విశ్వవ్యాప్త దీప్తి
కొందరికి వ్యూహకర్తలా...మరికొందరికి దేవదూతలా.. ఇంకొందరికి విప్లవవీరుడిలా... తత్వవేత్తలా...మార్గదర్శకుడిలా... ఎందరెందరికో ఆదర్శప్రాయుడిలా...ఇలా విభిన్నరూపాలతో... విభిన్న ముద్ర వేశాడు మహాత్మా గాంధీ. ఆయన భారత స్వాతంత్య్ర సాధకుడే కాదు... ప్రపంచాన్ని మేలుకొలిపిన నవయుగ వైతాళికుడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొన్న ప్రముఖులు ఎందరో.
ఓ మహాత్మా ఓ మహార్షీ
ఏది చీకటి ఏది వెలుతురు
.....
ఏది పుణ్యం ఏది పాపం
.....
ఏది సత్యం ఏదసత్యం
.....
ఏది తెలుపు ఏది నలుపు
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
.....
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షి ఓ మహాత్మా
మహాత్ముడు నేలకొరిగిన వార్త విని మహాకవి శ్రీశ్రీలో పెల్లుబికిన తాత్విక కవితా ధార సజీవ నదిలా మన హృదయాల్లో ప్రవహిస్తూనే ఉంది. మహాత్ముడి జీవితాన్ని, ఆలోచనలనూ, ఆచరణనూ తరచి చూసే కొద్దీ ఎన్నెన్నో సార్వజనీన సత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుని జయంతి రోజున వాటిల్లో కొన్నైనా ఆచరిద్దాం. మనలో మాలిన్యాలను కడిగేసుకుందాం!
''ప్రజాస్వామ్యవ్యవస్థలో రెండు ప్రధాన సూత్రాలు ప్రాణవాయువులా ఇమిడిఉన్నాయి. ఇందులో ఒకటి మెజారిటీవ్యక్తుల ఆధిపత్యమైతే...మరొకటి వ్యక్తిగౌరవం, సమష్టి హక్కులు...స్వేచ్ఛలకు సంబంధించిన అంశం. ఒకవేళ ఈ రెండు కీలకాంశాలమధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవలసి వస్తే... నేను రెండోఅంశం వైపే బలంగా నిలబడతాను''
చర్చిల్కు అలా కనిపించాడు మరి...
'రాచపుండులాంటి వ్యక్తి'.. అంటూ చర్చిల్‌లాంటివాళ్లు తిట్టిపోస్తే... అత్యంత సంప్రదాయవాదులైన యూరోపియన్ క్రిస్టియన్లు కొందరు ఆయనను దైవ కుమారుడైన క్రీస్తుతో పోల్చడం గమనార్హం. 1926-1931 మధ్యకాలంలో భారత్‌కు వైస్రాయ్‌గా వచ్చిన లార్డ్‌ఇర్విన్ మహాత్ముడిలో ఓ మహోన్నతుడిని చూశారు. ఇర్విన్‌లో బలీయంగా పెరిగిన ఈ ఉదాత్త భావన గాంధీజీని అరెస్టు చేయించలేకపోయింది. అందుకే దండి ఉప్పుసత్యాహ్రం నిర్విఘ్నంగా ముందుకు సాగింది.
రొమెయిన్రోలండ్కు ఓ తాత్వికుడిలా...
చాలా మంది పాశ్చాత్యులకు మన మోహన్‌దాస్ ఓ పెద్దప్రశ్న. మెజారిటీ ప్రజలు ఆయనలో ఓ ఆధ్మాత్మిక మూర్తిని చూసుకున్నారు. 1924లో ప్రచురితమైన గాంధీ జీవిత చరిత్రల్లో రొమెయిన్ రోలండ్ రాసిన 'మహాత్మాగాంధీ ది మ్యాన్ హూ బికేమ్ వన్ విద్ ద యూనివర్సల్ బీయింగ్' ఆయనలోని మహారుషిని కళ్లకు కడుతుంది. 'గాంధీజీ ఆశీస్సులు పొందడం నాకో గొప్పఅనుభూతి. సాక్షాత్తూ మా మత గురువులు సెయింట్ డొమినిక్...సెయింట్ ఫ్రాన్సిస్‌లు నన్ను ఆప్యాయంగా ముద్దాడిన భక్తిభావన కలిగింది'.. అని తన స్మృతుల్లో రాసుకున్నారు.
ఫ్రెంచ్ రాజకీయాల్లో సత్యాగ్రహం
1937లో మహాత్ముడిని వార్ధా ఆశ్రమంలో కలుసుకున్న సిసిలీకి చెందిన సంపన్నుడు జోసెఫ్ జీన్‌లాన్ డెల్‌వాస్టో.... ఆ చిన్ని కుఠీరంలో... ఆ మట్టినేలమీద.. అత్యంతనిరాడంబరంగా గాంధీజీ నీడలో నిలిచిపోవాలనిపించింది అని రాసుకున్నాడు. ఆ తర్వాత 1957లో డెల్‌వాస్టో అల్జీరియన్లపై ఫ్రాన్స్ దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ.. ఏకంగా 20రోజుల పాటు నిరశన దీక్ష చేపట్టాడు.
మదిదోచిన కొల్లాయి...
