ఎలా ఎత్తుకెళ్ళాలో చెబుతూ 'కృష్ణ! చేకొని పొమ్ము వచ్చెదన్' అని కబురు చేసింది. ఇప్పటి సినిమా భాషలో చెప్పాలంటే కచ్చితమైన 'స్కెచ్' వేసి మరీ పంపించింది. తన వలపుసెగను 'అగ్ని'ద్యోతనుడనే పురోహితుడి ద్వారా కృష్ణుడి చిత్తానికి చేరేలా చూసింది. కన్నెమనసును మించిన కవిత్వం లేదు- పురుషుడు చదవగలిగితే! అంత సాహసోపేతంగా ఒక జాణ వ్యవహరించినప్పుడు- ఆమె మనసులోని తపనను, దాని తీక్షణతను అర్థం చేసుకోవడమే సిసలైన మగతనం. కృష్ణుడు వెంటనే స్పందించాడు. 'వచ్చెద విదర్భభూమికి! చొచ్చెద భీష్మకుని పురము! సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి!' అన్నాడు. శత్రువులను పరాజితుల్ని చేస్తానని గర్జించాడు. అన్నంతపనీ చేశాడు. కథ సుఖాంతమైంది. సాహసోపేతమైన రుక్మిణి నిర్ణయాన్ని, ఉద్విగ్నభరితమైన ఘట్టాలను వర్ణించిన భాగవతంలోని రుక్మిణీ స్వయంవర గాథను తరతరాలుగా కన్నెపిల్లలు కంఠోపాఠం చేస్తూ వచ్చారు. మనస్తత్వ శాస్త్రరీత్యా అర్థం చేసుకోవలసిన విషయం అది!
రుక్మిణి విషయంలో కృష్ణుడితో ఆమెకు పొత్తు కుదిరేందుకు పురోహితుడు తోడ్పడ్డాడు. 'చిలుక పురోహితుండగుచు చెంగటనుండగ...' కాంతిమతీదేవి రాజశేఖరుణ్ని చేపట్టింది. దమయంతి హంస సాయంతో నలమహారాజును తనవాణ్ని చేసుకుంది. శివపార్వతుల మధ్య మన్మథుడు సంధానకర్తగా వ్యవహరించాడు. వలచినవాణ్ని సొంతం చేసుకోవడం నిజానికి రెండోదశ. కంటికి నదరుగా కనపడేవాళ్ళలో పెనిమిటిగా పనికొచ్చేదెవరో తేల్చుకోవడం మొదటి దశ. అదే అసలు దశ! తాటాకులు కట్టడానికి చాలామంది ఉంటారు. తాళి కట్టడానికి మాత్రం తగిన యోగ్యత ఉండి తీరాలి. ఆ అర్హతను తేల్చుకునేందుకే బంధువులు ఎన్నోరకాల ఆరాలు తీస్తారు, ఆచూకీలు రాబడతారు. ఆ పురాణ గాథలను, ఈ తకరారులను పూర్తిగా ఆకళించుకుందో ఏమో... ప్రముఖ శృంగార తార రాఖీసావంత్ సరికొత్త స్వయంవర ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రసార మాధ్యమాలను మధ్యవర్తులుగా చేసుకుంది. వేలమందిలోంచి పట్టుమని పదహారుమంది 'షోడశ' కళాప్రపూర్ణులను వడబోసి, ఒకానొక టీవీ ఛానల్ 'రాఖీకా స్వయంవర్'లో ప్రజలకు పరిచయం చేసింది. చివరికి ఒక వరుణ్ని తేల్చుకుంటానని ప్రకటించింది. చెట్టుసారం పండులో వ్యక్తమైనట్లుగా- మనిషి సారం మాటలో వ్యక్తమవుతుంది. నదులసారం నీటి రుచిలో తేలినట్లు- వ్యక్తి సారం నడతలో తేలుతుంది. అలా మాటల్లోనూ, చేతల్లోనూ ఆ రాకుమారులు తమ తమ 'మగసిరి'సంపదలను ప్రదర్శిస్తూ- 'రాణీ'సావంత్‌ను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వ్యక్తిత్వం, స్వభావం, దేహదారుఢ్యం, తెలివితేటలు తదితర వివిధ అంశాల్లో రకరకాల పరీక్షలు ఏర్పాటయ్యాయి. తనకు సరితూగే మగాణ్ని ఎంపికచేసుకోవడంలో రాఖీ అవలంబిస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు కొందరికి ఆకర్షణీయంగా తోస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలు, ప్రయోగాలు ముందు ముందు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయోనని మరికొందరు భయపడుతున్నారు. 'సహస్త్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' కథను కొందరు గుర్తుచేసుకుంటున్నారు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాన్ని రచ్చబండకు ఈడ్చడమేమిటని నిరసిస్తున్నవారూ ఉన్నారు. చివరకు ఏం అవుతుందో చూడాలి!
(eenaaDu, saMpadakeeyaM, 05:07:2009)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home