మౌనరాగం
మౌనానికి ఎన్నో ముఖచిత్రాలు... ఇంకెన్నో భాషలు... మరెన్నో భాష్యాలు. అది- పూలరేకుల లాలిత్యాన్ని మరిపిస్తుంది. కత్తి అంచు కాఠిన్యాన్నీ తలపిస్తుంది. అంగీకార ముద్రను సంకేతిస్తుంది. తృణీకార సందేశానికీ ప్రతీక అవుతుంది. ఖేదాన్నీ, మోదాన్ని; రాగాన్నీ, ద్వేషాన్ని; సుఖాన్నీ, దుఃఖాన్ని; విషాదాన్నీ, మాధుర్యాన్ని భాషాంతరీకరిస్తుంది. మాట మాదిరే మౌనమూ పదునైనది. ఆ మాటకొస్తే అది మాటకంటే శక్తిమంతమైనది. పలుకుది శబ్దభాష, మౌనానిది నిశ్శబ్ద భాషణ! మాట్లాడటానికి చాతుర్యం చాలు. కానీ, మౌనంగా ఉండటానికి చాతుర్యంతోపాటు నిగ్రహమూ అవసరమే. అందుకే- 'మాటలకు అలవిగాని శక్తి, ఒదుగు మౌనానికి ఉన్నాయి. మాటలు ఆవగింజ పాలు పలుకుతవి. మౌనం కొండంతదాన్ని ముక్తసరిగా ఉద్ఘోషిస్తుంది' అన్నారు మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి. నిజమే. మాటలు బట్వాడా చేయలేని భావాలను అవలీలగా ప్రసారంచేసే కొంటెచూపుల భాష మౌనమే. కొండంత మమతను పెంచుకోవడం మినహా మరేమీ తెలియని పిడికెడు పిచ్చిగుండెదీ మౌనభాషే. గొంతుకలోన కొట్లాడుతున్న మాటను చెప్పాలన్న మనిషి తపనకు, చెప్పలేని మనసు నిస్సహాయతకు మధ్య ఉక్కిరిబిక్కిరయ్యే హృదయలయ భాష కూడా మౌనమే. ఆత్రేయ అన్నట్లు అది- 'సెవులుండే మనసుకే ఇనిపిస్తుంది'. ఎద పలికించే మౌనగీతాన్ని ఆలకించగల చెవులుండే మనసులున్నప్పుడు ఈ లోకంలో భగ్నప్రేమలూ ఉండవు, దగ్ధమానసాలూ ఉండవు. మాటలతో పనిలేనిది- నిశ్శబ్ద రవళుల్ని వినగలిగే మనసు మాత్రమే.
మాట, మౌనం బొమ్మా బొరుసులాంటివి. రెండువైపులా పదునున్న కత్తివంటివవి. అనుచిత సంభాషణను తుంచివేయగల మందు మౌనంతో మందలించడమే. అర్థం పర్థం లేని కోపతాపాలకు స్వస్తిపలికి మాటలు కలుపుకొంటే చాలు... ఎంత ఎడమొహం పెడమొహంగా ఉన్న మనుషుల మధ్యనైనా స్నేహగీతికలు పల్లవిస్తాయి. మౌనంగా ఉండేందుకు చాతుర్యనిగ్రహాలు ముఖ్యమైనట్లే- మాటలకు సంయమనం, సమతూకం ప్రధానం. కత్తిగాట్లయినా పూడుతాయేమో కానీ, కరకుమాటలు చేసే గాయాలు మాసిపోవు. 'మాన్పగలిగితి కత్తి కోతలు/ మాన్పవశమే మాట కోతలు/ కత్తి చంపును; మాట వాతలు మానవేనాడున్...' అన్న మహాకవి గురజాడ మహితోక్తి- నరంలేని మన నాలుక పలికే మాటతీరు ఎంత మృదువుగా ఉండాలో నిర్దేశించే దిక్సూచి. మాటయినా, మౌనమంత్రమైనా సందర్భావసరాలకు తగినట్లుగా ఉండటమే మనుషుల సంస్కారానికి, పరిణతికి గీటురాళ్లు. దిక్పాలకుల్లో ఒకర్ని వివాహమాడవలసిందిగా దమయంతిని కోరడానికి వారి తరఫు దూతగా వచ్చిన నలమహారాజు తన పేరు వెల్లడించడం పాడి కాదన్నాడు. 