సిగరెట్టు... తెలివికీ పొగబెట్టు!

పగ తగదంటూ 'భారతం'లో చెప్పిన పద్యాన్ని కొద్దిగా మార్చి 'పొగ అడగించుటెంతయు శుభంబు...' అన్నా పొగరాయుళ్ళు వినిపించుకోకపోవచ్చు. తెలుగులో వారికి నచ్చనిది పొగాకును పగాకు అనడమేనన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొగతాగితే క్షయ, క్యాన్సర్ లాంటివి వస్తాయనీ ఆయుష్షు తరిగిపోతుందనీ పత్రికల్లో, పుస్తకాల్లో వచ్చే వ్యాసాలు చదివిచదివి విసుగెత్తి ఇహలాభం లేదని కొనడం మానేశాడు వెనకటికో ధూమపాన ప్రియుడు. ఇంతకీ అతగాడు అలా మానేసిందేమిటంటే- సదరు పత్రికలూ, పుస్తకాలూ కొనే అలవాటు! 'సిగరెట్లు కాల్చకండర్రా' అంటూ సుద్దులు చెప్పే తమ పినతాత- 'అవతల పారేయమంటాడు బీడీ కట్ట/ హాయిగా కాల్చుకోమంటాడు చుట్ట/ అసలు సిసలు పొగాకు/ ఆయనక్కాదు చిగాకు' అని ఆ హితోపదేశంలోని లోగుట్టును... పొగాకు మడతల్ని విడదీసినంత వివరంగా విప్పిచెప్పాడు ఆరుద్ర ఇంటింటి పజ్యాల్లో! చర్చిల్‌నో, చాసోనో గుర్తుకు తెచ్చుకుంటూ కేవలం సిగార్లు వెలిగించేవారు ఉన్నట్లే- 'ఖగరాట్ కృషి ఫలితంగా/ పొగాకు భూలోకమందు పుట్టెనుగానీ/ పొగచుట్టలెన్నియైునను/ సిగరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!' అన్న శ్రీశ్రీ పద్యాన్ని తలచుకొంటూ సిగరెట్లు మాత్రమే అంటించేవారూ ఉంటారు. మాటిమాటికి శ్వేతకాష్ఠాన్ని ముట్టిస్తున్న ఇంటాయనను నిలదీసింది ఇల్లాలు- 'అంత ఇష్టంగా కాల్చడానికి ఏముంది వాటిలో' అని. 'ఇష్టమా, పాడా! అవంటే కోపం. అందుకే వాటిని అంటించి, కాల్చి పీల్చి మసిచేసి నుసిచేసి అవతల పారేస్తున్నాను' అన్నాడా పొగపతిరావు- చివరి దమ్మును పీకిన తరవాత, ఆర్పేసిన సిగరెట్ పీకను అరికాలితో నలిపినంత గట్టిగా!
'నువ్వు కాల్చే సిగరెట్టు- నీ బతుక్కే పొగబెట్టు'నని పొగరాట్టులకు శ్రేయోభిలాషులు ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. 'సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం' అన్న చట్టబద్ధ హెచ్చరికలు 'తెల్ల తూటాల' పెట్టెల మీద ముద్రితమూ అవుతున్నాయి. పిస్తోలు తూటా అవతలివాడి బతుక్కి పొగబెడుతుందికానీ, తుపాకీధరుణ్ని ఏమీ చేయదు. తెల్లకాగితంలో చుట్టిన తూటాగా కొందరు వర్ణించే సిగరెట్ రూట్ మాత్రం వేరు. అది- తనను కాలుస్తూ, దమ్ము పీల్చేవారి ఆరోగ్యానికీ ముప్పు తెస్తుంది. వారు తనను అలా కాలుస్తూ గాలిలోకి వదిలే పొగను తమకు తెలియకుండానే పీల్చేవారి ఆరోగ్యానికీ హాని కలిగిస్తుంది. 'తనను తాను చంపుకొంటూ, ఎదుటివాణ్నీ చంపడానికి మనిషి కనిపెట్టిన మారణాయుధం సిగరెట్' అన్నది ముళ్లపూడివారి ఓ డైలాగ్ సారాంశం. ఇండియాతో సహా అనేక దేశాల్లోని ప్రభుత్వాలు బహిరంగ ధూమపానాన్ని నిషేధించడానికి కారణం- మనుషుల బతుక్కి సిగరెట్టు ఇలా పొగబెట్టుతుండటమే! బహిరంగ ప్రదేశాల్లోనే కాదు... ఇళ్లల్లోనూ, లేదా చిన్నపిల్లలు తిరుగాడేచోట్లా- వాళ్లు లేని సమయంలోనైనా సరే- పెద్దలు సిగరెట్లు కాల్చడమూ క్షేమకరం కాదంటున్నారు పరిశోధకులు. అటువంటి చోట్ల 'సిగరెట్ కాల్చినప్పుడు వెలువడే పొగలోని నికొటిన్, అక్కడి దుస్తులు తదితరాలను ఆవరిస్తుంది. వాటిలోని రసాయనాలతో అది కలిసి, పొగాకు సంబంధిత క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ వాయువుల్ని పీల్చినవారి, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది' అని తమ అధ్యయనాల్లో వెల్లడైందంటున్నారు వారు. మనిషి ఆరోగ్యానికే కాదు, మేధస్సుకూ సిగరెట్టు పొగబెడుతోంది. ధూమపానం జోలికి వెళ్లనివారితో పోలిస్తే- ధూమపాన ప్రియుల బుద్ధి కుశలత చాలా తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలడం అందుకు నిదర్శనం. ఇజ్రాయెల్ సైనికదళాల్లోకి కొత్తగా తీసుకున్న ఇరవైవేల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. సిగరెట్ల వూసే ఎత్తనివారిలో కంటే- రోజుకు ఓ పెట్టె సిగరెట్లను వూదేసేవారిలో బుద్ధికౌశల్యం ఏడున్నర పాయింట్లు తక్కువగా ఉందన్నది ఆ అధ్యయన సారాంశం. మనిషికి మహాభాగ్యమైన ఆరోగ్యాన్నీ, మనిషిని ముందుకు నడిపించే మేధనూ పొగచూరేలా చేస్తున్న సిగరెట్టుకు శాశ్వతంగా పొగబెట్టడమే తక్షణకర్తవ్యమని ఇక గ్రహించాల్సింది పొగరాయుళ్లే!
(ఈనాడు, సంపాదకీయం, ౨౧:౦౩:౨౦౧౦)
-------------------------------------------------
Labels: HEALTH, Life/telugu
0 Comments:
Post a Comment
<< Home