గెలిచిన సంప్రదాయం

వంశవృక్షపు వేళ్లను స్పృశించగలిగితే వాటి మౌనభాషలో- తరతరాల పేగుబంధపు గాథలు వినబడతాయి. ఆరు తరాల వెనక ఆఫ్రికా ఖండంలోని తన వంశ మూలపురుషుని పుట్టుపూర్వోత్తరాలను వెలుగులోకి తీసుకురావాలనికంకణం కట్టుకున్నాడు అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ. పన్నెండేళ్లు శ్రమించి ఆ కృషిలోసంకల్పసిద్ధుడనిపించుకున్నాడు. ధనబలవంతుల దౌష్ట్యం, దౌర్జన్యం కారణాన బానిసలుగా బతుకులీడ్వాల్సివచ్చిన తనపూర్వీకుల మూలాల్ని తెలుసుకోవడానికి హేలీ సాగించిన అన్వేషణను అ తని నవల 'రూట్స్ (ఏడు తరాలు)' మనకళ్లకు కడుతుంది. మూలాలమీద మక్కువతోపాటు మనిషికి కొన్ని గట్టి నమ్మకాలు, గాఢ విశ్వాసాలు అంతకుమించి- తాను పుట్టిన నేలపైన ప్రేమాభిమానాలు ఉండటం సహజమే. తన చితాభస్మాన్ని హిమగిరులపైన విరజిమ్మాలని, ఇక్కడి నదీజలాల్లో కలపాలని, పొలాల్లో వెదజల్లాలని నెహ్రూ విల్లు రాశాడు. ఈ దేశపు గాలిపై, నీటిపై, మట్టిపై ఆయనమమకారానికీ మమతానురాగాలకూ అది తార్కాణం. జీవనవిధానానికి మూలమంత్రాలుగా తాము విశ్వసించేఆచారాలకు, సంప్రదాయాలకు ఎత్తుపీట వేయాలని మనుషులు భావించడంలో తప్పులేదు. 'తన పేరు తల్లి పేరును/ తను గాంచిన తండ్రి పేరు, దైవము పేరున్/ తను యున్న యూరు పేరును వినుకలిగా బ్రతుకవలయు...'నన్నాడు ఓ చాటుకవి. అనాదిగా మనం పాటిస్తున్న కొన్ని ఆచారాలూ సంప్రదాయాలూ ఆజాబితాలో చోటు చేసుకోదగినవే. సంప్రదాయమంటే వారసత్వంగా సంక్రమించిన మంచితనమే. ఆచార్య సినారె మాటల్లో చెప్పాలంటే '... కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లుగ/ మనకు మిగులును గతములోపలి మంచి; అదియే సంప్రదాయము'. మనిషిని నడిపించేది అదే.
ఆచారాలు, సంప్రదాయాలు ఒక్కో మతానికి ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆయా మతస్తులు వాటికి కట్టుబడి మనుగడసాగిస్తుంటారు. శుభకార్యాల్లోనే కాదు, అశుభకార్యాల్లోనూ కొన్ని సంప్రదాయాలను అనుసరించడం- అన్నిమతాలవారిలో ఉన్నదే. తన నమ్మకాలకు, విశ్వాసాలకు అనుగుణంగా వాటిని పాటించడానికి మనిషితాపత్రయపడుతుంటాడు. తాను గౌరవించే సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకోవడానికి అవసరమైతే ప్రభుత్వంపైధర్మయుద్ధానికైనా సిద్ధమవుతాడు. బ్రిటన్‌లో స్థిరపడిన దేవేందర్ ఘయ్ అయిదేళ్ల సుదీర్ఘకాలంపాటు అక్కడన్యాయపోరాటం సాగించి సాధించిన విజయమే అందుకు నిదర్శనం. తమ మతాన్ని ఆచరించే హక్కు బ్రిటన్లోనిహిందువులకు ఉన్నా- పార్థివశరీరాలకు హిందూమత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపే వీలు అక్కడలేదు. హిందువుల భౌతికకాయాల్ని శవదహనశాలలో దహనం చేయాలి తప్ప- కట్టెలతో చితి పేర్చడం, తలకొరివి పెట్టిఅంత్యక్రియలు జరపడం బ్రిటన్లో నిషిద్ధం. ఇటువంటి ఆంక్షలవల్ల- ఆ దేశంలోని భారతీయ సంతతికి చెందినహిందువులెవరైనా కనుమూస్తే, మతాచారాల ప్రకారం దహనక్రియలు నిర్వహించడానికి వారి పార్థివశరీరాల్నిబంధువులు భారత్కు తరలిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. దీనిపై 'ఆంగ్లో-ఆసియన్ మైత్రీ సంఘం' వ్యవస్థాపకుడుదేవేందర్ఘయ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురైనా అప్పీళ్ల కోర్టుకు వెళ్లి 71ఏళ్ల ఈ వృద్ధుడు సాగించినపోరాటం- పట్టుదలకు వయసు అడ్డంకి కాదని చాటుతోంది. హిందువుల పార్థివశరీరాలకు చితిని పేర్చి, దహనం చేయడంచట్టబద్ధమేనని అప్పీళ్ల న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- ఏ దేశంలో ఉన్నా తమ మతాచారాలకు, సంప్రదాయాలకు గౌరవందక్కాలని ఆకాంక్షిస్తున్నవారికి వూరట కలిగిస్తుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౦౭:౦౩ :౨౦౧౦)
____________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home