గాంధీ వస్త్రధారణ ఈశాన్య ఇంగ్లండ్‌లోని కార్మిక సోదరుల మది దోచింది. సన్నటి వైరు ఫ్రేము కళ్లద్దాలు.. బక్క చిక్కిన శరీరం... దానిపై ముతకకొల్లాయి వస్త్రాలు.. ఇలా మహాత్ముడి రూపం ముద్రించుకుపోయింది వారిమనసులో. అక్కడ నిర్వహించిన ఫ్యాన్సీడ్రెస్ పోటీలో బాపూజీ వస్త్రధారణలో జనాన్ని మంత్రముగ్ధులను చేసిన గోర్డీ స్కిన్నర్‌ను చరిత్ర మరచిపోదు. ప్రథమ బహుమతి గోర్డీబృందానికే లభించింది
అమెరికా నుంచి బాపూజీని వెతుక్కుంటూ...
1920లో అమెరికాలో కార్మికోద్యమాన్ని మహోధృతంగా నడిపిన రిచర్డ్ గ్రెగ్ అనే న్యాయవాది మహాత్ముడికి ఏకలవ్య శిష్యుడని చెప్పవచ్చు. గాంధీ అహింసా ఉద్యమాన్ని చూసి ముగ్ధుడైన ఆయన భారత్‌కొచ్చి... అహింసావాదిగా పరివర్తన చెంది వెళ్లిపోయిన వైనం చరిత్ర మరవని సత్యం.
మాకు గాంధీ కావాలి: ఆఫ్రో అమెరికన్లు
అమెరికాలోని ఆఫ్రోఅమెరికన్లు 1920 నుంచి కూడా గాంధీజీపై అంతులేని ప్రేమను పెంచుకున్నారు. ఆయన రచనలను ప్రేమగా ప్రచురించుకున్నారు. మార్కస్‌గార్వీ...డబ్ల్యు.ఇ.బి. డ్యుబోయిస్ తదితరులు వీరిలో ముఖ్యులు. 1936లో హోవార్డ్ థుర్మన్ అనే బాప్టిస్ట్ మంత్రి సారథ్యంలో ఆఫ్రోఅమెరికన్ల ప్రతినిధి బృందం ప్రత్యేకంగా భారత్‌ను సందర్శించింది. గాంధీని కలుసుకోవాలన్న కలను నెరవేర్చుకుందీ బృందం. 'మీరు మాకు కావాలి. శ్వేతజాతి అమెరికన్‌ల కోసం కాదు...నల్లజాతీ నీగ్రోల సమస్యల పరిష్కారాలకు మీరుకావాలి. అందుకే, మీరు రావాలి' అంటూ థుర్మన్‌బృందం ఆయను బతిమలాడింది.
అణ్వాయుధ వ్యతిరేకోద్యమం..
హిరోషిమా...నాగసాకిని సర్వనాశనం చేసిన అణుబాంబుదాడిని గాంధీజీ తీవ్రంగా ఖండించారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన అణ్వాయుధవ్యతిరేక ఉద్యమాల్లో గాంధీజీ స్పూర్తే అంతర్లీనంగా నిలిచింది. జర్మనీలోనూ ఇదే స్ఫూర్తితో సంతకాల సేకరణలు పెనుఉద్యమాలయ్యాయి. పాలకులను కదిలించాయి.ఇవన్నీ కూడా అహింసాయుతంగా సాగిన ఉద్యమాలే.
మార్టిన్ లూథర్‌కింగ్‌కు స్ఫూర్తి
మార్టిన్ లూథర్‌కింగ్ సీనియర్ 1936లో ఓటుహక్కు డిమాండ్ చేస్తూ నిర్వహించిన ప్రదర్శన చరిత్రలో ఓ కీలక ఘట్టం. ఇక, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ మహాత్ముడిపై ఓ ప్రముఖుడిచ్చిన ఉపన్యాసానికి వెళ్లి ముగ్ధుడైపోయాడు. వెంటనే వెళ్లి గాంధీజీపై ప్రచురితమైన ఎన్నో పుస్తకాలను కొనుక్కుని ఆమూలాగ్రం చదివేశాడట. ఆయన తననెంత ప్రభావితం చేసిందీ ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా.
ఇలా చెప్పుకుంటూ పోతే...చరిత్రంతా మహాత్ముడి పాదముద్రలే కనిపిస్తాయి. ఆయన అహింసాపోరాట స్ఫూర్తే సాక్షాత్కరిస్తుంది. ఆయనలోని ఒక్కో కోణం ఒక్కోకాంతిపుంజమై ... ఎందరినో ముందుకునడిపించింది. మరెందరికో కరదీపికైంది. చరిత్రచెప్పే ఈ పాఠాలు భావితరాలకు మేలుబాటకావాలి. గాంధీజీ ఆశయజ్యోతి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లాలి.
''మనసులో అయిష్టంగా ఉన్నా బయటకు 'సరే' అని చెప్పేకంటే మొహమాటం లేకుండా 'నో' అని చెప్పడం మేలు''
''ఇచ్చిపుచ్చుకోవడం అంటేనే రాజీపడటం. మౌలిక సిద్ధాంతాలు బలంగా ఉన్నపుడు ఇచ్చిపుచ్చుకోవడాల ప్రశ్నే రాదు. మౌలిక విషయాల్లో రాజీపడటం అంటే దాసోహం అనడమే!''
''దేవుడి ముందు- నువ్వు చేసిన పనులను బట్టి కాకుండా నీ హృదయాన్ని బట్టే అంతిమ తీర్పు ఉంటుంది. దేవుడికి నీ హృదయం తెలుసు!!''
- న్యూస్‌టుడే ప్రత్యేక విభాగం
(ఈనాడు, ౦౨:౧౦:౨౦౦౯)
__________________________________
Labels: Personality
0 Comments:
Post a Comment
<< Home