'పేరు సెప్పిన నీ కనాచారమేని/ మాకు నాయంబె నీ తోడ మాటలాడ' అంటూ దమయంతి అతణ్ని సూటిగా ప్రశ్నించడం ఆమె పరిణతికి అద్దం. అలా అంటూనే 'పలుకకుంట తిరస్కార కలనముద్ర/కాన ప్రత్యుత్తరమిచ్చుదాన నీకు' అంటూ ఆమె దూతకు ఇవ్వవలసిన మర్యాదనూ కనబరచింది. అవసరమైన సమయాల్లో నోరు విప్పకుండా మౌనమంత్రం పఠించడమూ అనర్థదాయకమే. వ్యక్తికే కాదు, సమాజానికీ అది చేటుతెస్తుంది.
'మౌనేన కలహం నాస్తి' అని పెద్దలు చెప్పినమాట చద్దిమూట. కాలంతోపాటు సామాజిక విలువల్లో, మానవీయ సంబంధాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న ఈ రోజుల్లో- సాంసారిక జీవనాన మౌనమూ కలహకారకమవుతోంది. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న కలతలు, కలహాలు, చిరుకోపాలు సహజమే. కొన్ని సందర్భాల్లో దంపతులు పరస్పరం మాట్లాడుకోకపోవడమూ కద్దు. అది కుటుంబ సంబంధాల్లో చిచ్చు పెట్టే స్థాయికి దిగజారకూడదు. దురదృష్టమేమిటంటే- అటువంటి ప్రమాదకర పోకడలు ఇప్పుడు మన సమాజంలో పొడచూపుతుండటం! జీవిత భాగస్వామి తన పట్ల కఠినంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణతో- విడాకులకోసం దంపతుల్లో ఎవరో ఒకరు కోర్టుల్లో దాఖలు చేస్తున్న కేసులు అనేకం. దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా మౌనవ్రతం పట్టడమూ వైవాహిక సంబంధాల్లో 'కాఠిన్యం' కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ మధ్య పేర్కొంది. విడాకులకు సంబంధించిన కేసులను పరిష్కరించేటప్పుడు ఇతర అంశాలతోపాటు ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కింది కోర్టులను ఆదేశించింది. తమ సంసార జీవనంలో కస్తూరిబా, తాను రోజుల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా భీష్మించుకున్న సందర్భాలూ ఉన్నాయని గాంధీజీ తన ఆత్మకథలో రాశారు. అవేవీ తమ సంసారయాత్ర సాఫీగా సాగడానికి ఎన్నడూ అవరోధం కాలేదని ఆయన అన్నారు. అందుకు కారణం- తనమాటే భార్య విని తీరాలన్న పురుషాధిక్య ధోరణితో బాపూ వ్యవహరించకపోవడం, తనపై భర్తకు గల ప్రేమానురాగాలను కస్తూరిబా అర్థంచేసుకోవడం! అటువంటి సర్దుబాటు తత్వం ఉంటే- భార్యాభర్తల మధ్య మౌనమంత్రంలోనూ మంగళవాయిద్యాలు వినిపిస్తాయి. అహం విడనాడి మాటలు కలుపుకొంటే, జీవనయాత్రా పథమంతా పూలపుంత అవుతుంది.
(ఈనాడు, సంపాదకీయం, ౨౮:౦౨:౨౦౧౦)
____________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home